ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చి దాదాపు పంతొమ్మిది నెలలు పూర్తయింది.
కానీ రాజ్యాంగబద్ధ సంస్థలైన ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర సమాచార హక్కు కమిషన్, రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్, ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త, ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్ లాంటి వాటికి నియామకాలు జరపకుండా జాప్యం చేయడం, వాటిని పట్టించుకోకపోవడం విచారకరం. వీటిపట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారనడానికి అనేక కారణాలున్నాయి.
అందులో ప్రధానమైనది- వారు ఇచ్చే సూచనలు, సలహాలు, తీర్పులు, ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయకపోవడం ఒకటైతే, రెండవది భర్తీ చేయడానికి వచ్చిన అభ్యర్థులలో తమ ప్రభుత్వానికి అనుకూలమైన వారిని ఎంపిక చేయాలని సుదీర్ఘ కసరత్తులు చేయడం.
ఒకవేళ భర్తీ చేసి పదవి పొందిన తర్వాత ప్రభుత్వం పట్ల ఎటువంటి వైఖరితో ఉంటారో అనే ఒక పెద్ద అనుమానం.
అన్నిటినీ ముఖ్యమంత్రి మాత్రమే ఎంపిక చేయాలి కాబట్టి వీటిని ఎనిమిది నెలలుగా భర్తీ చేయకపోవడానికి ఒక కారణం కావొచ్చు.
వాస్తవానికి ఈ పదవులన్నీ ఒకరు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి భర్తీ చేస్తే బాగుండేది, కానీ ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో భర్తీ చేయడం కాస్త పెద్ద ప్రహసనంగా మారిపోయింది.
న్యాయస్థానం జోక్యం – మందలింపులు..
రాజ్యాంగబద్ధ కమిషన్ల నియామకంలో జాప్యం చేస్తున్నారనే విషయమై కొంతమంది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం – హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండకూడదని హైకోర్టు తీవ్రంగా మందలించడంతో కొన్ని కమిషన్లకు అభ్యర్థులు తమ దరఖాస్తులను పంపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు, రాజ్యాంగబద్ధ సంస్థలను ఎప్పటిలోగా భర్తీ చేస్తారో సమయాన్ని, కాలాన్ని నిర్దిష్టంగా తెలియజేయాలని ఆదేశించింది.
హైకోర్టు ఆదేశించి మూడు నెలలు గడిచినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నియామకాల భర్తీని పూర్తి చేయలేదు.
నియామకాల్లో కూటమి రాజకీయాల ప్రభావం..
రాజ్యాంగబద్ధ పదవులకు అర్హత, అనుభవం, రాజ్యాంగం పట్ల అవగాహన, సమాజం పట్ల నిబద్ధత, ప్రజల పట్ల గౌరవం ఉన్నవారికి భర్తీ చేయాలి.
వీటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకులో భాగంగానే చూస్తుంది.
కొన్నింటిని తమ పార్టీకి అనుకూలమైన వారిని నియమించాలని భావించినప్పటికీ, కూటమిగా(టీడీపీ – జనసేన – బీజేపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కాబట్టి మూడు పార్టీలకు అనుకూలమైన వారిని, అందరూ అంగీకరించే వారిని నియమించాలనుకోవడం ఇబ్బందిగానే ఉంటుంది.
విశ్రాంత అధికారుల నియామకం – రాజకీయ పునరావాసం..
ఇటీవలి కాలంలో ఈ పదవులకు విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమించడం పరిపాటిగా మారింది.
తాము ఉద్యోగాన్ని నిర్వహించే సమయంలో తమ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన వారిని నియమించుకోవడం, తాము చేయమని చెప్పిన పనిని తూచా తప్పకుండా చేసినవారిని నియమించాలని చూడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.
ఈ నియామకాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చాలనుకోవడం విచారకరం.
గతంలో నియమించిన చాలా మటుకు నియామకాలు అధికారంలో ఉన్న పార్టీకి గతంలో ఏమైనా లబ్ధి చేకూర్చింటే, వాటికై ప్రతిఫలం చెల్లించే విధానంలో భర్తీ జరుగుచున్నాయని ప్రజలలో చర్చనీయాంశంగా మారింది. దీని వలన రాజ్యాంగ సంస్థల స్థాయిని దిగజార్చడం అవుతుంది తప్ప మరొకటి కాదు.
భర్తీ చేయవలసిన ప్రధాన రాజ్యాంగబద్ధ సంస్థలు – ఖాళీలు..
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయవలసిన ప్రధానమైన రాజ్యాంగబద్ధ సంస్థలు, వాటి ఖాళీలు ఈ కింది విధంగా ఉన్నాయి:
ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవి 2024 మార్చి నెల నుంచి ఖాళీగా ఉన్నది.
హైకోర్టు జడ్జి జస్టిస్ సీతారామమూర్తి పదవీ విరమణ పొందిన తర్వాత రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్‌గా 3 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత ఇప్పటికీ భర్తీ కాలేదు.
ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు కమిషన్(సమాచార హక్కు చట్టం 2005)లో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌తో పాటు 10 మంది వరకు కమిషనర్లను నియమించుకునే వెసులుబాటు ఉంటుంది.
చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పదవీకాలం ముగిసి నెలలు గడిచాయి. ప్రస్తుతం కేవలం ముగ్గురు కమిషనర్లు మాత్రమే ఉన్నారు.
వీరు కూడా సరైన సమయంలో సమాచారం అప్పీళ్లపై స్పందించడం లేదు. దీని వలన అప్పీళ్ల పరిష్కారంలో తీవ్రమైన జాప్యం నెలకొని ఉంది.
దీని వలన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సమాచార హక్కు కొరకు కోరిన వారిపై చులకన భావం, హేయమైన భావం ఏర్పడే అవకాశం ఉంది.
ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార హక్కు చట్టం 2005ను నిర్వీర్యం చేసే పనిలో భాగంగా చట్టంలో చాలా మార్పులు తీసుకువచ్చాయి.
కమిషనర్ల నియామకంలో ఉండే జస్టిస్‌కు బదులుగా కేంద్ర మంత్రి సభ్యుడిగా ఉండే నియామక ప్రక్రియ(జ్యూరీ)ను ఏర్పాటు చేశారు.
సమాచార హక్కు కోసం అడిగే వారిపై అవినీతిపరులుగా ముద్రలు వేసి, భౌతికంగా నిర్మూలించే కార్యక్రమాలు చాలా రాష్ట్రాలలో జరుగుతూ ఉన్నాయి.
లోకాయుక్తలో ఇన్‌ఛార్జి పాలన..
ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త 2024 సెప్టెంబర్ నుంచి ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఉప లోకాయుక్తే ఇన్‌ఛార్జి(ఎఫ్ఏసీ) లోకాయుక్తగా వ్యవహరిస్తున్నారు.
ఏపీపీఎస్సీలో ఖాళీలు – నిరుద్యోగులపై ప్రభావం..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) చైర్మన్ పదవి 2024 అక్టోబర్ నుంచి ఖాళీగా ఉంది.
మొత్తం 9 మంది సభ్యులు ఉండవలసి ఉండగా మూడు ఖాళీలున్నాయి. మిగతా వారు కూడా త్వరలోనే వయస్సు రీత్యా పదవీ విరమణకు దగ్గరలో ఉన్నారు(62 సంవత్సరాలు).
ప్రభుత్వం వాగ్దానాలలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు, ఉద్యోగాల నోటిఫికేషన్, పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల ప్రక్రియపై కమిషన్‌లోని ఖాళీల వల్ల కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏపీపీఎస్సీని కూడా పూర్తిగా భర్తీ చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది.
వినియోగదారుల కమిషన్‌లో జాప్యం – సామాన్యులకు నష్టం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఏపీ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెస్సల్ కమిషన్) చైర్మన్ పదవి 2024 ఫిబ్రవరి నుంచి ఖాళీగా ఉన్నది.
ఈ కమిషన్‌లో చైర్మన్‌తో పాటు నలుగురు సభ్యులు ఉంటారు. ఇప్పుడు కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు.
జిల్లా వినియోగదారుల కమిషన్లు ఇచ్చే తీర్పులపై అప్పీలుకు పోవడానికి ఈ కమిషన్‌లో దాఖలు చేయవలసి ఉంటుంది.
వినియోగదారుల సమస్యలపై రాష్ట్రస్థాయి అప్పిలేట్ అథారిటీగా ఈ కమిషన్ పనిచేస్తుంది. ఇక్కడ వచ్చే తీర్పులు వినియోగదారులకు రావలసిన బకాయిల విషయంలోనూ లేదా నష్ట పరిహారం చెల్లించడంలోనూ, నష్ట పరిహారం తక్కువగా ఉంటే దాన్ని పెంపుదల విషయంలోనూ చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పదవులను వెంటనే భర్తీ చేయాలి. లేదంటే వినియోగదారులు ఈ కమిషన్ చుట్టూ తిరగడానికే ఖర్చులకు నష్టపోయే ప్రమాదం ఉంది. తద్వారా నష్టపరిచే వారు, బ్లాక్ మార్కెట్ దారులు లాభపడే ప్రమాదం ఉంది.
ఈ పదవిని రెండు సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంచారంటే రాష్ట్ర ప్రభుత్వానికి చాలా అవమానకరం లేదా ప్రజలకు నష్టం చేయడమే అవుతుంది.
విద్యుత్ నియంత్రణ మండలిలో చైర్మన్ పదవి ఖాళీ..
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్) చైర్మన్ పదవి 2024 అక్టోబర్ నుంచి ఖాళీగా ఉంది. ఇందులో కూడా ముగ్గురు సభ్యులు ఉంటారు.
ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఒక సభ్యుణ్ణి(అంతకుముందు పనిచేసి రిటైర్డ్ అయిన వారిని) సభ్యునిగా నియమించింది. చైర్మన్‌ను మాత్రం నియమించలేదు. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తిని సాధారణంగా చైర్మన్‌గా నియమించే సాంప్రదాయం కొనసాగుతూ ఉంది.
ఈ విద్యుత్ నియంత్రణ మండలి పని విధానం ఏమిటంటే, వ్యవసాయ వినియోగదారుల లేదా చిన్న, చిన్న కుటీర పరిశ్రమల వారిపై విద్యుత్ బిల్లు భారం ఎక్కువగా పడినా లేదా సరిగా విద్యుత్ సరఫరా కానప్పుడు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే దాదాపు నెలకోసారి కమిషన్ జిల్లాల వారీగా పర్యటిస్తూ ఉంటుంది.
విచారణ జరిపి సమస్యలపై పరిష్కార మార్గం లేదా విద్యుత్ అధికారులు తప్పులు చేస్తే వారిపై చర్యలకు ఉపక్రమించే మార్గం కూడా ఉంటుంది. దీనిని కూడా రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం విచారకరం.
భర్తీకి నోచుకోని ఇతర కమిషన్లు – విస్మరించిన ఎన్నికల హామీలు..
అంతేకాకుండా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్, రాష్ట్ర బీసీ కమిషన్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వీటిని నియమించలేదు. అన్నిటికీ మించి గత ప్రభుత్వం చేసిన భూ ఆక్రమణలపై, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణ, పుంగనూరుకి 3 కిమీ దూరంలో రాజ ప్రాసాదం లాంటి భవనాన్ని నిర్మించడం లాంటి ఘటనలపై ఒక ప్రత్యేక కమిషన్ వేసి విచారణ జరిపిస్తానన్న ఎన్నికల హామీని కూడా ముఖ్యమంత్రి తుంగలో తొక్కారు.
రుషికొండ ప్యాలెస్ పై ప్రణాళికా లోపం..
గత ప్రభుత్వం ఒక చోట ఏకంగా రుషికొండ ప్యాలెస్ వందల కోట్లతో నిర్మించి, కనీసం దానిని ఏవిధంగా వినియోగించుకోవాలో ఈ ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక లేదు.
లేదా దానిపై ఏమైనా విచారణ జరిపి నిధుల దుర్వినియోగం చేసిన వారిపై ఏమైనా చర్యలకు ఉపక్రమించిందా అంటే అదీ లేదు. కేవలం పత్రికల ఆకర్షణ కోసం వెదజల్లడం తప్ప ఏమీ లేదు.
మద్యం నియంత్రణలో వైఫల్యం – విచ్చలవిడితనం..
ప్రజలను మద్యం మత్తులో ముంచి, మద్యాన్ని చిన్న పిల్లలకు(1-14 సంవత్సరాల వయస్సు) కూడా అలవాటుచేసే విధంగా ప్రభుత్వ వ్యవహారం ఉంది తప్ప మరొకటి లేదు.
ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారులు కేవలం షాపుల లైసెన్సులు, వసూళ్లపై వారి పనిలో ఉన్నారు తప్ప మద్యాన్ని, బెల్టు షాపులను నియంత్రించే కార్యక్రమం చేపట్టడం లేదు.
గతంలో ఉన్న మద్య నియంత్రణపై ప్రజలకు అవగాహన చేసే ఒక కమిటీని కూడా ఇంతవరకూ ఈ ప్రభుత్వం నియమించలేదు.
విద్యా పాఠశాలల పర్యవేక్షణ కమిషన్ నిర్వీర్యం..
ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చట్టం- 2019 ప్రకారం కొంతమంది విద్యావేత్తలతో, లేదా విద్యపై పనిచేసిన మేధావులతో, తల్లిదండ్రుల సమన్వయ కమిటీ, ఒక ఐఏఎస్ అధికారితో (మొత్తం 5 మంది) రాష్ట్రస్థాయిలో 1-10 తరగతులు నిర్వహించే అన్ని విద్యాసంస్థల పనివిధానం, వసతులు, విద్యార్థుల కష్టాలు, పని భారం, ప్రైవేట్, ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటిపై విచారణ చేయడానికి రాష్ట్రస్థాయిలో ఒక కమిటీ, ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలి.
సంవత్సరానికొకసారి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించే వీలు ఉంటుంది. దీనిని అసలు ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నియామకాలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
