దాదాపుగా రెండు నెలల కాలం పాటు వెల్లువెత్తిన నిరసనలు, 26 రోజులుగా సాగిన ఆందోళనలు, పరాకాష్టగా దేశ రాజధానిలో జూన్ 20న జరిగిన ప్రభుత్వ దాడితో, దేశ విదేశాలలో కేంద్ర ప్రభుత్వ పరువు మంటగలిసింది. చివరకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. ఇది ఉవ్వెత్తున సాగిన ఉద్యమ విజయం.
అయితే అసలు ఈ సమస్య ఎక్కడ ఉత్పన్నమైంది, మూలాలేమిటి, గత అనుభవాలను సంపూర్ణంగా అవగాహన చేసుకోకుండా తాత్కాలిక విజయంతో శాశ్వత పరిష్కారంగా భావించడం చాలా ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుంది.
“విద్య ఒక వ్యక్తి జీవితాన్నే కాదు, దేశ భవిష్యత్తును కూడా నిర్మిస్తుంది”అని ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన సత్యం.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యను సామాజిక సమానత్వానికి ఆయుధంగా అభివర్ణించారు. జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి నాయకులు స్వాతంత్య్రానంతరం శాస్త్రీయ దృక్పథం, ఉన్నత విద్య, ప్రజా విద్యను దేశాభివృద్ధికి మూల స్తంభాలుగా భావించారు.
అయితే గత మూడు దశాబ్దాలుగా భారత విద్యా రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. విద్య సేవా రంగం నుంచి వ్యాపారంగా మారింది. ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్పొరేట్ పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు వేగంగా విస్తరించాయి. పోటీ పరీక్షల సంఖ్య పెరిగింది.
ఒక వైపు విద్యార్థుల అవకాశాలు పెరిగినా, మరో వైపు తీవ్రమైన పోటీ, అధిక ఖర్చు, మానసిక ఒత్తిడి, పరీక్షలపై అనిశ్చితి కూడా పెరిగాయి.
ఈ పరిస్థితుల్లో ప్రశ్నాపత్రాల లీకులు భారత విద్యా వ్యవస్థ విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీశాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం కోట్లాది మంది విద్యార్థులు వివిధ ప్రవేశ, నియామక పరీక్షలకు హాజరవుతున్నారు. వాటిలో ముఖ్యమైనవి నీట్(వైద్య విద్య), జేఈఈ (ఇంజినీరింగ్), సీయూఈటీ, యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు, పోలీసు నియామక పరీక్షలు, ఉపాధ్యాయ నియామక పరీక్షలు వగైరా.
ఈ పరీక్షల్లో ఒక చిన్న తప్పిదం కూడా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. కొందరు తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. వారి తల్లిదండ్రుల ఆశలు నిరాశ అవుతాయి. భారీ ఆర్థిక నష్టం జరుగుతుంది.
ప్రశ్నాపత్రాల లీక్ అంటే ఏమిటి?..
పరీక్ష నిర్వహణ సంస్థ గోప్యంగా ఉంచాల్సిన ప్రశ్నాపత్రం పరీక్షకు ముందే కొందరి చేతికి చేరడం, డబ్బు, అవినీతి, సాంకేతిక లోపాలు, అంతర్గత కుమ్మక్కు వల్ల బయటకు రావడం ప్రశ్నాపత్రాల లీక్.
ఇది కేవలం నేరం మాత్రమే కాదు. రాజ్యాంగంలోని సమాన అవకాశాల సూత్రానికి విరుద్ధం. నిజాయితీగా రేయింబవళ్ళు కష్టపడి చదివిన విద్యార్థులను అవమానించడం.
భారతదేశంలో ప్రశ్నాపత్రాల లీకుల ప్రారంభ చరిత్ర..
స్వాతంత్ర్యం తర్వాత తొలి కొన్ని దశాబ్దాల్లో ప్రశ్నాపత్రాల లీక్ సంఘటనలు అరుదుగా ఉండేవి. కానీ 1980ల చివరి నుంచి కొన్ని రాష్ట్రాల్లో అప్పుడప్పుడు ఇటువంటి సంఘటనలు వెలుగు చూశాయి.
1990లలో పరిస్థితి పూర్తిగా మారింది. ఆర్థిక సరళీకరణ, ప్రైవేట్ విద్యాసంస్థల విస్తరణ, కోచింగ్ సెంటర్ల పెరుగుదల, కంప్యూటరీకరణ వంటి అంశాలతో పాటు అవినీతి ముఠాలు కూడా ఏర్పడ్డాయి. 2000 తర్వాత ప్రశ్నాపత్రాల లీకులు దేశవ్యాప్తంగా తీవ్రమైన సమస్యగా మారాయి.
ప్రైవేటీకరణ అంటేనే నీతి, నియమాలకు పాతర వేసి త్వరగా వేలు, లక్షల కోట్లు సంపాదించడం. ఇందుకు అవినీతి ఒక చక్కని బాట. ప్రపంచవ్యాప్తంగా సరళీకృత విధానాల కాలంలో విలువలు పూర్తిగా నిర్వీర్యం చేయబడ్డాయి. అవినీతి విచ్చలవిడి అయింది.
ఈ ప్రపంచీకరణ విధానాలను అర్థం చేసుకోకుండా అసలు మూలాలను వెలికి తీయలేము. అసలు మూలాలను శాశ్వతంగా అంతం చేయకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదు.
ప్రశ్నాపత్రాల లీక్ ఎలా జరుగుతుంది?..
సాధారణంగా కింది మార్గాల్లో జరుగుతున్నట్లు దర్యాప్తుల్లో బయటపడింది.
1. ముద్రణ కేంద్రాల నుంచి లీక్ 2. రవాణా సమయంలో 3. స్ట్రాంగ్ రూమ్ భద్రతలో లోపాలు 4. పరీక్ష నిర్వహణ సిబ్బంది కుమ్మక్కు 5. సైబర్ హ్యాకింగ్ 6. కోచింగ్ సెంటర్ల మాఫియా 7. నకిలీ అభ్యర్థులు 8. బ్లూటూత్, డిజిటల్ పరికరాల దుర్వినియోగం 9. రాజకీయ అండ 10. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం 11. సాంకేతిక భద్రత లోపాలు.
ప్రశ్నా పత్రాల లీక్ వల్ల అత్యధికంగా నష్టపోయేది పేద, మధ్యతరగతి విద్యార్థులే. వేలాది కుటుంబాలు అప్పులు చేసి పిల్లలను కోచింగ్‌కు పంపుతున్నాయి.
ఒక ప్రశ్నాపత్రం లీక్ వల్ల పరీక్ష రద్దవుతుంది. మళ్లీ పరీక్ష రాయాలి. ఆర్థిక భారం పెరుగుతుంది. మానసిక ఒత్తిడి అధికమవుతుంది. ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోతారు.
నీట్ చరిత్ర..
నీట్ దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశానికి ఏకైక ప్రధాన పరీక్ష. నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) అనేది భారతదేశంలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష.
దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అన్ని రాష్ట్రాలకు ఒకే ప్రమాణంతో విద్యార్థుల ఎంపిక, అనేక ప్రవేశ పరీక్షల భారాన్ని తగ్గించడం, మెరిట్‌కు ప్రాధాన్యం కల్పించడం, పారదర్శకతను పెంచడం లక్ష్యాలుగా 2010 ప్రాంతంలో దేశవ్యాప్తంగా ఒకే వైద్య ప్రవేశ పరీక్ష నిర్వహించాలనే ఆలోచన మొదలైంది.
2013లో సుప్రీంకోర్టు అప్పటి నీట్ విధానాన్ని రద్దు చేసింది. 2016లో రాజ్యాంగ ధర్మాసనం మళ్లీ నీట్‌కు అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి నీట్ దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. నీట్ విధానం తేవడానికి చెప్పిన కారణాలు/లక్ష్యాలు ఆచరణలో విఫలమై విద్యార్థుల జీవితాలతో చెలగాటంగా మారింది.
ప్రతి సంవత్సరం సుమారు 20–25 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తారు. ఒక్క మార్కు కూడా ర్యాంకును ప్రభావితం చేసే పరీక్ష కావడంతో, ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు వచ్చినప్పుడల్లా దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంటుంది.
నీట్ రద్దు చేయాలని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రారంభం నుంచే కొన్ని రాష్ట్రాలు భాష, గ్రామీణ విద్యార్థుల అవకాశాలు, రాష్ట్ర బోర్డు సిలబస్ వంటి అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.
ప్రశ్నాపత్రాల లీక్ అనేది కేవలం పరీక్షా వ్యవస్థలోని లోపం మాత్రమే కాదు. అది విద్య, పరిపాలన, రాజకీయాలు, న్యాయ వ్యవస్థ, సామాజిక న్యాయం, యువత భవిష్యత్తు వంటి అనేక అంశాలను స్పృశించే జాతీయ సమస్యగా మారింది.
2018లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ను ఏర్పాటు చేసింది. దీని ప్రధాన బాధ్యతలు, నీట్, జేఈఈ, సీయూఈటీ, యూజీసీ-నెట్ ఇతర జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించడం. ఎన్టీఏ లక్ష్యం ఆధునిక సాంకేతికతతో పారదర్శక పరీక్షా వ్యవస్థను నెలకొల్పడం. ఇది కూడా ఆచరణలో పూర్తిగా విఫలం చెందింది.
2024 నీట్ పరీక్ష – వివాదాలకు నాంది..
2024లో జరిగిన నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా 24 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత కొన్ని అసాధారణ అంశాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో ముఖ్యమైనవి అసాధారణంగా అధిక సంఖ్యలో పూర్తి మార్కులు (720/720) రావడం.
కొన్ని పరీక్షా కేంద్రాల్లో ఒకే ప్రాంతానికి చెందిన పలువురు విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం. “గ్రేస్ మార్కులు” ఇవ్వడంపై వివాదం.
ప్రశ్నాపత్రం పరీక్షకు ముందే బయటకు వచ్చిందనే ఆరోపణలు. ఈ పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు ఎలా వెలుగులోకి వచ్చాయి?..
దర్యాప్తు సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రశ్నాపత్రం పరీక్షకు ముందు కొందరికి భారీ మొత్తాల డబ్బుకు అందించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ప్రత్యేకంగా బీహార్‌లోని పాట్నా ప్రాంతంలో కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో కేసు జాతీయ స్థాయికి చేరింది.
దర్యాప్తులో బయటకు వచ్చిన ఆరోపణల ప్రకారం అభ్యర్థుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేయడం, ప్రశ్నాపత్రాన్ని ముందుగానే చూపించడం, సమాధానాలు కంఠస్థం చేయించడం వంటి ఘటనలు జరిగినట్లు వెలుగులోకి వచ్చాయి. తరువాత కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. దర్యాప్తు ప్రకారం మొదట వెలుగులోకి వచ్చిన ప్రధాన కేసు బీహార్‌లోని పాట్నాలో నమోదైంది.
అయితే, దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో కూడా అనుమానాస్పద అంశాలు వెలుగు చూడడంతో ఇది ఒక్క ప్రాంతానికి పరిమితం కాలేదనే తేలింది.
దేశవ్యాప్తంగా నిరసనలు..
విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పరీక్షను మళ్లీ నిర్వహించాలని, లీక్‌తో సంబంధం ఉన్న అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్టీఏ పనితీరుపై విచారణ జరపాలని, పరీక్షా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలనే డిమాండ్లు ముందుకొచ్చాయి. దేశంలోని అనేక నగరాల్లో నిరసనలు జరిగాయి.
ప్రభుత్వ స్పందన..
కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఎన్టీఏ పనితీరును సమీక్షించింది. పరీక్షల భద్రత కోసం కొత్త చర్యలను ప్రకటించింది.
పరీక్షా నిర్వహణలో మార్పులపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అయినా 2026లో మరలా లీక్ అయింది. ఈ ఘటన చారిత్రకంగా మారింది.
నీట్ వివాదం ఒక ప్రశ్నాపత్రం లీక్ కేసు మాత్రమే కాదు. ఇది భారత పరీక్షా వ్యవస్థ విశ్వసనీయత, కోచింగ్ సెంటర్ల ప్రభావం, విద్య వ్యాపారం కావడం, యువత భవిష్యత్తు, ప్రభుత్వ బాధ్యత, పరీక్షల భద్రత, సమాన అవకాశాల రాజ్యాంగ సూత్రం అనే అంశాలపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ఈ సంఘటన తర్వాత “పోటీ పరీక్షల సంస్కరణలు” అనే అంశం జాతీయ చర్చగా మారింది.
సుప్రీంకోర్టు ముందున్న ప్రధాన ప్రశ్న..
నీట్-యూజీ 2024 వివాదంలో సుప్రీంకోర్టు ముందున్న ప్రధాన ప్రశ్న “ప్రశ్నాపత్రం లీక్ జరిగిందా?” అనే దాని కంటే, “ఆ లీక్ మొత్తం పరీక్షను ప్రభావితం చేసిందా?” అనేదే.
కొద్ది మంది చేసిన అక్రమాల కారణంగా లక్షలాది మంది నిజాయితీగా పరీక్ష రాసిన విద్యార్థులు బలి కాకూడదు.
విచారణ సందర్భంగా అప్పటి ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది.
ప్రశ్నాపత్రం లీక్ జరిగిన విషయం నిరాకరించలేము. పరీక్షల పవిత్రత మసకబారింది. అసలు ప్రశ్న ఆ ప్రభావం ఎంత విస్తృతంగా ఉంది?
ఈ వ్యాఖ్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన న్యాయ సూత్రాన్ని వివరించింది. మళ్లీ పరీక్ష నిర్వహించడం చివరి ప్రత్యామ్నాయం మాత్రమే. అందుకోసం ప్రధానంగా మూడు అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.
లీక్ వ్యవస్థాగత(సిస్టమిక్) స్థాయిలో జరిగిందా? అక్రమ ప్రయోజనం పొందిన వారిని నిజాయితీగా పరీక్ష రాసిన విద్యార్థుల నుంచి వేరు చేయగలమా? మొత్తం పరీక్షా ప్రక్రియపై ప్రజల నమ్మకం పూర్తిగా దెబ్బతిందా? మొత్తం పరీక్షను ఎందుకు రద్దు చేయలేదు? తుది తీర్పులో సుప్రీంకోర్టు ఇలా పేర్కొంది.
పాట్నా, హజారిబాగ్ వంటి ప్రాంతాల్లో లీక్‌కు సంబంధించిన ఆధారాలు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా మొత్తం పరీక్షా వ్యవస్థ కూలిపోయిందని నిరూపించే తగిన ఆధారాలు లేవు. అందువల్ల మొత్తం నీట్-యూజీ 2024 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించడం సముచితం కాదని నిర్ణయించింది.
విచారణ సందర్భంగా న్యాయమూర్తులు పరోక్షంగా ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేశారు. భారతదేశంలో లక్షలాది మంది యువత ఎన్నో నెలలు కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కుటుంబాలు భారీ ఖర్చు చేస్తున్నాయి.
ఒకే పరీక్షపై తమ భవిష్యత్తును ఆధారపరుచుకుంటున్నారు. కాబట్టి, పరీక్షల నిర్వహణలో చిన్న నిర్లక్ష్యం కూడా వారి జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని కోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసులో సుప్రీంకోర్టు రెండు అంశాల మధ్య సమతుల్యత పాటించడానికి ప్రయత్నించింది. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు, నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడడం. పరీక్షా వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం ఉండటం ప్రజాస్వామ్యానికి అవసరం.
ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యల వివాదం..
2026లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన కొన్ని మౌఖిక వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. నిరుద్యోగ యువత, సామాజిక మాధ్యమాల కార్యకలాపాలపై చేసిన వ్యాఖ్యల్లో “కాక్రోచెస్” అనీ అన్నారు. దీనిపై విస్తృత విమర్శలు వచ్చాయి.
అయితే అనంతరం ప్రధాన న్యాయమూర్తి తాను యువత మొత్తాన్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని, నకిలీ డిగ్రీలతో వ్యవస్థను దుర్వినియోగం చేసే వ్యక్తుల గురించే మాట్లాడినట్లు స్పష్టీకరించారు. అలాగే, దేశ యువతపై తనకు గౌరవం ఉందని చెప్పారు.
ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం కూడా ఆయన మరొక మారు తాను అలా అనలేదని ప్రకటించారు.
“కాక్రోచ్ జనతా పార్టీ” ఆవిర్భావం – అనంతరం జరిగిన ఆందోళనలు..
“కాక్రోచ్ జనతా పార్టీ” భారత ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ కాదు. ఇది 2026లో ప్రారంభమైన వ్యంగ్య రాజకీయ-సామాజిక ఉద్యమం.
ప్రధాన న్యాయమూర్తి చేసిన “కాక్రోచ్” వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర స్పందన వ్యక్తమైంది. ఆ పదాన్నే కొందరు యువకులు అవమాన సూచికగా కాకుండా, ప్రతిఘటనకు చిహ్నంగా స్వీకరించారు. అక్కడి నుంచే “మై భీ కాక్రోచ్” అనే నినాదం, తరువాత “కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)” అనే వ్యంగ్య ఉద్యమం రూపుదిద్దుకుంది.
కాక్రోచ్‌ను ఎంత తొక్కినా అది మళ్లీ బయటకు వస్తుంది. అలాగే యువత గొంతును అణచివేయలేరని వారు ప్రతీకాత్మకంగా చెప్పారు. అందువల్ల “కాక్రోచ్” అనే పదాన్ని అవమానంగా కాకుండా ప్రతిఘటన, పట్టుదల, మనుగడకు ప్రతీకగా మార్చుకున్నారు.
ప్రారంభంలో ఈ ఉద్యమం ప్రధానంగా నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌పై పూర్తి విచారణ, బాధ్యులపై కఠిన చర్యలు, పరీక్షా వ్యవస్థలో పారదర్శకత, విద్యా సంస్కరణలు, యువతకు ఉద్యోగ అవకాశాలు, ప్రజా సంస్థల్లో జవాబుదారీతనం పెంచడం అంశాలపై దృష్టి పెట్టింది.
సోషల్ మీడియా పాత్ర..
ఈ ఉద్యమం సంప్రదాయ రాజకీయ పార్టీల కంటే భిన్నంగా ఎదిగింది. దీని ప్రధాన బలం సోషల్ మీడియా మీమ్స్, చిన్న వీడియోలు, వ్యంగ్య పోస్టర్లు, ఆన్లైన్ ప్రచారం. యువతలో ఈ విధానం వేగంగా ప్రాచుర్యం పొందింది.
చలో సంసద్” పిలుపు..
ఉద్యమం ఢిల్లీలో “చలో సంసద్” కార్యక్రమానికి పిలుపునిచ్చింది. వారి ప్రధాన నినాదం “విద్యను రక్షించండి – యువత భవిష్యత్తును కాపాడండి.”
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. ఇది కేవలం నీట్ గురించిన ఉద్యమం మాత్రమే కాదు. నిరుద్యోగం, విద్యా వాణిజ్యీకరణ, పరీక్షల విశ్వసనీయత, యువతలో నిరాశ, ప్రభుత్వ జవాబుదారీతనం, ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన హక్కు సమస్యలను ముందుకు తెచ్చింది. అందువల్ల ఇది విద్యార్థి సమస్యను దాటి విస్తృత సామాజిక చర్చగా మారింది.
భారతదేశంలో గతంలో కూడా విద్యార్థి ఉద్యమాలు జరిగాయి. కానీ ఈ ఉద్యమంలో ప్రత్యేకత ఏమిటంటే సోషల్ మీడియా ప్రధాన వేదికగా మారడం, వ్యంగ్యాన్ని నిరసన సాధనంగా ఉపయోగించడం, యువత స్వయంగా ఉద్యమాన్ని నడిపించడం, విద్యా సమస్యలను జాతీయ రాజకీయ చర్చలోకి తీసుకురావడం. ఇది భవిష్యత్తులో భారత యువజన రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రశ్నాపత్రాల లీక్ అనేది ఒక్క నీట్ సమస్య మాత్రమే కాదు. గత రెండు దశాబ్దాలుగా కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో జరిగిన అనేక పరీక్షలు ఇదే సమస్యతో దెబ్బతిన్నాయి.
పలు అధ్యయనాల ప్రకారం, ముఖ్యంగా 2019 తర్వాత వివిధ రాష్ట్రాల్లో డజన్ల కొద్దీ ప్రధాన పరీక్షలు లీకులు లేదా అక్రమాల కారణంగా రద్దు చేయబడ్డాయి లేదా దర్యాప్తుకు గురయ్యాయి.
ప్రధాన సంఘటనలు..
2015 – ఏఐపీఎంటీ(ఆల్ ఇండియా ప్రీ-మెడికల్ టెస్ట్), నీట్‌కు ముందు నిర్వహించిన ఏఐపీఎంటీలో పెద్ద ఎత్తున అక్రమాలు బయటపడ్డాయి.
మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాల ద్వారా సమాధానాలు చేరవేయడం జరిగింది. సుప్రీంకోర్టు మొత్తం పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది.
ఈ సంఘటన తర్వాత జాతీయ స్థాయి వైద్య ప్రవేశ పరీక్షల భద్రతపై తీవ్రమైన చర్చ మొదలైంది.
2017–18 : ఎస్ఎస్సీ (స్టాఫ్ సెలెక్షన్ కమిషన్) ఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షలో ప్రశ్నాపత్రాల లీక్ ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు ఢిల్లీలో నిరసనలు చేపట్టారు. ఈ సంఘటన ప్రభుత్వ నియామక పరీక్షల విశ్వసనీయతపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది.
2018 – సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు. సీబీఎస్ఈ 10వ తరగతి గణితం, 12వ తరగతి ఎకనామిక్స్ ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. కొన్ని పరీక్షలను మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది.
2021లో రాజస్థాన్‌లో ఉపాధ్యాయ నియామక పరీక్ష(రీట్) ప్రశ్నాపత్రం లీక్ అయింది. పరీక్ష రద్దు అయింది. అధికారులు, మధ్యవర్తుల అరెస్టులు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ వివాదం కొనసాగింది. ఈ కేసు సంవత్సరాల పాటు దర్యాప్తులో కొనసాగింది.
2022 – బీహార్ బీపీఎస్సీ 67వ సంయుక్త పోటీ పరీక్ష ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పరీక్షను రద్దు చేశారు.
2024 – ఉత్తరప్రదేశ్‌లో సుమారు 48 లక్షల మంది అభ్యర్థులు రాసిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడంతో పరీక్షను రద్దు చేశారు. ఇది దేశ చరిత్రలో అత్యధిక మంది అభ్యర్థులను ప్రభావితం చేసిన నియామక పరీక్షలలో ఒకటిగా నిలిచింది.
2024 – యూజీసీ-నెట్ పరీక్ష కూడా ప్రశ్నాపత్రం భద్రతపై వచ్చిన అనుమానాల కారణంగా రద్దు చేయబడింది. కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది.
2024 – నీట్-యూజీ వివాదం దేశవ్యాప్తంగా పరీక్షా వ్యవస్థపై విశ్వాసాన్ని కదిలించింది. సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎన్టీఏపై విమర్శలు, పరీక్షల సంస్కరణలపై జాతీయ చర్చలు జరిగాయి.
పలు సంవత్సరాల్లో ప్రశ్నాపత్రాల లీక్ లేదా పరీక్షా అక్రమాల కేసులు ఎక్కువగా వెలుగు చూసిన రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ (వ్యాపం కుంభకోణం), పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామక వివాదం, గుజరాత్, జార్ఖండ్. లీక్ లు ఈ రాష్ట్రాలకే పరిమితం కాదు. ఇతర రాష్ట్రాల్లో కూడా విడివిడిగా ఘటనలు చోటుచేసుకున్నాయి.
పదే పదే ఎందుకు పునరావృతమవుతున్నాయి?..
భారీ నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాల కొరత, ఒక పోస్టుకు వేలాది మంది పోటీ, కోచింగ్ సెంటర్ల మాఫియా, సంఘటిత నేర ముఠాలు, అవినీతి, పరీక్షల నిర్వహణలో భద్రతా లోపాలు, డిజిటల్ సాంకేతికత దుర్వినియోగం.
ఇది కేవలం నేరమా? లేక వ్యవస్థాగత సమస్యా? చాలా మంది విద్యావేత్తలు దీన్ని వ్యక్తిగత నేరంగా మాత్రమే కాకుండా వ్యవస్థాగత సంక్షోభంగా చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొత్త లీకులు బయటపడుతున్నాయి. అదే తరహా పద్ధతులు పునరావృతమవుతున్నాయి.
సంఘటిత ముఠాలు పనిచేస్తున్నట్లు దర్యాప్తుల్లో బయటపడుతోంది. పరీక్షల భద్రతను నిరంతరం బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
భారతదేశంలో ప్రశ్నాపత్రాల లీకులు విడివిడిగా జరిగే సంఘటనలు కాకుండా, పరీక్షా వ్యవస్థకు పెద్ద సవాలుగా మారాయి.
ఈ సమస్యకు కేవలం కఠిన శిక్షలు సరిపోవు. పారదర్శకత, సాంకేతిక భద్రత, జవాబుదారీతనం, వేగవంతమైన దర్యాప్తు, సమర్థవంతమైన పరిపాలన అన్నీ కలిసి వస్తేనే దీర్ఘకాలిక పరిష్కారం సాధ్యమవుతుంది.
విద్యా వాణిజ్యీకరణ, తీవ్రమైన పోటీ, కోచింగ్ పరిశ్రమ విస్తరణ వంటి అంశాలు లీకులకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని పలువురు విద్యావేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
1991 తర్వాత భారత విద్యా రంగంలో మార్పులు..
1991 ఆర్థిక సంస్కరణల తర్వాత భారతదేశంలో ప్రైవేట్ రంగం అనేక రంగాల్లోకి ప్రవేశించింది. విద్యా రంగం కూడా దీనికి మినహాయింపు కాదు.
ఈ కాలంలో ప్రైవేట్ పాఠశాలలు వేగంగా పెరిగాయి. ప్రైవేట్ ఇంజినీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ కళాశాలలు విస్తరించాయి. కోచింగ్ పరిశ్రమ భారీ వ్యాపారంగా మారింది. ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలు దేశవ్యాప్తంగా ఏర్పడ్డాయి.
విద్యను సామాజిక సేవగా కాకుండా లాభదాయక రంగంగా చూసే ధోరణి పెరిగింది. విద్యార్థి పాఠశాల కంటే కోచింగ్‌పై ఎక్కువగా ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. ఆర్థికంగా బలమైన కుటుంబాలకు మెరుగైన కోచింగ్ లభిస్తుండగా, పేద విద్యార్థులు వెనుకబడుతున్నారు.
ప్రవేశ పరీక్షల చుట్టూ భారీ మొత్తంలో డబ్బు తిరుగుతోంది. దీనిని అవకాశంగా తీసుకొని నేర ముఠాలు ఏర్పడ్డాయి.
స్వాతంత్య్రం తర్వాత నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన ప్రముఖ మంత్రులు..
రాజీనామాలను రెండు రకాలుగా చూడాలి. 1) ఆరోపణల రుజువు కోసం చూడకుండా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం. 2) ఒత్తిడి/ఆందోళనలకు తలొగ్గి రాజీనామా చేయడం.
లాల్ బహదూర్ శాస్త్రి: భారత రాజకీయాల్లో నైతిక బాధ్యతకు ఆదర్శం(1956). భారత రాజకీయ చరిత్రలో నైతిక బాధ్యతకు ప్రతీకగా నిలిచిన పేరు లాల్ బహదూర్ శాస్త్రి. 1956లో తమిళనాడులోని అరియలూరు రైలు ప్రమాదంలో వందలాది మంది మరణించారు.
ఆ సమయంలో ఆయన రైల్వే మంత్రిగా ఉన్నారు. దర్యాప్తు పూర్తికాకముందే ఆయన ఇలా చెప్పారు. “ఈ ప్రమాదానికి నేను ప్రత్యక్ష కారణం కాకపోయినా, రైల్వే శాఖకు రాజకీయ బాధ్యత నాదే” అని రాజీనామా చేశారు. ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలో నైతిక బాధ్యతకు అత్యున్నత ఉదాహరణగా ఇప్పటికీ ప్రస్తావించబడుతుంది.
టీటీ కృష్ణమాచారి (1958): ముంద్రా కుంభకోణం దేశాన్ని కుదిపేసింది. ఎల్ఐసీ నిధుల పెట్టుబడుల విషయంలో తీవ్ర విమర్శలు రావడంతో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి రాజీనామా చేశారు.
వీకే కృష్ణ మేనన్ (1962): చైనా-భారత్ యుద్ధం తర్వాత దేశవ్యాప్తంగా రక్షణ శాఖపై విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటి రక్షణ మంత్రి వీకే కృష్ణ మేనన్ తీవ్ర రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో రాజీనామా చేశారు.
నీలం సంజీవరెడ్డి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రవాణా జాతీయీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆయన నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకున్నారు. ఇది రాష్ట్ర స్థాయిలో నైతిక బాధ్యతకు ప్రస్తావించబడే ప్రముఖ ఉదాహరణలలో ఒకటి.
మాధవరావు సింధియా (1993): రైల్వే ప్రమాదాలపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర రైల్వే మంత్రి మాధవరావు సింధియా రాజీనామా చేశారు. ప్రత్యక్ష తప్పిదం నిరూపించబడకపోయినా, శాఖాపరమైన బాధ్యతను అంగీకరించడం విశేషం.
శిబు సోరెన్ (2004): కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న శిబు సోరెన్‌పై పాత క్రిమినల్ కేసు మళ్లీ తెరపైకి రావడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు.
ఎ రాజా (2010): టూజీ స్పెక్ట్రమ్ కేటాయింపుల వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. టెలికాం మంత్రి ఏ రాజా దర్యాప్తు, రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో రాజీనామా చేశారు. తర్వాత కోర్టు విచారణలో ఆయన నిర్దోషిగా విడుదలైనప్పటికీ, రాజీనామా అప్పటికే జరిగింది.
అశోక్ చవాన్ (2010): మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ వివాదం నేపథ్యంలో పదవికి రాజీనామా చేశారు.
బీఎస్ యడియూరప్ప (2011): కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప గనుల వ్యవహారంపై లోకాయుక్త నివేదిక వచ్చిన తర్వాత రాజీనామా చేశారు.
ఉమా భారతి (2004): హుబ్లీ ఈద్గాహ్ మైదానం కేసులో అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఉమా భారతి రాజీనామా చేశారు.
లాలూ ప్రసాద్ యాదవ్ (1997): బీహార్‌లో పశుగ్రాసం కేసు నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
మధు కోడా (ఝార్ఖండ్): గనుల కేటాయింపులు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో పదవి కోల్పోయి, తరువాత విచారణను ఎదుర్కొన్నారు.
నిద్రపోయేవారిని లేపడం తేలిక. కానీ నటిస్తున్నవారిని లేపాలంటే తీవ్రమైన ఒత్తిడి, విస్తృత ఉద్యమాలు తప్పనిసరి అని నేటి ఉదంతం మరొకమారు నిరూపించింది.
1950–1980 మధ్య కాలంలో రాజీనామా ఒక రాజకీయ సంప్రదాయంగా ఉండేది. ఆరోపణలు వచ్చిన వెంటనే పదవి నుంచి తప్పుకునే ధోరణి ఎక్కువగా కనిపించేది.
1990 తర్వాత(సరళీకృత ఆర్థిక విధానాల అమలులోకి వచ్చాయి) చట్టపరమైన పోరాటం పూర్తయ్యే వరకు పదవిలో కొనసాగాలనే ధోరణి పెరిగింది. “ఆరోపణలు మాత్రమే రాజీనామాకు కారణం కావు” అనే వాదన బలపడింది.
నైతికత అంటే తప్పు చేశానని అంగీకరించడం కాదు. ప్రజల విశ్వాసాన్ని గౌరవించడం. విచారణ నిష్పాక్షికంగా జరగడానికి అవకాశం కల్పించడం.
ప్రజాస్వామ్య విలువలను కాపాడడం. లాల్ బహదూర్ శాస్త్రి వంటి నాయకుల ఉదాహరణ ఈ సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది.
ఈ ఆందోళన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్య పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతున్నది.
“ఆరోపణలతో రాజీనామాలు చేయడం ప్రారంభిస్తే ఇక మంత్రులు ఎవరూ మిగలరు” అని ఆయన వ్యాఖ్యానించారు. అంటే అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అక్రమాలు ఎంత లోతుగా పెనవేసుకుపోయి ఉన్నాయో మంత్రిగారి వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి.
పరిష్కారాలు..
అందరికీ నాణ్యమైన విద్య ఉచితంగా అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అక్రమాలను బయటపెట్టే అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులకు(విసిల్ బ్లోయర్) చట్టపరమైన రక్షణ కల్పించాలి.
ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తక్షణం బాధ్యతల నుండి తప్పించాలి. విచారణ నిష్పక్షపాతంగా సజావుగా జరిగే వాతావరణాన్ని సృష్టించాలి. న్యాయ విచారణ సుదీర్ఘకాలం కొనసాగే తంతుగా కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సత్వరం పరిష్కరించాలి.
ఒకే పరీక్షపై ఆధారపడకుండా బహుళ అవకాశాల వ్యవస్థను అభివృద్ధి చేయాలి. పాఠశాల విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రాంతీయ భాషల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాలి. విద్యలో నాణ్యత ఎంత ముఖ్యమో, విశ్వసనీయత కూడా అంతే ముఖ్యం.
పరీక్షలు నిష్పాక్షికంగా ఉంటేనే ప్రతిభకు న్యాయం జరుగుతుంది. పారదర్శక పరిపాలన ప్రజాస్వామ్యానికి పునాది. యువత విశ్వాసాన్ని కోల్పోయే వ్యవస్థ ఏ దేశానికైనా ప్రమాదకరం.
భారతదేశం ప్రపంచంలో అత్యంత యువ జనాభా కలిగిన దేశాలలో ఒకటి. ఈ యువశక్తే మన అతిపెద్ద సంపద. ఆ సంపదను కాపాడాలంటే విద్యలో సమాన అవకాశాలు, పరీక్షల్లో పారదర్శకత, ప్రభుత్వాల్లో జవాబుదారీతనం, రాజకీయాల్లో నైతిక విలువలు, నిజాయితీ అనే ఐదు స్తంభాలు బలంగా నిలవాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
