రోమిలా థాపర్‌కు ఇప్పుడు 94 ఏళ్లు. ఆమె చేతులు వణుకుతున్నాయి. నల్లటి స్వెటర్‌పై తుప్పు రంగులో ఉన్న ఏదో వస్త్రాన్ని కప్పుకున్నారు. ఆమెకు మైక్‌ను సరిచేయడానికి ఒక మహిళ లేచి వస్తుంది. ఆమె మైక్‌ను మెల్లగా తాకుతారు. బహుశా అది సరిగ్గా పనిచేస్తోందో లేదో పరీక్షిస్తారేమో. ఆ తర్వాత తన ప్రసంగానికి సంబంధించిన కాగితాలను బయటకు తీస్తారు.
ప్రసంగం ప్రారంభించే ముందు ఆమె గొంతు సవరించుకోరు. ఎలాంటి తడబాటు ఉండదు. పలకరింపులు, మర్యాదపూర్వకమైన మాటలు కూడా ఉండవు. నేరుగా మాట్లాడటం మొదలుపెడతారు.
ఎండిపోయిన నేలపై వాన చినుకులు పడినట్లుగా ఆమె మాటలు మనపై జాలువారుతాయి. అప్పుడప్పుడు మోగే మొబైల్ ఫోన్ల శబ్దం మినహా సభలో అందరూ నిశ్శబ్దంగా ఉంటారు.
ఆమె మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి. లిఖితపూర్వకమైన భాషలో ఉన్నట్లుగా, దాదాపు బ్రిటిష్ ఉచ్చారణను తలపిస్తాయి. ముఖ్యంగా ‘R’, ‘T’ అక్షరాల ఉచ్చారణపై ప్రత్యేక ఒత్తిడి కనిపిస్తుంది.
‘సుదూర గతం’
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఆమె వయసు 16 ఏళ్లు. అంటే, ఆమె భారత రాజ్యాంగం కంటే, చివరకు భారతదేశం కంటే కూడా పెద్దవారు.
అయితే ఆమె అధ్యయన అంశం మాత్రం వీటన్నింటికంటే ఎంతో పురాతనమైనది. అదే స్వాతంత్ర్యానికి పూర్వపు చరిత్ర, రచయిత మాటల్లో చెప్పాలంటే, ‘సుదూర గతం’.
ప్రముఖ చరిత్రకారిణి రోమిలా థాపర్ గత ఆదివారం హెచ్‌కేఎస్ భవన్లో జరిగిన సీతారాం ఏచూరి రెండో స్మారకోపన్యాసం చేశారు.
“ఈ అంశం గురించి సీతారాం, నేను చాలా సంవత్సరాల క్రితం ఒక అసంపూర్ణ సంభాషణ జరిపాం” అంటూ ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
పూర్వాధునిక చరిత్ర(Pre-modern History) ఇంత వివాదాస్పదంగా మారి ఇంతగా ప్రజల దృష్టిని ఆకర్షించే అంశంగా ఉండాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
19వ శతాబ్దం మధ్యకాలంలో చరిత్ర విద్యార్థిగా ఈ అంశాన్ని ఎంచుకున్నప్పుడు తాను ఒకరోజు ప్రజల దృష్టిలో ప్రముఖ వ్యక్తిగా మారతానని ఎవరూ ఊహించి ఉండరని అన్నారు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
చరిత్ర పుస్తకాలను నిశితంగా చీల్చిచెండాడుతున్నారు. చరిత్రకారులను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారు. రోమిలా థాపర్ ఈ విషయాలను ఎలాంటి ఉద్వేగం లేకుండా పొడి స్వరంతో చెబుతారు. (ఆమె మాటల్లో వినిపించని ఒక చిన్న వ్యంగ్యపు నవ్వును మనం ఊహించుకోవచ్చు.)
తార్కిక ప్రసంగం
థాపర్ ప్రసంగం సుదీర్ఘంగా సాగుతుంది. అందులో చరిత్ర రచనా శాస్త్రం (Historiography) వంటి సాంకేతిక పదాలు లేకపోలేదు. “ప్రతి అధ్యయన రంగానికీ దాని సొంత నియమాలు ఉంటాయి” వంటి బోధనాత్మక వ్యాఖ్యలూ ఉన్నాయి.
అయితే ఆమె చెప్పదలచుకున్న విషయం మాత్రం చాలా సరళమైనది. చరిత్ర ఉపయోగకరంగా ఉండాలన్నా, అసలు దాన్ని చరిత్రగా పరిగణించాలన్నా, ప్రశ్నించడానికి భయపడకూడదు.
థాపర్ ఈ తరహా చరిత్ర రచనా పద్ధతిని హిందుత్వ చరిత్ర రచనా విధానానికి భిన్నంగా చూపిస్తారు. ఆమె మాట్లాడే తీరు సరళంగా, స్పష్టంగా, తార్కికంగా ఉన్నప్పటికీ ఆమె అసలు చెప్పదలచుకున్న విషయాన్ని వినేవారు సులభంగా గుర్తించలేకపోవచ్చు.
లేదా చివర్లో మీడియా ప్రసారం చేసే చిన్న వ్యాఖ్యకే పరిమితం చేయవచ్చు. అంటే హిందుత్వ దృక్పథంతో చరిత్రను చదివే విధానం వల్ల చరిత్ర రచనా శాస్త్రానికి దక్కాల్సిన ‘మేధోపరమైన గౌరవం’ (Intellectual Status) దక్కకుండా పోతుందని ఆమె చెప్పిన మాటకే మొత్తం ప్రసంగాన్ని కుదించేయవచ్చు.
ఆమె అసలు ఉద్దేశాన్ని గుర్తించడం కష్టమవడానికి మరో కారణం కూడా ఉంది. ఇంతటి వయసులో ఉన్న వ్యక్తి మాట్లాడే తీరును శ్రద్ధగా వినడం కొంత కష్టమే. ఆమె మాటల్లో ప్రత్యేకమైన అలంకారాలు ఉండవు. సంపాదకీయ వ్యాఖ్యలు జోడించరు.
ఏదైనా విషయాన్ని నొక్కి చెప్పడానికి స్వరంలో హెచ్చుతగ్గులు చేయరు. ఆమె తీసుకునే విరామాలు వాక్యానికి అవసరమైన విరామ చిహ్నాల్లాంటివి. లేదా వయసు కారణంగా ఏర్పడేవి కావచ్చు. కొన్నిసార్లు ఆమె చేతిలోని కాగితాల పేజీ ముగియడం వల్ల కూడా కావచ్చు. ఇదే విషయం చాలా ముఖ్యమైనది. ఇది ఆమె ప్రసంగంలోని అసలు సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి కీలకమైన అంశం.
చరిత్ర రచనా శాస్త్రం
చరిత్ర రచనా శాస్త్రం(Historiography) అంటే చరిత్రను రాయడం. వాస్తవ సంఘటనలు చరిత్ర రచనను ఎంతగా ప్రభావితం చేస్తాయో, ఆ చరిత్రను రాసే వ్యక్తి కూడా అంతే స్థాయిలో ప్రభావితం చేస్తారు.
అందువల్ల చారిత్రక వాస్తవాలను ప్రశ్నించినట్లే, ఆ వాస్తవాలను నమోదు చేస్తున్న రచయితను కూడా మనం ప్రశ్నించాలి. చరిత్ర రచనలో రచయిత కూడా మన ప్రశ్నలకు గురికావాల్సిన ముఖ్యమైన అంశమే.
సత్యాన్ని తెలుసుకోవడంలో చరిత్ర రచయితకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. వాస్తవాల ద్వారా నిర్ధారించబడినట్లయితే, ఒక భావజాలం ఉండటంలో తప్పులేదని థాపర్ స్పష్టం చేస్తారు.
అయితే, ప్రజాదరణ పొందిన చరిత్రకారులు లేదా ఔత్సాహిక చరిత్ర రచయితలు ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించకపోవచ్చని ఆమె అంటారు. ఎందుకంటే, చరిత్రకారులు అనుసరించే పరిశోధనా పద్ధతుల గురించి వారికి పరిచయం ఉండకపోవచ్చు.
ఈ సవాలు మరింత సంక్లిష్టమైనది. ఎందుకంటే, సుమారు 1960వ దశకం నుంచి చరిత్రను కేవలం ప్రకటించడం లేదా నమోదు చేయడం మాత్రమే కాకుండా, దానిని విశ్లేషించి వివరించడం కూడా అవసరమని గుర్తించారు.
అయితే, కథనం లేకుండా ఒక విషయాన్ని వివరించడం కష్టం. అలా వివరించే క్రమంలో అది కథారూపంలోకి, చివరకు కల్పిత కథనాన్ని తలపించే వర్ణనలోకి జారిపోయే ప్రమాదం ఉంది.
ఈ విషయంలో నేను ప్రజాదరణ పొందిన చరిత్ర రచయితల పట్ల కొంత ఉదారంగా వ్యవహరిస్తున్నాను. ఎందుకంటే, చరిత్రలో ఒక విషయాన్ని కేవలం నమోదు చేయడానికి, దానిని విశ్లేషించి వివరించడానికి మధ్య ఉన్న ఈ కష్టాన్ని, ఈ సవాలును థాపర్ పరిగణనలోకి తీసుకోవడం లేదనిపిస్తోంది.
1960వ దశకం గురించి ఆమె మరో సందర్భంలో ప్రస్తావిస్తారు. ఆ కాలంలో వెలుగులోకి వచ్చిన చరిత్రకారులు వలసవాద చరిత్ర రచనలను సవాలు చేస్తూనే, భారతదేశ చరిత్రను అతిగా శుద్ధి చేసి, లోపాలు లేనట్లుగా చిత్రించిన పాత చరిత్ర పఠనాలను కూడా ప్రశ్నించారు.
చరిత్రకు పరిమితులు
చరిత్రకు ఉన్న పరిమితుల విషయంలో థాపర్ తన ప్రసంగంలో కొన్ని సందర్భాల్లో తనకు తానే విరుద్ధంగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది.
చరిత్రను ఎప్పుడూ సంప్రదాయ పద్ధతుల ద్వారానే పరిశీలించలేదన్నది వాస్తవం. మానవీయ శాస్త్రాల (Humanities) పరిధి నుంచి చరిత్ర సామాజిక శాస్త్రాల (Social Sciences) వైపు విస్తరించి, చివరకు వివిధ అధ్యయన రంగాలను సమన్వయం చేసుకునే అంతరశాఖా పరిశోధనల (Interdisciplinary Studies) దిశగా పయనించినప్పుడు, చారిత్రక ఆధారాల పరిధి విస్తరించిందని, వాటిని అర్థం చేసుకునే పద్ధతులు కూడా విస్తృతమయ్యాయని థాపర్ స్వయంగా అంగీకరిస్తారు.
అలాంటప్పుడు ఇప్పటికే అస్పష్టంగా నిర్వచించబడిన ‘ప్రజాదరణ పొందిన చరిత్రకారులు’ (Pop-historians) అందరినీ ఒకే గాటన కట్టడం సరైనదేనా? ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టిన చారిత్రక పరిశోధనలు, రచనలకు తమ వంతు కృషి చేసిన, అధికారిక శిక్షణ లేని చరిత్ర పరిశోధకుల గొప్ప సంప్రదాయాన్ని కూడా ఈ నిర్వచనం అన్యాయంగా మినహాయించడం లేదా?
ప్రధానంగా రెండు అంశాలు
నా అవగాహన ప్రకారం సీతారాం ఏచూరి స్మారకోపన్యాసంలో థాపర్ ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు.
మొదటిది, చరిత్ర అనేది కఠినమైన, మార్పులకు తావులేని, ప్రశ్నించడానికి వీలులేని అంశంగా ఉండకూడదు. చరిత్రను నిరంతరం ప్రశ్నించాలి, పరిశీలించాలి, అవసరమైతే పునఃపరిశీలించాలి.
రెండోది, ప్రజాదరణ పొందిన చరిత్ర రచయితల పెరుగుదలతో చరిత్ర ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడం, అదే సమయంలో చరిత్రపై హిందుత్వ శక్తులు చూపుతున్న ఆసక్తి కారణంగా చరిత్ర అనే అధ్యయన రంగం అనిశ్చితమైన, ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టబడటం.
ఈ రెండు అంశాలు స్పష్టంగానే ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉన్నాయి. అయితే ఆ రెండు అంశాలను విడివిడిగా తీసుకున్నా, వాటి మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించినా, రచయిత వాటిని తగినంత లోతుగా వివరించలేకపోయారని నాకు అనిపిస్తోంది.
నాకు అన్నింటికంటే ఎక్కువగా గుర్తుండిపోయేది ఒక విషయం. 94 ఏళ్ల వయసులో కూడా రోమిలా థాపర్ పూర్వాధునిక చరిత్ర అధ్యయనం పట్ల ఎంతో ఆసక్తితో, నిబద్ధతతో ఉన్నారు.
బహుశా ఆమెను నడిపిస్తున్నది వ్యక్తిగత నిబద్ధత కావచ్చు. తనకంటే ఎంతో విస్తృతమైనదిగా ఎదిగిన ఆమె జీవితకాల పరిశోధనా కృషి కావచ్చు. లేదా చరిత్రను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల సమాజంలో తలెత్తుతున్న సమస్యలు కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇవి మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు.
ఆమె ఆలోచనలు కొన్ని విషయాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకపోయినప్పటికీ, వాటి గురించి చర్చించడం, ఆలోచించడం ఎంతో అవసరం. కలిసికట్టుగా ఆలోచించడం అనే మేధోపరమైన కసరత్తు క్రమంగా కనుమరుగవుతోంది.
మన వృత్తిని, మనం చేసే పనిని అంత తీవ్రంగా, బాధ్యతాయుతంగా తీసుకుని బహిరంగంగా ముందుకొచ్చి “ఒక పనిని చేసే పద్ధతి ఇది కాదు. ఆ పనిని ఇలా చేయకూడదు” అని చెప్పడం కూడా ఒక ప్రజాసేవే. అయితే అలాంటి ప్రజాసేవకు మనం తగినంత గుర్తింపు ఇవ్వడం లేదు.
అనువాదం: కె మనోహర రాజు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
