“ప్రధాని గురించి అభ్యంతరకరమైన భాషలో కించపరిచే వ్యాఖ్యలు ఉన్న కథనాలను” తొలగించాలని మూడు సామాజిక మాధ్యమాల వేదికలకు నోటీసులను జారీ చేసినట్లు ఒక పోలీసు అధికారి ఒక వార్తా సంస్థకు చెప్పారు.
న్యూఢిల్లీ: ఇటీవల యువజన ఉద్యమం సందర్భంగా ప్రధాన మంత్రిని లక్ష్యంగా చేసుకొని పోస్ట్ చేసిన అభ్యంతరకరమైన వీడియోలు, పోస్టులను తొలగించాలని సామాజిక మాధ్యమాల వేదికలకు ఢిల్లీ పోలీసులు ఆదేశించినట్లు అనేక వార్తా సంస్థలు తెలియజేశాయి.
తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని ఒక సీనియర్ పోలీసు అధికారి ఇండియన్ ఎక్స్ప్రెస్కు తెలిపారు. “పలువురు వివిధ సామాజిక మాధ్యమాల వేదికల్లో బహుళ పోస్టులను అప్లోడ్ చేశారని, వాటన్నిటినీ తొలగిస్తున్నామని” పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి అన్నట్లు తెలిసింది.
“ప్రధాన మంత్రి గురించి అభ్యంతరకరమైన భాష, కించపరిచే వ్యాఖ్యలతో” ఉన్న కథనాలను తొలగించాలని ఆదేశిస్తూ మూడు సామాజిక మాధ్యమాల వేదికలకు నోటీసులను జారీ చేసినట్లు ఆ అధికారి చెప్పారు.
యువజన ఉద్యమం – మంత్రి రాజీనామా..
కొత్తగా ఏర్పాటైన కాక్రోచ్ జనతా పార్టీ నెల రోజులుగా చేపట్టిన ఆందోళన గత వారం దేశవ్యాప్త యువజన ఉద్యమంగా రూపుదిద్దుకోవడం విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసింది.
అనేక మంది యువకుల ఆక్రోశం మోదీ వైపు కనిపించింది. పోస్టర్లు, మీమ్స్ ద్వారా ఆయననే లక్ష్యంగా చేసుకున్నారు.
పోలీసుల పర్యవేక్షణ – చర్యలు..
సామాజిక మాధ్యమాల వేదికలకు నోటీసులను జారీ చేయక ముందు ప్రధాన మంత్రిని ఉద్దేశించి కించపరిచే వ్యాఖ్యలు, నేరపూరిత కథనాల పోస్టులు, వీడియోలను ఢిల్లీ పోలీసుల సామాజిక మాధ్యమాల “పర్యవేక్షణ” బృందం మొదట గుర్తించిన తర్వాత చట్టపరమైన నిబంధనల ప్రకారం చర్యలను మొదలు పెడుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలియజేసింది.
“తాజా అప్లోడ్లను” కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు ఆ కథనం పేర్కొంది.
“నిరసన సందర్భంగా, ఆ తర్వాత అప్లోడ్ అయిన కథనాలను సమీక్షించిన తర్వాత కించపరిచేవి తొలగించాలని నోటీసులను జారీ చేస్తున్నట్లు మరో పోలీసు అధికారి చెప్పినట్లు పీటీఐ కథనం వెల్లడించింది. వివిధ సామాజిక మాధ్యమాల వేదికల్లో అలాంటి కథనాలను గుర్తించే ప్రక్రియ ఇప్పటికే మొదలైందని” ఆయన చెప్పారు.
తొలగింపు ప్రక్రియ వెనుక ఉన్న చట్టంపై అస్పష్టత..
ఈ తొలగింపు ప్రక్రియ ఏ చట్టం కింద చేపడుతున్నారనేది అస్పష్టంగా ఉంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ ఆయన జూలై 24 అర్ధరాత్రి సామాజిక మాధ్యమ వీడియో సందేశంలో టెలీప్రాంప్టర్ ఉపయోగంపై బెంగాల్ సీపీఐ(ఎం) నాయకుడి వ్యంగ్య ఫేస్బుక్ పోస్టును పెట్టిన ఐదు నిమిషాల్లోనే మెటా తొలగించినట్లు ద వైర్ వార్తా సంస్థ నివేదించింది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింద పని చేసే ఢిల్లీ పోలీసులు ఇప్పుడు ఇంటర్నెట్ నుంచి వార్తలు, విశ్లేషణలు, హాస్యం, వ్యంగ్యం లేదా వ్యాఖ్యానాలను ప్రత్యక్షంగా తొలగించగలుగుతున్నారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్ట్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
