♦ ఓటర్ల జాబితాల నుంచి పేర్ల తొలగింపు ప్రజాస్వామ్య హక్కులపై దాడి
♦ ఎస్ఐఆర్ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలి
♦ ఓటు హక్కును కోల్పోతున్న అణగారిన వర్గాలపై వక్తల ఆందోళన
♦ ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలని పిలుపు
♦ పౌరుల భాగస్వామ్యంతోనే ఎన్నికల వ్యవస్థకు విశ్వసనీయత ఎన్నికల వ్యవస్థకు విశ్వసనీయత
హైదరాబాద్: ప్రజాస్వామ్యానికి పునాదైన ఓటు హక్కును పరిరక్షించుకోవాలంటే దేశంలో ఎన్నికల సమగ్రతను కాపాడుకోవడం అత్యంత అవసరమని భారత్ సమ్మిట్-2026లో పాల్గొన్న వక్తలు స్పష్టం చేశారు.
ఓటర్ల జాబితాల సవరణ పేరుతో పెద్ద సంఖ్యలో ప్రజల పేర్లను తొలగించడం, ఎస్ఐఆర్ ప్రక్రియలో పారదర్శకత లోపించడం, ఎన్నికల సంఘం స్వతంత్రతపై తలెత్తుతున్న సందేహాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు సవాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, వలస కార్మికులు సహా అణగారిన వర్గాల ఓటు హక్కులకు రక్షణ కల్పించాలని, ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు.
భారత్ సమ్మిట్‌లో భాగంగా ‘ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ’(ఎన్నికల సమగ్రత) అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఏఐసీసీ మహారాష్ట్ర ఇన్చార్జి సిరివెళ్ల ప్రసాద్, సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్, ఎమ్మెల్యే చిట్టం పర్ణికా రెడ్డి, తారారావు, డెలావేర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ముక్తార్ ఖాన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఎంకేఎస్ఎస్ మాజీ సభ్యులు నిఖిల్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
వలస కార్మికుల ఓటు హక్కుకు రక్షణ కల్పించాలి: సిరివెళ్ల ప్రసాద్
ఏఐసీసీ మహారాష్ట్ర ఇన్చార్జి సిరివెళ్ల ప్రసాద్ మాట్లాడుతూ, గతంలో గ్రామస్థాయిలో ఓటర్ల జాబితాలు స్పష్టంగా ఉండేవని, ప్రస్తుతం ఓటర్ల పేర్ల తొలగింపు, వలస కార్మికుల ఓటు హక్కులకు సంబంధించిన సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
2009 నుంచి నేషనల్ ఎలక్షన్ వాచ్ ద్వారా సుమారు 296 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్నికల సరళిని పరిశీలించినట్లు తెలిపారు. ఓటర్లపై ఒత్తిడి, హింస వంటి అంశాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసినట్లు వివరించారు.
ఎన్నికల నిధుల్లో పారదర్శకత అవసరం: ముక్తార్ ఖాన్
ముక్తార్ ఖాన్ మాట్లాడుతూ, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కార్పొరేట్ సంస్థల నుంచి రాజకీయ పార్టీలకు భారీగా నిధులు అందడం ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతోందన్నారు.
హైదరాబాద్‌లో సుమారు 7.7 లక్షల ఓట్లు తొలగించిన అంశాన్ని ప్రస్తావిస్తూ, పౌరుల ఓటు హక్కులను కాపాడుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.
గ్రామీణ ఓటర్లలో అవగాహన పెంచాలి: ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి
ఎమ్మెల్యే చిట్టం పర్ణికా రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల పవిత్రత ప్రజాస్వామ్యానికి ప్రధాన పునాదని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.
ఈసీ స్వతంత్రత, నిష్పాక్షికతను కాపాడాలి: అంజలి భరద్వాజ్
సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్ ఎస్ఐఆర్ ప్రక్రియలో పారదర్శకత, ప్రజలతో సంప్రదింపులు, సమాచార హక్కుకు ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు.
ఓటర్ల జాబితాలపై ప్రజలకు నమ్మకం కలిగేలా ఎన్నికల సంఘం వ్యవహరించాలని, దాని స్వతంత్రత, నిష్పాక్షికతను కాపాడాలని కోరారు.
ఎన్నికల ప్రక్రియలో పౌరుల క్రియాశీల పాత్ర అవసరం: తారారావు
తారారావు మాట్లాడుతూ, ఎన్నికల సమగ్రతను కాపాడటంలో పౌరులు ప్రేక్షకులుగా మిగిలిపోకుండా క్రియాశీల పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
ఓటర్ల జాబితాలను ప్రజలే పరిశీలించుకోవడంతో పాటు, ప్రజా ఆడిట్ల ద్వారా లోపాలను గుర్తించి ప్రశ్నించాలని సూచించారు.
ఎన్నికల సమగ్రత అనేది కేవలం ఓటింగ్‌కు సంబంధించిన అంశం మాత్రమే కాదని, ప్రజల హక్కులు, ప్రజాస్వామ్య విలువలు, ప్రభుత్వ జవాబుదారీతనంతో ముడిపడి ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు.
ప్రతి పౌరుడి ఓటు హక్కుకు భద్రత కల్పించినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని స్పష్టం చేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
