‘భారతదేశ గతంలో ఎలాంటి అసమ్మతి లేదు అని నమ్మేలా మా తరం విద్యార్థులను పెంచారు’ అని థాపర్ చెప్పారు. ‘అందరూ అందరితో ఏకీభవించారు, అది ఒక కేంద్రం నుంచి తదుపరి కేంద్రానికి సజావుగా సాగిపోయింది.’
ప్రాచ్య దేశాల పండితులు ప్రాచీన భారతదేశాన్ని ఒక ప్రశాంతమైన, నిశ్చలమైన దృశ్యంగా చిత్రీకరించారు.
ఆ ప్రాతిపదికన, జాతీయవాదులు ఎటువంటి అంతర్గత ఘర్షణలు లేని సామరస్యపూర్వకమైన భారతీయ నాగరికతపై తమ స్వంత అభిప్రాయాన్ని నిర్మించుకున్నారు.
‘అసమ్మతి సంప్రదాయం అనేది ఊరటనివ్వడానికి ఉద్దేశించినది కాదు. ఇది అసమ్మతి తెలిపే హక్కుకు ఒక సమర్థన, ఒక మద్దతు.’
మతపరమైన భారతీయ నిర్మాణాలలో– బ్రాహ్మణ-శ్రమణల నుంచి – బహుళత్వం, విభజన, ఘర్షణలపై ఆమె చేసిన అధ్యయనం, ఇస్లాం పూర్వ భారతదేశాన్ని ఒక ప్రశాంతమైన ఏకాభిప్రాయ క్షేత్రంగా భావించే పవిత్ర చిత్రాన్ని పటాపంచలు చేసింది.
‘చరిత్ర రచనలో మతం సామాజిక మూలాలపైనే నేను ఎల్లప్పుడూ దృష్టి పెట్టాను, ఆ కోణం నుంచే భారత దేశ గత చరిత్రను విశ్లేషించాను’ అని చెప్పారామె.
‘అందుకే నేను హిందూ వ్యతిరేకినని నాపై నిందలు వేస్తున్నారు, ఇది తప్పుడు ఆరోపణ ఎందుకంటే నేను హిందూ వ్యతిరేకిని కాదు కానీ నేను మతం మరొక కోణాన్ని చూపిస్తున్నాను, ఇది భక్తులకి నచ్చడం లేదు.’
2023లో, ఆమె ఈ విషయమై ‘వాయిసెస్ ఆఫ్ డిసెంట్’(అసమ్మతి స్వరాలు) అనే చిన్న పుస్తకాన్ని ప్రచురించారు. అయితే దానితో సంతృప్తి చెందలేదు. ‘నేను ఈ అంశం మీద ఇంకా ఎక్కువ సమయం వెచ్చించాల్సిందేమో అనిపించింది’ అన్నారు.
‘మనం ఉద్దేశపూర్వకంగానే అసమ్మతి సంప్రదాయాన్ని విస్మరించామని చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అది చాలా బలమైన సంప్రదాయం.’
ఆమె జీవితంలోని అనేక భాగాలలో అసమ్మతి స్వరం వినిపిస్తుంది: ఒక విద్యాసంబంధ పరిశోధనగా; పబ్లిక్‌లో ఒక వ్యక్తిగత సూత్రంగా, ధోరణిగా; 2014 కంటే ముందు భారతదేశం ఎంత విస్తృతమైన, స్వేచ్ఛా పూరితమైన దేశంగా ఉండేదో గుర్తులేని యువ భారతీయులలో ఆ అలవాటును ప్రోత్సహించడానికి నేను ప్రయత్నిస్తున్నాను.
నేడు ఇది పవిత్రత, విధేయత, క్రమశిక్షణలతో కూడిన ఒక కాల్పనిక గతాన్ని కీర్తించేలా శిక్షణ పొందిన మరింత పెళుసైన సమాజంగా మారుతుంది.
అందుకే అసమ్మతి సంప్రదాయాన్ని సమర్థించడం ఒక అసమ్మతి చర్యే అవుతుంది అని వివరించారామె.
బహుళత్వం, సమానత్వాల పట్ల నిబద్ధత..
ఈ ఉక్కిరిబిక్కిరి చేసే, అణచివేత కాలంలో దీర్ఘ దృష్టి, దృక్పథం ఏమైనా ఊరటనిస్తుందా అని నేను థాపర్‌ని అడిగాను.
‘అసమ్మతి సంప్రదాయం అనేది ఊరటనివ్వడానికి ఉద్దేశించినది కాదు’ అని భావోద్వేగరహిత శైలిలో బదులిచ్చారు.
‘ఇది అసమ్మతి తెలిపే హక్కుకు ఒక సమర్థన, అలా చేయడానికి ఒక మద్దతు, అసమ్మతి తెలియచేయడానికి గల కారణాలను చూపడం’ అని నొక్కి చెప్పారు.
నేను థాపర్ కంటే 50 ఏళ్లు చిన్నవాడిని, నేను కూడా నా జీవితాన్ని భారతదేశంలోనే గడిపాను.
బహుళత్వం, హక్కులు, సామాజిక ప్రజాస్వామ్యంలో గాంధీ-నెహ్రూల ప్రయోగం మా ఇద్దరినీ తీర్చిదిద్దింది, అయితే ఆమె తరం అందులో ఎదిగిన మొదటి తరం, నా తరం బహుశా చివరిది కావచ్చు.
ప్రస్తుతానికి మమ్మల్ని ఒక వైరుధ్యంగా, ఒక గుర్తింపు సంక్షోభంగా, లేదూ ప్రస్తుతం దేశంలో పై చెయ్యిగా నడుస్తున్న భావజాలం ప్రకారం ద్రోహులుగా పరిగణిస్తున్నారు.
థాపర్ బ్రిటిష్ వలస రాజ్యం వాకిట, ఆ రాజ్యపు ఉదారవాద, అంతర్జాతీయ నైతికతలో జన్మించిన భారతీయురాలు.
కానీ ఆమె భారతదేశంలోనే జీవించారు, క్షుణ్ణంగా అధ్యయనం చేశారు, తన జీవిత పర్యంతం దాని సంస్థలలో సేవ చేశారు.
ఒక చరిత్రకారిణిగా, ఆమె హిందూ జాతీయవాదాన్ని, గతానికి సంబంధించిన దాని వక్ర ఆలోచనలను సవాలు చేస్తారు.
ఆమెను ‘హిందూ ద్వేషి’ అని విమర్శించే వాళ్లందరి కన్నా ఆమెకు సంస్కృత ఇతిహాసాలు, వేదాలు, శాస్త్రాలపై గొప్ప పట్టు ఉన్నది.
‘చాలా సంవత్సరాల తర్వాత వలసవాద వ్యతిరేక జాతీయవాద మూలాల నుండి ఉద్భవించిన అసమ్మతిని చూస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది.’
సామాజిక ఉద్యమాలకు మద్దతు, వృద్ధాప్య సవాళ్లు..
ఆమె తన విద్యాసంబంధ అధికారం, ప్రతిష్ఠ, పలుకుబడులను తరచూ బలహీన వర్గాల రక్షణకు వినియోగించారు.
2020 ప్రారంభంలో, ఆమె న్యూఢిల్లీ శివార్లలోని పారిశ్రామిక ప్రాంతమైన షాహీన్ బాగ్‌లోని మహిళల నిరసన శిబిరాన్ని సందర్శించారు.
ఇది భారతదేశ రాజ్యాంగాన్ని, సమగ్రతలను నిలబెట్టుకునేందుకు ఒక పెద్ద, దేశవ్యాప్త ఉద్యమ కేంద్రంగా మారింది.
‘వాయిసెస్ ఆఫ్ డిసెంట్’ ముగింపులో, థాపర్ అక్కడి మహిళల ఆదరానికి, పట్టుదలకు, మతపరమైన వాచకాలను ఆశ్రయించకుండా వారు మాట్లాడిన తీరుకు తాను ఎంతగానో ప్రభావితమయ్యానని రాశారు. షాహీన్ బాగ్ ఉద్యమ అహింసాత్మక నైతికత, మహిళల ప్రధాన భాగస్వామ్యం నన్ను భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో నా స్వంత యవ్వన ప్రాయపు భాగస్వామ్యాన్ని గుర్తుకు తెచ్చింది.
చాలా సంవత్సరాల తర్వాత వలసవాద వ్యతిరేక జాతీయవాద మూలాల నుంచి ఉద్భవించిన అసమ్మతిని చూస్తున్నట్లు నాకు అనిపించింది’ అని రాశారామె.
అయితే, ఆమె సందర్శించిన రెండు వారాల తర్వాత, న్యూఢిల్లీలో జరిగిన ఒక క్రూరమైన, ప్రణాళికాబద్ధమైన అల్లర్ల మూలంగా ఆ ప్రజా ఉద్యమం నిలిచిపోయింది.
2016లో గ్రాడ్యుయేట్ విద్యార్థి ఉమర్ ఖాలిద్‌కు థాపర్ మద్దతుగా నిలిచారు. ఉమర్ ఖాలిద్ సౌమ్యమైన, చురుకైన విద్యార్థి.
ఇతర యువ ముస్లిం నాయకులతో కలిపి అతని మీద ఉపా చట్టం కింద అక్రమ అభియోగాలు మోపి అరెస్టు చేశారు.
2020 సెప్టెంబర్ నుంచి, అతను కనీసం విచారణ కూడా ప్రారంభం కాకుండా జైలులో మగ్గిపోతున్నాడు. ఈ జనవరిలో సుప్రీంకోర్టు బెంచ్ ఖాలిద్ బెయిల్ హక్కును సమర్థించడానికి నిరాకరించింది.
తన కెరీర్, జీవితం ఈ చివరి దశలో, థాపర్ అసమ్మతి హక్కు, చారిత్రక పరిశోధన – ఈ రెండింటి కోసం ఒక రక్షణ పోరాటాన్ని నడుపుతున్నారు.
ఆమె ఒంటరిది కాదు, కానీ ఇది రోజురోజుకూ ఒంటరి పోరాటంగా మారుతోంది. దాంతో పాటు వృద్ధాప్య ఒంటరితనం కూడా తోడవుతుంది.
కాలం స్నేహితులను దూరం చేస్తుంది, శారీరక బలహీనత ఇతరులతో సంబంధాలు కలిగి ఉండటాన్ని కష్టతరం చేస్తుంది.
2024 డిసెంబర్లో, ఆమె మేనల్లుడు మరణించడానికి ఐదు నెలల ముందు, థాపర్ తన సన్నిహిత స్నేహితులలో ఒకరైన శిరీష్ పటేల్‌ను కోల్పోయారు.
ఆయన ముంబై నగర అభివృద్ధికి అంకితమైన ఇంజనీర్, అర్బన్ ప్లానర్. ‘అతను, అతని భార్య ఇద్దరూ మనసు విప్పి ఏదీ దాచుకోకుండా మాట్లాడే మంచి మిత్రులు. అలాంటి మిత్రులను ఒకరి తర్వాత ఒకరిగా కోల్పోతున్నాను’ అన్నారామె.
కుటుంబం, స్నేహం, జ్ఞాపకాలు..
పటేల్ కుటుంబంతో ఉన్న ఒక ఊరట ఏమిటంటే- వారి కుమారుడు, కోడలితో ఇప్పటికీ సంబంధాలు కలిగి ఉండటం, తద్వారా ‘ఆ స్నేహం తర్వాతి తరానికి కూడా కొనసాగేలా చేయడం’.
ఆమె తన కుటుంబంలో, తన లోతైన అనుబంధాలను ఒక తరం నుంచి తదుపరి తరానికి మార్చారు: తన సోదరుడు రమేష్ నుంచి, అతని కుమారుడు వాల్మీక్ వైపు. ఇప్పుడు, ఆమెకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులలో ఒకరు వాల్మీక్ కుమారుడు హమీర్, అతని వయస్సు 23 ఏళ్లు.
‘ఇప్పుడు, ఈ వృద్ధాప్యంలో, నాకు పిల్లలు లేనందుకు నేను విచారిస్తున్నాను’ అన్నారామె. భర్త లేనందుకు నేను విచారించడం లేదు.
కానీ ఒక బచ్చా(పిల్లవాడు) లేనందుకు నేను విచారిస్తున్నాను – మన తర్వాత ఎవరైనా ఉండాలనే విషయంలో మా అమ్మ చెప్పినదానిలో కొంత నిజం ఉందని ఆమె అన్నారు.
కానీ ఆమె నిజంగా మిస్ అవుతున్నది ఏమిటంటే – ‘ఏదో ఒకటి జీవితం ముందుకు సాగిపోతుంది అనే ఆ అనుభూతిని పంచుకునే తనకంటూ ఒక మనిషి తోడు లేకపోవడం.’
‘మన తర్వాతి తరం అనుకోవడంలో ఏదో ఉంది, అది జీవితం ముందుకు సాగుతుందనే నమ్మకాన్ని మీకు ఇస్తుంది.’
పిల్లలు లేకపోతే, తమ పుస్తకాలు, ఫర్నిచర్ ఎవరికి దక్కుతాయో అని అందరూ ఆందోళన చెందుతారని నేను చమత్కరించాను.
‘దాని గురించి నాకు పెద్ద బాధ లేదు. ఇవి ఇవ్వడానికి నా దగ్గర 50 మంది స్నేహితుల పెద్ద జాబితా ఉంది,’ అన్నారు.
ఆమె ఉద్దేశం చాలా సులువైనది, సంక్లిష్టమైనది కూడా– ‘ఒక వ్యక్తి గురించి మాట్లాడటం, గతానికి సంబంధించిన కథలు చెప్పుకోవడం’ తెలిసిన – ప్రేమించిన వ్యక్తులు, విషయాల జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం.
ఇది ముందుగా ఊహించడం కష్టం కానీ, వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మనం విస్మరించలేని కోరిక.
‘నేను చరిత్రకారిణిని కాబట్టి ఇది చెప్పడం లేదు. కానీ ఒక రకంగా చెప్పాలంటే, కొనసాగింపు అనేది జీవించడానికి చాలా అర్థవంతమైన మార్గం. దాని అర్థం మనం గతంతో పూర్తిగా అతుక్కుపోవాలని కాదు. గతంలో ఎలా ఉండేది? నేను గతాన్ని మోస్తున్నానా? అని నిరంతరం ఆలోచించాలని నా ఉద్దేశం కాదు. మీరు తెలుసుకోకుండానే గతం మీతో పాటు సాగిపోతుంది. కానీ ఆ కొనసాగింపులో ఏదో ఉంది, అది జీవితం ముందుకు సాగుతుందనే నమ్మకాన్ని మీకు ఇస్తుంది.’
ఆమె తరంలో, కనీసం భారతదేశంలో, థాపర్ ఒక అసాధారణ వ్యక్తి. తన 90వ పడిలో కూడా వృత్తిపరంగా పూర్తి ఉత్సాహంతో, నలుగురితో కలవడానికి, మాట్లాడటానికి ఇష్టపడే ఆరోగ్యకరమైన జిజ్ఞాస కలిగి ఉండటం సాధారణమైన విషయం కాదు. ఆమెకు ఇష్టమైన కుర్చీ – ముదురు ఎరుపు రంగులో, ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్ ద్వారా గీసినట్లుగా మృదువైన వంపుతో ఉంటుంది – అది గుండ్రంగా ఎటు కావాలంటే అటు తిరగడానికి వీలుండేలా తయారు చేయబడింది. ఎవరితో అన్నా మాట్లాడుకునే సమయంలో తిరగడానికి చాలా బాగుంటుంది.
ఊహాజనిత సంభాషణలతో నిండిన గది వైపు తిరుగుతూ ఆమె నాకు చూపిస్తుంది. ‘చూశారా, ఇది నాకు ప్రతి ఒక్కరినీ చేరుకునే అవకాశాన్ని ఇస్తుంది’ అన్నారు.
ప్రకృతితో అనుబంధం, ఆశావాదం..
ఇప్పుడు బయటకు వెళ్లి, సాధారణ జీవితాన్ని గడపడం కొంచెం కష్టం. ఉదాహరణకు, ఒక లెక్చర్‌కి వెళ్లాలంటే, ఆమె తనకంటే చిన్నవాడైన ఒక స్నేహితుడికి ఫోన్ చేసి, తనతో రావడానికి ఖాళీగా ఉన్నారా అని అడగాల్సి వస్తుంది.
ఆమె ఇది చెబుతుంటే, ఆమెను ఒక సెమినార్‌కు తీసుకెళ్లడానికి గేటు వద్ద లైన్లో నిలబడే యువకుల సైన్యం నాకు గుర్తొచ్చింది: వారిలో నేను కూడా ఒకడిని. కానీ నిజ జీవితం అలా నడవదని నాకు తెలుసు.
‘కొన్నిసార్లు, నేను అడగడానికి సంకోచిస్తాను,’ ముఖ్యంగా ఉపన్యాసాల విషయానికి వస్తే: ‘వారికి అందులో పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చు.’ కానీ బయటకు వెళ్లడానికి ఆమెకు తోడు అవసరం కాబట్టి, ఆమె అడగడం ఒక అలవాటుగా చేసుకున్నారు, వృద్ధాప్య సవాళ్లలో ఒకదానిని కొత్త పరిచయాలకు పునాదిగా మార్చుకున్నారు.
ఈ విధంగా థాపర్ ఇప్పటికీ బయటి ప్రపంచంలోకి వెళ్తున్నారు, యువతరాన్ని తోడు తీసుకుని నడుస్తున్న నకిలీ చరిత్ర ఉప్పెనను ఎదుర్కొంటున్నారు.
ఉదయం వేళలు ప్రశాంతంగా ఉంటాయి. పక్షులు తోడుగా ఉంటాయని, ఎక్కువగా మ్యాగ్పైస్, బుల్బుల్స్ వస్తాయని ఆమె చెప్పారు. అవి థాపర్ వరండాలో ఉంచిన ధాన్యపు గిన్నెలు, నీళ్ల వద్దకు వస్తాయి. ఉడుతలు కూడా వస్తాయి. ఆమె కుక్క బుల్లే, తన బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక ముక్క కోసం ప్రయత్నిస్తుంది.
ఇటీవల వస్తున్న కొత్త అతిథి పెద్ద పందికొక్కు, అది తోట మూలలో ఉన్న తన బొరియ నుంచి బయటకు వస్తుంది, ఇది బుల్బుల్స్కు అసంతృప్తి కలిగిస్తుంది. అప్పుడప్పుడు, పొడుగు తోక ఉన్న తొండ కూడా వస్తుంది, అది వరండా అంచు వరకు వస్తుంది.
‘అది నిశ్చలంగా నిలబడి నన్ను పైకి చూస్తుంది, నేను దానిని చూస్తాను, చివరికి, ఇంకా ఈ సరదా చాలు అని నిర్ణయించుకుని అది వెళ్లిపోయే వరకు మేము ఒకరినొకరు రెప్ప వేయకుండా చూసుకుంటూనే ఉంటాము.’
వ్యాసకర్త ముంబై కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టు. లండన్ రివ్యూ బుక్స్, గ్రాంటా, గార్డియన్, స్లేట్ పత్రికలకు రాస్తుంటారు. ‘ఫార్థెస్ట్ ఫీల్డ్ – ఇండియన్ స్టోరీ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్’ పుస్తక రచయిత.
అనువాదం: కె సత్యరంజన్
Psyche వెబ్ పత్రిక సౌజన్యంతో నాలుగు భాగాలుగా ప్రచురితమైన వ్యాసాలలో ఈ వ్యాసం చివరి భాగం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
