– మితవాద, జాతీయవాద విధానాలకు ప్రత్యామ్నాయ అజెండాపై ‘భారత్ సమ్మిట్–2026’
– నవంబరు 13 శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు హెచ్ఐసీసీలో అంతర్జాతీయ సదస్సు
– 70 దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధుల హాజరు
– నవంబరు 14న ముగింపు సభకు రాహుల్ గాంధీ
– అంతర్జాతీయ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్యం, వాతావరణ మార్పులపై చర్చలు
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మితవాద రాజకీయాలు, ప్రజాస్వామ్య విలువలకు ఎదురవుతున్న సవాళ్లకు ప్రత్యామ్నాయ విధానాలను రూపొందించేందుకు ప్రపంచ ప్రగతిశీల శక్తుల సమీకరణకు హైదరాబాద్ వేదిక కానుంది.
‘భారత్ సమ్మిట్–2026’ పేరుతో నవంబరు 13, 14 తేదీల్లో హెచ్ఐసీసీ, నోవాటెల్‌లో రెండో అంతర్జాతీయ సదస్సు జరగనుంది.
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు 70 దేశాల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు.
భారతదేశం స్వాతంత్ర్యం పొంది 80వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా, తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 137వ జయంతి నేపథ్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.
ఆసియా, ఆఫ్రికా దేశాల ఐక్యత, అలీనోద్యమ వారసత్వాన్ని కొనసాగిస్తూ గ్లోబల్ సౌత్, గ్లోబల్ నార్త్ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం దీని ప్రధాన లక్ష్యం.
ఈ సదస్సులో నెదర్లాండ్స్ మాజీ విదేశాంగ మంత్రి బెర్ట్ కొయెండర్స్, పోర్చుగల్ మాజీ మంత్రి మరియా జోవో రోడ్రిగ్స్, ఐవరీకోస్ట్ మాజీ ప్రధాని పాస్కల్ అఫీ ఎన్గెస్సన్, దక్షిణ కొరియా మాజీ విదేశాంగ మంత్రి చుంగ్ యి-యోంగ్ తదితర అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొననున్నారు.
రాహుల్ ప్రసంగంపై ఆసక్తి
నవంబరు 14న జరిగే ముగింపు సభలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొని ‘భారత్, ప్రపంచ భవిష్యత్ దార్శనికత’పై ప్రసంగించనున్నారు.
సూత్రబద్ధమైన బహుపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, శాంతియుత సహజీవనం, ప్రజాస్వామ్య విలువల ఆధారంగా భారత విదేశాంగ విధానానికి ప్రత్యామ్నాయ దృక్పథాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు.
ఏఐ, క్లౌడ్ క్యాపిటలిజం, నూతన ప్రపంచ క్రమం, ప్రపంచ ఆర్థిక ఒప్పందాలు, యువత రాజకీయాలు, వాతావరణ మార్పులు, మహిళా న్యాయం, మీడియా భవిష్యత్తు, అంతర్జాతీయ సంస్థల సంస్కరణలు తదితర అంశాలపై చర్చా వేదికలు నిర్వహించనున్నారు.
తెలంగాణ అభివృద్ధిపైనా ప్రత్యేక చర్చలు
సదస్సులో భాగంగా ‘తెలంగాణ రైజింగ్’ పేరుతో తొమ్మిది ప్రత్యేక చర్చా సమావేశాలు నిర్వహించనున్నారు. ఫ్యూచర్ సిటీ, పట్టణీకరణ, ఆర్థిక, సామాజిక న్యాయం, సంక్షేమ విధానాలు, సహకార సమాఖ్యవాదం, సంస్కృతి, యువత, క్రీడలు, ఎన్నికల సమగ్రత వంటి అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్ తదితరులు ప్రసంగించనున్నారు. ప్రపంచ ప్రగతిశీల నాయకులు, విధాన నిర్ణేతలు, మేధావుల కలయికతో హైదరాబాద్ అంతర్జాతీయ చర్చలకు కేంద్రంగా నిలవనుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
