Norwegian Journalist Helle Lyng Visa Cancelled Before Bharat Summit in Hyderabad
మే నెలలో ప్రధానమంత్రి మోదీని ప్రశ్నించి వార్తల్లో నిలిచిన నార్వే దేశపు విలేకరి హెల్లె లింగ్ స్వెండ్స్ను, హైదరాబాద్లో జరగనున్న ‘భారత్ సమ్మిట్’ సదస్సుకు భారతదేశంలోకి రాకుండా అడ్డుకున్నారు. దానిపై ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ఆమె పెట్టిన సోషల్ మీడియా పోస్టుల వివరాలు:
“భారతదేశానికి రావడానికి నాకు వీసా వచ్చింది. హైదరాబాద్లో జరిగే భారత్ సమ్మిట్ సదస్సులో పాల్గొనడానికి నేను ఈ రోజు(11-11-2026)రాత్రికి ఓస్లో నుండి బయలుదేరాల్సి ఉంది. పత్రికా స్వేచ్ఛ, మీడియా భవిష్యత్తు అనే అంశాలపై మాట్లాడటానికి నన్ను ముఖ్య అతిథిగా, వక్తగా ఆహ్వానించారు. కానీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో ‘పై నుండి వచ్చిన ఆదేశాల’ వల్ల నా వీసాను రద్దు చేశారు. దీనిపై పునరాలోచించాలి. బంతి మీ కోర్టులో ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి నా సందేశం ఇదే.” — అని హెల్లె లింగ్ నవంబర్ 11, 2026న సోషల్ మీడియా (X/ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
“భారత ప్రధాని నరేంద్ర మోదీ నా ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు, ఆయన సమాధానం చెబుతారని నేను కూడా ఆశించలేదు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో నార్వే దేశం మొదటి స్థానంలో ఉంటే, భారతదేశం 157వ స్థానంలో ఉండి పాలస్తీనా, ఎమిరేట్స్, క్యూబా దేశాలతో పోటీ పడుతోంది. మనం కలిసి పనిచేసే ప్రభుత్వాలను, అధికారులను ప్రశ్నించడం విలేకరులుగా మా బాధ్యత.” — అని హెల్లె లింగ్ మే 18, 2026న పోస్ట్ చేశారు.
3 నిమిషాల 21 సెకన్ల రీల్ ను ఆమె విడుదల చేశారు. అందులో “ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఇది వినండి. వినడం ఇష్టం లేకపోతే స్క్రోల్ చేయండి. అందుకు నేను బాధపడను. అమిత షా గారు దీన్ని విన్నారా లేక ఎవరైనా చెప్పారా అనేది నిర్ధారణ కాలేదు. కానీ ప్రపంచం అంతా వింటున్నది, చూస్తున్నది” అని చెపారు.
వాస్తవంగా భారత్ సమ్మిట్ లో పాల్గొనే విదేశీయులందరికి నార్వే జర్నలిస్ట్ హెల్లె లింక్ తో సహా భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల శాఖ వీసాలు మంజూరు చేసింది. అయితే ఆమె బయలుదేరాడానికి కొద్ది గంటల ముందు ఆమె విసాను రద్దు చేసినట్లు సమాచారం అందింది. ఆమె భారత దేశానికి రావడం ఇదే మొదటి సారి.
వార్తలోని పూర్తి వివరాలు:
హైదరాబాద్లో జరగనున్న భారత్ సమ్మిట్ సదస్సుకు హాజరుకావడానికి ఆహ్వానం అందుకున్న నార్వే విలేకరి హెల్లె లింగ్ భారతదేశానికి రాకుండా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. ఈ సదస్సులో ‘వాక్ స్వాతంత్ర్యం’ (మాట్లాడే స్వేచ్ఛ) గురించి ప్రసంగించడానికి ఆమెను ఆహ్వానించారు.
అప్పట్లో ప్రధాని మోదీ నార్వే పర్యటనకు వెళ్ళినప్పుడు, ఆయన పత్రికా సమావేశంలో ప్రశ్నలు అడగడానికి ప్రయత్నించినందుకు ఇబ్బంది పడ్డ భారత రాయబార కార్యాలయం, అదే రోజు సాయంత్రం ‘ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి’ మీడియాను ఆహ్వానించింది. అయితే, ఆ సమావేశంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఒకరు నార్వే మీడియాకు భారతదేశ గతం, వారసత్వం గురించి సుదీర్ఘంగా పాఠాలు చెప్పడంతో ఆ పరిస్థితి కాస్తా మరింత దిగజారింది.
తాజాగా విడుదల చేసిన వీడియో చివరలో ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశించి, “మిస్టర్ షా, ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది” అని అన్నారు. ఆ వీడియోను ముగిస్తూ, “మనం దీనిని పరిష్కరించుకోగలం. దీన్ని సాధ్యం చేద్దాం” అని ఆమె ఎంతో ఆవేదనతో విజ్ఞప్తి చేశారు.
“పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశాలపై చర్చించడానికి హైదరాబాద్లో జరిగే భారత్ సమ్మిట్లో పాల్గొనేందుకు ఈ నార్వే విలేకరి భారతదేశానికి వస్తారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికైనా తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసి, సదస్సులో పాల్గొనడానికి అనుమతించవచ్చని” ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
అసలు తనను భారతదేశంలోకి రాకుండా ఎందుకు నిషేధించారని ఆమె హోంమంత్రిని పలు ప్రశ్నలు సంధించారు. ప్రధాని మోదీని ప్రశ్నించే ధైర్యం చేసినందుకే నా రాకను అడ్డుకుంటున్నారా? నా రచనల్లో భారత ప్రభుత్వాన్ని విమర్శించినందుకా? నరేంద్ర మోదీని, ఆయన విధానాలను విమర్శించినందుకా? అదానీ-అంబానీల సంబంధాలను, ప్రభుత్వంపై వారికి ఉన్న గట్టి పట్టును విమర్శించినందుకా? లేకపోతే, ‘కాక్రోచ్ జనతా పార్టీ’ గురించి సానుకూలంగా రాసి, నెల రోజుల క్రితం ఆ పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన అభిజీత్ దిప్కేను ఇంటర్వ్యూ చేసినందుకా? అని ఆమె ప్రశ్నించారు.
ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి, ఇతర సోషల్ మీడియా వేదికలలో కూడా పంచుకున్న ఈ వీడియో గత 12 గంటల్లో బాగా వైరల్ అయింది. 12 లక్షల మంది చూశారు. దీనికి పెద్ద ఎత్తున ప్రజల నుండి స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఇదొక అనవసరమైన, మరో అవమానకరమైన సంఘటన.
ఇవి కూడా చదవండి: నువ్వు ఎవరు?
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
