తన ఆర్థిక వ్యవహారాలపై జరుగుతున్న దర్యాప్తు నేపథ్యంలో ప్రజాకర్షక నాయకుడు, రిఫార్మ్ యూకే పార్టీ అధినేత రాజీనామా చేశారు. అయితే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.
గత ఏడాది నుంచి తన పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహించిన అభిప్రాయ సర్వేలలో నైజెల్ ఫరాజ్ ముందంజలో ఉంది.
అయినప్పటికీ, తన ఆర్థిక వ్యవహారాలపై తలెత్తిన వివాదం నేపథ్యంలో పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అదే స్థానానికి జరిగే ఉపఎన్నికలో మళ్లీ పోటీ చేస్తానని తెలిపారు.
“నా రాజకీయ భవిష్యత్తును ఓటర్లే నిర్ణయించాలి” అని ఫరాజ్ అన్నారు. సాధారణ ఎన్నికల మధ్యలో ఏదైనా పార్లమెంట్ స్థానం ఖాళీ అయితే అక్కడ ఉపఎన్నిక జరుగుతుంది. అలాంటి ఉపఎన్నిక రాబోయే కొద్ది నెలల్లో జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
“ఇది మొత్తం రాజకీయ వ్యవస్థను సవాలు చేసే అంశం. వ్యాపారవేత్తల నుంచి నాకు అందిన విరాళాలపై జరుగుతున్న దర్యాప్తు, నా పార్టీ ఎన్నికల్లో విజయం సాధించకుండా అడ్డుకునేందుకు బ్రిటన్ రాజకీయ వ్యవస్థ చేస్తున్న ప్రయత్నమే” అని ఆయన ఆరోపించారు.
ఫరాజ్ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలపై ఆయన పార్లమెంట్ నిబంధనలను ఉల్లంఘించారా లేదా అన్న అంశంపై కొనసాగుతున్న వివాదం మధ్య ఈ అసాధారణ నిర్ణయం వెలువడింది.
విరాళాల చుట్టూ ముసిరిన వివాదం..
62 ఏళ్ల ఫరాజ్పై, 2024 ఎన్నికలకు ముందు ధనిక మద్దతుదారుల నుంచి అందుకున్న విరాళాలపై ఇటీవలి వారాల్లో విచారణ ప్రారంభమైంది.
రీఫార్మ్ యూకే పార్టీ నాయకుడైన ఫరాజ్, థాయ్‌లాండ్‌కు చెందిన క్రిప్టోకరెన్సీ బిలియనీర్ క్రిస్టోఫర్ హార్బోర్న్ నుంచి 5 మిలియన్ పౌండ్ల (సుమారు 6.7 మిలియన్ అమెరికన్ డాలర్లు) విరాళం పొందారు.
పార్లమెంట్‌కు అనూహ్యంగా తిరిగి రావడానికి కొన్ని నెలల ముందు ఈ విరాళం అందింది.
ఆ విరాళాన్ని వెల్లడించాల్సిన బాధ్యత తనకు లేదని ఫరాజ్ వాదన. అది తన వ్యక్తిగత భద్రత కోసం ఇచ్చిన వ్యక్తిగత బహుమతి మాత్రమేనని చెప్పారు.
అయితే పార్లమెంట్ ప్రమాణాల కమిషనర్ ఈ విరాళంపై అధికారిక దర్యాప్తు ప్రారంభించారు.
హౌస్ ఆఫ్ కామన్స్ నిబంధనల ప్రకారం, ఎన్నికలకు ముందు పన్నెండు నెలల్లో ఎంపీలు పొందిన బహుమతులు, ప్రయోజనాలన్నింటినీ నమోదు చేయాలి. “నేను ఎలాంటి తప్పూ చేయలేదు” అని ఫరాజ్ తెలిపారు.
బ్రిటన్ రాజకీయాలపై ప్రభావం..
ఫరాజ్ చుట్టూ ఏర్పడిన ఈ వివాదం బ్రిటన్ రాజకీయాలకు మరో పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
ప్రస్తుతం ఆయన పార్టీకి కేవలం ఎనిమిది మంది ఎంపీలే ఉన్నప్పటికీ, గత 15 నెలలుగా జాతీయ సర్వేలలో ఆ పార్టీ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
గత శతాబ్దంలో లేబర్ లేదా కన్జర్వేటివ్ పార్టీలు కాకుండా మరో పార్టీ ఇంతకాలం అగ్రస్థానంలో నిలవడం ఇదే మొదటిసారి.
ఈ వివాదం ఫరాజ్‌కు అండగా ఉన్న ప్రధాన మద్దతుదారులపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.
అయితే సాధారణ ప్రజల్లోని మితవాద ఓటర్లను ఆకర్షించే ఆయన సామర్థ్యాన్ని దెబ్బతీసి, సాధారణ ఎన్నికల్లో మెజారిటీ సాధించే అవకాశాలను తగ్గించవచ్చని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయం రాజకీయవేత్త, ప్రొఫెసర్ టిమ్ బేల్ అన్నారు.
రాజీనామా – ఉపఎన్నిక వ్యూహం..
ఫరాజ్ రాజీనామాతో ఆయన నియోజకవర్గంలో ఉపఎన్నిక జరుగుతుంది. అయితే అదే స్థానంలో ఆయన మళ్లీ పోటీ చేయకుండా చట్టపరంగా ఎలాంటి అడ్డంకి లేదు.
2024లో తూర్పు ఇంగ్లాండ్‌లోని క్లాక్టన్-ఆన్-సీ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన ఫరాజ్, మళ్లీ గెలిచే అవకాశాలు ఉన్నాయని టిమ్ బేల్ అభిప్రాయపడ్డారు.
అయితే దాంతో ఆయన రాజకీయ సమస్యలు ముగిసిపోవు. ఫరాజ్ తిరిగి పార్లమెంట్‌కు వచ్చిన వెంటనే విరాళాలపై దర్యాప్తు పునఃప్రారంభమవుతుంది.
నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఆయన అధికారిక సస్పెన్షన్‌కు గురయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఆయన నియోజకవర్గంలో మరోసారి ఉపఎన్నిక జరగవచ్చు.
అయితే సస్పెండ్ అయినా కూడా ఆ ఉపఎన్నికలో మళ్లీ పోటీ చేసే హక్కు ఫరాజ్‌కు ఉంటుంది. తద్వారా వరుసగా రెండు ఉపఎన్నికల్లో గెలిచి తిరిగి పార్లమెంట్‌లోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
పార్లమెంటరీ విచారణ పూర్తి కాకముందే రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్లడం ద్వారా, దర్యాప్తును, మీడియా విమర్శలను తట్టుకుని ప్రజల తీర్పు తనకు అనుకూలంగా వస్తుందనే లెక్కతో ఫరాజ్ ఈ నిర్ణయం తీసుకున్నారని యూరేషియా గ్రూప్ యూరప్ విభాగం రిస్క్ విశ్లేషణ అధిపతి ముజ్తబా రెహ్మాన్ వ్యాఖ్యానించారు.
ఫరాజ్ రాజకీయ ప్రస్థానం..
ఆధునిక బ్రిటన్ రాజకీయాల్లో ఫరాజ్ అత్యంత ప్రభావశీల నాయకుల్లో ఒకరు. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడానికి (బ్రెగ్జిట్) ప్రధాన రూపకర్తగా నిలిచారు.
2024లో రాజకీయాల్లోకి తిరిగి వచ్చిన ఆయన, భారీ వలసలు, ఆర్థిక స్థబ్దత నేపథ్యంలో బ్రిటన్‌లో లేబర్, కన్జర్వేటివ్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మూడో పార్టీ అవసరమని వాదించారు.
ఫరాజ్ విరాళాలపై వివాదం ఏప్రిల్ చివర్లో ప్రారంభమైంది. హార్బోర్న్ నుంచి వెల్లడించని విరాళం అందుకున్నట్లు మీడియా వార్తలు వెలువడిన తర్వాత, అది తన వ్యక్తిగత భద్రత కోసం షరతుల్లేకుండా ఇచ్చిన బహుమతి మాత్రమేనని ఫరాజ్ అంగీకరించారు.
“నాపై మళ్లీ మళ్లీ దాడులు జరిగాయి. శారీరకంగానూ, మాటల ద్వారానూ ఆధునిక కాలంలో అత్యధికంగా దాడులకు గురైన ప్రజాప్రతినిధుల్లో నేనొకడిని” అని ఫరాజ్ అన్నారు.
న్యూయార్క్ టైమ్స్ సౌజన్యంతో. అనువాదం: డి వెంకన్న.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
