రాష్ట్ర అధికార, విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు షరా మామూలుగా మారాయి. ఎంతటి విషాదమైనా అక్కడ కూడా రాజకీయ విమర్శలే.
గడిచిన దశాబ్దన్నర కాలంగా ఇదే తంతు కొనసాగుతూ వస్తోంది. ఈ విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణల వెల్లువలో అసలు సమస్యలు అడుగంటిపోతున్నాయి.
తాజాగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో కార్మికుల మరణాలు, బాధిత కుటుంబాల వేదన చూసేవారిని కలిచివేస్తున్నాయి.
రాజకీయ పార్టీలు మాత్రం పక్షాలుగా విడివడి దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ప్రభుత్వ వైఫల్యమని విపక్షం అంటున్నది.
“చావు దగ్గర కూడా జగన్ రాజకీయమా?” అని టీడీపీ-జనసేన శ్రేణులు, వారి సోషల్ ఐటీ సెల్ డిజిటల్ పొలిటికల్ వార్‌ను వైసీపీ మీద ప్రకటించాయి.
వాస్తవానికి కొద్ది కాలంగా వరుస ప్రమాదాలు స్టీల్ ప్లాంట్‌లో జరుగుతున్నాయి. ఈ ఘటనలపై ప్రభుత్వం కమిటీ కూడా వేసింది.
వరుస ప్రమాదాల నివారణకు తాము తీసుకున్న చర్యలేమిటో, తీసుకోబోయే చర్యలు ఏమిటో అనే విషయాలకంటే జగన్‌ను కట్టడి చేయడానికే ప్రాధాన్యతనిస్తున్నారనే అభిప్రాయం చాలా మందిలో కలుగుతున్నది.
ఇదంతా ఒక వైపు దృశ్యం. మరొకవైపున, అసలు మూలాన్ని పక్కనపెట్టి రాజకీయ విమర్శలకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు.
దుర్ఘటన పూర్వాపరాలు, బాధితుల జీవితాలు- ఈ పట్టింపుకంటే ఏ పార్టీ వాదన సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందో దానికే పార్టీలు ప్రాధాన్యతనిస్తున్నాయి.
గత ఘటనల నుంచి పాఠాలు శూన్యం..
2014 రాష్ట్ర విభజన తర్వాత గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి వద్ద జరిగిన తొక్కిసలాటలో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు.
ఎన్నికల ప్రచార సభలలో కూడా తొక్కిసలాట జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
ఆయా సందర్భాల్లో పరస్పర ఆరోపణలు, విమర్శలే. జరిగిన ఘటనల నుంచి ఏ పాఠాలూ నేర్చుకోలేదు. ఆ ప్రయత్నమూ జరగలేదు.
వామపక్షాల విమర్శ..
చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ప్రచారం మీద ఉన్నంత శ్రద్ధ హామీల అమలు, భవిష్యత్తుపై దృష్టి లేదనే విమర్శలు ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్నాయి.
కులాల వారీగా, పార్టీల వారీగా రాష్ట్రంలో ప్రజలను విభజించి రాజకీయాలు చేస్తున్నారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది.
విశాఖ ఘటన తర్వాత తీసుకోవాల్సిన చర్యలకంటే వైసీపీని ఎలా కట్టడి చేయాలో కూటమి నాయకుల మాటలే చెప్తున్నాయి.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన అమరావతి నిర్మాణంలో పురోగతి, సూపర్ 6 అమలు- ఈ విషయాల గురించి ఇప్పటి వరకు విపక్షం నిర్దిష్ట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టలేదు.
ప్రజలకు ఇచ్చిన హామీలలో ఎన్ని అమలు చేశారో ప్రభుత్వం కూడా చెప్పుకోవడం లేదు. అసలు ఆ సాహసమే చేయడం లేదు.
ఇప్పటికే రెండేళ్ల కాలం గడిచిపోయింది. ఉపాధి కల్పన, పెట్టుబడులు వంటి అంశాల గురించి సోషల్ మీడియాలో ఊదరగొట్టడం తప్ప చేస్తున్నది ఏం లేదని వామపక్షాల విమర్శ.
హామీలు, ఆచరణ.. పొంతన ఏది?
ప్రధాని పన్నెండేళ్ల పదవీకాలం పూర్తి అయిన సందర్భంగా అమరావతిపై వరాల జల్లు కురిపించారనే అధికార పార్టీ నాయకుల భావన. గడిచిన పదేళ్ల అనుభవంతో చూసినప్పుడు- మాటలకు, చేతలకు పొంతనే లేదనే విషయం రూఢీ అవుతున్నదని ప్రజల భావన. రాష్ట్రంలో వందలాది గ్రామాలకు రోడ్డు మార్గాల మరమ్మత్తులు చేయాల్సి ఉంది.
విద్యుత్ సౌకర్యం అందని ఆదివాసీ నివాస ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ భావోద్వేగపూరిత ఉపన్యాసాలు, ఒకటి అర ఆచరణలు తప్ప అడుగు ముందుకు పడిందే లేదని రాష్ట్ర ప్రజల అభిప్రాయం.
ఎన్నికల ముందు భావోద్వేగాలు..
రాష్ట్ర రాజకీయాలలో నిరంతరం ఎన్నికల ముందు భావోద్వేగాలే కొనసాగుతున్నాయి. మేధోవర్గం, విద్యావంతులు తదితర సామాజిక చలనశీల శక్తుల ప్రాబల్యం పెరగాల్సిన అనివార్యత రాష్ట్రంలో కనిపిస్తున్నది.
విద్యా, ఉద్యోగ, ఉపాధి కల్పనల వంటి అంశాలపై క్షేత్ర స్థాయిలో పనిచేసే, సమాజ హితం కోసం పనిచేసేవారి అవసరం ఉందని రాష్ట్ర ప్రజల బలమైన ఆకాంక్ష. చంద్రబాబు నాయుడు తనకున్న సుదీర్ఘ అనుభవంతో ఉపాధి సెంటర్లను స్థిరపరచి విస్తరించింది లేదు.
గత ప్రభుత్వ హయాంలోనూ ఇదే పరిస్థితి ఉంది. వెరసి రాష్ట్రం నుంచి భారీ ఎత్తున ప్రజలు ఉపాధి కోసం బయటి ప్రాంతాలకు వెళ్తున్నారు.
ఇట్లా వెళ్తున్న వారు భూమి, ఆస్తిపాస్తులు లేనివారే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి వారి విషయంలో దృక్పథం ఏమిటనేది కీలకం. ఇన్నాళ్లుగా అధికార, విపక్షాలు పోలవరం, అమరావతి, పాపులర్ పథకాల గురించి మాట్లాడాయి. పరిస్థితులలో మాత్రం ఏ మార్పు లేదనేది సామాజిక విశ్లేషకుల అభిప్రాయం.
అభివృద్ధి నమూనా అత్యవసరం..
ప్రభుత్వాన్ని, విపక్షాన్ని సద్విమర్శ చేయొచ్చు. ఏపీ ఇందుకు భిన్నంగా ఉంది- అప్పుడైనా ఇప్పుడైనా. స్టీల్ ప్లాంట్ ఘటన గురించి ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను వెతికినా అధికార, విపక్షాల నిందారోపణలే కనిపిస్తున్నాయి.
స్టీల్ ప్లాంట్‌లో భవిష్యత్తు ప్రమాద నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? రాజకీయాలకు అతీతంగా ప్రజలను ఎలా ఆదుకోవాలి? అనే విషయాలు కనిపించడం లేదు.
ప్రతీ సందర్భంలోనూ రాజకీయ అంశాలే ఎజెండా అయినప్పుడు ప్రజా సమస్యలు పాతాళంలోకి పడిపోతాయి. ప్రభుత్వాలు అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలతోపాటు దూరదృష్టి కలిగిన అభివృద్ధి నమూనా ఆంధ్రప్రదేశ్‌కు అత్యవసరం, అనివార్యం. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తిస్తాయని రాష్ట్ర సగటు సామాన్య వ్యక్తి ఆశ.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
