Social Justice Through Education, Welfare and Empowerment (AI-generated illustration)
తెలంగాణలో సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వమే ప్రభుత్వ అభివృద్ధి విధానం
భారత్ సమ్మిట్ – 2026 అంతర్జాతీయ ప్యానెల్ చర్చలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
హైదరాబాద్, నవంబర్ 13:
విద్య, సంక్షేమం, సాధికారత ద్వారానే సమాజంలో నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే మౌలిక సూత్రాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ, సమాజంలోని అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో భారత్ సమ్మిట్ – 2026లో భాగంగా 'విద్య, సంక్షేమం, సాధికారత ద్వారా సామాజిక న్యాయం (Social Justice through Education, Welfare and Empowerment)' అనే అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ ప్యానెల్ చర్చలో మంత్రి అడ్లూరి గారు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లురి మాట్లాడుతూ.. ఒక రాష్ట్ర అభివృద్ధిని కేవలం ఆర్థిక వృద్ధి, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల ఆధారంగా మాత్రమే అంచనా వేయరాదని, పేద కుటుంబాల్లోని పిల్లలకు నాణ్యమైన విద్య అందుతోందా? దివ్యాంగులు స్వతంత్రంగా జీవించగలుగుతున్నారా? వృద్ధులకు గౌరవప్రదమైన జీవితం లభిస్తోందా? ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు దక్కుతున్నాయా? అన్న అంశాలే సమగ్ర అభివృద్ధికి అసలైన కొలమానాలని వివరించారు.
యంగ్ ఇండియా గురుకులాలతో విద్యలో సమానత్వం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 105 శాసనసభ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. సుమారు రూ.21 వేల కోట్ల పెట్టుబడితో 2.70 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వెల్లడించారు.
సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందని, ఐఐటీ, నీట్, క్లాట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో రాణించేలా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని వివరించారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి ప్రతిభా అవకాశాలకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీలకు సామాజిక, ఆర్థిక సాధికారత
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబనలో సమాన అవకాశాలు కల్పించడంతో పాటు కుల వివక్ష, అంటరానితనం, దాడులను అరికట్టి రాజ్యాంగ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి, పారిశ్రామిక అవకాశాలు కల్పించడం ద్వారా వారిని కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా అభివృద్ధిలో భాగస్వాములుగా తీర్చిదిద్దాలని వివరించారు.
దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్లకు గౌరవప్రదమైన జీవనం
దివ్యాంగులకు సహాయం అందించడమే కాకుండా, వారు స్వతంత్రంగా జీవించేలా విద్య, ఉపాధి, సహాయక పరికరాలు, ఆర్థిక పునరావాస అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, రవాణా, డిజిటల్ సేవలు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.
వయోవృద్ధుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాల నుంచి నిబంధనల మేరకు 15 శాతం లేదా గరిష్ఠంగా రూ.10 వేల వరకు కోత విధించి తల్లిదండ్రులకు అందించే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, తల్లిదండ్రుల పోషణ పర్యవేక్షణ బిల్లు–2026ను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసినట్లు వివరించారు. వృద్ధుల హక్కులు, భద్రత కోసం ఎల్డర్‌లైన్ 14567 సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
అదేవిధంగా ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు విద్య, వైద్యం, ఉపాధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో సమాన అవకాశాలు కల్పించి, వివక్షకు తావులేని గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్యానెల్ సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానాలు
చర్చలో ప్యానెల్ సభ్యులు తెలంగాణలో సంక్షేమ విధానాల అమలు, విద్యా రంగంలో అసమానతలు, బాలల హక్కులు, అట్టడుగు వర్గాల సాధికారత, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం తదితర అంశాలపై పలు ప్రశ్నలు సంధించారు. వాటికి మంత్రి లక్ష్మణ్ కుమార్ సమగ్రంగా, వివరణాత్మకంగా సమాధానాలిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, వాటి లక్ష్యాలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్తు కార్యాచరణను వివరించారు.
ముఖ్యంగా పిల్లల సంక్షేమం, అట్టడుగు వర్గాల బాలలకు విద్యా అవకాశాలు కల్పించడంపై మంత్రి ఇచ్చిన సమాధానాలను ప్రముఖ సామాజిక కార్యకర్త శాంతా సిన్హా అభినందించారు. పిల్లల సంక్షేమానికి ప్రభుత్వం చూపుతున్న ప్రాధాన్యతపై ఆమె ప్రశంసలు వ్యక్తం చేశారు.
పలు సూచనలు చేసిన ప్యానెల్ సభ్యులు
ఈ చర్చకు డాక్టర్ ఆర్తి కృష్ణ మోడరేటర్‌గా వ్యవహరించారు.
ఆర్తి ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్సీగా, ఏఐసీసీ కార్యదర్శిగా, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల ఉపాధ్యక్షురాలిగా ఉన్న ఆమెతో పాటు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఏఐసీసీ శాశ్వత ఆహ్వానితుడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విభాగాల జాతీయ సమన్వయకర్త, ఛైర్మన్, జార్ఖండ్‌కు Aicc ఇంచార్జి , సీనియర్ జర్నలిస్ట్ సుంకరి రామ్మూర్తి చర్చలో పాల్గొన్నారు.
టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఏఐసీసీ సభ్యురాలు, సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ కోట నీలిమ, ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, లాపరోస్కోపిక్ సర్జన్, తెలంగాణ సమాజ్ కాంగ్రెస్ వ్యవస్థాపకులు డాక్టర్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొని పలు విలువైన సూచనలు చేశారు.
విద్యా సమానత్వం, సంక్షేమ పథకాల పారదర్శక అమలు, సామాజిక భద్రత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఉపాధి అవకాశాల విస్తరణ వంటి అంశాలపై వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
సంక్షేమం నుంచి స్వావలంబన దిశగా తెలంగాణ
సంక్షేమ పథకాల విజయాన్ని కేవలం నిధుల కేటాయింపులు, లబ్ధిదారుల సంఖ్యతో కాకుండా ప్రజల జీవితాల్లో వచ్చిన వాస్తవ మార్పుతో అంచనా వేయాలని మంత్రి అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలతో భాగస్వామ్యాలను పెంపొందించుకుని ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకోవాలని సూచించారు.
ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్య, ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా, ప్రతి వ్యక్తికి ఆత్మగౌరవం, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించినప్పుడే రాజ్యాంగ ఆశయాలు సాకారమవుతాయని మంత్రి స్పష్టం చేశారు. సామాజిక న్యాయం దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు సమగ్ర, సమానత్వ ఆధారిత అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ప్రజా రవాణా ప్రజల హక్కు-దేశాభివృద్ధికి పునాది!
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
