హ్లోత్ ఇటీవల చేసిన ‘పైలట్ సాబ్ నిజాన్ని అంగీకరించాలి’ అనే వ్యాఖ్యలు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకురావాలనే దిశగా సాగుతున్న మార్పులు రాజస్థాన్‌లో కూడా ప్రభావం చూపవచ్చనే ఆందోళన ఆయనకు ఉన్నట్లు కనిపిస్తోంది.
జైపూర్: 2028 నవంబర్-డిసెంబర్లో జరగనున్నట్లు భావిస్తున్న రాజస్థాన్ తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉంది.
ఇటీవలి నెలల్లో, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పదేపదే ఒక విషయం చెబుతోంది.
1998 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం వరుసగా మళ్లీ ఎన్నిక కాలేదనే చరిత్రను ప్రస్తావిస్తూ, ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు 2028 ఎన్నికల్లో ఓడించి అధికారానికి దూరం చేస్తారని కాంగ్రెస్ వాదిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని భజన్ లాల్ శర్మ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని నిరంతరం “పర్చీ సర్కార్” అని కూడా విమర్శిస్తోంది.
అంటే, బీజేపీ కేంద్ర నాయకత్వం పంపే పర్చీలు(ఆదేశాలు లేదా సూచనలు) ఆధారంగా నడిచే ప్రభుత్వం అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
ప్రజలు ఇలాంటి ప్రభుత్వాన్ని అంగీకరించరని, అందువల్ల భవిష్యత్తులో దీనికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తారని కాంగ్రెస్ చెబుతోంది.
జూన్ 7న, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు- మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ చేసిన వ్యాఖ్యలు, ఆయనకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌తో ఉన్న ప్రత్యర్థిత్వాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి.
తర్వాత, సచిన్ పైలట్ మద్దతుదారులు కూడా దీనికి ప్రతిస్పందించారు.
దీంతో ఈ ఇద్దరు నాయకుల మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న విభేదాలు, వైరం మళ్లీ రాజకీయ చర్చల్లో ప్రధానాంశంగా మారాయి.
సచిన్ పైలట్ తన తప్పును ఒప్పుకోవాలి..
ఆయనను ముఖ్యమంత్రిగా చేసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు.
“పైలట్ సాబ్ నిజాన్ని అంగీకరించాలి. తప్పులు చేయడం మనుషుల సహజ స్వభావం. నేను కూడా తప్పులు చేయగలను. ఆయన ఒక తప్పు చేశారు; దాన్ని ఆయన అంగీకరించాలి” అని గెహ్లోత్ హిందీలో విలేకరులతో అన్నారు. అలాగే, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2020లో రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని మరోసారి ప్రస్తావించారు.
సుదీర్ఘ వ్యాఖ్యలో గెహ్లోత్ మరోసారి 2020 జూలై-ఆగష్టు ఘటనలపై తన వాదనను వివరించారు. ఆ సమయంలో సుమారు నెల రోజుల పాటు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.
సచిన్ పైలట్, అతనికి విధేయులైన 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ పాలిత హర్యానాలోని మనేసర్‌లో శిబిరం వేసి, అనంతరం ఢిల్లీలో ఉన్నారు.
ఇదే సమయంలో ప్రభుత్వం కూల్చివేయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ, గెహ్లోత్ ప్రభుత్వం పైలట్‌కు దేశ ద్రోహం ఆరోపణలతో నోటీసు జారీ చేసింది.
గమనించదగ్గ విషయం ఏమిటంటే ఆ సమయంలో పోలీసులు నేరుగా ముఖ్యమంత్రి గెహ్లోత్ ఆధీనంలోనే ఉండేవారు. ఎందుకంటే ఆయన వద్దే హోం శాఖ బాధ్యత కూడా ఉండేది.
ఆ సమయంలో సచిన్ పైలట్‌ను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి అనే రెండు పదవుల నుంచి తొలగించారు. అనంతరం దాదాపు నెల రోజుల పాటు రాజకీయ అనిశ్చితి కొనసాగింది. ఈ కాలంలో గెహ్లోత్ వర్గం, పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా నిరోధించేందుకు వేర్వేరు హోటళ్లలోనే ఉంచబడ్డారు.
చివరకు, కాంగ్రెస్ అధిష్ఠానం జోక్యం చేసుకుని ఇరు వర్గాల మధ్య ఒక సున్నితమైన రాజీ కుదిరేలా చేసింది.
గతంలో గెహ్లోత్ పదేపదే 2020 రాజకీయ సంక్షోభం వెనుక బీజేపీ ఉందని ఆరోపించారు. అంతేకాక, తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ కోట్ల రూపాయలు చెల్లించిందని కూడా ఆయన ఆరోపించారు.
అయితే ఈ ఆరోపణలను సచిన్ పైలట్, 2020లో ఆయనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల వివాదం..
జూన్ 7న చేసిన తన ప్రకటనలో గెహ్లోత్ 2022 సెప్టెంబరు 25న జరిగిన సంఘటనలు కూడా ప్రస్తావించారు. 2020 రాజకీయ సంక్షోభం జరిగిన రెండు సంవత్సరాల తరువాత కాంగ్రెస్ అధిష్టానం సీఎల్పీ (కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ) సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
గెహ్లోత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ సమావేశం జరిగింది. అప్పుడు ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి రావచ్చని, ఆయన స్థానంలో సచిన్ పైలట్‌ను ముఖ్యమంత్రిగా నియమించవచ్చని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
అయితే, ఆ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సీఎల్పీ) సమావేశం జరగలేకపోయింది. ఎందుకంటే గెహ్లోత్ వర్గానికి చెందిన సుమారు 100 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సచిన్ పైలట్‌ను గానీ, ఆయన మద్దతుదారుల్లో ఎవరినైనా గానీ ముఖ్యమంత్రిగా అంగీకరించబోమని స్పష్టంగా ప్రకటించారు.
కాంగ్రెస్ తరఫున నియమించబడిన ఇద్దరు పరిశీలకులు, తరువాత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్‌లు గెహ్లోత్‌కు విధేయులైన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సీఎల్పీ) సమావేశం నిర్వహించేందుకు ఒప్పించడానికి ప్రయత్నించారు.
అయితే ఆ ఎమ్మెల్యేలు తమ వైఖరిని మార్చుకోలేదు. దానికి బదులుగా, వారు శాసనసభ స్పీకర్‌కు తమ రాజీనామాలను సమర్పించాలని నిర్ణయించుకున్నారు. ఈ చర్య వల్ల రాష్ట్రంలో నాయకత్వ మార్పు చేయాలన్న కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నం నిలిచిపోయింది.
అనంతరం 2022 సెప్టెంబరు 25న జరిగిన సంఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ గెహ్లోత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికలలో తన ప్రభుత్వం ఓడిపోయే వరకూ ముఖ్యమంత్రిగానే కొనసాగారు. ఇదే సమయంలో మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
జూన్ 7న గెహ్లోత్ మాట్లాడుతూ, “సెప్టెంబర్ 25న జరిగిన ఘటన, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని పేరు వినిపించిన పైలట్ సాహెబ్‌కు వ్యతిరేకంగా జరిగింది. దీనిని వారి సొంత వర్గం వారే ప్రారంభించారు. ఒక పరిస్థితిని సృష్టించారు; దాంతో 100 మంది ఎమ్మెల్యేలు ఒకచోట చేరారు. ‘అశోక్ గెహ్లోత్ జాతీయ అధ్యక్షుడు కాబోతున్నందున కొత్త ముఖ్యమంత్రిని నియమించాల్సి వస్తే, ఆ వ్యక్తి మాలోని 100 మందిలో ఎవరైనా కావాలి. ఎందుకంటే మేము అధిష్ఠానానికి విధేయత చూపాము, హోటళ్లలోనే ఉండి ప్రభుత్వాన్ని కాపాడాము. కానీ మమ్మల్ని మనేసర్‌కు తీసుకెళ్లిన వారిలో పైలట్ సాహెబ్ కూడా ఉన్నందున, ఆయనను మాత్రం మేము అంగీకరించము’అని వారన్నారు” అని తెలియజేశారు.
గెహ్లోత్ తనకు విధేయులైన ఎమ్మెల్యేలు సచిన్ పైలట్‌ను ముఖ్యమంత్రిగా నిరాకరించిన ఘటనను తిరుగుబాటుగా పేర్కొనడానికి నిరాకరించారు.
“అది తిరుగుబాటు ఎలా అవుతుంది? 100 మంది ‘మేము అధిష్ఠానానికి అండగా నిలిచాం, ప్రభుత్వాన్ని కాపాడాం. మాలో ఎవరినైనా ముఖ్యమంత్రిని చేసి ఉండవచ్చు’ అని చెప్పారు. వారు చెప్పిన దాంట్లో తప్పేముంది? ఇప్పుడు దానిని అధిష్ఠానానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు అంటున్నారు. కానీ అప్పుడే నేను సోనియా గాంధీ గారికి క్షమాపణ చెప్పాను. ఆ సమయంలో శాసనసభాపక్ష నాయకుడు నేనే ఉన్నాను” అని గెహ్లోత్ అన్నారు.
అంతేకాకుండా, “భారతదేశంలో చాలామంది ఇలా అనుకుంటున్నారు – అశోక్ గెహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలని కాకుండా ముఖ్యమంత్రిగానే కొనసాగాలని అనుకుంటున్నాడు, అందుకే ఆ తిరుగుబాటు జరిగింది. దేశవ్యాప్తంగా నాకు అత్యంత సన్నిహితులైన వారు, నా సొంత సహచరులు కూడా ఇదే భావనతో ఉన్నారు. అశోక్ గెహ్లోత్ ముఖ్యమంత్రిగానే ఉండాలనుకున్నాడు, అందుకే తిరుగుబాటు నిర్వహించాడు అని. ఇప్పుడు నేను వారికి ఏమి వివరించాలి? ఈరోజు నేను మీకు అదే విషయం వివరిస్తున్నాను” అని గెహ్లోత్ చెప్పుకొచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి గెహ్లోత్ మీడియాపై కూడా విమర్శలు చేశారు. “కొన్నిసార్లు మీడియా సచిన్ పైలట్ ప్రధానమంత్రి పదవికి అభ్యర్థి అని, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అభ్యర్థి అని, అతను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నారని వార్తలు ప్రచారం చేస్తుంది” అని అన్నారు.
గెహ్లోత్ జూన్ 7న విలేఖరులతో మాట్లాడుతూ- “మీరందరూ పైలట్ సాహెబ్ వెనక ఎందుకు పడుతున్నారు? ఢిల్లీలోని ప్రధాన మీడియా, సోషల్ మీడియా అందరూ ఆయన గురించే ఎందుకు అంతగా చర్చిస్తున్నారు?” అని ప్రశ్నించారు.
పదవుల పంపకాలు – కొనసాగుతున్న గెహ్లోత్ రాజకీయాలు..
గెహ్లోత్ 2020, 2022 సంఘటనలను మరోసారి ప్రస్తావించటం- కాంగ్రెస్ పార్టీ యువ నాయకత్వం వైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్న సమయంలో జరిగింది.
మాజీ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడానికి కొద్ది రోజుల ముందే కాంగ్రెస్ కర్ణాటక రాష్ట్రంలో నాయకత్వం మార్పు చేసింది. అక్కడ సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్థానంలో యువ నాయకుడైన డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా నియమించింది.
గతంలో కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గెహ్లోత్‌కు పార్టీ సంస్థాగత(ఆర్గనైజేషనల్) బాధ్యతలు అప్పగించేవారు. కానీ ప్రస్తుతం ఆయన పార్టీలో ఎలాంటి పదవిలో లేరు. అయినప్పటికీ, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ తన ఎక్కువ సమయాన్ని రాజస్థాన్‌లోనే గడుపుతూ, రాష్ట్ర రాజకీయాలపై నిశితంగా దృష్టి ఉంచుతున్నారు.
అలాగే అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రభుత్వంపై నిరంతరం విమర్శలు చేస్తున్నారు. ఇది చూస్తే, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన గెహ్లోత్ రాజకీయాల నుంచి విరమించుకోవాలనే (రిటైర్ అవ్వాలనే) ఆలోచనలో లేరని స్పష్టంగా తెలుస్తోంది.
సచిన్ పైలట్ ప్రస్తుతం టోంక్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అదనంగా ఇటీవల ముగిసిన కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ఆయనను కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకుడిగా నియమించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) విజయం సాధించింది.
ప్రస్తుతం రాజస్థాన్ కాంగ్రెస్‌లో ప్రధానంగా కనిపిస్తున్న ఇద్దరు నాయకులు గోవింద్ సింగ్ దోతాస్రా, టీకారాం జుల్లీ. సచిన్ పైలట్‌ను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత గోవింద్ సింగ్ దోతాస్రాను ఆ పదవికి నియమించారు.
టీకారాం జుల్లీ ప్రస్తుతం రాజస్థాన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. యాదృచ్ఛికంగా ఇటీవల రాజస్థాన్ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ- గెహ్లోత్, పైలట్ సమక్షంలోనే దోతాస్రా, జుల్లీ ఇద్దరినీ ప్రశంసించారు.
ఆయన పార్టీని మూడుసార్లు ఓడించాడు — గెహ్లోత్‌కు పైలట్ వర్గం ఘాటు ప్రతిస్పందన..
అయితే ఇటీవల గెహ్లోత్, పైలట్ మద్దతుదారుల మధ్య జరిగిన మాటల యుద్ధం చూస్తే ఈ రెండు వర్గాలలో ఏ ఒక్కటీ మరో వర్గానికి చోటు ఇవ్వడానికి లేదా వెనక్కు తగ్గడానికి సిద్ధంగా లేవని స్పష్టం అవుతుంది.
ప్రత్యేకించి వచ్చే నెలతో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న గోవింద్ సింగ్ దోతాస్రా 2028 అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీని నడిపిస్తారా లేక కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం కొత్త అధ్యక్షుడిని నియమిస్తుందా అన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియని సమయంలో ఈ విభేదాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
సచిన్ పైలట్ ఇప్పటి వరకు గెహ్లోత్ తన గురించి చేసిన వ్యాఖ్యలకు నేరుగా స్పందించకుండా ఉండగా, ఆయన మద్దతుదారులు మాత్రం ఏమాత్రం వెనుకాడకుండా ఘాటుగా స్పందించారు.
బుధవారం(జూన్ 10న) గెహ్లోత్ వ్యాఖ్యలు చేసిన మూడు రోజుల తరువాత, సచిన్ పైలట్ తన తండ్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాజేష్ పైలట్ 26వ వర్ధంతికి ఒక రోజు ముందు కరౌలీ జిల్లాలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వెళ్లారు.
ఈ కార్యక్రమంలో పైలట్ వేదికపై కూర్చుని ఉండగానే, ఆయన మద్దతుదారుల్లో కొందరు గెహ్లోత్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
కరౌలీలో జరిగిన ఆ కార్యక్రమంలో సచిన్ పైలట్ సమక్షంలో మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ మీనా గెహ్లోత్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
“మన మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ మాట్లాడుతూ పదే పదే వాళ్లు మానేసర్‌కు వెళ్లారు, ఒక్కొక్కరు 10-10 కోట్లు తీసుకున్నారు అని అంటుంటారు. రమేష్ మీనా పది కోట్లు తీసుకుని ఉంటే, నాపై నార్కో టెస్ట్ నిర్వహించాలని నేను ఆయనకు సవాలు విసురుతున్నాను. అలాగే స్వతంత్ర ఎమ్మెల్యేలకు, బీటీపీ, బీజేపీ ఎమ్మెల్యేలకు మీరు ఎంత డబ్బు ఇచ్చారో తెలుసుకోవటానికి మీపై కూడా నార్కో టెస్ట్ జరగాలి. దానికి సంబంధించిన పత్రాలు మా దగ్గర కూడా ఉన్నాయి” అన్నారు.
రమేష్ మీనా 2020 రాజకీయ సంక్షోభం సమయంలో సచిన్ పైలట్‌కు మద్దతుగా నిలిచిన 18 మంది విధేయ ఎమ్మెల్యేలలో ఒకరు. ఆ సమయంలో ఆయన కూడా ఇతరులతో కలిసి మనేసర్‌లో శిబిరం వేశారు. ఆ కార్యక్రమంలో ఆయన రాహుల్ గాంధీకి కూడా ఒక విజ్ఞప్తి చేశారు.
“ఆయనను (గెహ్లోత్‌ను) మూడుసార్లు ముఖ్యమంత్రిని చేశారు. కానీ ఆ మూడు సార్లలోనూ ఆయన పార్టీని ఓడించారు. రాహుల్ గాంధీ గారికి నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే, మీరు రోడ్డు నుంచి పార్లమెంట్ వరకు సామాన్య ప్రజల కోసం, రైతుల కోసం పోరాడుతున్నారు, వారి గొంతుకను వినిపిస్తున్నారు. కానీ ఇలాంటి వ్యక్తిని మీరు నియంత్రించకపోతే, కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుంది” అని రమేష్ మీనా అన్నారు.
బుధవారం తన ప్రసంగంలో సచిన్ పైలట్ గెహ్లోత్ పేరు నేరుగా ప్రస్తావించలేదు. అయితే, మాట్లాడేటప్పుడు మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
బుధవారం కరౌలీలో జరిగిన కార్యక్రమంలో సచిన్ పైలట్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ:
“నాకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవు. మీ అందరికీ తెలుసు, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతాను. ఎందుకంటే ఒకసారి నోటి నుంచి బయటకు వచ్చిన మాట తిరిగి వెనక్కి రాదు. అందుకే పోరాటం ముఖ్యం, సత్యం పక్షాన నిలబడటం ముఖ్యం- అలాగే ఇతరులకు గౌరవం ఇవ్వడం కూడా ముఖ్యం” అని అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ: “రాజకీయాల్లో ‘అడ్వాన్స్ బుకింగ్’ అనే దేమీ ఉండదు” అని అన్నారు.
సచిన్ పైలట్ మాట్లాడుతూ..
“నేనెప్పుడూ ఒక విషయమే చెబుతుంటాను. రాహుల్ గాంధీ చెప్పినట్లుగా మొహబ్బత్ కీ దుకాణ్ ఖోల్నీ హై(ప్రేమ, ఆప్యాయతల దుకాణం తెరవాలి). ఎవరైనా మనతో విభేదించినా, మన మాట వినకపోయినా ఆ వ్యక్తికి అపారమైన ప్రేమ, గౌరవం ఇవ్వాలి. చివరికి అతనే మనతో కలిసి వచ్చేలా ఉండాలి” అని అన్నారు.
2028 అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో గెహ్లోత్ – పైలట్ల మధ్య చాలా ఏళ్లుగా కొనసాగుతున్న విభేదాలు ఇంకా పూర్తిగా ముగిసినట్లు కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో కూడా ఈ విభేదాలు కొనసాగవచ్చునని సంకేతాలు కనిపిస్తున్నాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
