ఫ్రాన్స్‌లో రాబోయే ఆరు నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు మాక్రాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల ప్రజలలో తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.
రెండు నెలల క్రితం విద్యార్థి ఉద్యమంగా ప్రారంభమై క్రమంగా అది పెద్ద ప్రజా ఉద్యమంగా మారింది. నవంబరు 5న కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మె నిర్వహించాయి.
ఇప్పటివరకు జరిగిన సమ్మెలన్నింటికంటే ఇది అతిపెద్ద సమ్మె అని, ఆ రోజు జరిగిన నిరసన ప్రదర్శనలలో 16 లక్షల మంది పాల్గొన్నారని సీజీటీ నేత స్టెఫిన్ తెలిపారు.
ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఈ ఉద్యమాలు అద్దం పడుతున్నాయి. దీని ప్రభావం రానున్న అధ్యక్ష ఎన్నికల్లో ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
త్రిముఖ పోటీ
వామపక్ష పార్టీ, మధ్యేవాద సోషల్ డెమొక్రాట్ పార్టీ, ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ పార్టీలు అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్నాయి. ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ పార్టీకి చెందిన మహిళ ‘మరైన్ లే పెన్’ ముందున్నట్లు కొన్ని సర్వేలు తెలియజేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో నవంబరు 8న ఫ్రెంచ్ వామపక్ష అభ్యర్థి జీన్-ల్యూక్ మెలాంచన్ అధ్యక్ష ఎన్నికల ప్రణాళికను ప్రకటించారు.
విమర్శలు
వామపక్ష అభ్యర్థి ప్రకటించిన ఎన్నికల ప్రణాళికపై అప్పుడే వామపక్ష వ్యతిరేకులు విమర్శలు ప్రారంభించారు. ధరలు విపరీతంగా పెరగడంతో అల్లాడిపోతున్న ఓటర్లను ఆకర్షించడానికి ఆయన ఎన్నో మంచి మాటలు చెప్పారు. కానీ ఇవన్నీ అమలు చేస్తే ఫ్రాన్స్ మరింత పేద దేశంగా మారుతుందని, భవిష్యత్తులో ప్రజలకు మరింత కోపం వస్తుందని వారు విమర్శిస్తున్నారు.
మెలాంచన్ ప్రతిపాదనలు
ఆహార పదార్థాలు, కరెంటు, ఇంధన ధరలను ప్రభుత్వ నియంత్రణలోకి తెస్తానని మెలాంచన్ చెబుతున్నారు. పదవీ విరమణ వయసును 64 సంవత్సరాలకు పెంచే రూల్స్ రద్దు చేసి, దానిని మళ్లీ 60 సంవత్సరాలకే తగ్గిస్తానని ఆయన అంటున్నారు.
దేశంలోని 100 మిలియన్ పౌండ్ల సంపద కలిగిన అత్యంత ధనవంతులపై 2 శాతం అదనపు పన్ను విధిస్తానని, 10 మిలియన్ యూరోల కంటే ఎక్కువ వారసత్వ ఆస్తిని నిషేధిస్తానని, అంతకంటే ఎక్కువ వారసత్వ ఆస్తి ఉంటే ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుంటుందని ఆయన ప్రకటించారు.
దేశానికి కీలకమైన పరిశ్రమలన్నీ ప్రభుత్వ నియంత్రణలోకి తెస్తానని, అణు శక్తి నుంచి, నాటో భాగస్వామ్యం నుంచి వైదొలుగుతామని ప్రకటించారు.
విమర్శకుల వాదన:
“మెలాంచన్ తెచ్చిన ఈ కొత్త ఆలోచనలు చూస్తుంటే, ఫ్రాన్స్ ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి మరొక సంక్షోభంలో కూరుకుంటుందని అనిపిస్తోంది. ఆయన పథకాలు అమలు చేస్తే దేశంలో కరెంటు, వస్తువుల కొరత ఏర్పడుతుందని, పెట్టుబడులు తగ్గిపోయి దేశం తీవ్రమైన అప్పుల సంక్షోభంలో కూరుకుపోతుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాది ఫ్రాన్స్ ఆర్థిక వృద్ధి కేవలం 0.4 శాతం మాత్రమే ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంచనా వేసింది. ఇప్పటికే ప్రభుత్వ ఖర్చులు జీడీపీలో 57 శాతంగా ఉన్నాయి.
మెలాంచన్ చెబుతున్న ఈ మాటలు కొత్తవి కావు. అమెరికాలో బెర్నీ సాండర్స్ ఎలాగైతే దశాబ్దాలుగా విఫలమైన ఆర్థిక సిద్ధాంతాల గురించి ప్రచారం చేస్తున్నారో, ఈయన కూడా అలాగే చేస్తున్నారు. అయితే తేడా ఏమిటంటే గత కొన్ని వారాలుగా వేలాదిమంది ప్రజలు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్న ప్రస్తుత తరుణంలో, ఈ సోషలిస్ట్ ఆలోచనలకు ప్రజల నుంచి కాస్త ఆదరణ దక్కవచ్చు. గత అక్టోబరులో చేసిన ఒక సర్వే ప్రకారం ఫ్రాన్స్ దేశ భవిష్యత్తు గురించి 91 శాతం మంది ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారు.”
ఏప్రిల్ ఎన్నికలు
రాబోయే ఏప్రిల్ నెలలో అధ్యక్ష ఎన్నికల మొదటి విడత ఓటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ప్రజలు మెలాంచన్ వైపు మొగ్గు చూపుతారా లేక ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ పార్టీకి చెందిన మహిళ ‘మరైన్ లే పెన్’ వైపు వెళ్తారా అనేది తేలనుంది.
ప్రస్తుతం లే పెన్ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. నవంబరు 5న విడుదల చేసిన ఒక సర్వేలో 16 శాతం మంది వామపక్ష అభ్యర్థి మెలాంచన్ మంచివాడని భావిస్తుండగా, 35 శాతం మంది మాత్రం లే పెన్ వైపు ఉన్నారు.
మెలాంచన్ గెలవకపోయినా ఆయన ఆలోచనలు చివరి రౌండ్ వరకు వెళ్లే అవకాశం లేకపోలేదు. ఆయనకు పోటీగా ఉన్న మితవాద సోషలిస్ట్ ప్రత్యర్థి రఫేల్ గ్లక్స్మాన్కు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఆయన కూడా ధనవంతులపై, వారసత్వ ఆస్తులపై పన్నులు వేయాలని చెబుతున్నారు.
లే పెన్ నియో లిబరల్ కాదు. అయితే ప్రొటెక్షనిజమ్ విధానాలు, ప్రభుత్వ మార్గదర్శకంలో పెట్టుబడులు ఉంటాయని, దేశంలోని కార్మికులను, పరిశ్రమలను విదేశీ పోటీ నుంచి కాపాడుతానని చెబుతున్నారు.
ఒకవేళ ఫ్రాన్స్ తనను తాను మార్చుకోకపోతే, వచ్చే వేసవి నాటికి యూరప్‌లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటి అయిన ఫ్రాన్స్ తీవ్రమైన సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది.
ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ పార్టీ జాతీయవాదం వైపో లేదా వామపక్షాల ప్రభుత్వ పంపిణీ విధానాల వైపో ఫ్రాన్స్ రాజకీయాలు మళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
(వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వార్త ఆధారంగా)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
