హెలెనిస్టిక్ యుగంలో ఈజిప్టులో, ఈజిప్టు ప్రజల లోహాలను శుద్ధి చేసే నైపుణ్యాలు, వారి మత విశ్వాసాలు, గ్రీకు తత్వశాస్త్రంతో కలవడంతో పాశ్చాత్య రసవాదం(ఆల్కెమీ) పుట్టుకొచ్చింది.
సీసం లాంటి నాసిరకం లోహాలను బంగారం లాంటి విలువైన లోహాలుగా మార్చవచ్చనే విశ్వాసమే రసవాదం(ఆల్కెమీ) ప్రధాన సిద్ధాంతం.
అయితే ఈ భావన కేవలం లోహాల రూపాంతరానికే పరిమితం కాదు.
భౌతిక ప్రపంచంలో పదార్థాల పరివర్తనతో పాటు మనిషి ఆత్మను ఉన్నత స్థితికి చేర్చే ఆధ్యాత్మిక పరివర్తన కూడా సాధ్యమేనన్న విశాలమైన తాత్విక దృక్పథానికి ఇది పునాది వేసింది.
రసవాదం ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో చైనా, భారతదేశం లాంటి నాగరికతల్లో స్వతంత్రంగా అభివృద్ధి చెందినప్పటికీ పాశ్చాత్య రసవాదం పుట్టుక మాత్రం హెలెనిస్టిక్ యుగంలోని ఈజిప్టులో జరిగింది.
అక్కడ ప్రాచీన ఈజిప్టు ప్రజల లోహశాస్త్ర నైపుణ్యాలు, వారి మతపరమైన విశ్వాసాలు, ఆధ్యాత్మిక ఆచారాలు హెలెనిస్టిక్ తత్వశాస్త్రంతో కలిసిపోవడంతో రసవాదం ఒకేసారి సాంకేతిక విద్యగా, ఆధ్యాత్మిక సాధనగా రూపుదిద్దుకుంది.
ప్రాచీన ఈజిప్టులో లోహశాస్త్రం..
ఒక పదార్థాన్ని మరో పదార్థంగా మార్చే మార్గాలను అన్వేషించాలనే తపన మానవ సహజ స్వభావంలో భాగం.
పదార్థాల్లో జరిగే రసాయనిక పరివర్తనల చరిత్ర కూడా కనీసం రెండు లక్షల సంవత్సరాల క్రితం అగ్నిని కనుగొన్న కాలం నాటికే చేరుకుంటుంది.
అగ్నిని ఉపయోగించి మనిషి చెక్కను మరింత గట్టిగా మార్చడం, మెత్తని మట్టిని కాల్చి దృఢమైన కుండమట్టిగా రూపాంతరం చేయడం, ధాన్యాన్ని రొట్టెగా మార్చడం నేర్చుకున్నాడు.
కొంతకాలానికే లోహాలను వేడి చేసి వాటికి కొత్త ఆకృతులు ఇవ్వవచ్చని, వాటితో అందమైన వస్తువులను తయారు చేయవచ్చని మానవుడు గ్రహించాడు.
అంతేకాదు తగరం, రాగి లాంటి వేర్వేరు లోహాలను కలిపి కొత్త లోహాలను సృష్టించవచ్చని కూడా తెలుసుకున్నాడు. ఈ ఆవిష్కరణలే మానవ నాగరికతను కాంస్య యుగం వైపు నడిపించాయి.
ప్రాచీన ఈజిప్టువారు లోహశాస్త్రంలో అసాధారణ నైపుణ్యం సాధించినవారు. వారి సంస్కృతిలో లోహాలకు ముఖ్యంగా బంగారానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉండేది.
ఈజిప్టు భాషలో నెబు అని పిలిచే బంగారం ఎప్పటికీ చెదరని, మసకబారని తన సహజ ప్రకాశం వల్ల దైవిక పదార్థంగా పరిగణించబడేది.
ఈజిప్టువారి విశ్వాసం ప్రకారం బంగారం దేవతల శరీర మాంసం ముఖ్యంగా సూర్యదేవుడు రా దేహ స్వరూపం. అందువల్ల దానిని పవిత్రమైన ద్రవ్యంగా ఆరాధించేవారు.
తమ దేవతల విగ్రహాలను రూపొందించడానికి దేవాలయాలను అలంకరించడానికి వారు విస్తృతంగా బంగారాన్ని ఉపయోగించారు. అలాగే అంత్యక్రియలకు సంబంధించిన వస్తువులు, తాయెత్తులు తయారు చేయడానికీ బంగారాన్నే వినియోగించేవారు.
బంగారానికి అతీంద్రియ శక్తులు ఉన్నాయని, అది మనిషికి ఈ జన్మలోనే కాక మరణానంతర జీవితంలో కూడా రక్షణ కల్పిస్తుందని వారు గాఢంగా విశ్వసించేవారు.
అందుకే బంగారం వారికి కేవలం విలువైన లోహం మాత్రమే కాకుండా దైవత్వం, పవిత్రత, శాశ్వతత్వానికి కూడా ప్రతీకగా నిలిచింది.
బంగారంతో పనిచేసే నైపుణ్యం కలిగిన శిల్పకారులు, పూజారుల పర్యవేక్షణలో నడిచే ప్రత్యేక కార్యశాలల్లో తమ కళను ప్రదర్శించేవారు.
వారు దేవతల విగ్రహాలను అత్యంత శ్రద్ధతో రూపొందించగా పూజారులు వాటిపై ప్రార్థనలు, పవిత్ర క్రతువులు నిర్వహించేవారు. అలాంటి క్రతువులలో ప్రముఖమైనది నోరు తెరవడం అనే ఆచారం.
ఈ క్రతువు ద్వారా దేవుని దివ్యశక్తిలోని ఒక భాగం విగ్రహంలో ప్రవేశిస్తుందని అప్పుడు ఆ విగ్రహం సజీవ దైవ స్వరూపంగా మారి భక్తులు దాని ద్వారా దేవునితో సంభాషించగలరని వారు విశ్వసించేవారు.
ఇదే క్రతువును మరణించిన ఫరోకు సంబంధించిన అంత్యక్రియల విగ్రహాలపైనా నిర్వహించేవారు. దీనివల్ల ఫరో కా అంటే అతని జీవశక్తి లేదా ఆధ్యాత్మిక స్వరూపం సమాధిలోని తన ప్రతిమల్లో నివసించగలదని నమ్మకం ఉండేది.
సాంకేతిక నైపుణ్యం, మత విశ్వాసం ఈ విధంగా ఒకదానితో మరొకటి మిళితమై ఉండటం ఆశ్చర్యకరం కాదు. ఎందుకంటే ప్రాచీన ఈజిప్టు సమాజంలో మత విశ్వాసాలు జీవితం ప్రతి కోణాన్ని ఆవరించి ఉండేవి. అక్కడ కళ, శాస్త్రం, వృత్తి, ఆచారాలు అన్నీ మతంతో విడదీయరాని బంధాన్ని కలిగి ఉండేవి.
ప్రాచీన ఈజిప్టు లోహశాస్త్ర నిపుణులకు రసాయన పదార్థాలను ఉపయోగించి లోహాల స్వభావాన్ని, రూపాన్ని మార్చవచ్చనే విషయం కూడా బాగా తెలుసు. ఉదాహరణకు బంగారానికి రాగి లేదా ఎలెక్ట్రం(బంగారం–వెండి మిశ్రమ లోహం) కలిపి దానికి ఎరుపు లేదా మరింత పసుపు వర్ణాన్ని తీసుకొచ్చేవారు.
అలాగే కొన్ని వస్తువులపై ఎర్రటి మెర్క్యూరిక్ సల్ఫైడ్(పాదరసం–గంధకం సంయోగం) పూత పూసి వాటికి మరింత ప్రకాశవంతమైన ఎరుపు రంగును అందించేవారు.
గంధకం, ఆర్సెనిక్, పాదరసం ఆవిరి లాంటి రసాయన పదార్థాలను ఉపయోగించి వారు అనేక ప్రయోగాలు చేసినట్లు ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఈ అనుభవాల వల్ల లోహం బాహ్య రూపాన్ని మార్చడం నుంచి ఒక లోహాన్నే పూర్తిగా మరో లోహంగా మార్చగలమనే ఆలోచనకు చేరుకోవడం సహజమైన తదుపరి అడుగే అయింది.
అలాంటి సంపూర్ణ రూపాంతరం కేవలం సాంకేతిక నైపుణ్యంతోనే సాధ్యం కాదని దానికి మతపరమైన విశ్వాసాలు, పవిత్ర క్రతువులు, ఆధ్యాత్మిక శక్తులూ అవసరమని అప్పటి ప్రజలు భావించేవారు. అందుకే ప్రాచీన ఈజిప్టులో రసవాదం(ఆల్కెమీ) విజ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక సాధనగా కూడా రూపుదిద్దుకుంది.
ఈజిప్టులో హెలెనిస్టిక్ భావాల ప్రభావం..
క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం చివరలో అలెగ్జాండర్ ది గ్రేట్ ఈజిప్టును జయించిన తరువాత ఆ దేశం హెలెనిస్టిక్ ప్రపంచంలో భాగమైంది. కొద్ది కాలానికే ఈజిప్టు అలెగ్జాండర్‌కు అత్యంత విశ్వసనీయ సేనాధిపతుల్లో ఒకరైన ప్టోలెమీ ఆధీనంలోకి వెళ్లింది. అనంతరం ఆయన ఈజిప్టులో ప్టోలెమిక్ ఫరోల రాజవంశాన్ని స్థాపించాడు.
ప్టోలెమీ హెలెనిస్టిక్ ప్రపంచానికి చెందిన పండితులు, పాలకవర్గాలు, మేధావులను ఈజిప్టుకు ఆహ్వానించాడు. అలాగే అలెగ్జాండ్రియా నగరాన్ని హెలెనిస్టిక్ ప్రపంచానికి ఒక కొత్త రాజధానిగా, విజ్ఞాన–సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దాడు. వారితో పాటు గ్రీకు తాత్విక ఆలోచనలు, శాస్త్రీయ సంప్రదాయాలు కూడా ఈజిప్టుకు చేరాయి.
దీంతో గ్రీకు, ఈజిప్టు నాగరికతలకు చెందిన భావాలు, విశ్వాసాలు, జ్ఞాన సంప్రదాయాలు వేగంగా పరస్పరం కలిసిపోయాయి. ముఖ్యంగా అలెగ్జాండ్రియా విద్య, పరిశోధన, సంస్కృతికి ప్రముఖ కేంద్రంగా ఎదిగింది. ఇలాంటి విశిష్టమైన మేధో–సాంస్కృతిక వాతావరణంలోనే ఆల్కెమీకి పునాది అయిన తాత్విక దృక్పథం రూపుదిద్దుకుంది.
హెలెనిస్టిక్ ప్రపంచానికి చెందిన ప్రజలు తమతో పాటు అరిస్టాటిల్ ప్రతిపాదించిన తాత్విక భావాలను కూడా ఈజిప్టుకు తీసుకువచ్చారు. వాటిలో ముఖ్యమైనది పదార్థ స్వరూపం గురించి ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం.
అరిస్టాటిల్ అభిప్రాయం ప్రకారం ఈ విశ్వంలోని సమస్త పదార్థాలు నాలుగు మూల తత్వాలైన భూమి, గాలి, అగ్ని, నీరులతో ఏర్పడతాయి. అలాగే వాటిలో వేడి, చలి, తేమ, పొడితనం అనే నాలుగు ప్రాథమిక గుణాలు వివిధ నిష్పత్తుల్లో ఉంటాయి.
ప్రపంచంలోని ప్రతి వస్తువు ఈ మూలతత్వాలు, గుణాల భిన్నమైన సమ్మేళనం వల్లే తన ప్రత్యేక స్వరూపాన్ని పొందుతుందని ఆయన భావించాడు.
ఈ సిద్ధాంతాన్ని అంగీకరిస్తే ఏదైనా ఒక పదార్థాన్ని దాని మూల భాగాలుగా విభజించి ఆ మూలతత్వాల గుణాల సమతుల్యతను మార్చడం ద్వారా దానిని మరో పదార్థంగా తిరిగి రూపొందించవచ్చనే ఆలోచన సహజంగానే తలెత్తుతుంది. ఈ భావననే తరువాత ఆల్కెమీ ప్రధాన తాత్విక పునాదులలో ఒకటిగా భావించారు.
లోహాలను ఒక రూపం నుంచి మరో రూపానికి మార్చవచ్చనే విశ్వాసానికి కూడా అరిస్టాటిల్ సిద్ధాంతం బలాన్ని అందించింది.
ప్లేటో ఈ ఆలోచనలకు మరో ముఖ్యమైన తాత్విక పరిమాణాన్ని జోడించాడు. ప్లేటో ప్రకారం ఈ విశ్వంలోని సమస్త సృష్టికి మూలమైన ఒక ఆదిమ పదార్థం ఉంది. దానినే మటేరియా ప్రైమా లేదా మూల పదార్థం అని పిలుస్తారు.
ప్రపంచంలోని ప్రతి వస్తువు, ప్రతి జీవి ఈ ఒకే మూల పదార్థం నుంచే ఉద్భవించిందని ఆయన భావించాడు.
అలా అయితే అన్నీ ఒకే మూలం నుంచి పుట్టి, ఒకే ప్రాథమిక మూలతత్వాలతో నిర్మితమై ఉంటే ఒక పదార్థాన్ని దాని మూల స్వరూపానికి విడదీసి దానిని మరో పదార్థంగా తిరిగి నిర్మించడం సాధ్యమేననే ఆలోచన సహజంగానే బలపడింది. ఈ తాత్విక దృక్పథం కూడా ఆల్కెమీ అభివృద్ధికి బలమైన పునాదిగా నిలిచింది.
ప్లేటో మరో ఆసక్తికరమైన భావనను కూడా ప్రతిపాదించాడు. ఆయన దృష్టిలో ఈ భౌతిక ప్రపంచం కేవలం జడ పదార్థాల సమాహారం మాత్రమే కాదు అది ఒక సజీవ అస్థిత్వం, దానికి ఒక విశ్వాత్మ ఉంది. ఆ విశ్వాత్మనే అనిమా ముండి లేదా విశ్వాత్మ అని ఆయన పేర్కొన్నాడు. మనుషుల ఆత్మలైనా, లోహాల అంతర్గత స్వరూపమైనా అన్నీ ఈ విశ్వాత్మ నుంచే ఉద్భవిస్తాయని ఆయన విశ్వసించాడు.
రూపాంతరం అనేది ఈ భావన ప్రకారం కేవలం ఒక లోహాన్ని మరో లోహంగా మార్చే భౌతిక ప్రక్రియ మాత్రమే కాదు అది ఆత్మను మరింత ఉన్నత స్థితికి చేర్చే ఆధ్యాత్మిక పరివర్తన కూడా. అందువల్ల రసవాదంలో భౌతిక మార్పు, ఆధ్యాత్మిక వికాసం రెండూ పరస్పరం విడదీయరాని అంశాలుగా పరిగణించబడ్డాయి.
ఈ భావనను తరువాత నియోప్లేటోనిక్ తత్వవేత్తలు మరింత విస్తరించారు. వారు ప్లేటో చెప్పిన ఆ విశ్వాత్మను ది వన్ లేదా ఏక పరమ సత్యం గా అభివర్ణించారు. వారి దృష్టిలో అదే సమస్త శ్రేయస్సుకు, పరిపూర్ణతకు, సత్యానికి మూలం. ప్రపంచంలోని మంచి లక్షణాలన్నీ దాని నుంచే ఉద్భవిస్తాయని వారు విశ్వసించారు.
దీనికి విరుద్ధంగా పదార్థ ప్రపంచాన్ని వారు ఆ పరమసత్యానికి ధ్రువ విరుద్ధంగా చూశారు. అది అసంపూర్ణతకు, అపవిత్రతకు, పరిమితులకు ప్రతీక అని భావించారు. ఈ తాత్విక దృక్పథం ఆల్కెమీలో రూపుదిద్దుకుంటున్న విశ్వాసాలపై గాఢమైన ప్రభావాన్ని చూపింది.
దీని ఫలితంగా సీసం లాంటి సాధారణ లేదా అసంపూర్ణ లోహాలను శుద్ధి చేసి వాటిని అత్యంత పరిపూర్ణమైన లోహంగా భావించిన బంగారంగా మార్చవచ్చనే భావన బలపడింది.
ఈ పరివర్తన కేవలం లోహాలకే పరిమితం కాదని మనిషి ఆత్మ కూడా తనలోని అపవిత్రతలను తొలగించుకొని క్రమంగా శుద్ధి చెందగలదని వారు నమ్మారు. అలా శుద్ధి చెందిన ఆత్మ చివరికి ది వన్‌తో మళ్లీ ఏకమై అమరత్వాన్ని పొందుతుందని వారి విశ్వాసం.
అందువల్ల ఆల్కెమీ దృష్టిలో బంగారంగా మారే లోహం పరమ సత్యంతో ఏకమయ్యే ఆత్మ ఈ రెండూ ఒకే పరివర్తన సూత్రానికి రెండు వేర్వేరు రూపాలుగా భావించబడ్డాయి.
హెర్మీస్ ట్రిస్మెజిస్టస్ (ముమ్మారు మహోన్నతుడు)
తమ తాత్విక భావాలకు ప్రాచీన సంప్రదాయాల ఆధారాన్ని చూపించడం ద్వారా వాటికి మరింత విశ్వసనీయత, గౌరవం తీసుకురావాలని అప్పటి పండితులు భావించారు. ప్రాచీన ప్రపంచంలో ఇది సాధారణ పద్ధతే. ఈ నేపథ్యంలోనే హెర్మీస్ ట్రిస్మెజిస్టస్ అనే విశిష్టమైన రూపం ఆవిర్భవించింది.
ఈ వ్యాసం మూడు భాగాలుగా ప్రచురితమవుతుంది, ఇది మొదటి భాగం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
