ఈ ప్రభుత్వం, దాని నిశ్శబ్దం చూసి నేను పదే పదే ఎందుకు ముందుకు వస్తున్నానని నాకు ఆశ్చర్యం వేస్టుంటుంది.
కానీ ఈరోజు దశాబ్దానికి పైగా మూగబోయిన ప్రజాస్వామ్యం కొత్త గొంతుకలతో ముందుకు వచ్చింది. అది నాకు సంతృప్తిగా, సంపూర్ణంగా కనిపించింది. నా ఈ సంతృప్తి తాత్కాలికమే కావచ్చు.
వేకువజామున మూడు గంటల నుంచి జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. జరిగిన పరిణామాలతో ఢిల్లీ వీధుల గురించి నాకున్న అవగాహనను, పరిచయాన్ని పునరాలోచించుకునే ప్రయత్నం చేశాను.
జూలై 20వ తేదీ జరిగిన పరిణామాలు భారత ప్రజాస్వామ్య చరిత్రలో మైలురాయిగా నిలుస్తాయన్న వ్యాఖ్యలను ప్రముఖ రాజకీయ తత్వవేత్త వినయ్ వైదేహి భార్గవ ఎక్స్ ఖాతాలో చూశాను.
ప్రతిఘటన రాజకీయాలకు ఆరు కారణాలు..
ఈ వ్యాసం భారతదేశం పరస్పరం పోటీపడే ఎన్నికల ఆధారిత ప్రజాస్వామ్యం లేదా నిరంకుశత్వం నుంచి ప్రతిపక్షం ఎన్నికలపై పెట్టే దృష్టిని మళ్లీ ప్రతిఘటనపై మళ్లించాల్సిన అవసరం ఏమిటి అన్న విషయాన్ని చర్చిస్తుంది.
ప్రతిఘటన రాజకీయాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడానికి జంతర్ మంతర్‌లో జరిగిన నిరసనలు ప్రధానమైన పరిణామం అని చెప్పటానికి ఆరు కారణాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.
ఊహించని జనసందోహం..
మొదటి కారణం సంఖ్య. అక్కడ ఎంతమంది వచ్చారు అనే విషయంలో ఎవరికీ స్పష్టమైన అవగాహన లేదు.
అంచనా కూడా లేదు. కానీ ఇది నిర్వాహకులు ఆశించిన పదిహేను, ఇరవై వేల మంది కంటే చాలా ఎక్కువ మోతాదులో ఉన్న సంఖ్య.
డ్రోన్ ద్వారా తీసిన ఫోటోలు పరిశీలిస్తే కనీసం లక్ష మందికి పైగా ఈ నిరసనకారులు ఉన్నారని అర్థమవుతుంది.
సాధారణమైన నిరసన కోసం నిర్ణయించిన తర్వాత అది ఒక భారీ ప్రదర్శనగా మారింది.
మధ్యాహ్నం సమయానికి పార్లమెంటుకు వెళ్లే ప్రతి దారి, ల్యుటియెన్స్ ప్రాంతంగా పరిగణించే ఢిల్లీలోని ప్రతి వీధి జనంతో కిక్కిరిసిపోయింది. ఇది ఇండియా ఆక్యుపై ఉద్యమంగా మారింది.
స్వచ్ఛంద సమీకరణ..
ఈ సమీకరణకు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఇది స్వతంత్రంగా, సద్యోజనితంగా వచ్చిన సమీకరణ.
జనాన్ని అరువుకు తెచ్చుకునే రాజకీయ పార్టీ ప్రదర్శనలకు భిన్నంగా జంతర్ మంతర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ సామాజిక మాధ్యమాల్లో ఇచ్చిన పిలుపును అనుసరించి పోగైనవారే.
దూర ప్రాంతాల నుంచి సొంత ఖర్చుల మీద వచ్చిన వారే.
ఈ తరహాలో ఎవరికి వారే సొంత ఖర్చుల మీద రాజధానికి రావడానికి సిద్ధపడిన సందర్భాన్ని చివరిసారిగా నేను రెండు వేల ఇరవై ఒకటి రిపబ్లిక్ డే సందర్భంగా చూశాను. ఇది రెండో విషయం.
ఆందోళనకారుల్లో అనూహ్య వైవిధ్యం..
ఇక మూడో విషయం గురించి చెప్తాను. పైన చెప్పిన విధంగా సమీకరించబడిన వారిలో ఉన్న వైవిధ్యాన్ని చూడండి.
జంతర్ మంతర్‌లో నేను అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన వ్యక్తిని, హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు చెందిన ఒక బృందాన్ని, పుణెకు చెందిన ఒక వికలాంగురాలైన విద్యార్థినిని, డెహ్రాడూన్ నుంచి వచ్చిన కొంతమంది విద్యార్థినులను, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ల నుంచి వచ్చిన కొంతమంది యువకులను చూశాను.
ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలోనూ, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోనూ, కాలక్షేపం కోసం చదివే కాలేజీలలోనూ చదువుకుంటున్న ఉన్నత కుటుంబాలకు చెందిన విద్యార్థులతో పాటు ముఖర్జీ నగర్ లాంటి ఢిల్లీలోని అనేక ప్రాంతాల నుంచి భవిష్యత్తు మీద పెద్ద ఎత్తున ఆశలతో వచ్చిన విద్యార్థులు, యువకులు ఉన్నారు.
వీళ్లల్లో మహిళల సంఖ్యను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇటువంటివారు నిరసనలు, ఆందోళనలు, ప్రదర్శనలలో కనిపిస్తారని ఎవరూ ఊహించరు.
ఈ నిరసనలో పాల్గొన్న ఎక్కువమంది మొట్టమొదటిసారిగా ఇటువంటి నిరసనలలో పాల్గొంటున్నారు.
రాజకీయంగా ఈ నిరసనకారుల కుటుంబాలలో ఎక్కువ మంది బీజేపీని సమర్థించిన వారే. నిన్నటి వరకు వాళ్ళందరూ బీజేపీని సమర్థించిన వారే. ఇదే పాలకులకు ఆందోళన కలిగించే విషయం.
వ్యవస్థపై అసంతృప్తి..
ఇక నాలుగో విషయం. వీళ్ళందర్నీ ఏకం చేసిన విషయం ఇప్పటికిప్పుడు జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీ మాత్రమే కాదు. అంతకన్నా విస్తృతమైనది, విస్తృత స్వభావం కలిగినది.
నీట్ పరీక్షల రద్దు, సీబీఎస్ఈ కుంభకోణం, ఈ గందరగోళంలో తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, తప్పనిసరిగా తమకు ఉద్యోగం వస్తుందని ఆశించిన యువకులు, ఉద్యోగుల భర్తీ కుంభకోణంలో నష్టపోయిన వారు ఉన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో హాజరైన వారిలో ప్రత్యక్షంగా నష్టపోయిన వారి కంటే భవిష్యత్తులో నష్టపోతామేమో అన్న సందేహంతో వచ్చిన వారు, ఈ దేశంలో విద్యా, ఉద్యోగ వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని నమ్మినవారు ఎక్కువమంది.
రాజకీయ నినాదాలుగా విద్య, ఉపాధి..
ధర్మేంద్ర ప్రధాన్‌పై వ్యక్తమవుతున్న వ్యతిరేకత వెనుక భారీ అగ్నిపర్వతమే దాగి ఉన్నది.
ఈ ఆగ్రహానికి పునాది అర్థవంతమైన, నాణ్యమైన విద్య కోసం సమాన అవకాశాలు, సార్వత్రిక ఉపాధి హక్కు కావాలన్న ఆకాంక్షలు.
1974 నాటి జయప్రకాష్ నారాయణ ఉద్యమం తర్వాత దాదాపు యాభై ఏళ్లకు ఈ దేశ యువత విద్య, ఉద్యోగ నినాదాలను జాతీయ ప్రధాన స్రవంతి రాజకీయ నినాదాలలోకి తెచ్చింది.
ఆరాధనకు అతీతమైన నాయకత్వం..
ఇక ఐదో అంశం. ప్రతిఘటన చిహ్నాలు, పేర్ల పరిధికి మించినది. యువ నిరసనకారులకు సోనమ్ వాంగ్‌చుక్ హీరోయే. సందేహం లేదు.
అయితే అన్నా హజారే ఉద్యమంతో పోల్చినప్పుడు ఈ ఉద్యమంలో ఆరాధన భావం తక్కువే.
సీజేపీ నాయకత్వం, వాళ్లతో కలిసి నడుస్తున్న యువత ఆరోగ్యవంతమైన విమర్శలు చేయడానికి వెనుకాడటం లేదు.
వేదిక నుండి మాట్లాడిన నాయకులు, కార్యకర్తల ఉపన్యాసాలకు చప్పట్లు కొట్టారు అంతే తప్ప నాయకుల గొప్పతనాన్ని చూసి మైమరచిపోలేదు. ఈ ప్రజాస్వామిక స్ఫూర్తి భవిష్యత్తు పట్ల ఆశలు రేకెత్తిస్తోంది.
సోషల్ మీడియా ఆయుధంగా ఉద్యమం..
ఆరో అంశం మీడియాకు సంబంధించినది. గోదీ మీడియా గో బ్యాక్ అన్న నినాదాలు ప్రధాన స్రవంతి సృష్టించిన కథనాల ప్రభావం నుంచి యువత బయటపడుతోందన్న వాస్తవాన్ని గుర్తు చేస్తున్నాయి.
నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ ప్రసారమాధ్యమాలు, టీవీ ఛానళ్లు జంతర్ మంతర్‌లో ఏమీ జరగలేదు, అసలు నిరసనే లేదు అన్నట్టుగానే వ్యవహరించాయి.
చివరకు ప్రభుత్వం పన్నిన అన్ని పన్నాగాలు, మీడియా అల్లిన కథనాలు దూదిపింజల్లా తేలిపోయాయి.
రైతు ఉద్యమం తరహాలోనే విద్యార్థులు, నిరుద్యోగుల ఆందోళనలను దేశం దృష్టికి రాకుండా చేయటంతో ఆందోళనకారులు స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా తమదైన మీడియా స్వరాన్ని లోకం ముందుకు తెచ్చారు. ఇందులో భాగంగా వాట్సాప్, మౌఖిక ప్రచారం వంటి మార్గాలు, సాధనాల ద్వారా శక్తివంతమైన ప్రచారం జరుగుతోంది.
ప్రచారంలో భాగంగా వాళ్ళు ముందుకు తెస్తున్న వాదనలు సూటిగా ఉంటున్నాయి. నినాదాలు పదునుగా ఉంటున్నాయి.
“ప్రజాస్వామ్యానికి నిజమైన పరీక్ష నిరసనలు కాదు. ఈ నిరసనల పట్ల ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది అన్నదే కీలకం”, “మోదీ ఎపుడు భయపడినా హిందూ, ముస్లింల గురించిన వాదనలు ముందుకు వస్తాయి”.
ఇలాంటి నియంతృత్వ పూరిత వాదనలను పటాపంచలు చేస్తున్నాయి ఈ యువత ముందుకు తెచ్చిన నినాదాలు, వాదనలు.
నిఘాను దాటుకున్న తెగింపు..
ఇక ఏడో వాదన. జులై 20 జరిగిన ఆందోళన ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.
రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన ఉద్యమం, అవినీతి వ్యతిరేక ఉద్యమం సమయంలో ఉద్యమకారులపై ప్రభుత్వం నిఘా నీడ ఈ స్థాయిలో లేదు.
బీజేపీ ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పెంచిన నిఘా కాఠిన్యాన్ని నవతరం ఉద్యమకారులు గుర్తించారు.
దాని ప్రభావం ఏంటో కూడా అర్థం చేసుకున్నారు. ఈ కారణంగానే అనేక మంది జంతర్ మంతర్‌కు రావడానికి సిద్ధం కాలేదు. కానీ ఆ భయపు పొర కూడా తొలగిపోయింది.
బహుశా విశాల జనబాహుళ్యమే తమకు రక్షణ అనుకున్నారు. బహుశా అంతులేని నిరాశావాదంతో వచ్చిన తెగింపు కావచ్చు.
లేదా ఏదో ఆశ కోసం ఆరాటం కావచ్చు. ఏది ఏమైనా ఈ యువత తమ ఫోటోలు రోడ్డెక్కుతాయని ఆందోళన చెందలేదు. బాష్పవాయు గోళాలకు బెదరలేదు.
సామాజిక న్యాయం – కొత్త కోణం..
అంతిమంగా ఈ ఉద్యమం ముందుకు తెచ్చిన మరో కొత్త కోణాన్ని ఎక్కువమంది గుర్తించినట్టు లేదు.
అది సామాజిక న్యాయానికి సంబంధించిన కొత్త కోణం. యువతను ఈ స్థాయిలో ఉద్యమంలోకి నడిపించినది ఓ దళితుడు. అభిజిత్ డిప్కే.
ఆయన వెంట నడిచిన మరో గొప్ప వ్యక్తి సోనమ్ వాంగ్‌చుక్ ఒక ఆదివాసీ.
వీరిద్దరూ కేవలం దళిత, ఆదివాసీ సమస్యలకే పరిమితమైన వాళ్ళు కాదు.
జాతి వనరుల్లో తమ వాటా ఏమిటి అన్న ప్రశ్నకు పరిమితం కాకుండా ఈ ఉద్యమం జాతి అంటే ఏమిటో నిర్వచించే స్థితికి వచ్చింది.
భవిష్యత్తుపై కొత్త ఆశ..
కొన్ని నెలలుగా భారతదేశపు భవిష్యత్తు ఏమిటి అని నన్ను అడిగిన వాళ్లకు నేను చెప్తోంది ఒక్కటే. “జనం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నిలబడతారా లేదా అన్నది ప్రశ్న కాదు. జనం లేచి నిలబడే సరికి మనం కూర్చుంటామా అన్నది ప్రశ్న”. నిన్న నా కళ్లముందు అదే దృశ్యం ఆవిష్కృతమైంది. జనం లేచి నిలబడ్డారు. జనంతో పాటే నేనూ నిలబడ్డాను.
అనువాదం: కొండూరి వీరయ్య
(రచయిత స్వరాజ్ ఇండియా సభ్యులు, భారత్ జోడో ఆందోళన జాతీయ కన్వీనర్. వ్యాసంలోని అభిప్రాయాలు ఆయన సొంతం.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

