ప్రభావతి దేవి ఒడిశాలోని బర్గఢ్ ప్రాంతంలో 1910 అక్టోబరు 18న జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ధనపతి దాస్, మాణిక్య దేవి. ఐదో తరగతి వరకు చదువుకున్నారు. కేవలం పదేళ్ల వయసులో బాల్యవివాహం కారణంగా వివాహిత అయ్యారు. అయితే చిన్న వయసులోనే భర్త మరణించడంతో బాలవితంతువుగా మారారు. ఆ కాలంలో బాలవితంతువులపై సమాజంలో అనేక ఆంక్షలు ఉండేవి. విద్య, సామాజిక జీవనం, వ్యక్తిగత స్వేచ్ఛకు కూడా అవకాశం ఉండేది కాదు. కానీ ప్రభావతి దేవి ఈ సంప్రదాయ ఆంక్షలకు తలవంచలేదు. సమాజంలో మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం ఉండాలని భావిస్తూ ప్రజా జీవితంలోకి ప్రవేశించారు. నవంబరు 13 ఆమె వర్ధంతి.
స్వాతంత్ర్య ఉద్యమంలోకి ప్రవేశం
ఆమెను ప్రభావితం చేసిన వారిలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఫకీర్ బెహెరా ముఖ్యులు. 1937లో ప్రముఖ మహిళా కాంగ్రెస్ నాయకురాలు మాలతి దేవి బర్గఢ్ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రభావతి దేవి ఆమెను కలిసి స్వాతంత్ర్య ఉద్యమంలో పనిచేయాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. మాలతి దేవి ఆమెను ఒడిశాలోని బారి ఆశ్రమానికి తీసుకెళ్లారు.
బారి ఆశ్రమం ఒడిశాలో గాంధేయ నిర్మాణాత్మక కార్యక్రమాలకు ముఖ్యమైన కేంద్రంగా ఉండేది. రామా దేవి, గోప బంధు చౌధురి తదితరులు ఈ ఆశ్రమం ద్వారా మహిళల అభివృద్ధి, గ్రామీణ పునర్నిర్మాణం, ఖాదీ, వయోజన విద్య వంటి కార్యక్రమాలను నిర్వహించేవారు. ప్రభావతి దేవి ఈ ఆశ్రమంలో చేరి వీటిలో శిక్షణ పొందారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనే పద్ధతులు:
♦ సత్యాగ్రహం, అహింసా ఉద్యమం
♦ నూలు వడకడం, ఖాదీ తయారీ
♦ కుటీర పరిశ్రమల నిర్వహణ
♦ మహిళా విద్య, వయోజన విద్య
♦ గ్రామీణ ప్రజల్లో జాతీయ చైతన్యం పెంపొందించడం

ఆమె ఆశ్రమంలో చేరడం అప్పటి సంప్రదాయవాద సమాజానికి నచ్చలేదు. ఆమె కుటుంబం కూడా సామాజిక ఒత్తిడిని ఎదుర్కొంది. అయినప్పటికీ ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం
ప్రభావతి దేవి కేవలం శిక్షణకే పరిమితం కాలేదు. ప్రత్యక్షంగా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. బర్గఢ్ పోలీస్ స్టేషన్ ముట్టడి, కాంగ్రెస్ ప్రచార కరపత్రాల పంపిణీ, విదేశీ వస్తువుల బహిష్కరణ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ కార్యకలాపాల కారణంగా ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఒకటిన్నర సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించారు.
1938లో పార్వతి గిరితో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ బారి ఆశ్రమంలో పనిచేసి, తరువాత సంబల్పూర్ ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకలాపాలను విస్తరించేందుకు నియమితులయ్యారు.
1941 నుంచి ప్రభావతి దేవి గ్రామ గ్రామాన పర్యటిస్తూ విదేశీ వస్తువులను బహిష్కరించాలని, స్వదేశీ వస్తువులను ఉపయోగించాలని ప్రచారం చేశారు. ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నారు.
క్విట్ ఇండియా ఉద్యమం – జైలు జీవితం
1942 ఆగస్టులో మహాత్మా గాంధీ పిలుపునిచ్చిన క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రభావతి దేవి చురుకుగా పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేయడానికి కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను పెద్ద సంఖ్యలో అరెస్టు చేసింది.
1943 ఆగస్టు 23న కాంగ్రెస్ ప్రచార కరపత్రాలను పంపిణీ చేసినందుకు ప్రభావతి దేవిని పోలీసులు అరెస్టు చేశారు. మొదట సంబల్పూర్ జైలులో ఉంచి, అనంతరం కటక్ జైలుకు తరలించారు. జైలు జీవితంలో రామా దేవి, మాలతి చౌధురి తదితర మహిళా స్వాతంత్ర్య సమరయోధులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. 1945లో విడుదలైన తరువాత తిరిగి ప్రజాసేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
స్వాతంత్ర్యం అనంతరం సామాజిక సేవ
భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులు రాజకీయాల్లోకి ప్రవేశించారు. మరికొందరు సామాజిక సేవకు అంకితమయ్యారు. ప్రభావతి దేవి రెండో మార్గాన్ని ఎంచుకున్నారు.
1945లోనే బర్గఢ్ ప్రాంతంలో మాతృ మంగళ కేంద్రాన్ని ప్రారంభించి మహిళలు, పిల్లలు, నిరుపేదల సంక్షేమానికి కృషి చేశారు. తరువాత బలహీన వర్గాల పిల్లల సంరక్షణ, విద్య, పునరావాసం కోసం బాల నికేతన్ కార్యక్రమాన్ని అభివృద్ధి చేశారు. 1992లో సుమారు 50 నుంచి 60 మంది అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించే అనాథాశ్రమాన్ని ప్రారంభించారు.
వినోబా భావే ప్రారంభించిన భూదాన్ ఉద్యమంలో కూడా ఆమె పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ పేదలకు భూమి, జీవనోపాధి, సామాజిక గౌరవం కల్పించాలనే ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. ఆమె సేవలు కేవలం స్వాతంత్ర్య ఉద్యమానికే పరిమితం కాలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా పేదలు, అనాథలు, మహిళలు, నిరుపేద పిల్లల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేశారు.
పురస్కారాలు, గౌరవాలు
ఆమె సేవలను గుర్తించి వివిధ సంస్థలు, ప్రభుత్వాలు గౌరవించాయి. 1972లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేతుల మీదుగా స్వాతంత్ర్య సమరయోధుల సేవలకు గుర్తింపుగా తామ్ర పత్రం అందుకున్నారు.
1984లో కటక్‌లోని ఆల్ ఇండియా ఫ్రీడమ్ ఫైటర్స్ స్మృతి సంస్థ నుంచి రాష్ట్ర గౌరవ్ పురస్కారం అందుకున్నారు. 1998లో సంబల్పూర్ విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టర్ ఆఫ్ లాస్ పట్టా ప్రదానం చేసింది. అప్పటి ఒడిశా గవర్నర్ డాక్టర్ సి రంగరాజన్ చేతుల మీదుగా ఈ గౌరవాన్ని స్వీకరించారు.
ప్రభావతి దేవి 1998 నవంబరు 13న ఒడిశాలోని చాచన్పాలి బాలనికేతన్లో మరణించారు. ఆమె జీవితంలో దాదాపు ఐదు దశాబ్దాల పాటు ప్రజాసేవకు అంకితమయ్యారు. బాల్యంలో వితంతువుగా ఎదుర్కొన్న సామాజిక వివక్షను అధిగమించి, స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని, జైలు శిక్షలు అనుభవించి, చివరకు అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించిన ఆమె జీవితం మహిళా సాధికారతకు ఒక చారిత్రక ఉదాహరణ.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
