Wealth Must Not Be Confined to a Few - Development Must Reach Everyone (AI-generated illustration)
- ప్రాంతీయ అసమానతలు తొలగించి పరిశ్రమలను వికేంద్రీకరించాలి
- యువతకు ఉపాధి, రైతులకు గిట్టుబాటు ఆదాయం కల్పించాలి
- సంక్షేమంతో పాటు స్వయం ఉపాధి అవకాశాల పెంపు అవసరం
- భారత్ సమ్మిట్-2026లో ఆర్థిక న్యాయంపై నిపుణుల అభిప్రాయాలు
హైదరాబాద్: రాష్ట్రంలో సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా, సమాజంలోని అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు సమానంగా అందినప్పుడే నిజమైన ఆర్థిక న్యాయం సాధ్యమవుతుందని భారత్ సమ్మిట్-2026లో వక్తలు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌కే పరిమితమైన పారిశ్రామిక అభివృద్ధిని వెనుకబడిన జిల్లాలకు విస్తరించాలని, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని సూచించారు. హైదరాబాద్ హైటెక్స్‌లో శుక్రవారం ‘తెలంగాణ అభ్యుదయం.. ఆర్థిక న్యాయం’ అంశంపై నిర్వహించిన సదస్సులో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్, ఎంపీ కడియం కావ్య, ఎన్ఐపీఎఫ్పీ మాజీ డైరెక్టర్ డాక్టర్ రతిన్ రాయ్, ప్రొఫెసర్లు సంతోష్ మెహరా, హిమాన్షు తదితరులు పాల్గొన్నారు.
మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంపన్నులు, మధ్యతరగతి, పేదల మధ్య ఆర్థిక అంతరాలు పెరగకుండా సమాన అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పరిశ్రమలు హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ఆదిలాబాద్, ములుగు, నారాయణపేట వంటి వెనుకబడిన ప్రాంతాలకు విస్తరించాలని సూచించారు. గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పథకం ఎంతో ఉపయోగకరమని, కేంద్రం నిధులు, పనిదినాలు తగ్గించడం ఆందోళనకరమన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తమ ప్రభుత్వం తక్కువ సమయంలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేసిందని, యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. పేదలకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.
బల్మూరి వెంకట్ మాట్లాడుతూ 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు వైద్య సాయం అందిస్తున్నామని తెలిపారు. ట్రాన్స్జెండర్లకు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు కల్పించడం ద్వారా సామాజిక సమానత్వానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, యువతకు నైపుణ్య శిక్షణ కోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి కార్యక్రమాలు సాధికారతకు దోహదపడుతున్నాయని వివరించారు.
డాక్టర్ రతిన్ రాయ్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు స్వయం ఉపాధి, శాశ్వత ఆదాయ వనరులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా రంగంలో తెలంగాణ మెరుగైన వ్యయం చేస్తోందని, రెసిడెన్షియల్ పాఠశాలల ఫలితాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టే పథకాలు ఆర్థికంగా భరించగలిగే స్థాయిలో ఉండాలని సూచించారు. భూముల విక్రయం, బంగారం పెట్టుబడులకే పరిమితం కాకుండా పరిశ్రమల అభివృద్ధి ద్వారా సంపద, ఉపాధి సృష్టించాలని స్పష్టం చేశారు.
ప్రొఫెసర్ హిమాన్షు మాట్లాడుతూ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాలకు వ్యవసాయమే ఆర్థిక చోదకశక్తి అని పేర్కొన్నారు. రైతుల ఆదాయం పెరగాలంటే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని, నూనెగింజల సాగు, వ్యవసాయ పరిశోధనలు, ఆహార శుద్ధి పరిశ్రమలు, రవాణా సదుపాయాలను బలోపేతం చేయాలని సూచించారు. కరువు పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు సామాజిక భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు.
ప్రొఫెసర్ సంతోష్ మెహరా మాట్లాడుతూ ఏటా పెద్ద సంఖ్యలో యువత ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్నప్పటికీ, అందుకు అనుగుణంగా ఉద్యోగాల కల్పన జరగడం లేదన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) క్లస్టర్లను అభివృద్ధి చేసి నైపుణ్య శిక్షణ, రుణ సదుపాయాలు, సాంకేతిక, మార్కెటింగ్ సహకారం అందించాలని సూచించారు. పరిశ్రమల్లో యువతకు కనీసం ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ కల్పిస్తే తొలి ఉద్యోగానికి భరోసా లభిస్తుందని చెప్పారు. చైనాలో అనుసరించిన క్లస్టర్ అభివృద్ధి విధానాలను పరిశీలించి తెలంగాణలోనూ అమలు చేయాలని సూచించారు.
ఇది కూడా చదవండి: ప్రజా రవాణా ప్రజల హక్కు-దేశాభివృద్ధికి పునాది!
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
