అలా చేయవద్దని ఆదేశించినప్పటికీ, శాంతియుత నిరసనకారులకు వ్యతిరేకంగా తన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది పెల్లెట్ గన్నులను ఉపయోగించినట్లు, సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ విచారణ బట్టబయలు చేసింది.
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జూలై 20న “ఛలో సంసద్” మార్చ్ సందర్భంగా కన్నాట్ ప్లేస్ వద్ద ఉన్న ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) సిబ్బంది తన పెల్లెట్ గన్ నుంచి కనీసం ఏడు రౌండ్లు కాల్చారని, అందులోంచి ఐదు శాంతియుత నిరసనకారులకు తగిలినట్లు, సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జరిపిన విచారణలో తేలినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం వెల్లడించింది.
గడచిన నెల రోజులుగా సీజేపీ, ఇతర విద్యార్థి సంఘాలు నిరసన తెలుపుతున్న జంతర్ మంతర్ వద్ద విధి నిర్వహణలో ఉన్న భద్రతా దళాలు పెల్లెట్ గన్నుల వినియోగాన్ని నివారించాలని ఆదేశించినప్పటికీ మార్చ్ సందర్భంగా ఆర్ఏఎఫ్ సిబ్బంది పెల్లెట్ గన్నుల వల్ల గాయాల కేసులు ఉద్భవించాయని, అసలు పెల్లెట్ గన్నులను ఉపయోగించారా అన్నది నిర్ధారించడానికి సీఆర్పీఎఫ్ జూలై 24న దర్యాప్తుకు చొరవ తీసుకుంది.
ముగ్గురికి తీవ్ర గాయాలు..
ఢిల్లీలో నిరసన సందర్భంగా ఆరోజు ముగ్గురు వ్యక్తులు- 25 సంవత్సరాల ఇర్షాద్ షేక్, 19 ఏండ్ల ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సాహిల్ లోచబ్, ఔట్లుక్ మ్యాగజైన్లో పని చేస్తున్న 28 సంవత్సరాల జర్నలిస్టు తీవ్రంగా గాయపడ్డారు.
పెల్లెట్ గన్నుల ఉపయోగాన్ని ఢిల్లీ పోలీసులు తరచుగా తిరస్కరిస్తుండగా, ఈ అంశంపై సీఆర్పీఎఫ్ మౌనం పాటిస్తుంది, నిరాయుధ నిరసనకారులపై వాటి వినియోగాన్ని గతంలోనే ది వైర్ కథనం నిర్ధారించింది.
లాగ్ ఎంట్రీలో ధ్రువీకరణ..
పాలక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూలై 20 అసమ్మతిని అణిచివేయడానికి పెల్లెట్ గన్నులు వంటి తీవ్రమైన చర్యలకు భద్రతా దళాలు పాల్పడినట్లు ఇప్పుడు ఆర్ఏఎఫ్ తయారు చేసిన లాగ్ ఎంట్రీలో ధ్రువీకరించడమైందని, మూలాలు చెప్పినట్లు ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం తెలియచేసింది.

ఆర్ఏఎఫ్ సిబ్బంది ఏడు పెల్లెట్ రౌండ్లు కాల్చగా “ఐదు రౌండ్లు నిరసనకారులకు తగిలాయి, మిగతా రెండు భూమికి తగిలాయని చెప్పారు. నిరసనకారులు భద్రతా దళాలపై దాడి చేసి రాళ్లు విసిరిన తర్వాత రౌండ్లు కాల్చడం జరిగింది” అని చెప్పారు.
అధికారుల సమీక్ష – దిద్దుబాటు చర్యలు..
“జంతర్ మంతర్ వద్ద నిరసన సంసద్ ఛలో మార్చ్ సందర్భంగా ఆర్ఏఎఫ్ సిబ్బంది పాత్ర, మోహరింపు, వ్యవహారశైలి”పై ఆర్ఏఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ సీమా ధుండియా జూలై 22న సమీక్షించారు. ఈ సందర్భంగా కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు.
“అవసరమైన మేరకే న్యాయబద్ధంగా, నిష్పక్షపాతంగా, సమతుల్యంగా, సున్నితమైన పద్ధతిలో దళాలను ఉపయోగించాలని ఆఫీసర్లను ఆదేశించడమైంది. బలాన్ని ఉపయోగించక ముందు తగిన హెచ్చరికలు జారీ చేయాలని, పరిస్థితుల ఆధారంగా ప్రజలను నియంత్రించడానికి లాఠీచార్జి, బాష్పవాయువు వంటి ఇతర ఆమోదించిన పద్ధతులను చేపట్టాలని కూడా ఆదేశించినట్లు” చెప్పారు.
సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ను ఆయన అభిప్రాయాన్ని కోరగా “ప్రొఫెషనల్- పోస్ట్ ఈవెంట్ అసెస్మెంట్”ను నిర్వహించి, ఆ తర్వాత “దళం ప్రధాన కార్యాలయం వాదనను ప్రజల ముందు పెడతామని” ది ఇండియన్ ఎక్స్ప్రెస్కు చెప్పారు.
హోంమంత్రికి రాహుల్ గాంధీ లేఖ..
నిరసన సందర్భంగా విద్యార్థులకు వ్యతిరేకంగా మితిమీరిన బలాన్ని ఉపయోగించిన దానికి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ ఢిల్లీ పోలీసు, ఆర్ఏఎఫ్లను ఆదేశించే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జూలై 26న లేఖ రాశారు.
“ఢిల్లీలో 2026 జూలై 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై అనాగరికమైన దాడికి జవాబుదారీతనం కావాలని డిమాండ్ చేస్తూ ఈ లేఖ రాస్తున్నాను. ప్రాణాంతక పెల్లెట్ గన్నులను ఉపయోగించడం తీవ్రమైన షాక్కు గురి చేసింది” అన్నారు.
ఒక జర్నలిస్టుతో పాటు ప్రజలు తీవ్ర గాయాలతో బాధపడుతున్న దృశ్యాలు మీడియా, సోషల్ మీడియాలో కథనాలు స్పష్టంగా చూపించాయి.
“నేను 19 సంవత్సరాల విద్యార్థి సాహిల్ లోచబ్ను కలిశాను, ఇప్పుడు తను తీవ్ర నొప్పితో బాధపడుతున్నాడు. పెల్లెట్ గన్నులతో కాల్చడం వల్ల కంటి చూపును కోల్పోవచ్చు” అని ప్రతిపక్ష నాయకుడు తెలిపారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
