కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని సంకల్పించినట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నది.
పైగా తరగతి గదుల్లోనే తెలంగాణ భవిష్యత్తు ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిపి దాదాపు 29 వేల పాఠశాలలు ఉన్నాయి. అందులో సుమారు 25 వేల ప్రైవేటు బడులకు సొంత రవాణా సౌకర్యాలు ఉన్నాయి.
తమ బడిలో చేరిన పిల్లలను తీసుకొచ్చి, తిరిగి వదిలిపెట్టడానికి ఆ వాహనాలున్నాయి.
అయినా పసి పిల్లల భద్రత విషయంలో అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి.
కేవలం ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఐదు మాసాలలో జరిగిన రోడ్డు ప్రమాద బాధితుల్లో 10 శాతం మంది పిల్లలే ఉన్నట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయని ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొన్నది.
పిల్లల భద్రత ఎంత ప్రమాద స్థాయిలో ఉందో, పిల్లల భద్రత విషయంలో ఎంత మేరకు దృష్టి పెడుతున్నారనేది ఈ గణాంకాలను పరిశీలిస్తే అర్థం చేసుకోవచ్చు.
ఇవి కేవలం ఐదు మాసాల లెక్కలే. ఇవి కాకుండా హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో, యావత్తు దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో పిల్లలు బాధితులుగా మారుతున్న లెక్కలు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో బడి పిల్లల భద్రతను వారే చూసుకోవాలని ఒక పోలీసు ఉన్నతాధికారి పిల్లలకు పాఠాలు చెప్పడం విశేషం.
ముఖ్యమంత్రి ఆకాంక్ష – క్రీడల్లో పతకాలు..
కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వ బడులను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో స్థాపించిన “తెలంగాణ పబ్లిక్ స్కూల్”ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రారంభించారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, బడి పిల్లల భద్రత గురించి కనీసం ప్రస్తావించకుండా విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి మాట్లాడారు.
దానితో పాటు మన విద్యార్థులు క్రీడల్లో బాగా రాణించి 2034లో జరిగే ఒలింపిక్స్లో బంగారు పతకాలను సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రిగా ఇలాంటి కోరికను, ఆకాంక్షను వ్యక్తం చేయడంలో ఎంతమాత్రం తప్పులేదు. నిజంగా అది సఫలమైతే ప్రభుత్వానికి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు వస్తుంది.

భవిష్యత్తులో మరికొందరు ఉత్తమ క్రీడాకారులు పుట్టవచ్చు. అయితే విద్యార్థులు ఆ స్థాయికి చేరుకోవడానికి కావల్సిన భద్రత ఎవరు కల్పించాలి? అది ఎవరి బాధ్యత?
భద్రతను గాలికి వదిలేసిన ప్రైవేట్ బడులు..
నూతన ఆర్థిక విధానాల పుణ్యమా అంటూ 1991 నుంచి పుట్టగొడుగుల్లా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు వెలిశాయి.
పాఠశాలల ఏర్పాటుకు కావల్సిన కనీస మౌలిక సదుపాయాలు, పిల్లల భద్రత ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం అనుమతులను మంజూరు చేస్తూనే ఉంది.
ఉదయాన్నే ఇంటి నుంచి బడికి బయలుదేరిన పిల్లలు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారా అన్న ఆందోళనతో తల్లిదండ్రులు కొట్టుమిట్టాడుతున్న రోజులివి.
బడి పిల్లల నుంచి కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల విషయం వరకు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్లో రోడ్డు భద్రత డొల్లత..
పిల్లల భద్రత విషయంలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నగర పోలీస్ ట్రాఫిక్ విభాగం ఇటీవల “పాఠశాల విద్యార్థుల రోడ్డు భద్రత” పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్ విభాగం) జోయల్ డేవిస్ పాల్గొని ప్రమాద గణాంక వివరాలను తెలియజేశారు.
పాఠశాల పిల్లల భద్రత విషయంలో అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేటు యాజమాన్యాలు ఏ మేరకు బాధ్యత వహిస్తున్నాయో ఈ డేటా ప్రకారం తెలిసిపోతుంది.
ఈ డేటా ప్రకారం హైదరాబాద్ నగరంలో 80 శాతం స్కూళ్లకు “స్కూల్ జోన్” బోర్డులు లేవు. 90 శాతం స్పీడ్ లిమిట్ సైన్లు లేవు. 70 శాతం జీబ్రా క్రాసింగ్లు లేవు. 70 శాతం స్పీడ్ బ్రేకర్లు లేవు. 60 శాతం పైగా సరైన ఫుట్పాత్లు లేవు. 70 శాతం పికప్ – డ్రాపింగ్ జోన్లు లేవు. 80 శాతం వరకు ప్రమాదాలను నమోదు చేసే నిర్మాణాత్మక వ్యవస్థ లేదు.
హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ముఖ్యంగా పాఠశాల పిల్లలకు భద్రతకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాల పరిస్థితికి ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి.
పైగా చైనా రాజధాని బీజింగ్ తర్వాత అత్యధిక సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు ఉన్న ప్రపంచంలోనే రెండవ నగరంగా హైదరాబాద్ ఉందని పాలకులు అప్పుడప్పుడు గొప్పలు చెబుతుంటారు.
ఆందోళనకరంగా ప్రమాదాల గణాంకాలు..
ఇక రోడ్డు ప్రమాదాల విషయానికి వస్తే జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్ విభాగం) తెలియజేసిన వివరాల ప్రకారం ఈ ఏడాది మొదటి ఐదు మాసాలు (జనవరి నుంచి మే వరకు) జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 శాతం బాధితులు పిల్లలే ఉన్నట్లు తెలిసింది.
ఈ కాలంలో నగరంలో 1,604 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా, అందులో 141 ప్రాణాంతక ప్రమాదాలు, 86 తీవ్రంగా గాయపడినవి, 1,377 ప్రమాదాల్లో స్వల్పంగా గాయపడిన వారున్నారు.
అలాగే 18 సంవత్సరాల వయస్సులోపు ఉన్న ఏడుగురి మరణంతో సహా మొత్తం 128 మంది పిల్లలు ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడ్డారు. తెలంగాణలో ప్రతి ఏటా జరుగుతున్న సుమారు 7 వేల రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 10-15 శాతం వరకు పిల్లలు గాయపడుతున్నారని ఆయన తెలిపారు.
ఇవి కాకుండా దేశంలో ప్రతిరోజూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 5 నుంచి 19 సంవత్సరాల లోపు ఉన్న 45 మంది పిల్లలు మరణిస్తున్నారు. ఈ విధంగా 2011 నుంచి 2025 వరకు జరిగిన ప్రమాదాల్లో సుమారు 2 లక్షల మంది పిల్లలు తమ ప్రాణాలను కోల్పోయారని జోయల్ డేవిస్ వివరించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ద్విచక్ర వాహన ప్రమాదాల్లో 94 శాతం మంది పిల్లలు చనిపోతున్నారని చెప్పారు.
ప్రభుత్వ వైఫల్యం – ప్రజలపై నెపం..
రోడ్డు ప్రమాదాల నివారణ, బడి పిల్లల భద్రత విషయంలో ఉన్న అనేక లోటుపాట్లను ఇటు ప్రభుత్వం, అటు ప్రైవేట్ యాజమాన్యాలు సరిదిద్దకుండా, దానికి బదులుగా పిల్లలు వారి భద్రతను వారే చూసుకోవాలని, ఆటో రిక్షాలలో ఆరుగురికి మించి పంపించరాదని, నాలుగు సంవత్సరాలు పైబడిన పిల్లలు ఖచ్చితంగా హెల్మెట్ ధరించే విధంగా చూడాలని, కారు ముందు భాగంలో 12 సంవత్సరాల లోపు పిల్లలు కూర్చోరాదని పిల్లలకు, వారి తల్లిదండ్రులకు పాఠాలు చెప్పారు.
రోడ్డు భద్రత నియమాలు అందరూ పాటించాలి. అయితే ఆ నియమాల గురించి ప్రజలను చైతన్యవంతులను చేయడం ప్రభుత్వ బాధ్యత. అలాగే ఆ నియమాలు పాటించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇవేవీ చేయకుండా హిత వచనాలు పలకడం ఆత్మవంచన తప్ప మరొకటి కాదు. అలాగే విద్యాసంస్థల బస్సులకు పర్మిట్లు ఇస్తున్నది ప్రభుత్వమే. పర్మిట్లు ఇచ్చేటప్పుడు గానీ, ఆ తర్వాత పర్మిట్ నిబంధనలు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా, వాహన కండిషన్ ఎలా ఉందో పర్యవేక్షించి, సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే అనుమతులు లేదా పునరుద్ధరణ చేయాలి. ఇది ప్రభుత్వ బాధ్యత.
కానీ అనేక విద్యాసంస్థల బస్సుల ప్రమాదాలు వాహన కండిషన్ సరిగా లేకపోవడం, రోడ్ల నిర్మాణంలో భద్రతకు అవసరమైన ఏర్పాట్లు చేయకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణాలు.
పెద్దపెద్ద విద్యాసంస్థలన్నీ ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉండి రాజకీయనాయకుల ప్రాభల్యం ఉన్నందుకే నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. “చట్టం ముందు అందరూ సమానులే” అనే దాన్ని అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా చిత్తశుద్ధితో అమలు చేయాలి.
ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమవుతున్నది. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను, వాహనాలు నడిపే వారిపై నిందారోపణలు చేసి బలి పశువులను చేస్తున్నారు. ఇది అత్యంత గర్హనీయం.
హైదరాబాద్ నగరంలో పిల్లలే కాదు, పెద్దలు సైతం రోడ్డు దాటాలంటే నరకయాతనగా ఉంది. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. పాదచారులు నడవడానికి ఫుట్పాత్లు సరిగా లేవు. ఒకవేళ ఉన్నప్పటికీ వినియోగించుకోవడానికి ఏ మాత్రం వీలుకాకుండా ఉన్నాయి.
ప్రపంచంలోనే అనేక దేశాలలో “పాదచారే రాజు” అనే విధానం అమలులో ఉంది. పాదచారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఆ దేశాలలో ఉంది. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మారుస్తామని పదేపదే మాట్లాడే మాటలు వాస్తవ పరిస్థితిని గమనించాలి. పాదచారులు సురక్షితంగా నడవడానికి రోడ్లు, ఫుట్పాత్లు, ప్రధాన కూడళ్లను అనుకూలంగా నిర్మించాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
