భారతదేశంలో బ్రిటిష్ పాలన ముగిసే సమయానికి ఈ గొప్ప చరిత్రకారిణి యుక్తవయస్సుకు వచ్చారు. ప్రస్తుతం 94 ఏళ్ల వయసులో కూడా భారతదేశ గతంలోని బహుళత్వాన్ని, అసమ్మతిని పూర్వపక్షం చేయాలని నిశ్చయించుకున్న ఒక ప్రభుత్వ పాలనను ఆమె ఎదిరిస్తూనే ఉన్నారు.
మేము మొదటిసారి కలుసుకున్న రోజు, రోమిలా థాపర్ తనకు వ్యక్తిగతంగా జరిగిన నష్టాన్ని తలుచుకుంటూ- ఆ తలపులలో గడుపుతూ ఉన్నారు.
ఆమె మేనల్లుడు వాల్మిక్ థాపర్ మరణించి అప్పటికి రెండు వారాలు కూడా కాలేదు.
ఆయన వన్యప్రాణి సంరక్షకుడు, భారతదేశపు పులుల రక్షణ ప్రచారంలో దశాబ్దాల పాటు ప్రముఖ పాత్ర పోషించారు.
ఆమె కంటే ఆయన 20 ఏళ్లు చిన్నవాడు. ఆమె బాధలో మునిగిపోయి ఉన్నారని నేను చెప్పగలను, కానీ ఆ బాధ ఆమె ముఖంలో పైకి కనిపించడం లేదు.
వాల్మిక్ గురించి నాకు చెబుతున్నప్పుడు, ఒక దీర్ఘకాలిక మేధోజీవిగా బహుశా దుఃఖానికి కొత్తకాని వ్యక్తిగా ఆ స్వరం స్థిరంగా సాగింది.
చాలా మంది కంటే ఎక్కువ కాలం జీవించడం అంటే ఎక్కువ మంది ఆత్మీయులను కోల్పోవడం కూడా. నవంబర్‌లో రోమిలా థాపర్‌కు 94 ఏళ్లు నిండాయి.
ఆమె ప్రతిసారీ నన్ను రిసీవ్ చేసుకున్నట్లే, ఆ రోజు కూడా ఒక చక్కని కుర్తా ధరించి, రెండు చేతుల వేళ్లకు వెండి, మేలిమి రత్నాలు పొదిగి ఉన్న పెద్ద ఉంగరాలను పెట్టుకుని నన్ను ఆహ్వానించారు.
మేము దక్షిణ ఢిల్లీలోని ఆమె నివాసంలో ఉన్న లివింగ్ రూమ్‌లో కూర్చున్నాము, అది నేరుగా ఆమె స్టడీ రూమ్‌లోకి దారి తీస్తుంది.
ఒక చరిత్రకారిణి ఇంటి నిశ్శబ్ద వాతావరణంలో, థాపర్ ఒక ప్రకాశవంతమైన ఎరుపు రంగు కుర్చీలో కూర్చున్నారు. నేల నుంచి పైకప్పు వరకు గోడల నిండా పుస్తకాలు అమర్చబడి ఉన్నాయి.
వాటి మధ్య దేవాలయ శిల్పాల ముక్కలు, పురాతన చెక్క వస్తువులు, కంబోడియా కుడ్యచిత్రం నమూనా, రంగులు వెలిసిపోతున్న ఒక జైన ఖగోళ చార్ట్ ప్రింట్ ఉన్నాయి.
ఆమె మేనల్లుడు తన 20 ఏళ్ల వయసులో విడాకులు తీసుకుని, ఏం చేయాలో తోచక కొంతకాలం దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆమె నాతో చెప్పారు.
“అప్పటికి అతను ఇంకా పులులను (తన జీవిత ఆశయాన్ని) కనుగొనలేదు” అన్నారామె.
వాల్మిక్ తరచూ తన అత్తను కలవడానికి వచ్చేవారు, అలా వారిద్దరూ మాట్లాడుకోవడం ఒక అలవాటుగా మారింది. ఆమె అతని పట్ల సానుభూతితో ఉండేవారు.
ప్రాచీన ప్రపంచ చరిత్రలో భారతదేశపు అత్యంత అగ్రగణ్యురాలైన చరిత్రకారిణిగా, ఏ రంగంలోనైనా దేశంలోనే అత్యంత ప్రసిద్ధ విద్యావేత్తగా ఎదగడానికి ముందు— తన యవ్వనంలో కూడా రోమిలా థాపర్ గందరగోళానికి, ఆందోళనకు గురయ్యారు.
ఆ విధంగా మేనల్లుడు, అత్త ఒకరికొకరు మరింత దగ్గరయ్యారు. ఆమెకు తన మనసులోని విషయాలను పంచుకోదగిన వ్యక్తిగా వాల్మిక్ మారారు.
“వాడు పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు. రానురానూ వాడు నా కొడుకులా అనిపించాడు. ఇప్పుడు నాకు ఆ బంధం తెగిపోయినట్టుగా అనిపిస్తోంది” అన్నారామె.
“అతను మరణించడం వల్లేనా?”
“అవును.”
స్వాతంత్ర్య వేకువజామున – ఒక చరిత్రకారిణి అంతర్మథనం..
మార్పు, కొనసాగింపు అనేవి చరిత్రకారులు గతాన్ని అర్థం చేసుకోవడానికి, వివరించడానికి ఉపయోగించే పరస్పర విరుద్ధమైన మార్గాలు.
థాపర్ జీవితాన్ని గురించి ఆలోచించేటప్పుడు కూడా ఇవే పదాలను ఉపయోగించడం సముచితంగా అనిపిస్తుంది.
నా వయసు ఉన్న వారికి, మాకు తెలిసినప్పటి నుంచి రోమిలా థాపర్ ఒక నక్షత్రంలా మెరిసే చరిత్రకారిణి.
జవహర్లాల్ నెహ్రూ నుంచి నరేంద్ర మోదీ వరకు భారతదేశంలోని ప్రతి ప్రధానమంత్రి హయాంలోనూ ఆమె బోధనా వృత్తిలోనే ఉన్నారు. పుస్తకాలను ప్రచురించారు.
ఆమె రాసిన చరిత్రలలోనే కాకుండా, ఆమె జ్ఞాపకాలలో కూడా సుదీర్ఘ కాల చక్రాలు కనిపిస్తాయి.
ఒక పండితురాలిగా ఆమె పరిశోధించే సమస్యలలోనే కాకుండా, తన జీవితంలో ఆమె ఎదుర్కొనే సవాళ్లలో కూడా గతం చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది.
భారతదేశంలో బ్రిటిష్ పాలన ముగిసే నాటి ఒక శకంలో ఆమె యుక్తవయస్సుకు వచ్చారు.
ఒక మహిళగా, ఒక విద్వన్మణిగా ఆమె సాంప్రదాయాలను, పాత పద్ధతులను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారు.
తన స్వేచ్ఛను ఉత్తమంగా ఎలా ఉపయోగించుకోవాలో అన్వేషణలో ఉన్న దేశంలో, ఆమె కూడా తన స్వేచ్ఛకు ఒక సరైన మార్గాన్ని ఎంచుకున్నారు.
ఇప్పుడు ఆమె జీవితం, కెరీర్ చివరి దశలో, మతతత్వ జాతీయవాదం, నియంతృత్వం భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న తరుణంలో, ఆమె మరొక చారిత్రక మార్పుకు సాక్షిగా నిలుస్తున్నారు.
ఈ కొత్త పాలనలో ఆమె ఒక అసమ్మతివాదిగా, అసమ్మతి అధ్యయనపరురాలుగా ఉన్నారు.
అందుకే చాలా మంది భారతీయులు థాపర్‌ను జాతీయ సంపదగా భావిస్తే, మరి కొంత మంది ఆమె మీద ద్రోహి అని ముద్ర వేస్తుంటారు.
ఉపఖండంలో స్వాతంత్ర్యం, దేశ విభజన జరిగిన 1947వ సంవత్సరంలో థాపర్‌కు 15 ఏళ్లు.
ఆమె పూనాలోని కాన్వెంట్ స్కూల్లో చివరి సంవత్సరం చదువుతూ, క్లాస్‌లో ఉత్తమ విద్యార్థిగా ఉన్నారు.
పాఠశాల మైదానంలో యూనియన్ జాక్ (బ్రిటిష్ జెండా)ను దించి, కొత్త (భారత) జెండాను ఎగురవేసే గౌరవం ఆమెకు లభిస్తుందని అలాగే ఆమె 15 నిమిషాల పాటు ప్రసంగించాల్సి ఉంటుందని చెప్పారు. అది ఆమెను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
బ్రిటిష్ రాజ్యం కాని దేశంలో భారతీయుడిగా ఉండటం అంటే ఏమిటి? అనే విషయంపై ఏం మాట్లాడాలో తెలియక అదే పనిగా ఆలోచిస్తూ ఆమె చాలా నిద్ర లేని రాత్రులు గడిపారు.
విభజన గాయాలు – జాతీయ గుర్తింపు అన్వేషణ..
థాపర్ 1931లో పంజాబీ ఖత్రీల ఉన్నత వర్గంలో జన్మించారు, ఆ కుటుంబం బ్రిటిష్ రాజ్యానికి చేసిన సేవలకు గాను గొప్ప గొప్ప పురస్కారాలను అందుకుంది.
ఆమె తండ్రి సైన్యంలో వైద్యుడు, అందువల్ల థాపర్ తన చిన్ననాటి కాలంలో ఎక్కువ భాగం బ్రిటిష్ ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న తిరుగుబాటు ప్రాంతమైన నార్త్-వెస్ట్ ఫ్రంటియర్లో గడిపారు.
వారి ఇల్లు థాల్ అనే కొండ కోటలో ఉండేది. అక్కడ నుంచి ఆమె తండ్రి సమీపంలోని గ్రామాలలో ప్రాక్టీస్ చేయడానికి కారులో వెళ్లేవారు, రోమిలా కూడా వారితో పాటు వెళ్తూ పష్తూన్ మహిళలతో గంటల తరబడి గడుపుతూ, వాళ్ల ఆసక్తుల నుంచి వెండి ఆభరణాలు, ఉంగరాల పట్ల ఇష్టాన్ని పెంచుకున్నారు.
ఆ తర్వాత వారి కుటుంబం కంటోన్మెంట్లకు మారింది: నార్త్-వెస్ట్ ఫ్రంటియర్లోని పెషావర్, రావల్పిండిలో గడిపిన ఆమె ఆ తరువాత ద్వీపకల్ప భారతదేశంలోని పూనాకు వచ్చారు.
రోమిలా ప్రతి శీతాకాలం సెలవులలో క్రమం తప్పకుండా లాహోర్‌లోని తన నానమ్మ వాళ్ల పెద్ద ఇంట్లో బంధువులతో గడపడానికి వెళ్లేవారు. లాహోర్ పంజాబ్ ప్రావిన్స్ రాజధాని. భారతదేశంలోని విభిన్న మతాలు, సాంస్కృతిక వైవిధ్యాల కలయికకు ప్రతీక. ఇది కేవలం 250 మైళ్ల దూరంలో ఉన్న ఢిల్లీకి జంట నగరం లాంటిది.
అయితే 1947లో భారత ఉపఖండం భారతదేశం, పాకిస్తాన్ దేశాలుగా విభజించబడినప్పుడు— ఆ స్వాతంత్య్రానికి దారితీసిన దుర్భర పరిస్థితి వల్ల— ఆమె నానమ్మ ఇల్లు, లాహోర్ నగరం సగం పంజాబ్ భారతదేశం నుంచి వేరు చేయబడ్డాయి.
(యూరోపియన్లు, పర్షియన్లలా భారతీయులకు కూడా బలమైన, వివేకవంతమైన శాస్త్రీయ యుగపు సామ్రాజ్యం ఉండేది.)
ఆ ప్రావిన్స్‌లోని నివాసితులు కొత్త సరిహద్దుల గుండా, వారు కోరుకున్న దేశాల్లోకి భయంతో పారిపోవడంతో ఆ ప్రాంతం ఒక సంవత్సరం పాటు ఘోరమైన హింసతో అట్టుడికిపోయింది; ముస్లింలు పశ్చిమంగా పాకిస్తాన్‌కు, హిందువులు, సిక్కులు తూర్పుగా భారతదేశానికి తరలివెళ్లారు.
ఈ జాతి హత్యాకాండ కొన్ని నెలల ముందే ప్రారంభమైంది.
కానీ 1947 ఆగస్టు నాటికి అది పూర్తిగా నియంత్రణ తప్పింది, ఆ సమయంలోనే యువ రోమిలా రాత్రిపూట నిద్రలేకుండా గడిపారు.
ఇప్పుడు భారతీయుడిగా ఉండటం అంటే ఏమిటి? దానికి సమాధానంగా ఒక సూచన ఆగస్టు 15 ఉదయం ఆమె ఎగురవేయబోయే జెండాపై ముద్రించబడి ఉంది. దాని మధ్యలో ఉన్న గుర్తు ఒక పురావస్తు నమూనా: సారనాథ్ వద్ద ఒక శిథిలమైన స్తంభంపై కనుగొనబడిన చక్రాకారం.
గత వైభవపు గుర్తులు – కెరీర్‌పై తర్జనభర్జనలు..
19వ శతాబ్దంలో కనుగొనబడిన ఈ స్తంభం, అలాంటి ఇతర స్తంభాలపై ఉన్న శాసనాలు ఒక ప్రాచీన సామ్రాజ్యమైన మౌర్యుల జ్ఞాపికను వెలుగులోకి తెచ్చాయి.
క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో ఉపఖండంలోని ఎక్కువ భాగం మౌర్య సామ్రాజ్య పాలకుడైన అశోకుడు అనే తత్వవేత్త వంటి మహారాజు ఆధ్వర్యంలో పాలించబడింది.
అశోకుడు, మౌర్యుల సామ్రాజ్య అన్వేషణ వలసపాలనలో ఉన్న భారతదేశపు ఆత్మగౌరవానికి ఒక లేపనంగా పనిచేసింది. యూరోపియన్లు, పర్షియన్లకు వలె, భారతీయులకు కూడా రోమ్ – గ్రీస్‌లాంటి బలమైన, వివేకవంతమైన శాస్త్రీయ యుగపు సామ్రాజ్యం ఉందని దీని అర్థం.
2,000 సంవత్సరాల నాటి అశోకుని చిహ్నాలు 1950లో, ఆధునిక భారత గణతంత్ర దేశపు అధికారిక చిహ్నాలుగా మారాయి.
చరిత్ర ఆమె కళ్ల ముందే రూపుదిద్దుకుంటోంది. కానీ గణతంత్ర దేశపు ప్రారంభ సంవత్సరాల్లో, చరిత్ర— అందునా ప్రాచీన చరిత్ర— ఒక తెలివైన యువ వ్యక్తికి తగిన సబ్జెక్ట్ కాదని భావించేవారు. దేశం మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల స్థాపనలతో వలసరాజ్యాల వెనుకబాటుతనం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తోంది. జలవిద్యుత్ ఆనకట్టలు “ఆధునిక భారతదేశ దేవాలయాలు” అని నెహ్రూ అన్నారు.
థాపర్ ఒక చురుకైన విద్యార్థిని అయినప్పటికీ, తనేం చేయాలో తెలియక అయోమయస్థితిలో ఉన్నారు.
లెక్కలేనన్ని పుస్తకాలు, ఆమె కెరీర్ జ్ఞాపకాలతో నిండిన తన లివింగ్ రూమ్‌లో కూర్చుని, థాపర్ తన కెరీర్ ప్రారంభంలో పడిన ఇబ్బందులను— తన లక్ష్యాన్ని నిర్ణయించుకోలేక పోయిన ముందు నాటి అమ్మాయిని—గుర్తుచేసుకున్నారు.
“నేను చాలా తర్జనభర్జన పడ్డాను” అన్నారామె. “నేనేం చేయాలి? నేనేం చేయాలి?- ఇదే ప్రశ్న నన్ను వెంటాడుతుంది. మా తల్లిదండ్రులను చూడటానికి వచ్చిన మా నాన్నగారి స్నేహితులను ‘నాకు మీరేం సలహా ఇస్తారు? నేను ఏ సబ్జెక్ట్ చదవాలి?’ అని అడుగుతూ వారిని తెగ విసిగించేదాన్ని.”
(నిస్తేజమైన కంటోన్మెంట్ పట్టణాల్లో పెరిగిన ఒక యువ భారతీయ మహిళకు లండన్‌లోని సంపూర్ణ స్వేచ్ఛ, వినోదం అద్భుతంగా అనిపించాయి.)
లండన్ ప్రయాణం – స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగులు..
థాపర్ ఉన్నత విద్యను అభ్యసిస్తారనేది ఖాయం, కానీ ఏ వృత్తిని లేదా ఏ కెరీర్‌ను ఎంచుకుంటారనేది మాత్రం స్పష్టం కాలేదు. ఆమె తల్లి కాలేజీ గ్రాడ్యుయేట్ అయినప్పటికీ, ఇంటి గడప దాటి వెళ్లి పనిచేయడానికి ఆమెకు అనుమతి లభించలేదు.
రోమిలా అక్కకు పెళ్లయి హోంమేకర్గా ఉన్నారు. ఆమె తండ్రి ఓపికగా ఉండేవారు, కానీ ఆయన ఎప్పుడూ ఒక విషయం స్పష్టంగా చెప్పేవారు: “చివరికి, నువ్వు పెళ్లి చేసుకోవాలి. మేము నీకోసం ఒక భర్తను వెతకాలి. అది మాకు భారంగా మారేలా చూడకు.”
1953లో, థాపర్ లండన్‌కు వెళ్లడం మూలంగా ఈ పోరు నుంచి తప్పించుకున్నారు. అక్కడ బ్రిటన్‌లోని ప్రముఖ ఇండాలజిస్ట్లలో ఒకరైన ఎఎల్ బాషమ్ ఆధ్వర్యంలో స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్‌లో చరిత్ర విభాగంలో చేరారు. ఆయన తరగతులు ఎంత ప్రత్యేకమైనవిగా, తక్కువ మంది విద్యార్థులతో ఉండేవంటే, అవి వ్యక్తిగత ట్యుటోరియల్స్లాగా మారాయి.
క్లాస్రూమ్ వెలుపల ఆమె చేసిన ప్రయాణాలు కూడా అంతే జ్ఞానాన్ని ఇచ్చాయి. నిస్తేజమైన కంటోన్మెంట్ పట్టణాల్లో పెరిగిన ఒక యువ భారతీయ మహిళకు, లండన్‌లోని సంపూర్ణ స్వేచ్ఛ, వినోదం— అద్భుతంగా అనిపించాయి. లండన్ మహానగరపు విభిన్న సంస్కృతుల వాతావరణం తనను “పూర్తిగా మంత్రముగ్ధులను చేసింది” అని థాపర్ తరువాతి కాలంలో రాశారు.
ఆమె స్నేహితులు ఫ్రాన్స్‌లోని ప్రోవెన్స్లో హిచ్‌హైకింగ్ (ఉచితంగా వాహనాలు ఎక్కి ప్రయాణించడం) చేయడానికి ఆమెను ఆహ్వానించారు. వారు రోమన్ శిథిలాలను సందర్శించారు.
హాస్టళ్లలో పడుకున్నారు, అవి తరచుగా పశువుల పాకల కంటే గొప్పగా ఉండేవి కావు, పరుపులుగా పరుచుకోవడానికి గడ్డి వాములు ఉండేవి.
రోడ్లపై, చిన్న కార్లలో ముగ్గురు కూర్చోవడానికి స్థలం తక్కువగా ఉండేది, కాబట్టి వారు “పెద్ద కామియన్స్” (ట్రక్కులు) వైపు చేతులు ఊపి ఆపి, డ్రైవర్లు రాత్రిపూట పడుకునే చెక్క బెంచ్‌పై సర్దుకుని కూర్చునేవారు.
అనువాదం: కె సత్యరంజన్
Psyche వెబ్సైట్ సౌజన్యంతో ఈ వ్యాసాన్ని నాలుగు భాగాలుగా అందిస్తున్నాము. ఇది మొదటి భాగం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
