అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ముగిశాయి. మేధావులు, విశ్లేషకులు ప్రస్తుతానికి భారీ ‘బ్లూ వేవ్’ (డెమోక్రాట్ల విజయం), ‘రెడ్ డిఫీట్'(రిపబ్లికన్ల ఓటమి) గురించి విశ్లేషించనారంభిస్తారు. రిపబ్లికన్లకు ఇది MAGA (మ్యాగా) శకం ముగింపేనా? 2028లో ఎవరు డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి కాగలరు? ట్రంప్ ఎంతవరకు బలహీనపడ్డారు? ఇలా అనేక ప్రశ్నలు వస్తాయి.
చాలా వ్యాఖ్యానాలు రెండు పార్టీల వ్యవస్థ పైనే దృష్టి పెడతాయి. భవిష్యత్తును అంచనా వేయడానికి కాంగ్రెస్, అధ్యక్ష పదవి వంటి సాంప్రదాయ సంస్థలను పరిశీలిస్తాయి.
అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇతర గాలులు కూడా వీస్తున్నాయి. సెర్బియా, భారతదేశం వంటి పరస్పర భిన్న దేశాలలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ ఆందోళనలు చాలా భిన్నమైనవి. రాజకీయ రంగాలలో కొత్త పద్ధతులలో నిరసన చర్యలకు పూనుకోవడానికి, సంస్థల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను చూపుతున్నాయి.
రెండు పార్టీల వ్యవస్థలో ఇరుక్కుపోయిన అమెరికా
అమెరికా కూడా కొత్త రకాల రాజకీయ సంస్థల ఏర్పాటులో కొన్ని ప్రయోగాలను చేసింది. టీ పార్టీ, MAGA, లేదా డెమోక్రటిక్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికా(డీఎస్ఏ) వంటి సంస్థలకు అప్పుడప్పుడు చిన్న అవకాశాలు లభించినప్పటికీ, ఇది ప్రస్తుతం రెండు పార్టీల వ్యవస్థలోనే కూరుకుపోయినట్లు కనిపిస్తోంది.
‘ఆక్యూపై వాల్ స్ట్రీట్’ వంటి వినూత్నమైన ఉద్యమాల డైనమిక్స్ చాలావరకు గతంలాగే మిగిలిపోయాయి. ఎందుకని?
సాధారణ రాజకీయ యవనిక కనుమరుగవడం, సంప్రదాయ రాజకీయాల పట్ల వేసట కలగడం గురించి ఆంటన్ జాగర్ తన ‘హైపర్పాలిటిక్స్’లో ఒక ఆసక్తికరమైన వాదనను వినిపించారు.
జాగర్ చాలా సరళమైన ప్రతిపాదనతో ప్రారంభిస్తారు. “ప్రపంచ వేదికపై అమెరికాకు సాటిలేని ఆధిపత్యం, నిరంతర సాంస్కృతిక ఆకర్షణ ఉన్నప్పటికీ, డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఇప్పుడు ఒకే రాజకీయ ప్రదేశంలో కలిసి జీవించడం దాదాపు అసాధ్యమని భావిస్తున్నారు.” అయితే ఈ విభజిత రాజకీయ ప్రదేశం ఎలా ఉంది? “ఒకవైపు, అమెరికన్ రాజకీయాలలో ప్రజా భాగస్వామ్యం సాపేక్ష పునరుజ్జీవనాన్ని చూసింది,” “మరోవైపు, సంస్థాగత భాగస్వామ్యం సర్వకాల కనిష్ట స్థాయికి పడిపోయింది” అని ఆయన అభిప్రాయపడ్డారు.
అమెరికన్ రాజకీయ పార్టీలు మీడియా వెన్నుదన్నుతో, బిలియనీర్ విరాళాల దాతలతో మరింతగా పెనవేసుకుపోయాయి. అమెరికన్ పౌర జీవితం క్షీణించడం గురించి రాబర్ట్ పుట్నమ్ తన 2000 నాటి ప్రభావవంతమైన గ్రంథం ‘బౌలింగ్ అలోన్: ది కొలాప్స్ అండ్ రివైవల్ ఆఫ్ అమెరికన్ కమ్యూనిటీ’లో చేసిన వాదనను ఇది ప్రతిధ్వనిస్తోంది.
నిరసన ఉద్యమాల స్వల్ప జీవితకాలం
జాగర్ ఏమంటారంటే, హైపర్పాలిటిక్స్ అనేది ప్రజా ఉద్యమాలు, సభ్యత్వ సంఘాల క్షీణత మధ్య ఉన్న ఖాళీ స్థలంలోనే ఉంది.
1900 నుంచి చారిత్రక పరిణామాన్ని చూపించే అతని గ్రాఫ్, 2010 నుంచి రాజకీయీకరణలో తీవ్రమైన పెరుగుదలను, అదే సమయంలో 1940ల నుంచి సంస్థాగత క్షీణతను చూపుతుంది. అతను ఉదహరించిన ఒక అద్భుతమైన ఉదాహరణ ఏమిటంటే, “స్వీడన్ నుంచి తూర్పు తైమూర్ వరకు పర్యావరణ నిరసనలు పాఠశాల పనిదినాలను అస్తవ్యస్తం చేశాయి, ఆ తర్వాత క్రమంగా నిరసనలు కనుమరుగయ్యాయి.” గ్రెటా థన్‌బెర్గ్, ఆమె పర్యావరణ నిరసనలకు ఏమైంది? COP30 సాధించిందేమిటి? COP31 మెరుగ్గా ఉంటుందా?
ఇలాంటి నిరసన ఉద్యమాల స్వల్ప జీవితకాలం, వాటి నిలకడలేమిని కూడా జాగర్ ప్రశ్నిస్తారు. ‘బ్లాక్ లైవ్స్ మేటర్’, క్యాపిటల్ భవనంపై దాడికి మధ్య పోలికలను కనుగొంటూ- “నైతికపరంగా, అవి ఆకాశానికీ భూమికి ఉన్నంత తేడాగా ఉన్నాయి. అయితే సంస్థాగత పరంగా, ఈ ఉద్యమాలలో అద్భుతమైన పోలికలు కనిపిస్తాయి. స్వల్పకాలికమైనవిగా ఉంటూ, ఎలాంటి సభ్యత్వ రిజిస్టర్లను నిర్వహించవు. తమ అనుచరులను క్రమశిక్షణలో ఉంచడం కష్టతరమవుతుంది” అని అన్నారు.
అందువల్ల, మన ముందున్న సవాలు ఏమిటంటే వ్యవస్థీకృత రాజకీయ అధికారానికి వ్యతిరేకంగా వ్యూహరచన చేయడం కాదు, తీవ్రమైన నిరసనలను మించి మనుగడ సాగించగల కొత్త రకాల రాజకీయ భాగస్వామ్యాలను ఎలా సృష్టించాలనేదే.
సెర్బియా విద్యార్థి ఉద్యమం సృజనాత్మకత
హైపర్పాలిటిక్స్ పరిధిలోని సృజనాత్మక చర్యలకు సెర్బియా, భారతదేశాలు రెండు కేస్ స్టడీలను అందిస్తున్నాయి. డిప్లో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన జోవన్ కుర్బలిజా సెర్బియాలో అధ్యక్షుడు అలెగ్జాండర్ వుచిక్ పాలక కూటమిని గద్దె దించడానికి దారి తీసిన విద్యార్థుల నిరసన కార్యకలాపాల గురించి ఒక సబ్‌స్టాక్ పోస్ట్‌లో వివరించారు.
“సెర్బియా విద్యార్థులు కొత్త రకమైన సమగ్రమైన, సమర్థవంతమైన ప్రజాస్వామ్యాన్ని పెంపొందిస్తున్నారు, ఐరోపా దీని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది” అని కుర్బలిజా రాశారు.
ఈ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమ నూతన, సృజనాత్మక అంశాలను వివరిస్తూ ఆయన ఇలా పేర్కొన్నారు:
1. నాయకులు లేరు కానీ అరాచకం కాదు.
2. విద్యార్థుల ప్లీనరీల ద్వారా నిర్ణయాలు, ఆ తర్వాత పౌర సభలు.
3. చురుకైన, వికేంద్రీకృత నిర్ణయ ప్రక్రియ.
4. డిజిటల్ రూపంలోనే కాకుండా భౌతిక రూపంలో కూడా నిరసనలకు పూనుకోవడం.
ప్రతిసారీ ఒక్కో విద్యార్థి అధ్యక్షత వహించేలా ఉంటూ నాయకులు లేకుండా నడిచే ఈ ప్లీనరీలను చూసి ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్టర్ కూడా ఎంతగానో ప్రభావితమయ్యారు.
“గత రెండేళ్లుగా, ఈ సమావేశాలు ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను నిర్వహించడం నుంచి అత్యంత క్రమశిక్షణ గల సమష్టి నిర్ణయాలు తీసుకునే సంస్థలుగా పరిణామం చెందాయి”. “మేము పాలించడానికి రాలేదు, సృష్టించడానికి వచ్చాము” అని ఆ ప్లీనరీలో పాల్గొన్న ఒక సాధారణ పౌరుడు చెప్పడాన్ని ఆయన ఉదహరించారు.
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, విరాళాలు కోరుతూ డెమోక్రాట్ల నుంచి నాకు రోజుకు దాదాపు 20 సందేశాలు వస్తాయి.
కుర్బలిజా ఇలా రాశారు- “కొన్ని వారాల క్రితం నేను విద్యార్థుల ఉద్యమానికి విరాళం ఇవ్వాలనుకున్నాను. సాధారణంగా, మీరు డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మీకు పెద్దగా ప్రశ్నలు ఎదురుకావు. ఈసారి అందుకు భిన్నమైన అనుభవాన్ని చవిచూశాను. విద్యార్థుల ఉద్యమం నా గుర్తింపు, ఎందుకు విరాళం ఇవ్వాలనుకుంటున్నారు అన్న అంశాల గురించి అనేక ప్రశ్నలు అడిగింది. ఒక దశలో నేను ఫారమ్‌లు నింపి, నింపి విసిగిపోయి- ‘నన్ను ఈ రాతకోతల ప్రక్రియ ద్వారా ఇబ్బంది పెట్టకండి. నేను మీకు కేవలం డబ్బు ఇవ్వాలనుకుంటున్నాను’ అని రాశాను. వారు ఎంతో మర్యాదపూర్వకంగా నా నిజాయితీని అభినందించారు, అయితే అవసరమైన సమాచారం అందించనంతవరకు వారు నా మద్దతును స్వీకరించలేమని వివరించారు. ఇది నన్ను ఎంతగానో ఆకట్టుకున్న చిన్న విషయం. లాబీయింగ్ లేదా ‘నల్లధనం’ అనే చిన్న అనుమానానికి కూడా తావునిచ్చే ఏ అవకాశానికి వారు చోటు ఇవ్వలేదు.
భారతదేశంలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆవిర్భావం
ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలోని ‘బొద్దింకలు’ సంగతేంటి? అది మరో కేస్ స్టడీ, మరింత క్లిష్టమైనది, బహుశా హైపర్పాలిటిక్స్లో సృజనాత్మకతకు మరింత ప్రయోజనకరమైన ఉదాహరణ అనుకోవచ్చు.
‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఒక అవమానం నుంచి పుట్టుకొచ్చింది. భారతదేశ ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగులను “బొద్దింకలు”గా అభివర్ణించిన తర్వాత, యువ కార్యకర్తలు ఆ అవమానాన్ని ఒక రాజకీయ గుర్తింపుగా మలుచుకున్నారు.
యువత నేతృత్వంలో ఆన్లైన్ వ్యంగ్యంగా ప్రారంభమైనది ఉద్యమంగా మారి, చివరికి భారతదేశ విద్యాశాఖ మంత్రి రాజీనామాతో ముగిసింది.
కాక్రోచ్ అనే పేరు ఉద్దేశపూర్వకంగానే హాస్యాస్పదంగా, చివరికి తమను తాము న్యూనతపరచుకునేలా ఉంది. కానీ అదే దాని ఆకర్షణలో భాగమయ్యింది.
విద్యార్థులు ఒక అవమానాన్ని పరిమిత స్థాయిలోనైనా ఐక్యతకు రూపంగా మార్చారు. అధికారిక పార్టీని ఏర్పాటు చేయాలా వద్దా అనే దానిపై దాని వ్యవస్థాపకుడు ఇంకా నిర్ణయించుకోలేదని రాయిటర్స్ నివేదించింది.
ఉద్యమాల తర్వాత ఏమి జరుగుతుంది?
సెర్బియాతో కొన్ని స్పష్టమైన పోలికలు ఉన్నాయి. రెండు ఉద్యమాలు వ్యవస్థీకృత రాజకీయ సంస్థల నుంచి బహిష్కరించబడినట్లు భావించిన యువత నడిపించాయి.
రెండూ తమ సందేశాన్ని నిర్వహించడానికి, వ్యాప్తి చేయడానికి డిజిటల్ కమ్యూనికేషన్‌ను వినియోగించాయి. రెండూ సంప్రదాయ పార్టీలు, సంప్రదాయ రాజకీయాల్లో లీనం కావడానికి సుముఖత చూపలేదు, ప్రతిఘటించాయి.
రెండు ఉద్యమాలు కూడా రాజకీయ నాయకత్వం గురించిన సాంప్రదాయ ఆలోచనలను సవాలు చేశాయి. సెర్బియాలో, ఒకే నాయకుడిని గుర్తించడానికి నిరాకరించడం లేదా వ్యవస్థీకృత రాజకీయ నాయకులను ఉద్యమంపై నియంత్రణ తీసుకోనివ్వకపోవడం ఒక బలమైన అంశం.
భారతదేశంలో కాక్రోచ్ ఉద్యమం ఒకే వ్యక్తిపై ఆధారపడకుండా, హాస్యాస్పదంగా కనిపించే గుర్తింపు ఎలా శక్తివంతమైన సంస్థాగత సాధనంగా మారుతుందో ప్రదర్శించింది.
ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, తర్వాత ఏమి జరుగుతుంది? వాటిని నిలబెట్టగల సంస్థలు లేనప్పుడు తీవ్రమైన, అత్యంత దృశ్యమానమైన రాజకీయ ఉద్యమాలకు ఏమి జరుగుతుంది? ఒక ఉద్యమం తాను మొదట సవాలు చేయాలనుకున్న సంస్థలా మారకుండానే కొత్త సంస్థలను సృష్టించగలదా?
జాగర్ చెప్పినట్లుగా- “విడిపోయిన వ్యక్తులను మళ్లీ పార్టీలు, యూనియన్ల వైపు లాగడం అనే మన హైపర్పాలిటికల్ ప్రతిష్టంభనకు విరుగుడు పాతకాలపు వ్యవస్థలాగా, అధికారికంగా లేదా కేవలం అవ్యక్తంగా అనిపించవచ్చు.” నిజమే, “1968 నాటి వారసత్వం, పోస్ట్ మోడర్న్ హెడోనిజంపై ఎంతగా విమర్శలు గుప్పించినా, యువకులు తమ అంతరాత్మల నోరునొక్కి తిరిగి ఎప్పటిలానే ఆదివారం నాడు ఫార్మల్ దుస్తుల్లో చర్చికి హాజరయ్యేలా ఏదీ ప్రేరేపించలేదని కనీసం అత్యంత కరడుగట్టిన ప్రతీఘాతవాది కూడా ఇప్పుడు అంగీకరించాలి” అని ఆయన అర్థం చేసుకున్నాడు.
నేనైతే ఏ బౌలింగ్ లీగ్‌లోనూ చేరడానికి, ఆదివారం నాడు ఫార్మల్ దుస్తులలో చర్చికి వెళ్లడానికి సిద్ధంగా లేను. నేను ఖచ్చితంగా నా అంతరాత్మ నోరు నొక్కను.
అయితే, నేను ఆయన ప్రతిపాదించిన “రాజకీయ భాగస్వామ్య పునర్వ్యవస్థీకరణ”, సామాజిక సంబంధాలు, సామాజిక పెట్టుబడుల ప్రాముఖ్యతకు తిరిగి రావడం అన్న అభిప్రాయంతో ఏకీభవిస్తాను. అదే ప్రజలను ఐక్యం చేస్తుంది, శాశ్వత రాజకీయ మార్పుకు అవకాశాన్ని కలిగి ఉంటుంది.
సెర్బియా, భారతదేశాల ఉదాహరణలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. నిరసన ఉద్యమాల శక్తి, ఆవశ్యకతలను, సంస్థల మన్నికతో మిళితం చేసే కొత్త సృజనాత్మక రాజకీయ సంస్థలు మనకు అవసరం.
నిరసనలు మంచివే. మధ్యంతర ఎన్నికల లాంటి ఎన్నికలు కూడా మంచివే. ఆ తర్వాత జరిగేదే నిర్ణయాత్మకమైనది.
(వ్యాస రచయిత డేనియల్ వార్నర్ ‘అన్ ఎథిక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్’ గ్రంథ రచయిత. ప్రస్తుతం జెనీవాలో నివసిస్తున్నారు.)
కౌంటర్ పంచ్ సౌజన్యంతో అనువాదం: కె సత్యరంజన్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
