వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ ఎలాగైతే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులో, అలాగే నిర్దోషిత్వ భావన, న్యాయపాలన కూడా ప్రాథమిక సూత్రాలే.
ప్రజాస్వామ్యంలో రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని ప్రశ్నించడం నేరం కాదు; రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కు. అలా ప్రశ్నించడం బాధ్యత కూడా.
కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, మతాన్ని ధిక్కరించినా దేశద్రోహం లాగా మారిపోయింది. అప్రకటిత ఎమర్జెన్సీలో ఉన్నామా అనే భావన కలుగుతుంది.
ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో బెయిల్ నిరాకరిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇద్దరు వ్యక్తుల స్వేచ్ఛకు సంబంధించిన అంశం మాత్రమే కాదు.
ఇది యూఏపీఏ చట్టం పరిధి, సెక్షన్ పదిహేను వ్యాఖ్యానం, సెక్షన్ 43డీ(5) కింద బెయిల్ ప్రమాణాలు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో న్యాయవ్యవస్థ పాత్ర గురించి మౌలిక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
సోనమ్ వాంగ్‌చుక్ నెలల తరబడి జైల్లో ఉండడం, స్టాన్ స్వామి జైలులో ప్రాణాలు విడవటం, ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబర్ రావణ్ పై యూఏపీఏ చట్టం ప్రయోగించటం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ విశ్లేషణ అవసరమైంది.
తీవ్రవాద వ్యతిరేక భద్రతా చట్టాల చరిత్ర..
టాడా, పోటా, యూఏపీఏ మూడు చట్టాల చరిత్రను పరిశీలిస్తే ఒకే విధమైన లక్షణం, స్వభావం కనిపిస్తుంది. ప్రతి చట్టం ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే లక్ష్యంతో రూపొందించబడింది.
పంజాబ్ వేర్పాటు వాదుల ఉద్యమం కారణంగా చూపి దేశవ్యాప్తంగా 1985లో వచ్చిన టాడా (ఉగ్రవాద, విచ్ఛిన్నకర కార్యకలాపాల నిరోధక చట్టం) వేలాది మంది జీవితాలను చిదిమేసింది.
వేలాది మందిని అరెస్టు చేసినా, శిక్షల శాతం అత్యంత తక్కువగా ఉండేది.
భిన్నస్వరాలు, రాజకీయ ప్రత్యర్థులు, మైనారిటీలు, జర్నలిస్టులు, విశ్లేషకులు, సామాజిక కార్యకర్తలపై ఈ చట్టం విస్తృతంగా దుర్వినియోగమైంది.
చివరికి ప్రజాస్వామ్య ఒత్తిడికి తలొగ్గి 1995 తర్వాత ఆ చట్టాన్ని కొనసాగించలేదు.
అలాగే 2002లో పార్లమెంట్‌పై ఉగ్రదాడి అనంతరం, కశ్మీర్ తీవ్రవాదుల అణచివేత కోసం పోటా చట్టం వచ్చింది. అదే కథ మళ్లీ పునరావృతమైంది.
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే పేరిట భిన్నస్వరాలను అణచివేయడానికి ఉపయోగించబడింది. ప్రభుత్వాలపై ఒత్తిడి వలన 2004లో అది కూడా నిలిచిపోవాల్సి వచ్చింది.
అయితే 1967లో రూపొందిన యూఏపీఏ మాత్రం 2004, 2008, 2019 సవరణలతో మరింత కఠినమైన చట్టంగా రూపాంతరం చెందింది.
దాదాపుగా రద్దయిన టాడా, పోటా లాంటి చట్టమే మళ్ళా రూపొందించబడింది.
ముఖ్యంగా 2019 సవరణ ద్వారా విచారణ, శిక్ష ఏదీ లేకుండానే ఒక వ్యక్తిని “ఉగ్రవాది/తీవ్రవాది”గా ప్రకటించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు.
భారత దేశానికి ఖచ్చితంగా ఉగ్రవాద నియంత్రణ చట్టం ఉండటం ఎంత అవసరమో ఆ చట్టం దుర్వినియోగానికి గురవకుండా ఉండడం కూడా అంతే అవసరం.
ఆ దిశలో ఇప్పటిదాకా వచ్చిన ప్రతి కొత్త చట్టం “దేశ భద్రత” పేరుతోనే వచ్చింది. కానీ ఆచరణలో అవి “పౌర స్వేచ్ఛల నియంత్రణ”గా మారాయి అనటానికి చరిత్రయే ఒక సాక్ష్యం.
రాజ్యాంగ హక్కులు – ప్రాథమిక స్వేచ్ఛ..
ప్రజాస్వామ్యంలో పౌరులు ఏం చేశారనే కారణంతో కాదు, ఏం మాట్లాడారనే కారణంతో శిక్షించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన దశ.
భగత్ సింగ్ వంటి ఎందరో స్వతంత్ర సమరయోధుల కరపత్రాలు, భావోద్వేగాన్ని కలిగించే వ్యాసాలు, మరెందరో రాసిన కవిత్వాలు నినాదాలే భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమానికి పునాదులు వేశాయి.
ప్రాచీన భారతదేశంలో చార్వాక/లోకాయత, బౌద్ధ సైద్ధాంతిక తత్వం వల్ల వచ్చిన సామాజిక మార్పులు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి.
అలాంటి చరిత్ర కలిగిన దేశంలో నేడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ఉగ్రవాద ఆరోపణలకు కారణమవుతోంది అంటే మనం వెనక్కి వెళ్తున్నామేమో అనే భయం వేస్తుంది.
విచారణ కూడా పూర్తికాకముందే సంవత్సరాల తరబడి జైల్లో ఉండాల్సిన పరిస్థితిని చట్టం కాదు, యూఏపీఏ అనే ఆయుధం నిర్మించింది.
సుప్రీంకోర్టు తీర్పు అసాధారణ స్థాయిలో చట్టాన్ని విస్తరించింది..
యూఏపీఏలోని సెక్షన్ 15 “ఉగ్రవాద చర్య” అంటే ఏమిటో నిర్వచిస్తుంది.
అందులోని భాషను పరిశీలిస్తే ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ప్రాణనష్టం కలిగించే హింసాత్మక చర్యల గురించే ప్రస్తావన కనిపిస్తుంది. అంటే ఉగ్రవాదం అనేది భౌతిక హింసకు సంబంధించిన నేరం.
శిక్షాస్మృతుల వ్యాఖ్యానంలో శిక్షాస్మృతుల ఖచ్చితమైన నిర్మాణ సూత్రం శతాబ్దాలుగా అన్ని దేశాలచే అంగీకరించబడింది. శిక్ష విధించే చట్టాలను విస్తృతంగా కాకుండా పరిమితంగా, నిర్దిష్టంగా వ్యాఖ్యానించాలి.
చట్టసభలు స్పష్టంగా చెప్పని అంశాన్ని న్యాయస్థానం తన వ్యాఖ్యానం ద్వారా పెంచకూడదు లేదా చేర్చకూడదు.
ఎందుకంటే శిక్షాస్మృతిలో ప్రతి సందేహం నిందితుడికి అనుకూలంగా పరిగణించబడాలి అనే న్యాయపరమైన సడలింపు నియమం(సందేహ ప్రయోజనం) క్రిమినల్ న్యాయశాస్త్రానికి మూలసూత్రం.
కానీ ఢిల్లీ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆ నిర్వచనాన్ని విస్తృత పరిణామాలు ఉండే రీతిలో విస్తరించింది.
“మరే ఇతర మార్గాల ద్వారానైనా” అనే పదాలను ప్రజా సమావేశాల్లో చేసిన ప్రసంగాలు, నినాదాలు, నిరసనల నిర్వహణ వంటి అంశాలను కూడా ఉగ్రవాద కుట్రలో భాగంగా పరిగణించే దిశగా వ్యాఖ్యానం చేసింది.
ఇది అత్యంత ఆందోళనకర పరిణామం. ఎందుకంటే ఒకసారి బలమైన పదజాలం కల్గిన ప్రసంగాన్నే ఉగ్రవాద చర్యగా పరిగణించడం ప్రారంభిస్తే, ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతి మాటను కూడా ఉగ్రవాదంగా, తీవ్రవాదంగా చిత్రీకరించే అవకాశాలు మొదలౌతాయి.
ప్రతి నిరసనను ఉగ్రవాద చర్య నిర్వచన పరిధిలోకి తీసుకురావడం చట్టపరంగా తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది.
శాసనసభ ఉద్దేశించని పరిధిని న్యాయ వ్యాఖ్యానం ద్వారా విస్తరించడం న్యాయ నిగ్రహ సూత్రానికి అనుకూలమా అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది.
శాంతిభద్రతలు – దేశ భద్రత మధ్య వ్యత్యాసం..
శిక్షాస్మృతిలో ఉన్న సాధారణ నేరాలు – తీవ్రవాద నిరోధక చట్టాలు సూచించే నేరాలు, దేశద్రోహ నేరాలు కూడా దాదాపుగా ఒకటే స్వభావాన్ని కలిగి ఉంటాయి.
శాంతిభద్రతలు, ప్రజాశాంతి, దేశ భద్రతపై వ్యాఖ్యానం చేస్తూ, సుప్రీంకోర్టు “రామ్ మనోహర్ లోహియా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్” కేసులో ఇలా అంది: “మూడు కేంద్రీకృత వృత్తాలను ఊహించుకుంటే, వాటిలో అతి పెద్ద వృత్తం ‘శాంతిభద్రతల’ను సూచిస్తుంది. దాని లోపల ఉన్న రెండవ వృత్తం ‘ప్రజా శాంతి’ని సూచిస్తుంది. దాని లోపల ఉన్న అతి చిన్న వృత్తం ‘రాష్ట్ర/దేశ భద్రత’ను సూచిస్తుంది. అప్పుడు ఒక విషయం సులభంగా అర్థమవుతుంది—ఏదైనా చర్య శాంతిభద్రతలను ప్రభావితం చేయవచ్చు; కానీ అది తప్పనిసరిగా ప్రజా శాంతిని ప్రభావితం చేయాల్సిన అవసరం లేదు. అదే విధంగా, ఒక చర్య ప్రజా శాంతిని ప్రభావితం చేయవచ్చు; కానీ అది తప్పనిసరిగా రాష్ట్ర/దేశ భద్రతకు ముప్పుగా మారాల్సిన అవసరం లేద” అని.
అంటే నేరంగా పరిగణించబడే ప్రతి చర్యను కూడా ఈ దృష్టి కోణంతో చూసినప్పుడే నేరస్వభావాన్ని గుర్తించటం(వ్యత్యాసం చూపడం) సాధ్యము అని కోర్టు చెప్పింది.
ఇటీవల కాలంలో ఉత్తర భారతదేశంలోని రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీని ముట్టడించారు. రవాణా సౌకర్యాలకు రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే కాపు సామాజిక వర్గం రిజర్వేషన్లు కోరే పోరాటంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రైలు కూడా తగలబెట్టారు.
1974లో జార్జ్ ఫెర్నాండిస్ నేతృత్వంలో దాదాపుగా ఇరవై రోజుల పాటు రైలు రవాణా సంస్థ మొత్తం ఆగిపోయింది.
యూఏపీఏ చట్టం ప్రకారం “ప్రజావసర/ నిత్యావసర సరఫరాలను అడ్డుకోవడం” కూడా తీవ్రవాద చర్యగానే పరిగణించబడుతుంది. కానీ పైన చెప్పిన మూడు సందర్భాలలో ఈ చట్టాన్ని లేదా అంతకు ముందు ఉన్న తీవ్రవాద వ్యతిరేక చట్టాలను ప్రయోగించలేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో రాతలకు, సభలలో ఇచ్చిన ఉపన్యాసాల వలన కూడా యూఏపీఏ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
ప్రక్రియే శిక్షగా మారుతున్న వైనం..
అధికారంలో ఉన్నవారు అధికార దుర్వినియోగం చేస్తారని చెప్పటానికి అసాధారణమైన జ్ఞానం అవసరం లేదు. అది నగ్నసత్యం. కాకపోతే యూఏపీఏ లాంటి చట్టాలను ప్రయోగించినప్పుడు మానవ హక్కుల ఉల్లంఘన తీవ్రస్థాయిలో ఉంటుంది. ఆ చట్టంలోని సెక్షన్ 43డీ (5) కారణంగా బెయిల్ దాదాపు అసాధ్యమవుతుంది.
విచారణ ప్రారంభమయ్యేలోపే సంవత్సరాలు జైలులో గడిచిపోతాయి. ఈ ప్రక్రియలో శిక్ష తీర్పు ద్వారా, తీర్పు తర్వాత రావటం లేదు. ప్రక్రియే శిక్ష అవుతున్నది. స్టాన్ స్వామి ఉదాహరణ ఒక్కటి చాలు ప్రక్రియే శిక్షగా మారుతుంది అని చెప్పడానికి.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది పౌరులందరికీ భావప్రకటన స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా ఇస్తుంది. ఆ స్వేచ్ఛకు పరిమితులు ఉండవచ్చు. కానీ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను విమర్శించిన ప్రసంగాన్ని ఉగ్రవాదంగా పరిగణించడం “సహేతుకమైన పరిమితి” కాదు. అది భావప్రకటనా స్వేచ్ఛనే నిర్వీర్యం చేయడం.
ఈ పరిస్థితి ఇప్పటికే పౌరహక్కుల కార్యకర్తలలో, సాధారణ పౌరునిలో కూడా తీవ్రమైన భయాన్ని సృష్టిస్తోంది. న్యాయవాదులు యూఏపీఏ కేసులు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు.
జర్నలిస్టులు స్వీయ సెన్సార్ చేసుకుంటున్నారు. ఇలాంటి చట్టాల ప్రయోగంతో భయాన్ని పాలనా సాధనంగా ఉపయోగించడం శోచనీయం. ఇందుకు ఏ ప్రభుత్వాలూ మినహాయింపు కాదు.
భారతదేశం ఉగ్రవాదాన్ని ఎదుర్కోకూడదని ఎవరూ చెప్పరు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం ఎంత అవసరమో, రాజ్యాంగ స్వేచ్ఛలను కాపాడటం కూడా అంతే అవసరం.
ఈ రెండింటి మధ్య సమతుల్యత కోల్పోతే జాతీయ భద్రత పేరుతో పౌర స్వేచ్ఛలు క్రమంగా క్షీణిస్తాయి. న్యాయస్థానాల బాధ్యత కేవలం చట్టాన్ని అమలు చేయడం కాదు; రాజ్యాంగాన్ని సంరక్షించడం.
ముఖ్యంగా శిక్షాస్మృతుల వ్యాఖ్యానంలో న్యాయ నిగ్రహం, వ్యక్తిగత స్వేచ్ఛ పట్ల గౌరవం, రాజ్యాంగ విలువల పట్ల నిబద్ధత ప్రజాస్వామ్యానికి రక్షణగా నిలుస్తాయి.
భిన్నాభిప్రాయం ప్రజాస్వామ్యానికి ముప్పు కాదు. భిన్నాభిప్రాయాన్నే ఉగ్రవాదంగా పరిగణించడం ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు.
అత్యవసరమైన మూడు సంస్కరణలు..
అందుకే కనీసం మూడు సంస్కరణలు అత్యవసరం.
మొదటిది: న్యాయస్థానాల నిగ్రహం లేదా సంయమనం. శిక్షాస్మృతులను వాటి స్పష్టమైన పదాలకే పరిమితం చేయాలి. న్యాయ వ్యాఖ్యానం పేరుతో వాటిని విస్తరించకూడదు.
రెండవది: శాసన సంస్కరణ. యూఏపీఏలోని సెక్షన్ 43డీ(5) బెయిల్ నిబంధనలను పునఃపరిశీలించాలి. నిర్దోషిత్వ భావన ప్రజాస్వామ్య న్యాయవ్యవస్థకు ప్రాణం.
మూడవది: దుర్వినియోగానికి బాధ్యత. రాజకీయ కార్యకర్తలు, విద్యార్థులు, జర్నలిస్టులపై నిరాధారంగా యూఏపీఏ ప్రయోగించి చివరకు కేసులు నిలవకపోతే, అవి తప్పుడు కేసులు అని తేలితే అలాంటి అధికారులపై చట్టపరమైన జవాబుదారీతనం ఉండాలి.
రాజ్యాంగం అంటే అధికారాన్ని పరిమితం చేసే లేదా నియంత్రించే ప్రమాణం. ప్రజాస్వామ్యం అంటే భిన్నాభిప్రాయాన్ని వినగలిగే వ్యవస్థ. న్యాయస్థానం అంటే పౌరుల స్వేచ్ఛకు చివరి రక్షణ. ఆ మూడు బలహీనపడితే ప్రమాదంలో పడేది కొందరు వ్యక్తులు కాదు—భారత ప్రజాస్వామ్య భవిష్యత్తు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
