2026 నవంబరు 1న బల్గేరియాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల రెండో విడత పోలింగ్ యూరప్ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ ఎన్నిక ఒక దేశాధ్యక్షుడిని ఎన్నుకోవడానికి జరిగిన ప్రక్రియ మాత్రమే కాదు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, యూరోపియన్ యూనియన్‌తో సంబంధాలు, నాటో భద్రతా విధానం, అవినీతి ఆరోపణలు, రాజకీయ అస్థిరత, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి వంటి అనేక అంశాలు ఈ ఎన్నికలో ప్రతిబింబించాయి.
ఈ ఎన్నికల్లో ఇలియానా యొటోవా(సెంటర్ లెఫ్ట్) విజయం సాధించారు. ఆమె బల్గేరియా చరిత్రలో ప్రజల ఓట్ల ద్వారా ఎన్నికైన తొలి మహిళా అధ్యక్షురాలిగా గుర్తింపు పొందారు.
అయితే ఈ విజయాన్ని కేవలం వ్యక్తిగత రాజకీయ విజయంగా చూడకుండా, బల్గేరియా దేశంలోని రాజకీయ విభజనలు, విదేశాంగ విధానంపై భిన్నాభిప్రాయాలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అంశాల నేపథ్యంలో పరిశీలించాలి.
ముఖ్యంగా ఈ ఎన్నికకు ముందు, 2026 ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో రుమెన్ రాదేవ్ నాయకత్వంలోని ప్రోగ్రెసివ్ బల్గేరియా పార్టీకి(సెంటర్ లెఫ్ట్) స్పష్టమైన మెజారిటీ వచ్చింది. ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడాన్ని కూడా తాజా అధ్యక్ష ఎన్నికల రాజకీయ కోణంలో చూడాలి.
బల్గేరియా దేశ రాజకీయ నేపథ్యం
బల్గేరియా ఆగ్నేయ యూరప్‌లోని బాల్కన్ ప్రాంతంలో ఉన్న దేశం. రాజధాని సోఫియా. జనాభా: సుమారు 65 లక్షలు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ. యూరోపియన్ యూనియన్ సభ్యత్వం 2007 నుంచి. నాటో సభ్యత్వం 2004 నుంచి. యూరో కరెన్సీ అమలు 2026 జనవరి 1 నుంచి.
బల్గేరియా ఒకప్పుడు సోవియట్ యూనియన్ ప్రభావంలోని సోషలిస్ట్ దేశంగా ఉండేది. 1989లో సోషలిస్ట్ వ్యవస్థ పతనం తర్వాత బహుళ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థగా మారింది. 1990ల నుంచి మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, ప్రైవేటీకరణ, యూరప్‌తో ఆర్థిక సంబంధాల విస్తరణ దిశగా ప్రయాణించింది. అయితే రాజకీయ ప్రజాస్వామ్యం ఏర్పడినప్పటికీ అవినీతి, రాజకీయ నాయకులపై ప్రజల అసంతృప్తి, ప్రభుత్వాల అస్థిరత వంటి సమస్యలు బల్గేరియాను వెంటాడాయి.
2021 నుంచి రాజకీయ అస్థిరత
2021 ఏప్రిల్ నుంచి 2026 ఏప్రిల్ వరకు బల్గేరియాలో ఎనిమిది పార్లమెంటరీ ఎన్నికలు జరిగాయి. ఐదేళ్లలో ఇన్ని ఎన్నికలు జరగడం ఆ దేశ రాజకీయాల్లో ఉన్న అస్థిరతకు నిదర్శనం.
ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడం, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడి కూలిపోవడం, పార్టీల మధ్య పరస్పర విభేదాలు ఈ పరిస్థితికి కారణమయ్యాయి.
యూరప్ కౌన్సిల్ పార్లమెంటరీ అసెంబ్లీ(PACE) ఎన్నికల పరిశీలన నివేదిక ప్రకారం, 2020 నుంచి అవినీతి, ప్రభుత్వ వ్యవస్థలపై ప్రభావం చూపుతున్న శక్తిమంతమైన ప్రయోజన వర్గాలు, రాజకీయ పరిరక్షణ వ్యవస్థలు, బాధ్యతాయుత పాలన లోపం వంటి అంశాలు ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి.
2025 ప్రజా ఉద్యమాలు – ప్రభుత్వ పతనం
2025 చివరలో బల్గేరియాలో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరిగాయి. ప్రారంభంలో ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనలపై అసంతృప్తి వ్యక్తమైంది.
సామాజిక భద్రతా చందాల పెంపు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు సంబంధించిన ప్రతిపాదనలు నిరసనలకు కారణమయ్యాయి. క్రమంగా ఈ ఉద్యమం కేవలం బడ్జెట్ వ్యతిరేక నిరసనగా కాకుండా విస్తృత రాజకీయ ఉద్యమంగా మారింది.
ప్రధానంగా ముందుకొచ్చిన అంశాలు: 1) ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు. 2) రాజకీయ నాయకులు, సంపన్న ప్రయోజన వర్గాల మధ్య సంబంధాలు (క్విడ్ ప్రో కో). 3) న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ప్రశ్నలు. 4) నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల. 5) ప్రభుత్వ ఖర్చుల్లో పారదర్శకత లోపం. 6) రాజకీయ పార్టీలపై ప్రజల విశ్వాసం తగ్గిపోవడం.
సోఫియా, ప్లొవ్దివ్, వార్నా, రూసే తదితర ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. యువత పెద్ద సంఖ్యలో ఈ నిరసనల్లో పాల్గొనడం ఈ ఉద్యమంలో ఒక ముఖ్యమైన పరిణామం. ఈ నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం 2025 డిసెంబరులో రాజీనామా చేసింది. తదనంతర రాజకీయ పరిణామాలు ముందస్తు పార్లమెంటరీ ఎన్నికలకు దారితీశాయి.
2026 ఏప్రిల్ 19 పార్లమెంటరీ ఎన్నికలు
2026 ఏప్రిల్ 19న బల్గేరియాలో పార్లమెంటరీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు రుమెన్ రాదేవ్ నాయకత్వంలోని ప్రోగ్రెసివ్ బల్గేరియా కూటమి ప్రధాన రాజకీయ శక్తిగా అవతరించింది.
240 స్థానాలున్న పార్లమెంటులో 131 స్థానాలు సాధించింది. ఈ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ 51.11 శాతం. ప్రోగ్రెసివ్ బల్గేరియా ఒక్కటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే మెజారిటీ సాధించింది. 2026 మే 8న రుమెన్ రాదేవ్ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనేక సంవత్సరాల తర్వాత బల్గేరియాలో ఒకే పార్టీ ఆధారంగా ప్రభుత్వం ఏర్పడింది.
ఈ ఫలితాల రాజకీయ ప్రాధాన్యం
రాదేవ్ విజయానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి. 1) మార్పు కోసం ప్రజల ఆకాంక్ష – వరుసగా ప్రభుత్వాలు మారడం, అవినీతి ఆరోపణలు, రాజకీయ అనిశ్చితి ప్రజల్లో ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం ఆసక్తిని పెంచాయి. 2) ఆర్థిక సమస్యలు – ధరల పెరుగుదల, జీవన వ్యయం, యూరో కరెన్సీ అమలుతో సంబంధం ఉన్న ఆర్థిక ఆందోళనలు ఎన్నికల ప్రచారంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 3) విదేశాంగ విధానం – రష్యాతో సంబంధాలు, ఉక్రెయిన్ యుద్ధం, యూరోపియన్ యూనియన్ విధానాలు, రక్షణ సహకారం వంటి అంశాలు రాజకీయ చర్చలో ప్రధానంగా నిలిచాయి.
అవినీతి నిరోధిస్తానని, సంపన్న ప్రయోజన వర్గాల ప్రభావాన్ని తగ్గిస్తానని, ధరలను నియంత్రిస్తానని, పాలనలో స్థిరత్వం సాధిస్తానని రాదేవ్ తన ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వాగ్దానం చేశారు.
నవంబరు 1 అధ్యక్ష ఎన్నికలు
2026 నవంబరు 1న బల్గేరియాలో అధ్యక్ష ఎన్నికల రెండో విడత పోలింగ్ జరిగింది. ఈ ఎన్నిక ప్రధానంగా రెండు కూటముల అభ్యర్థుల మధ్య పోటీగా జరిగింది.
1) ఇలియానా యొటోవా అధ్యక్ష అభ్యర్థి. కిరిల్ వల్చెవ్ ఉపాధ్యక్ష అభ్యర్థి. వీరిరువురూ ప్రధానమంత్రి రుమెన్ రాదేవ్కు (బల్గేరియా ప్రోగ్రెసివ్ పార్టీ) రాజకీయంగా సన్నిహితులు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి దౌత్యపరమైన పరిష్కారం అవసరమని అభిప్రాయపడిన నాయకత్వం.
2. ఆండ్రే గ్యూరోవ్ (మాజీ తాత్కాలిక ప్రధానమంత్రి) అధ్యక్ష అభ్యర్థి. జార్జి కందేవ్ (మాజీ అంతర్గత వ్యవహారాల శాఖ ఉన్నతాధికారి) ఉపాధ్యక్ష అభ్యర్థి. వీరు పాశ్చాత్య అనుకూల, సంస్కరణవాద ప్రతిపక్ష పార్టీల మద్దతు పొందిన అభ్యర్థుల బృందం. ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడాన్ని గ్యూరోవ్ గతంలో బలపరిచారు.
ఈ విధంగా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానమైన రాజకీయ విభజన రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పట్ల, యూరప్‌తో సంబంధాల పట్ల ఉన్న భిన్న దృక్పథాల మధ్య జరిగింది.
ఎన్నికల ఫలితాలు
బల్గేరియా కేంద్ర ఎన్నికల సంఘం నవంబరు 3న తుది ఫలితాలను ప్రకటించింది. ఇలియానా యొటోవా – కిరిల్ వల్చెవ్ 57.566 శాతం ఓట్లతో నెగ్గారు. ప్రత్యర్థులు ఆండ్రే గ్యూరోవ్ – జార్జి కందేవ్లకు 39.483 శాతం ఓట్లు వచ్చాయి. ఓటింగ్ శాతం: 28.67. ఇలియానా యొటోవా, కిరిల్ వల్చెవ్ ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఈ విజయంతో ఇలియానా యొటోవా బల్గేరియా చరిత్రలో ప్రజల ప్రత్యక్ష ఓటుతో ఎన్నికైన తొలి మహిళా అధ్యక్షురాలిగా నిలిచారు. అయితే ఆమెకు వచ్చిన 57.566 శాతం అనేది పోలైన ఓట్లలో వాటా. మొత్తం అర్హులైన ఓటర్లలో ఆమెకు లభించిన ఓట్ల శాతం ఇంకా తక్కువ.
ఓటింగ్ శాతం ఇంత తక్కువగా ఎందుకు ఉంది?
ఈ ఎన్నికలో అత్యంత కీలకమైన అంశం ప్రజల భాగస్వామ్యం. రెండో విడతలో 28.67 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. అంటే అర్హులైన ఓటర్లలో దాదాపు 71 శాతం మంది ఓటు వేయలేదు. మొదటి విడత అక్టోబరు 25న జరిగినప్పుడు ఓటింగ్ శాతం కేవలం 22.98 మాత్రమే. రెండో విడతలో కొంత పెరిగినా అది తక్కువ స్థాయిలోనే ఉంది.
ఇంత తక్కువ ఓటింగ్‌కు వరుస ఎన్నికలతో ప్రజలు విసిగిపోయారా? రాజకీయ పార్టీలపై విశ్వాసం తగ్గిందా? ఎన్నికల్లో గెలిచే నాయకత్వం తమ జీవితాల్లో మార్పు తీసుకురాగలదనే నమ్మకం ప్రజల్లో సన్నగిల్లిందా?
రష్యా అనుకూల, పాశ్చాత్య అనుకూల రాజకీయ శిబిరాల మధ్య పోటీ ప్రజల ఆర్థిక సమస్యలను వెనక్కి నెట్టిందా? రాజకీయ వ్యవస్థపై నిరసన వ్యక్తం చేయడానికి ఓటింగ్‌కు దూరంగా ఉండటాన్ని కొందరు ఎంచుకున్నారా? అనేవి పరిశీలించాల్సిన అంశాలు.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం – ఎన్నికలపై ప్రభావం
బల్గేరియా ఎన్నికల్లో అంతర్జాతీయ రాజకీయాల ప్రభావాన్ని అర్థం చేసుకోవాలంటే దాని భౌగోళిక, చారిత్రక నేపథ్యాన్ని పరిశీలించాలి.
బల్గేరియా నల్ల సముద్ర తీరంలో ఉంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి వ్యూహాత్మక ప్రాధాన్యం పెరిగింది. బల్గేరియా ఒకవైపు నాటో సభ్యదేశం. మరోవైపు రష్యాతో చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు కలిగి ఉంది. ఈ రెండు అంశాల మధ్య సమతుల్యత సాధించడం అక్కడి రాజకీయ నాయకత్వానికి సవాలుగా మారింది.
ఇలియానా యొటోవా వైఖరి
రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని ఆమె అభిప్రాయపడుతున్నారు. యుద్ధాన్ని ముగించడానికి దౌత్యపరమైన మార్గాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఆమెకు రాజకీయంగా సన్నిహితుడైన రుమెన్ రాదేవ్ కూడా ఉక్రెయిన్ యుద్ధంలో దౌత్యపరమైన పరిష్కారాన్ని సమర్థించారు.
ఆండ్రే గ్యూరోవ్ వైఖరి
ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడంలో ఆయనకు స్పష్టమైన వైఖరి ఉంది. పాశ్చాత్య దేశాలతో మరింత సన్నిహిత సంబంధాలను సమర్థించారు.
తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఉక్రెయిన్‌తో భద్రతా సహకార ఒప్పందంపై సంతకం చేశారు. ఈ రెండు వైఖరుల మధ్య వ్యత్యాసం ఎన్నికల్లో ప్రధాన చర్చనీయాంశమైంది.
నల్ల సముద్రంలో డ్రోన్ దాడులు
ఎన్నికలకు ముందు నల్ల సముద్ర తీరంలో వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో కనీసం 24 మంది నావికులు మరణించినట్లు రాయిటర్స్ సంస్థ పేర్కొంది. ఈ ఘటనలు బల్గేరియా భద్రత, నాటో పాత్ర, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై ఆందోళనలను పెంచాయి.
బల్గేరియా తన విదేశాంగ విధానంలో ఏ దిశగా ప్రయాణించాలి అనేది కూడా ఒక ముఖ్యమైన అంశంగా ముందుకొచ్చింది.
నాటో, యూరోపియన్ యూనియన్‌తో భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేయాలా? రష్యాతో దౌత్య సంబంధాలను మెరుగుపరచాలా? ఉక్రెయిన్‌కు సైనిక సహకారాన్ని కొనసాగించాలా?
యుద్ధాన్ని ముగించేందుకు చర్చలకు ప్రాధాన్యమివ్వాలా? ఈ ప్రశ్నలు కేవలం బల్గేరియాకు సంబంధించినవి మాత్రమే కావు. యూరప్ మొత్తం ఎదుర్కొంటున్న సమస్యలతో ముడిపడి ఉన్నాయి.
అవినీతి, ఓట్ల కొనుగోలు, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు
ఈ ఎన్నికల్లో మరో ముఖ్యమైన అంశం ఎన్నికల పారదర్శకత. యూరప్ కౌన్సిల్ పార్లమెంటరీ అసెంబ్లీ నివేదికలో బల్గేరియా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కొన్ని తీవ్రమైన సమస్యలను ప్రస్తావించారు.
ఓట్ల కొనుగోలు ఆరోపణలు. ఓటర్లపై ఒత్తిడి. నియంత్రిత ఓటింగ్. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం దుర్వినియోగం అయ్యే అవకాశం. సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత సమస్యలు.
2026 ఏప్రిల్ పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా ఓట్ల కొనుగోలుకు సంబంధించిన పోలీసు చర్యల్లో సుమారు 10 లక్షల యూరోలు స్వాధీనం చేసుకున్నట్లు నివేదిక పేర్కొంది.
మీడియా పాత్ర
బల్గేరియాలో టెలివిజన్, రేడియో, పత్రికలు, ఆన్లైన్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారం జరిగింది. అయితే కొన్ని ప్రధాన మీడియా సంస్థల వద్ద అధిక కేంద్రీకరణ, మీడియాపై ప్రజల్లో తక్కువ విశ్వాసం, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం వంటి సమస్యలను అంతర్జాతీయ పరిశీలకులు గుర్తించారు. ఇది ఆధునిక ప్రజాస్వామ్యానికి సంబంధించిన విస్తృతమైన సమస్య. ప్రజలకు సమాచారం అందుబాటులో ఉండటం మాత్రమే కాదు, ఆ సమాచారం నమ్మదగినదా కాదా అన్నది కూడా ముఖ్యమైన అంశం.
యూరో కరెన్సీ – ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
2026 జనవరి 1 నుంచి బల్గేరియా యూరో కరెన్సీని అధికారికంగా స్వీకరించింది. ఇది ఆ దేశ ఆర్థిక చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు.
యూరో అమలుతో యూరోపియన్ దేశాలతో వ్యాపార లావాదేవీలు సులభతరం అవుతాయి. కరెన్సీ మార్పిడి ఖర్చులు తగ్గుతాయి. విదేశీ పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం, యూరోపియన్ ఆర్థిక వ్యవస్థతో మరింత అనుసంధానం, అంతర్జాతీయ వ్యాపారంలో ఆర్థిక స్థిరత్వానికి తోడ్పాటు ఉంటాయని ఆశించారు.
అయితే యూరో అమలుపై ప్రజల్లో కొన్ని ఆందోళనలు కూడా ఉన్నాయి. వస్తువుల ధరలు పెరుగుతాయా? సామాన్య ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుందా? పెన్షన్లు, వేతనాలు, పొదుపులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? చిన్న వ్యాపారాలు కొత్త కరెన్సీ వ్యవస్థకు ఎలా సర్దుబాటు అవుతాయి?
యూరో స్వీకరణ వల్ల ఈ సమస్యలన్నీ ఆటోమేటిక్‌గా పరిష్కారమవుతాయని చెప్పలేం. ద్రవ్యోల్బణం, వేతనాల పెరుగుదల, ఉత్పాదకత, ప్రభుత్వ ఆర్థిక విధానాలు కూడా కీలకం.
రాదేవ్ ప్రభుత్వం ఎన్నికల్లో ధరల నియంత్రణ, ప్రజల జీవన వ్యయాన్ని తగ్గించడం వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది. కాబట్టి యూరో అమలు తర్వాత సామాన్య ప్రజల జీవన ప్రమాణాల్లో వచ్చిన మార్పులను అంచనా వేయడం కొత్త ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన పరీక్ష.
మహిళా నాయకత్వం – చారిత్రక ప్రాధాన్యం
ఇలియానా యొటోవా ఎన్నిక బల్గేరియా రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన పరిణామం. ఆమె వయసు 61 సంవత్సరాలు. గతంలో యూరోపియన్ పార్లమెంట్ సభ్యురాలిగా వ్యవహరించారు. 2017 నుంచి రుమెన్ రాదేవ్‌తో కలిసి ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు.
2026 జనవరిలో రాదేవ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ఆమె తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ప్రజల ప్రత్యక్ష ఓటుతో అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
2026 పార్లమెంటరీ ఎన్నికల్లో మహిళా అభ్యర్థుల వాటా సుమారు 30 శాతంగా, ఎన్నికలకు ముందు పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం 28.75 శాతంగా ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. అందువల్ల మహిళలకు రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించడం ఇంకా కొనసాగాల్సిన అంశం.
అధ్యక్ష పదవికి ఉన్న అధికారాలు – ఈ విజయం ఎంతవరకు ప్రభావం చూపుతుంది?
బల్గేరియా పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రధానమంత్రి, పార్లమెంటుకు ప్రభుత్వ నిర్వహణలో అత్యధిక అధికారాలు ఉంటాయి. అధ్యక్షుడి బాధ్యతలు ప్రధానంగా దేశాధినేతగా వ్యవహరించడం. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించడం. చట్టాలపై రాజ్యాంగబద్ధమైన పాత్ర నిర్వహించడం. కొన్ని సందర్భాల్లో వీటో అధికారాన్ని ఉపయోగించడం. ప్రభుత్వ ఏర్పాటు సంక్లిష్టమైనప్పుడు రాజ్యాంగ ప్రక్రియలో పాత్ర పోషించడం.
సాయుధ దళాలకు సంబంధించిన రాజ్యాంగబద్ధమైన బాధ్యతలు నిర్వహించడం. అందువల్ల యొటోవా ఎన్నికతో బల్గేరియా విదేశాంగ విధానం ఒక్కసారిగా మారిపోతుందని భావించడానికి వీలులేదు.
అయితే ఆమె ప్రధానమంత్రి రుమెన్ రాదేవ్కు రాజకీయంగా సన్నిహితురాలు కావడం వల్ల అధ్యక్ష భవనం, ప్రభుత్వ నాయకత్వం మధ్య విధానపరమైన సమన్వయం పెరిగే అవకాశం ఉంది.
అదే సమయంలో అధ్యక్ష పదవికి ఉన్న రాజ్యాంగబద్ధమైన స్వతంత్రత, పార్లమెంటరీ పర్యవేక్షణ, ప్రతిపక్షాల పాత్ర కొనసాగడం ప్రజాస్వామ్యానికి అవసరం.
2026 బల్గేరియా ఎన్నికలు ఒక దేశంలో నాయకత్వ మార్పుకు సంబంధించిన సాధారణ రాజకీయ సంఘటన మాత్రమే కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ స్థిరత్వం, అవినీతి నిరోధం, ఆర్థిక సమానత్వం, విదేశాంగ విధానం, ప్రజల విశ్వాసం వంటి అంశాలు ఎంత ముఖ్యమైనవో ఈ ఎన్నికలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.
ఒకవైపు ఏప్రిల్ పార్లమెంటరీ ఎన్నికల్లో రుమెన్ రాదేవ్ నాయకత్వంలోని ప్రోగ్రెసివ్ బల్గేరియా స్పష్టమైన మెజారిటీ సాధించింది.
మరోవైపు నవంబరు అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు సన్నిహితురాలైన ఇలియానా యొటోవా గెలుపొందారు. దీంతో దేశంలోని రెండు కీలక రాజ్యాంగ వ్యవస్థల్లోనూ ఒకే రాజకీయ దృక్పథానికి అనుకూలమైన నాయకత్వం ఏర్పడింది.
కానీ అసలు పరీక్ష ఇప్పుడు ప్రారంభమైంది. ప్రజలు కోరుకున్న అవినీతి రహిత పాలన అందుతుందా? సామాన్య ప్రజల జీవన వ్యయం తగ్గుతుందా? ఉపాధి అవకాశాలు పెరుగుతాయా?
న్యాయవ్యవస్థ స్వతంత్రత బలపడుతుందా? యూరోపియన్ యూనియన్, నాటో సభ్యత్వ బాధ్యతలను కొనసాగిస్తూనే విదేశాంగ విధానంలో సమతుల్యత సాధించగలదా? ఈ ప్రశ్నలకు రాబోయే సంవత్సరాల్లో లభించే సమాధానాలే బల్గేరియా రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక ముఖ్యమైన సాధనం మాత్రమే. ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారి హక్కులను పరిరక్షించడం, ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడం ద్వారానే తన పాలనకు విశ్వసనీయతను సంపాదించుకోగలదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
