ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగు దశాబ్దాలకు పైగా హక్కుల సంఘాలు లాకప్ మరణాలను వ్యతిరేకిస్తూ వస్తున్నాయి.
పోలీసులు తమ అదుపులోని నిందితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి, చిత్రహింసలకు గురిచేయడం కొత్త విషయమేమీ కాదు.
లాకప్ మరణం జరిగిన ప్రతి సందర్భంలోనూ హక్కుల సంఘాలు నిజనిర్ధారణ చేసి, అందుకు కారకులైన పోలీసులపై చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వాలను కోరినా, ఎగ్జిక్యూటివ్ మేజిస్టీరియల్ విచారణతో సరిపెడుతూ వచ్చాయి.
అయితే గాదె సాయికృష్ణ విషయంలో అతని తల్లి విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించడం వల్లనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణలంక సీఐ నాగరాజును సస్పెండ్ చేసి, హత్య కేసును నమోదు చేయడం జరిగింది.
లాకప్ మరణాలకు కారకులెవరు?
సీఐ నాగరాజు అదుపులో ఉన్న సాయికృష్ణ అదృశ్యం కాగా, అతని వేధింపుల కారణంగా విజయవాడకు చెందిన దళిత వ్యక్తి క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు.
అలాగే సిట్ పోలీసుల చిత్రహింసల కారణంగా కర్నూలు జిల్లా బదినేహాల్ గ్రామానికి చెందిన దళిత వితంతు మహిళ గంగమ్మ లాకప్ మరణం సంభవించింది.
నిందితులైన పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా, వారిని కాపాడడానికే ప్రయత్నం చేయడమేంటి? తప్పనిసరి పరిస్థితుల్లోనే వారిపై నామమాత్రపు చర్యలు తీసుకోవడం ఏమిటి?
పోలీసులు సమాజంలో నేరాలు జరగకుండా చూడడం, నేరాలు జరిగినప్పుడు అందుకు కారకులైన నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం వారి కనీస బాధ్యత.
అయితే వాళ్లు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం వల్లనే లాకప్ మరణాలు జరుగుతున్నాయి.
నిందితులపై ఎంతటి తీవ్రమైన నేరారోపణలున్నా, పోలీసులు సహేతుకమైన పద్ధతుల ద్వారా విచారణ జరిపి, న్యాయస్థానాల ముందు సరైన సాక్ష్యాలు, ఆధారాలు పెట్టి వారికి శిక్షపడేట్టు చూడాలి.
వారు నిందితులను కొట్టడం ద్వారానే నేరాలను నిరూపించాలని చూడడం సరైంది కాదు.
ప్రజలు ఎన్నుకొని అధికారం కట్టబెట్టిన ప్రజా ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి లోని ప్రాథమిక హక్కులలోనే కీలకమైన జీవించే హక్కును కాపాడాలి.
అందుకొరకు లాకప్ మరణాలకు కారకులైన పోలీసు అధికారులపై సెక్షన్ 176(1 ఏ) సీఆర్పీసీ, సెక్షన్ 196(2) బీఎన్ఎస్ఎస్ కింద జ్యుడిషియల్ న్యాయ విచారణ జరిపించకుండా వారిని ఎందుకు కాపాడుతోంది?
డీకే బసు కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాల అమలు ఎక్కడ?
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 1983లో జరిగిన లాకప్ మరణాలపై డీకే బసు రాసిన ఉత్తరాన్నే రిట్ పిటిషన్‌గా స్వీకరించిన సుప్రీంకోర్టు పోలీసులకు మార్గదర్శక సూత్రాలను నిర్దేశించింది.
అందులో ప్రధానంగా నిందితులను అరెస్టు చేసిన దగ్గర నుంచి 24 గంటల్లో న్యాయస్థానంలో హాజరుపరిచే వరకు వారికున్న హక్కుల గురించి ప్రస్తావించింది.
సీఐ నాగరాజు కానీ, గంగమ్మ కేసులో సిట్ పోలీసులకు నేతృత్వం వహించిన అధికారిణి సుప్రజ కానీ, నిందితుల హక్కులను అమలుచేసి ఉంటే, లాకప్ మరణాలు జరిగేవా?
సాయికృష్ణ హత్య కేసు, గంజాయి కేసులో ముద్దాయి. క్రాంతికుమార్ చిన్న పెట్టీ కేసుల్లో ముద్దాయి.
అలాగే గంగమ్మ తన పెద్ద కొడుకు వీరేంద్రను తన ప్రియుడు దర్గయ్య సహకారంతో తానే చంపించిందని ఆరోపణలు ఉన్నాయి.
సాయికృష్ణను మార్కాపురంలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు, మే 6న కృష్ణలంక సీఐ నాగరాజుకు అప్పజెప్పారు.
సీఐ నాగరాజు సాయికృష్ణను చిత్రహింసలు పెట్టి, చంపి శవాన్ని అదృశ్యం చేశాడని, అతని తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తరువాతనే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి, అతనిపై హత్య కేసును నమోదు చేయడం జరిగింది.
దళితుడైన క్రాంతికుమార్ సీఐ నాగరాజు వేధింపుల వల్లే తాను విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నానని చెబుతూ తీసుకున్న వీడియో అదే సమయంలో వైరల్ కావడంతో సీఐ నాగరాజుపై మరో కేసు నమోదు కావడం జరిగింది.
సిట్ పోలీసులు గంగమ్మ, దర్గయ్యలను మే నెల చివరి వారం రోజులు నిర్బంధించి, వీరేంద్ర శవం ఆచూకీ తెలపమని కొట్టడంతోనే, జూన్ 1న గంగమ్మ కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రిలో మృతిచెందగా, సిట్ పోలీసులే ఆమె అంత్యక్రియలు జరపడం, అదేవిధంగా దర్గయ్యను ఎవరినీ కలవనీయకుండా పోలీసు పహారా మధ్య కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది.
పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించి ఉంటే ఈ లాకప్ మరణాలు జరిగేవా?
సీసీటీవీ ఫుటేజీల మాయం వెనుక మర్మమేమిటి?
రాజస్థాన్ రాష్ట్రంలో లాకప్ మరణాల విషయమై దైనిక్ భాస్కర్ అనే పత్రిక రాసిన రిపోర్టును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి పరంవీర్ సింగ్ సైనీ వర్సెస్ బల్జీత్ సింగ్ కేసులో దేశంలోని అన్ని పోలీసు స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజీ ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూనే, 18 నెలల పాటు భద్రపరచాలని ఇటీవలనే తీర్పును చెప్పడం జరిగింది.
అయినా కృష్ణలంక స్టేషన్లో సాయికృష్ణ నిర్బంధంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ మాయం కావడం చూస్తే, సీఐ నాగరాజుపై వచ్చిన ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. అదేవిధంగా గంగమ్మ, దర్గయ్యలను సిట్ పోలీసులు విచారించిన సీసీటీవీ ఫుటేజీలను భద్రపరిచారా లేదా అన్నది అనుమానమే.
సుప్రీంకోర్టు అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు డీకే బసు కేసులో, పరంవీర్ సింగ్ కేసుల్లో తీర్పులను అమలు చేయడం ద్వారా మనిషికుండే ప్రాథమిక హక్కు అయిన జీవించే హక్కును హరిస్తున్న లాకప్ మరణాలను నివారించమని స్పష్టంగా ఆదేశించింది.
ప్రజలు ఎన్నుకొని అధికారం కట్టబెట్టిన ప్రభుత్వాలు విధి నిర్వహణలో భాగంగా పోలీసులు పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో విఫలం కావడం జరుగుతోంది.
మూడు లాకప్ మరణాల విషయమై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణకు ఆదేశించి, వారి మృతికి కారకులైన పోలీసుల పైన, సహకరించిన వారి పైన చట్టప్రకారం చర్య తీసుకోవాలని ఆదేశించాలని, ప్రభుత్వం ప్రజలకు చట్టబద్ధ పాలన అందించడం ద్వారా లాకప్ మరణాలకు ముగింపు పలకాలని కోరుకుందాం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
