నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే కవితలు రాయడం మొదలుపెట్టాను. మొదట 1970వ దశకంలో కలకత్తా నగరంలోని రోజువారీ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి రాశాను. ఆ తర్వాత ఇద్దరు కవుల రచనలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఒకరు విస్తృతంగా రాసిన అలెన్ గిన్స్బర్గ్ (1926-1997) కాగా, మరొకరు సంతోషాన్ని పంచే పాటలు రాసిన శైలేంద్ర (1923-1966). నేను రాయడం ఎప్పుడూ ఆపలేదు కానీ, నా రాతలను చూసి నాకే సిగ్గేసి వాటిని ఎక్కువగా పారేసేవాడిని.
గత కొన్నేళ్లుగా నేను సామ్యవాద రచనల గురించి పాఠాలు చెబుతున్నాను. ఈ క్రమంలో నాకు ఎంతో ఇష్టమైన రచయితలు ఎడ్వర్డో గలియానో, జేమ్స్ బాల్డ్విన్ పుస్తకాలను మరింత లోతుగా చదువుతున్నాను.
ఆ తర్వాత సామ్యవాద రచనలపై ఒక చిన్న పత్రికను మొదలుపెట్టాను. అది చాలా నెమ్మదిగా, ఒక సామ్యవాదిగా వార్తలు ఎలా రాయాలి అనే దానిపై ఒక పుస్తకంగా మారుతోంది. రచనలోని ఆలోచన, నైపుణ్యం గురించిన చిన్న కథల రూపంలో ఈ పుస్తకం తయారైంది.
కవిత్వం ద్వారా వార్తలు
బొమ్మల ద్వారా వార్తలు చెప్పడం గురించి జో సాకో రాసిన మాటలను నేను మళ్లీ చదివాను. అప్పుడే కవితల ద్వారా వార్తలు చెప్పాలనే ఆలోచన నాకు వచ్చింది.
2013 ముజఫర్‌నగర్ అల్లర్లపై లెఫ్ట్‌వర్డ్ బుక్స్ ప్రచురించిన సాకో పుస్తకం ‘ది వన్స్ అండ్ ఫ్యూచర్ రియట్’ మన కాలపు గొప్ప జర్నలిస్టులలో ఆయన ఒకరని నిరూపించింది.
కవితల ద్వారా వార్తలు చెప్పడం కొత్త విషయమేమీ కాదు. పాబ్లో నెరూడా ఎన్నో ఏళ్ల క్రితమే ఇలా చేశారు, హబీబ్ జాలిబ్ కూడా అలాగే రాశారు.
నేను కరోలిన్ ఫోర్చే రాసిన కవితలను చదివాను. ఆమె 1950లో పుట్టారు. వార్తలు చెప్పే పద్ధతిని, కవిత్వాన్ని కలిపి ఆమె అద్భుతంగా రాశారు. ఎల్ సాల్వడార్ దేశంలోని ఒక సైనికాధికారి క్రూరత్వం గురించి ఆమె 1978లో ‘ది కల్నల్’ అనే గొప్ప కవిత రాశారు. ఆ కవితలో వార్తలను, కవిత్వాన్ని ఆమె అందంగా కలిపారు.
“మీరు విన్నది నిజమే. నేను అతని ఇంటికి వెళ్లాను. అతని భార్య కాఫీ, పంచదార ట్రే తెచ్చింది. అతని కూతురు నెయిల్ ఫైలర్తో గోళ్లు సరిచేసుకుంటోంది, కొడుకు రాత్రి బయటికి వెళ్లాడు. అక్కడ దినపత్రికలు, పెంపుడు కుక్కలు, అతని పక్క కుషన్ మీద పిస్టల్ ఉన్నాయి. ఇంటి మీద నల్లటి తాడులా చంద్రుడు వేలాడుతున్నాడు. టీవీలో ఒక పోలీస్ షో వస్తోంది. అది ఇంగ్లిష్‌లో ఉంది. గోడల మీద పగిలిన సీసాలు గుచ్చారు; ఎవరైనా గోడ దూకితే కాళ్లు, చేతులు కోసుకునేలా ఆ ఏర్పాటు చేశారు. కిటికీలకు వైన్ షాపుల మాదిరిగా ఇనుప గ్రిల్స్ ఉన్నాయి.
మేము రాత్రి భోజనం చేశాము. గొర్రె మాంసం, మంచి వైన్ ఉన్నాయి. పనిమనిషిని పిలవడానికి బల్లపై బంగారు గంట ఉంది. పనిమనిషి పచ్చి మామిడికాయలు, ఉప్పు, ఒక రకమైన రొట్టె తెచ్చింది. ఈ దేశం నాకు ఎలా అనిపించిందని నన్ను అడిగారు. స్పానిష్ భాషలో ఒక చిన్న ప్రకటన వచ్చింది. అతని భార్య అన్నింటినీ తీసుకెళ్లింది. ఆ తర్వాత పరిపాలించడం ఎంత కష్టమైపోయిందో కొద్దిగా మాట్లాడుకున్నారు. టెర్రస్ మీద చిలుక హలో అంది. కల్నల్ దానిని నోరు మూసుకోమని చెప్పి, బల్ల మీద నుంచి లేచాడు. నా స్నేహితుడు నాతో కళ్లతో ‘ఏమీ మాట్లాడకు’ అన్నాడు.
కల్నల్ సామాన్లు తెచ్చే సంచితో తిరిగి వచ్చాడు. అతను బల్ల మీద చాలామంది మనుషుల చెవులను కుమ్మరించాడు. అవి ఎండిన పీచు పండ్ల సగభాగాల లాగా ఉన్నాయి. దీనిని చెప్పడానికి వేరే మార్గం లేదు. అతను వాటిలో ఒకదానిని చేతిలోకి తీసుకున్నాడు, మా ముఖాల ముందు దాన్ని ఊపాడు, నీళ్ల గ్లాసులో పడేశాడు. అక్కడ అది ప్రాణం పోసుకున్నట్లు అయింది. నేను ఆటలు ఆడి అలసిపోయాను అని ఆయన అన్నాడు. ఎవరి హక్కుల గురించో మీ వాళ్లకు చెప్పండి, వాళ్లకు నచ్చింది చేసుకోమని అన్నాడు. అతను తన చేత్తో చెవులన్నింటినీ కిందికి ఊడ్చేశాడు, తన మిగిలిన వైన్‌ను గాల్లోకి ఎత్తాడు. మీ కవిత్వానికి ఒక విషయం దొరికింది కదా? అని అన్నాడు. నేల మీద ఉన్న కొన్ని చెవులు అతని గొంతులోని ఆ చిన్న మాటను విన్నాయి. నేల మీద ఉన్న కొన్ని చెవులు నేలకు ఆనించి ఉన్నాయి.”
1978లో వచ్చిన ఈ కవితను కరోలిన్ ఫోర్చే కేవలం 28 ఏళ్ల వయసులోనే రాశారు. 1993లో సీలంపూర్ అల్లర్ల సమయంలో తాను ప్రత్యక్షంగా చూసిన భయానక దృశ్యాలు ఈ కవితను చదువుతున్నప్పుడు గుర్తుకు వస్తాయి.
ఈ రకమైన హింస ఎంతో సాధారణంగా, దారుణంగా కనిపిస్తుంది. ఆ క్రూరత్వాన్ని, దాని వెనుక ఉన్న అర్థరహితమైన భయాన్ని పూర్తి స్థాయిలో వివరించడంలో సాధారణ వచన రచన ఎప్పుడూ విఫలమవుతుంది.
జర్నలిజం మొదటి రూపం పుకార్లే
జర్నలిజం అనేది చరిత్రకు మొదటి రూపమని తరచుగా అంటుంటారు. కానీ అది తప్పు. అసలైన మొదటి రూపం పుకార్లేనని జర్నలిస్టులందరికీ తెలుసు.
పోలిష్ జర్నలిస్టు రిజార్డ్ కపుస్సిన్స్కీ రాసిన ‘షా ఆఫ్ షాస్’ (1982) పుస్తకాన్ని మొదటిసారి చదివినప్పుడు నాకు ఇదే ఆలోచన వచ్చింది.
ఇరాన్ చివరి రాజు గురించి రాసిన చిన్న పుస్తకం అది. నిరంకుశ రాచరికాల గురించి, వాటిలోని సాధారణ క్రూరత్వాన్ని కపుస్సిన్స్కీ పట్టుకున్న తీరు, ఆయన శైలి, కథ చెప్పే విధానం నన్ను ఆశ్చర్యపరిచాయి.
తరువాతి కాలంలో కపుస్సిన్స్కీ తన రచనల్లో విషయాలను కొంత ఎక్కువ చేసి చెప్పారని లేదా కొన్ని వివరాలను కల్పించి రాశారనే వివాదం గురించి నేను లోతుగా చదివాను. కానీ ఆ విమర్శలు నన్ను ఆకట్టుకోలేదు. ఎందుకంటే ఆయన పుస్తకాల్లో ఒక రకమైన మాయాజాలం ఉంటుంది. కేవలం వివరాల కంటే అసలు భావాన్ని బయటకు తెచ్చే జర్నలిజం ఆయనది.
కపుస్సిన్స్కీ నవలా రచయితా లేక జర్నలిస్టా అనే ప్రశ్న నాకు ఆసక్తి కలిగించలేదు. ముఖ్యంగా అంగోలాలో వలసవాద వ్యతిరేక పోరాట చివరి రోజుల గురించి ఆయన రాసిన ‘అనదర్ డే ఆఫ్ లైఫ్’ (1976) పుస్తకంలో స్వాతంత్ర్య పోరాట అనుభూతి ఎలా ఉంటుందో, వలస పాలన నుంచి విముక్తి పొందే క్రమంలో ఏర్పడే గందరగోళం ఎలా ఉంటుందో ఆయన తన కథనం ద్వారా మనకు కళ్లకు కట్టినట్లు చూపించారు.
బొగ్గు గని కార్మికుల దుస్థితిపై..
కొన్నేళ్ల క్రితం అలాన్ వాల్డ్ రాసిన ‘ఎక్సైల్స్ ఫ్రమ్ ది ఫ్యూచర్’ (2002) పుస్తకంలో నేను మురియల్ రుకీజర్ కవిత్వాన్ని గురించి తెలుసుకున్నాను. ఆమె అమెరికన్ వామపక్ష భావజాలం కలిగిన గొప్ప కవయిత్రులలో ఒకరు. ఆమె తన స్నేహితురాలు నాన్సీ నౌంబర్గ్తో కలిసి వెస్ట్ వర్జీనియాలోని హాక్స్ నెస్ట్ టన్నెల్లో పనిచేసే బొగ్గు గని కార్మికుల పరిస్థితులను అధ్యయనం చేయడానికి వెళ్లారు. ఆ తర్వాత ఆమె రాసిన కవితల సంపుటి యూఎస్- 1లో ‘ది బుక్ ఆఫ్ ది డెడ్’ (1938) పేరుతో ప్రచురితమైంది.
ప్రపంచవ్యాప్తంగా కాకపోయినా, కనీసం అమెరికాలోని ప్రతి పాఠశాల విద్యార్థి ఈ పుస్తకాన్ని లేదా కనీసం ఈ కవితలను తప్పక చదవాలి. ఇందులోని ‘జార్జ్ రాబిన్సన్’ అనే కవిత ఒక నల్లజాతి గని కార్మికుడి స్వరంతో రాసినట్టే ఉంటుంది.
“పేలుడు శబ్దం రాగానే యజమాని అరిచేవాడు, రండి, లోపలికి వెళ్దామని. ఆ భారీ పేలుడు తెల్లటి పొగలా మారగానే, రండి, లోపలికి వెళ్దామని మళ్లీ అరిచేవాడు. రాళ్లు పడుతున్నా, బురద ఉన్నా త్వరగా రండని మమ్మల్ని తొందరపెట్టేవాడు.
వాళ్లు తెచ్చే నీళ్లలో దుమ్ము ఉండేది. మేము తాగే నీళ్లలో, మేముండే గుడారాలు, చుట్టుపక్కల తోటలన్నీ ఆ దుమ్ముతో నిండిపోయాయి. మేము ఆ తోటల్లో బట్టలు ఉతుక్కున్నా, మా ఒంటికి ఎప్పుడూ దుమ్ము అంటుకునే ఉండేది.
పార్కులు, తోటలన్నింటిపై ఎవరో పిండి చల్లినట్లు తెల్లగా కనిపించేది. ఆ దుమ్ము అలాగే ఉండిపోయింది, వర్షం కూడా దానిని కడగలేకపోయింది, అది మెరిసింది. మా పాదాల చుట్టూ ఆ తెల్లటి దుమ్ము నిజంగా ఎంతో అందంగా కనిపించేది.
నేను నల్లగా ఉన్నా, రాత్రంతా సొరంగంలో పనిచేసి ఉదయాన్నే బయటకు వచ్చినప్పుడు, ఒక తెల్లవాడి పక్కన నడిస్తే, మా ఇద్దరిలో ఎవరు తెల్లవాడో ఎవరూ గుర్తుపట్టలేకపోయేవారు. ఆ దుమ్ము మమ్మల్ని ఇద్దరినీ కప్పేసింది, ఆ దుమ్ము తెల్లగా ఉంది.”
సూటిగా.. ఎంతో అందంగా..
శ్రీ 420 (1955) సినిమాలో శైలేంద్ర రాసిన అద్భుతమైన పాటను మన్నా డే పాడారు. కొత్త భారతదేశపు సామాన్య మనిషిలా రాజ్ కపూర్ తెరపై ఈ పాటను పాడుతూ, మనం మాట్లాడే మాటలు ఎప్పుడూ అందరికీ అర్థమయ్యేలా సూటిగా ఉండాలని, అదే సమయంలో ఎంతో అందంగా చెప్పాలని గుర్తుచేస్తారు.
“ఓ… అయ్యో!
ప్రేమగల మనసా, నా గుండె కథ విను,
నా కథ చాలా సాదాసీదా, ఎలాంటి అలంకారాలు లేవు;
మా లోపల మొలకెత్తేదే మంచి మాటగా మారుతుంది.
ప్రేమగల మనసా, నా గుండె కథ విను.ఒక చిన్న గుడిసెలో, ఒక పేదవాడి కొడుకుగా,
నా తల్లి తలరాతలో రాసిపెట్టిన బిడ్డను నేను.
బాధలు, కష్టాలే నా చిన్ననాటి స్నేహితులు;
ఈ జీవితపు చిన్న దీపం తుఫాన్లలో ఆరిపోతూ ఉంటే
ఆకలే నన్ను ఎంతో ఆప్యాయంగా పెంచింది.అయ్యో, నా ఈ ముఖంతో నేను ఏం చేయగలను?
ఒక అనుభవజ్ఞుడైన దొంగ ముఖం కూడా నా ముఖంలోనే కనిపిస్తుంది.
ఒకరోజు నేను స్వేచ్ఛగా నడుచుకుంటూ వెళ్తుంటే,
ఎవరో నన్ను గురించిన నిజాలన్నీ క్షణంలో పట్టేశారు—
ఒక్కసారి కూడా సరిగ్గా చూడకుండానే! ఒక పోలీసు నన్ను బంధించి తీసుకెళ్లాడు.ఆ ముసలి ఇన్స్పెక్టర్ తన అద్దాల ద్వారా చూశాడు,
ముందు నుంచి చూశాడు, వెనక నుంచి చూశాడు,
పై నుంచి కింద వరకు నన్ను తూచి చూశాడు.
“నువ్వు ఎంత పెద్ద గందరగోళం సృష్టించావు!” అని విసుక్కున్నాడు.
“అరే, ఎంత పెద్ద తప్పు చేశావు!” అని అరిచాడు.
“అరరె, ఇతను స్టేషన్ బాస్ గారి సొంత బావమరిది కదా!”నా దుఃఖం ఇంకా తీరలేదు;
నా జీవితం ఇంకా వికసించకపోయినా నేను చిరునవ్వు నవ్వుతున్నాను.
నా గమ్యస్థానం చాలా దగ్గరగా ఉంది,
కానీ నా కాళ్లకు సంకెళ్లు బిగుసుకుపోయాయి.
ఒక అధికారో లేదా ధనవంతుడో నా దారికి అడ్డుగా నిలబడ్డాడువిను, కానీ ఈ రహస్యం ఎవరికీ చెప్పకు:
ప్రవాహంలో ఈదుకుంటూ వెళ్లడానికి గడ్డిపోచను కూడా నమ్ముకోకు.
కాలం రాకముందే వాన పాట అందుకోకు
కారణం లేకుండా అర్ధరాత్రి వేళ గొంతు ఎత్తకు
లేదంటే ఒక పోలీసు వచ్చి నిన్ను పట్టుకెళ్తాడు.”నేను పెద్దయ్యాక ఇలాంటి ఒక పాట రాయాలనుకుంటున్నాను.
అనువాదం: రచన
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

