హైదరాబాద్, నవంబరు 14: ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు జవాబుదారీతనంతో వ్యవహరించాలని పలువురు అంతర్జాతీయ రాజకీయ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం, అవినీతి నిర్మూలనకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్–2026లో భాగంగా శనివారం ‘ప్రగతిశీలత, పౌరసత్వం, జవాబుదారీతనం’ అంశంపై నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఫిన్లాండ్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ మాజీ కార్యదర్శి ఆంట్టన్ రోన్హోమ్, థాయిలాండ్ పీపుల్స్ పార్టీ నాయకత్వ సలహాదారు పియాంగ్పనోర్ బూన్క్లమ్, ఫిలిప్పీన్స్ ప్రతినిధుల సభ మాజీ సభ్యుడు డాక్టర్ మారియో అగుజా, ఎఫ్ఈపీఎస్ ప్రజాస్వామ్య విభాగం అధిపతి క్రిస్టియన్ సాల్మ్ పాల్గొని మాట్లాడారు.
అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలకూ బాధ్యత ఉండాలి: క్రిస్టియన్ సాల్మ్
ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, చర్యలకు అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలు కూడా బాధ్యత వహించాలని క్రిస్టియన్ సాల్మ్ పేర్కొన్నారు.
బ్రెజిల్ వంటి దేశాల్లో ప్రగతిశీల రాజకీయ విజయాల నుంచే కాకుండా నాయకుల వైఫల్యాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాలని సూచించారు.
అవినీతి, స్కామ్ నెట్వర్క్లు, భౌగోళిక రాజకీయ సమస్యలను ఎదుర్కోవాలంటే ప్రభుత్వ సంస్కరణలు అవసరమన్నారు. భవిష్యత్తు తరాలకు మెరుగైన సమాజాన్ని అందించాలనే లక్ష్యంతో రాజకీయాలు సాగాలని అభిప్రాయపడ్డారు.
పారదర్శకతతోనే ప్రజాస్వామ్యంపై నమ్మకం: ఆంట్టన్ రోన్హోమ్
ప్రజాస్వామ్యంపై ప్రజల్లో విశ్వాసం తగ్గడానికి జవాబుదారీతనం లోపించడమే ప్రధాన కారణమని ఆంట్టన్ రోన్హోమ్ అన్నారు. వాతావరణ, సామాజిక, డిజిటల్ రంగాల మాదిరిగా ప్రజాస్వామ్యాన్ని కూడా ఒక కీలక విధాన అంశంగా పరిగణించాలని సూచించారు.
ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, ప్రజాస్వామ్య ప్రక్రియల్లో పారదర్శకత తీసుకురావడం, అవినీతిని అరికట్టడం, ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపడం ద్వారా వ్యవస్థపై నమ్మకాన్ని పెంచవచ్చన్నారు. ప్రగతిశీల శక్తులు ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైతే మితవాద రాజకీయాలకు అవకాశం పెరుగుతుందని హెచ్చరించారు.
జవాబుదారీతనం ప్రజల హక్కు: పియాంగ్పనోర్ బూన్క్లమ్
ఎన్నికల్లో ఓటమికి విధానాల కంటే నాయకులపై ప్రజల్లో నమ్మకం తగ్గడమే ప్రధాన కారణమని పియాంగ్పనోర్ బూన్క్లమ్ పేర్కొన్నారు. జవాబుదారీతనం అనేది నాయకులు ప్రజలకు ఇచ్చే వరం కాదని, ప్రజలు తమ హక్కుగా డిమాండ్ చేయాలన్నారు.
కృత్రిమ మేధ, మారుతున్న పని విధానాలకు అనుగుణంగా నూతన సామాజిక ఒప్పందం అవసరమని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కార్మికులు, ఓటర్లు సాంకేతిక పరిజ్ఞానం, డేటా విశ్లేషణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతి పౌరుడిలో శాస్త్రీయ దృక్పథం ఉండాలన్న భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రపంచానికి ఆదర్శమని పేర్కొన్నారు.
ప్రజలకు నమ్మకం కలిగించే కొత్త ప్రత్యామ్నాయాలు అవసరం: డాక్టర్ మారియో అగుజా
హంగేరీలో విక్టర్ ఓర్బాన్ రాజకీయ ఎదుగుదల, వామపక్షాల వైఫల్యాలను డాక్టర్ మారియో అగుజా విశ్లేషించారు. ఉదారవాద ఆర్థిక విధానాల వైఫల్యాలు రాజకీయ మార్పులకు దారితీశాయని, ఓర్బాన్ కొన్ని విధానాలను వ్యతిరేకించినప్పటికీ దేశంలో క్రోనీ క్యాపిటలిజం పెరగడం, మీడియా, న్యాయవ్యవస్థపై నియంత్రణ వంటి సమస్యలు తలెత్తాయని వివరించారు.
కాలానుగుణంగా మార్పులు చేసుకోవడంలో, ప్రత్యామ్నాయ ఆర్థిక, రాజకీయ విధానాలను రూపొందించడంలో వామపక్షాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. పాత విధానాలను అధిగమించి ప్రజలకు నమ్మకం కలిగించే కొత్త ప్రత్యామ్నాయాలను నిర్మించాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
