టెడ్ కొప్పెల్ టౌన్ హాల్ సమావేశం జరిగిన అదే వారంలో తొలిసారిగా ఒక్కటైన జ్యూస్ ఫర్ రేషియల్ అండ్ ఎకనామిక్ జస్టిస్(జేఎఫ్ఆర్ఈజే) లాంటి సంస్థలను కూడా మనం స్మరించుకుంటాం.
న్యూయార్క్‌లోని ఎంతోమంది యూదులు మడీబాతో సంఘీభావంగా నిలిచారని ప్రపంచానికి చాటిచెప్పడానికే ఆ సంస్థ ఏర్పడింది.
అంతేకాదు వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటానికి 50 వేల డాలర్లు విరాళంగా సేకరించిన ఒక షబాత్ ప్రార్థనా సభను కూడా వారు నిర్వహించారు.
మడీబాను ఒక మహానాయకుడిగా స్మరించుకుంటున్న ఈ సమయంలో నాతో సహా చాలామంది మనల్ని మనం ఒక మరింత కఠినమైన ప్రశ్న అడగాలి.
చరిత్ర మడీబాను మహానాయకుడిగా గుర్తించే ముందు ఆయనతో ఎలా ప్రవర్తించారో ఈ రోజు మనం కూడా అలానే ఎవరితోనైనా ప్రవర్తిస్తున్నామా?
ఈ రోజు మనం మడీబాను ప్రశంసించడానికి ఉపయోగిస్తున్న ప్రతి గొప్ప పదానికి బదులుగా ఈ రోజే టెడ్ కొప్పెల్ అప్పట్లో మడీబాను ఎలా చిత్రీకరించాడో అలా చిత్రీకరించబడుతున్న వ్యక్తి ఎవరు? ఇంకెవరెవరి మానవత్వాన్ని షరతులతో ముడిపెట్టారు? ఇంకెవరెవరికి వారి స్వేచ్ఛ కోసం ఇంకా వేచి ఉండాల్సిందేనని చెప్పారు?
ఈ రోజు మనం వ్యతిరేకిస్తున్నా భవిష్యత్తులో చరిత్ర వెనక్కి తిరిగి చూసినప్పుడు గొప్పగా కీర్తించే ఒక పోరాటానికి నాయకత్వం వహిస్తున్న వారు ఎవరు? ఇంకెవరికి ఈ రోజు మన సంఘీభావం అవసరం?
ఒమర్ ఎల్ అక్కాద్ రాసిన ఒక రోజు ప్రతి ఒక్కరూ ఎప్పటి నుంచో దీనికి వ్యతిరేకంగానే ఉన్నామని చెబుతారు (వన్ డే, ఎవ్రీవన్ విల్ హ్యావ్ ఆల్వేస్ బీన్ అగైన్స్ట్ థిస్) అనే పుస్తకం గురించి నేను ఆలోచిస్తాను.
ఆ ఒక్క వాక్యమే చరిత్రలో అత్యంత క్రూరమైన అత్యంత సుపరిచితమైన అలవాట్లలో ఒకదానిని ప్రతిబింబిస్తుంది.
చివరికి దాదాపు ప్రతి ఒక్కరూ తాము వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఉన్నామని చెబుతారు. చివరికి దాదాపు ప్రతి ఒక్కరూ తాము మడీబాతో కలిసి నిలబడ్డామని డాక్టర్ కింగ్‌కు మద్దతుగా నిలిచామని చెబుతారు. చివరికి ఈ రోజు తాము సమర్థిస్తున్న ఎన్నో అన్యాయాలను కూడా తాము వ్యతిరేకించామని దాదాపు ప్రతి ఒక్కరూ చెబుతారు.
కానీ న్యాయం అంటే చరిత్ర తీర్పు చెప్పిన తర్వాత మనం ఎక్కడ నిలబడ్డామన్నది కాదు.
చరిత్ర తన తీర్పును ఇంకా రాస్తున్న సమయంలోనే అన్యాయం–న్యాయం మధ్య పోరాటం జరుగుతున్నప్పుడే మనం ఏ వైపు నిలిచామన్నదే అసలు కొలమానం.
ఇంకా వేలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలను సమాధి చేసే వరకు, ఇంకా వేలాది మంది తమ అవయవాలను, తమ ఇళ్లను, తమ భవిష్యత్తును కోల్పోయే వరకు మనం వేచి చూడాల్సిందేనా? అప్పుడు మాత్రమే మనం ఒక్కటై పాలస్తీనా స్వేచ్ఛ కోసం గట్టిగా డిమాండ్ చేయాలా?
డాక్టర్ హుస్సామ్ అబూ సఫియా ఈ రోజు వరకు కొనసాగుతున్న ఇజ్రాయెల్ నిర్బంధంలో 18 నెలలకు పైగా స్వేచ్ఛ కోసం ఎందుకు ఎదురుచూడాల్సి వస్తోంది?
ప్రపంచమంతా ఆయనను తన ఆసుపత్రి నుంచి బయటకు వస్తుండగా అపహరించడాన్ని చూసిన తర్వాత కూడా ఆయన జైలులో క్షీణించిపోతున్న దృశ్యాన్ని చూస్తున్నప్పటికీ ఆయనకు ఇంకా ఎందుకు విముక్తి లభించడం లేదు?
దిల్లీలో ఉమర్ ఖలీద్ తన నిర్బంధ జీవితంలో 6వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నప్పటికీ మనం ఇంకా ఎందుకు వేచి చూస్తున్నాం? మడీబాపై ఒకప్పుడు మోపినట్టే కల్పితమైన ఉగ్రవాద ఆరోపణలతో జైలులో పెట్టబడిన ఒక రాజకీయ ఖైదీగా ఆయన ఇంకా ఎందుకు స్వేచ్ఛ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది?
దాడులకు గురవుతున్నా, లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తున్న వలసదారుల పక్కన మనం దృఢంగా నిలబడటానికి ఇంకా ఎందుకు వేచి చూడాలి?
అది సోమవారం మైనే రాష్ట్రంలోని బిడెఫోర్డ్లో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) కాల్పుల్లో తలకు బుల్లెట్ తగిలి మరణించిన జోన్ సెబాస్టియన్ డురాన్ గెర్రెరో అయినా లేదా గత వారం దక్షిణాఫ్రికా వీధుల్లో జెనోఫోబియా (విదేశీయుల పట్ల ద్వేషం) పెరుగుతున్న పరిస్థితుల్లో హతమైన ఇద్దరు నైజీరియన్లు అమరమిరో ఇమ్మాన్యుయేల్, ఎక్ఫెయోంగ్ ఆండ్రూ అయినా వారి కోసం మనం ఎందుకు ఇప్పుడే నిలబడకూడదు?
మనకు ఎలాంటి నష్టం, మూల్యం చెల్లించాల్సిన అవసరం లేని పరిస్థితి వచ్చిన తర్వాతే సంఘీభావం చూపాలా?
ఆ ప్రశ్నలకు నిజంగా నిష్కపటంగా సమాధానం వెతకాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరి మీద ఉంది.
సంఘీభావం అనేది కేవలం ఒక నినాదంగా కాకుండా మన జీవన విధానంలో, మన రాజకీయ వైఖరిలో, ప్రపంచాన్ని చూసే తీరులో, దానిలో మనం ప్రవర్తించే తీరులో ఒక భాగంగా మార్చుకోవాల్సిన బాధ్యత మనదే.
చీకటిలోనే నక్షత్రాలు వెలుగుతాయి..
ఇది అంత సులభమైన పని కాదు. మనం జీవిస్తున్న ప్రపంచం మనల్ని ఒకరినొకరు విడదీసేలా నిర్మించబడింది. లాభాల కోసం పనిచేసే శక్తులు, మన ప్రవర్తనను ప్రభావితం చేసే అల్గారిథమ్‌లు ఇవన్నీ మన మధ్య విభేదాలు పెంచి ఒకరిపై ఒకరిని తిరగబడేలా రూపొందించబడ్డాయి.
అధిక సంపద కలిగిన కొద్దిమంది తక్కువ వనరులతో జీవిస్తున్న అనేక మందిని దోచుకుంటున్నారు.
గాజాలో జరుగుతున్న మారణహోమం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాల విషాదాన్ని మనం ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నాం.
ఎప్పటిలాగే పేదలను చెడ్డవారిగా చిత్రీకరించడం ద్వారా, జాతి విద్వేషపు మంటలను రెచ్చగొట్టడం ద్వారా కొందరు డబ్బు సంపాదించడానికి, మరికొందరు అధికారాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇవన్నీ మనల్ని ఒకరినొకరు దూరం చేసే శక్తులు. ఒకరి నుంచి ఒకరం ముఖం తిప్పుకునేలా చేసే శక్తులు. కానీ మడీబా అధిగమించిన పరిస్థితులు కూడా ఇవే కాదా?
మడీబాను గాలులు బలంగా వీచే రాబెన్ దీవికి తీసుకెళ్లినప్పుడు బయట ప్రపంచంతో ఆయనకు ఉన్న సంబంధాలన్నీ తెగిపోయినప్పుడు అది సంఘీభావం పెరగడానికి అనుకూలమైన పరిస్థితా? దశాబ్దాల పాటు జాతి వివక్ష ఆధిపత్యాన్ని, మనిషిగా ఉన్న గౌరవాన్ని నిరాకరించే అవమానాన్ని మడీబా భరించినప్పుడు అది సంఘీభావానికి అనుకూలమైన పరిస్థితా? వర్ణవివక్ష పూరిత వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు, పెద్ద సంస్థలు తమ అపారమైన సంపదను, అధికారాన్ని ఉపయోగించినప్పుడు అది సంఘీభావం పెరగడానికి అనుకూలమైన పరిస్థితా?
సంఘీభావం సాధ్యమయ్యే మంచి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే మండేలా పోరాడలేదు.
ఒంటరితనం, జైలు, అణచివేత, అపారమైన అధికారానికి వ్యతిరేకంగానే ఆయన సంఘీభావాన్ని నిర్మించాడు. కాబట్టి ఈ రోజూ కష్టమైన పరిస్థితులున్నాయని చెప్పి మనం వెనక్కి తగ్గకూడదు.
నిజం ఏమిటంటే సంఘీభావం బలంగా పెరగడానికి అత్యంత అనుకూలమైన నేలగా మారేవి దానిని నాశనం చేయాలని ప్రయత్నించే పరిస్థితులే కావచ్చు.
యజమానులు కార్మికుల హక్కులను అణచివేసినప్పుడు కార్మికులు ఐక్యంగా లేచి నిలబడతారు.
నియంతృత్వ పాలకులు క్రూరమైన అణచివేతలకు పాల్పడినప్పుడు పౌరులు ఒకరి చేతిని మరొకరు పట్టుకుని ఐక్యంగా నిలుస్తారు.
మెరుగైన భవిష్యత్తు కోసం జరిగిన ప్రతి పోరాటం ఆ భవిష్యత్తు ఎప్పటికీ అందని కలలా అనిపించిన ఒక క్షణంలోనే ప్రారంభమైంది.
డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యకు గురయ్యే ముందు రోజు రాత్రి చెప్పినట్లుగా: చీకటి మరింతగా కమ్ముకున్నప్పుడే నక్షత్రాలు కనిపిస్తాయి.
అన్యాయం సంఘీభావాన్ని చంపదు. దానికి వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసే శక్తిగా కూడా మారుతుంది.
ఇప్పుడైతే చీకటి సరిపడా కమ్ముకున్నదని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ ఈ గదిలో మనమంతా కలిసి ఉన్నప్పుడు ఆ నక్షత్రాలను కూడా చూడగలమని నమ్మాలి.
ఆ నక్షత్రాలు అంటే— గౌరవప్రదమైన జీవితాన్ని కోరుతూ భుజం భుజం కలిపి నిలబడుతున్న శ్రామిక ప్రజల రూపంలో కనిపించే చిన్న చిన్న వెలుగులు. ఎండైనా చలైనా లెక్కచేయకుండా వీధుల్లోకి వచ్చి యుద్ధాలకు ముగింపు కావాలని, బాధలకు తెరపడాలని డిమాండ్ చేస్తూ నడుస్తున్న నిరసనకారుల రూపంలోని వెలుగులు. తమ పేరు మీద దాదాపు ఏమీ లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ తమకున్న కొద్దిపాటి దానిని కూడా తమకంటే మరింత అవసరంలో ఉన్నవారికి అందించడానికి చేతులు చాచే మనుషుల రూపంలోని వెలుగులు.
సంఘీభావం అంటే పరిపూర్ణత కాదు. సంఘీభావం అంటే ఎలాంటి లోపాలు లేని పవిత్రత కూడా కాదు. సంఘీభావం అంటే మనుషులు ఒకరినొకరు ఎంచుకోవడం, కొన్ని సందర్భాల్లో తమ స్వంత ప్రయోజనాల కంటే ఇతరుల కోసం నిలబడటం కూడా.
మిత్రులారా సంఘీభావం అనేది చాలా సందర్భాల్లో అసాధ్యమైనదిగా అనిపిస్తుంది. అది కేవలం ఏదో ఒక కల్పిత మహానాయకుడి వల్ల మాత్రమే సాధ్యమయ్యే విషయం అనిపించవచ్చు. కానీ మడీబా మనకు గుర్తుచేసినట్లుగా ఆయన జీవించిన జీవితం ద్వారా, ఆయన చూపించిన నాయకత్వం ద్వారా, ఆయన పలికిన మాటల ద్వారా ఏదైనా పని పూర్తయ్యే వరకు అది ఎప్పుడూ అసాధ్యంగానే అనిపిస్తుంది. కాబట్టి మనం కలిసి దాన్ని సాధిద్దాం.
ఒక గొప్ప మార్పు సాధించే వరకు అది అసాధ్యంగా కనిపిస్తుంది. కానీ ప్రజలు ఐక్యంగా కృషి చేస్తే అసాధ్యమనుకున్నదే సాధ్యమవుతుంది. ధన్యవాదాలు.
అనువాదం: మనోహర రాజు
మమ్దానీ ప్రసంగ వ్యాసం మూడు భాగాలుగా ప్రచురితమవుతుంది, ఇది చివరి భాగం. మొదటి భాగం, రెండవ భాగం కోసం క్లిక్ చేయండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
