జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలు జీవితం గడుపుతున్న దశలో, 1934-35 మధ్య కాలంలో తన ఆత్మకథ ‘టువర్డ్స్ ఫ్రీడమ్’ రాసుకున్నారు. బానిస సంకెళ్లు తెంచుకుని, దేశం స్వేచ్ఛ కోసం తపిస్తున్న రోజుల్లో ఆయన అందులో తన అనుభవాల్ని నమోదు చేసుకున్నారు.
నెహ్రూజీ జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య కమలా నెహ్రూ అనారోగ్యంతో మంచాన పడి ఉన్నారు. కూతురు ఇందిర అప్పటికి చిన్నపిల్ల. ఆమె ఆలనాపాలనా చూసేవారు ఎవరూ లేకపోవడం వల్ల తరచూ రవీంద్రుడి శాంతినికేతన్‌కు పంపుతుండేవారు.
రవీంద్రుడి పర్యవేక్షణలో ఆమె అక్కడ గడుపుతూ ఉండేది. అందరినీ, అన్నింటినీ ప్రేమగా చూసే లక్షణం ఆ బాలికలో ఉందని గ్రహించి రవీంద్రనాథ్ టాగూర్ ఆమెను ‘ప్రియదర్శిని’ అని అన్నారు. అప్పటి నుంచి ఆమె ఇందిరా ప్రియదర్శిని అయ్యింది.
నెహ్రూ ఆత్మకథపై రవీంద్రుడి ప్రశంసల జల్లు
పండిట్ నెహ్రూకు సాహిత్యం, కళల పట్ల ఉన్న అవ్యాజమైన ప్రేమ జగద్విదితం. ఆయన ఆత్మకథను చదివి విశ్వకవి ఆశ్చర్యచకితులైపోయారు. ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉత్తరం రాశారు. అప్పటికి నెహ్రూ భారతదేశానికి తొలి ప్రధాని కాలేదు. స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొంటున్న దేశభక్తుడు, యోధుడు మాత్రమే. భార్య అనారోగ్యాన్ని, కుటుంబాన్ని పక్కనపెట్టి పూర్తి సమయం దేశం కోసం వెచ్చించడం, మానవీయ విలువల కోసం తపించడం విశ్వకవి రవీంద్రుడికి బాగా నచ్చింది. 1936 మే 31న తన నివాసం శాంతినికేతన్ నుంచి రవీంద్రుడు రాసిన ఉత్తరం ఇలా ఉంది.
“ప్రియమైన జవహర్లాల్,
మీ పుస్తకం చదవడం ఇప్పుడే పూర్తి చేశాను. నిజంగా అది చాలా గొప్ప పుస్తకం. చదువుతూ ఎంతో చలించిపోయాను. మీరు సాధించిన విజయాలు తెలుసుకుని గర్వపడుతున్నాను. అన్నింటికీ మించి మీ హృదయపు అట్టడుగున ప్రవహించే లోతైన మీ మానవత్వపు దృక్కోణం, సంక్లిష్టమైన చిక్కుముడులనన్నింటినీ విప్పుతూ ఉంది. వాస్తవాల్ని నిబ్బరంగా బహిర్గతం చేస్తూ ఉంది. ఇంతవరకు సాధించిన విజయాలకు మించిన మహోన్నతమైన వ్యక్తిత్వం మీది అనే విషయం తెలిసిపోతూ ఉంది. సమకాలీన స్థితిగతుల నుంచి నిజాయితీతో కూడిన ఒక నిఖార్సయిన మీ వ్యక్తిత్వం గోచరిస్తోంది” అని కితాబిచ్చారు రవీంద్రనాథ్ టాగూర్.
లేఖా సాహిత్యం – చాచా నెహ్రూ వ్యక్తిత్వం
సాహిత్య ప్రేమికుడు, సాహిత్యకారుడు అయిన భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు విశ్వకవి రవీంద్రుడు, అమృతా షేర్గిల్, కవయిత్రి సరోజినీ నాయుడు; ఫ్రెంచ్ సాహిత్యకారుడు, నోబెల్ గ్రహీత రోమైన్ రోల్లాండ్ వంటి దిగ్గజాల నుంచి ఉత్తరాలు వస్తుండేవి. సమయం చూసుకుని వారికి నెహ్రూజీ సమాధానాలు రాస్తుండేవారు.
ఆ రోజుల్లో లేఖలు రాయడం కూడా ఒక కళగా పరిగణించబడుతూ ఉండేది. జైలు నుంచి నెహ్రూజీ తన కూతురు ఇందిరా ప్రియదర్శినికి రాసిన ఉత్తరాలు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఆ ఉత్తరాల్లో సాహిత్య, సామాజిక, చారిత్రక, స్వాతంత్ర్యోద్యమ విశేషాలతో పాటు దేశ, కాల పరిస్థితుల గురించి ఎన్నో అంశాలు చర్చించబడుతూ ఉండేవి. తరువాత కాలంలో ఆ లేఖలన్నీ పుస్తక రూపంలో వెలువడ్డాయి.
ఆ ఉత్తరాలతో పాటు ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ పుస్తకం కూడా వెలువడింది. దాని ఆధారంగా చిత్రదర్శకుడు శ్యామ్ బెనెగల్ టీవీ సీరియల్ తీశారు. పిల్లల పట్ల ఆయనకు గల ప్రత్యేకమైన ఆసక్తి, ప్రేమల వల్ల ఎంతో అభిమానం పొందారు. దేశంలో ఎన్నో సంస్థలకు, ప్రాజెక్టులకు పునాదులు వేశారు.
పిల్లలు పెద్దవాళ్ళై ముసలివాళ్ళు కూడా అవుతారు కానీ, తరాలు మారినా పండిట్ నెహ్రూను చాచా నెహ్రూగానే పిలుస్తారు. ఆయన పుట్టినరోజు నవంబర్ 14ను పిల్లల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
వ్యవస్థల నిర్మాణం – సమకాలీన రాజకీయ విశ్లేషణ
జాతీయ సంస్థల్ని ప్రారంభించి నిలబెట్టింది నెహ్రూజీ అయితే, అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసింది మోడీజీ. తొలి ప్రధాని నుంచి ఇటీవల కాలం వరకు ఏ ప్రధానీ చేయని “ఘన”మైన పనులు ఇప్పటి ప్రధాని చేశారు. నిజమే.. ఈయన నిరంతర ప్రపంచ పర్యాటకుడు. ఈ దేశానికేమో పార్ట్ టైమ్ ప్రైమ్ మినిస్టర్. ఈయనకు సెల్ఫీలంటే ఇష్టం. ఏమి మాట్లాడలేక వారసత్వ పాలనకు నెహ్రూయే కారణమంటారు. ఆయన మరణానంతరం జరిగిన సంఘటనకు ఆయన ఎలా బాధ్యుడవుతారూ? పటేల్ విగ్రహం స్థాపించారు. ఏక్తా విగ్రహం అన్నారు, బాగుంది. ప్రారంభోత్సవ సభలో నేటి హోం మంత్రి కనబడలేదు. విగ్రహం తొలి హోంమంత్రిది కదా? పైగా వేల సంఖ్యలో మత గురువులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అసలు దానికి, మతానికి ఏం సంబంధం ఉంటుంది?
ఆరోజుల్లో ఆసేతు హిమాచలం స్వాతంత్య్ర సమరయోధులు లక్షల మంది ఉండి ఉంటారు. వారందరిలోకి నాయకత్వ లక్షణాలు, చురుకుదనం, విశాలభావాలు, అభ్యుదయధోరణి, విదేశాంగ విధానాల మీద పట్టు, చదువు- సంస్కారం అన్నీ పుణికి పుచ్చుకుని ఉన్నారు గనక నెహ్రూ తొలి ప్రధానికాగలిగారు.
సుదీర్ఘకాలం ఆ పదవిలో కొనసాగగలిగారు. మనుషులలో సంయమనం ఉంటేగానీ అలా నిలబడలేరు. ధనం, స్థాయి, స్థోమత ఏమీ లేనివాడు త్యాగం చేయడానికి ఏముంటుంది? కానీ, నెహ్రూజీకి ఇవన్నీ ఉండి కూడా అన్నింటినీ త్యజించి, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడం గొప్ప. పైగా కశ్మీరీ పండిట్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారై ఉండి, నిరీశ్వరవాది కావడం అంతకన్నా గొప్ప.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
