A New Economic Deal Is Needed to Address Inequality (AI-generated illustration)
గ్లోబల్ సౌత్ దేశాలకు అంతర్జాతీయ విధానాల్లో తగిన ప్రాధాన్యం కల్పించాలి
భారత్ సమ్మిట్-2026లో ‘ప్రపంచానికి కొత్త ఆర్థిక ఒప్పందం’పై చర్చ
హైదరాబాద్: ప్రపంచ వ్యాసప్తంగా ఆర్థిక వృద్ధితోపాటు సామాజిక న్యాయం, సమాన అవకాశాలకు ప్రాధాన్యం కల్పించే కొత్త ఆర్థిక విధానాలు అవసరమని పలువురు అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. సంపదను సృష్టించడమే కాకుండా, దాని ప్రయోజనాలు అన్ని వర్గాలకూ చేరేలా చూడాలని సూచించారు. హైదరాబాద్ హైటెక్స్ జరుగుతున్న భారత్ సమ్మిట్-2026లో భాగంగా శుక్రవారం ‘ప్రపంచానికి కొత్త ఆర్థిక ఒప్పందం’ అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్టి జరిగింది. సమావేశంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గ్లోబల్ సౌత్ దేశాల పాత్ర, అంతర్జాతీయ నియమాల్లో మార్పులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, సాంకేతిక అభివృద్ధి, వాతావరణ మార్పుల ప్రభావం వంటి అంశాలపై చర్చించారు. కార్యక్రమానికి ఎంపి దీపేందర్ హుడా సమన్వయకర్తగా వ్యవహరించారు.
సమావేశంలో దక్షిణాఫ్రికా మాజీ మంత్రి ఇబ్రహీం పటేల్ మాట్లాడుతూ స్వేచ్ఛాయుత మార్కెట్లు, సామాజిక న్యాయం పరస్పర విరుద్ధమైనవి కావని, రెండింటినీ సమతుల్యం చేసే విధానాలు అవసరమని పేర్కొన్నారు. ఆధునిక ప్రపంచ మార్కెట్లలో ఆర్థిక శక్తి కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతోందని, ఈ అసమానతలను తగ్గించేందుకు జీ20 వంటి అంతర్జాతీయ వేదికలు సమ్మిళిత వృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు. భారత్, ఆఫ్రికా దేశాలు ప్రపంచ జనాభాలో గణనీయమైన వాటా కలిగి ఉన్నప్పటికీ, ప్రపంచ జీడీపీలో వాటి వాటా తక్కువగా ఉండటం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలోని అసమతుల్యతను సూచిస్తోందన్నారు. ఆఫ్రికాలో పారిశ్రామిక రంగం క్షీణించడం, దేశాల మధ్యే కాకుండా దేశాల అంతర్గతంగా కూడా అసమానతలు పెరగడం ఆందోళనకరమని చెప్పారు. సాంకేతికత అభివృద్ధికి అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో అంతరాలను పెంచుతోందని, వాతావరణ మార్పుల విషయంలో శాస్త్రీయ అవగాహనకు అనుగుణంగా రాజకీయ నిర్ణయాలు ఉండాలని పేర్కొన్నారు.
ఐక్యరాజ్యసమితి ఉన్నతస్థాయి ఆర్థిక, సామాజిక వ్యవహారాల సలహాదారు ప్రొఫెసర్ జయతి ఘోష్ మాట్లాడుతూ ప్రపంచ జనాభాలో అధిక భాగం ఉన్న ఆఫ్రికా, ఇతర గ్లోబల్ సౌత్ దేశాలకు అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ వ్యవస్థల్లో తగిన ప్రాతినిధ్యం, ప్రభావం లభించడం లేదన్నారు. ఆర్థిక విధానాల్లో నియంత్రణల సడలింపు సంపద కేంద్రీకరణకు, అసమానతల పెరుగుదలకు దోహదం చేస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రైవేటు సంపద పెరుగుతున్నప్పటికీ, అనేక దేశాల్లో ప్రజా సంపద, ప్రభుత్వ రంగ వనరులు క్షీణిస్తున్నాయని పేర్కొన్నారు. కృత్రిమ మేధ సహా ఆధునిక సాంకేతికతలు కొత్త అవకాశాలను కల్పిస్తున్నప్పటికీ, వాటి ప్రయోజనాలు సమానంగా అందేలా విధానాలు రూపొందించాలని సూచించారు. వాతావరణ మార్పులు, వనరుల వినియోగం వంటి అంశాల్లో దేశాల మధ్య సమన్వయం అవసరమన్నారు.
ఈక్వెడార్ మాజీ విదేశాంగ మంత్రి గులౌమే లాంగ్ మాట్లాడుతూ గ్లోబల్ సౌత్ దేశాలు అంతర్జాతీయ విధానాలలో తమ వాటాను, ప్రభావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న నియమాలను సవాలు చేస్తూ, కొత్త విధానాలు, కూటములు ఏర్పడుతున్నాయన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), ఇతర ఆధునిక టెక్నాలజీలు ప్రపంచాన్ని మారుస్తున్నాయని, ఇవి కొత్త అవకాశాలతో పాటు కొన్ని సవాళ్లను కూడా తెస్తున్నాయని తెలిపారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో, వనరుల వినియోగంలో దేశాల మధ్య సమన్వయం, కొత్త విధానాలు అవసరమన్నారు.
ఇది కూడా చదవండి: ప్రజా రవాణా ప్రజల హక్కు-దేశాభివృద్ధికి పునాది!
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
