2026 జూన్ 15 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ ప్రారంభమయింది.
రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా చేస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ ఎంతో సంతోషదాయకంగా జరగాలని ప్రజలు ఆశిస్తున్నారు. అయినప్పటికీ, దానికి ఆధార్ తదితర గుర్తింపు కార్డుల(ఐడెంటిటీ) పేరుతో నిజమైన ఓటర్లను తొలగించకుండా ఉంటే చాలని అందరూ భావిస్తున్నారు.
ఈ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పట్ల అన్ని రాజకీయ పార్టీల్లోనూ, ప్రధానంగా బీజేపీయేతర పార్టీలలో ఆందోళన నెలకొంది.
ఎందుకంటే, ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీ ఓటర్లను తొలగింపజేస్తుందనే భయం నెలకొంది.
ప్రతిపక్ష పార్టీలన్నీ జరుగుతున్న విధానంపై భయంతో ఉన్నాయి. ఒక రకంగా ప్రజలపై కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దాడిగా దీనిని భావిస్తున్నాయి.
ప్రధానంగా క్రైస్తవ, ముస్లిం మైనారిటీ ప్రజల ఓట్లను తొలగించే విధంగా ఈ సవరణ ప్రక్రియ జరుగుతున్నట్లు, గతంలో బీహార్, పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో దాదాపు 60 లక్షల ఓట్ల తొలగింపు జరిగిందనేది అక్కడ పోటీ చేసిన ప్రధాన ప్రతిపక్ష పార్టీల ఆరోపణ.
బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఆ విధంగా ఓట్లను తొలగించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఎన్నడూ రాని విధంగా ఆయా రాష్ట్రాలలో అధికారంలోనికి రాగలిగిందనేది పచ్చి నిజం. కాబట్టి ఈ సవరణ ప్రక్రియపై మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే పునరావృతం అవుతుందనేది ప్రధాన ప్రతిపక్ష పార్టీల ఆరోపణ.
ఓటర్ల జాబితా – మ్యాపింగ్ గణాంకాలు..
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 4.16 కోట్ల మంది ఓటర్ల వివరాలను పరిశీలించి, ఎన్యూమరేషన్(గణన) ప్రక్రియను చేపట్టాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది.
అయినప్పటికీ, ఆందోళనకరమైన విషయం ఏంటంటే- రాష్ట్రంలోని మొత్తం 4,16,19,359 మంది ఓటర్లలో ఇప్పటికే 2,68,86,239 మందికి మించి 2002లో జరిగిన ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ పూర్తి చేశారు. అంటే ఇంకా దాదాపు 1,47,32,120 మందికి మ్యాచింగ్ చేయాల్సి ఉంది.
జూలై 14 వరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు(బీఎల్ఓ) ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలను సేకరిస్తారు. ప్రతి ఇంటినీ కనీసం మూడు సార్లు సందర్శించి ఓటర్ల వివరాలను వారు నిశితంగా ధ్రువీకరించాలని బీఎల్ఓలకు ఆదేశాలు జారీ చేశారు. అధికారుల ఒత్తిళ్లు తీవ్రంగా ఉంటే, ఈ ప్రక్రియ వికటించే అవకాశాలు లేకపోలేదు.
ఎన్నికల సంఘం షెడ్యూల్ – అప్రమత్తమైన పార్టీలు..
వాస్తవానికి ఈ ప్రక్రియ మరణించిన ఓటర్లను తొలగించడం, కొత్త ఓటర్లను చేర్చడం, తప్పులు సరిదిద్దడం, అనర్హులైన వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించడం లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం ప్రారంభించింది.
ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, జూలై 21 ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. అనంతరం ప్రజల నుంచి అభ్యంతరాలు, సవరణలు, కొత్త దరఖాస్తులను పరిశీలించిన తర్వాత సెప్టెంబర్ నెలలో తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.
ఈ ప్రక్రియ కోసం రాజకీయ పార్టీలు సైతం తీవ్రంగా అప్రమత్తమయ్యాయి. రెండు నెలల ముందు నుంచే ఈ సమగ్ర సవరణపై రాజకీయ పార్టీలు తమ శ్రేణులకు జిల్లాల వారీగా శిక్షణా తరగతులు నిర్వహించాయి. తద్వారా తమ తమ ఓటర్ల పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించకుండా జాగ్రత్త పడాలని, అర్హులైన కొత్త ఓటర్ల పేర్లు నమోదయ్యేలా చూడాలని క్షేత్రస్థాయి(క్రింది స్థాయి) నాయకులకు దిశానిర్దేశం చేశాయి.
ఈ ప్రక్రియలో వివిధ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లనుబీఎల్ఏ) కూడా భాగస్వామ్యం చేయాలని ఎన్నికల సంఘం కోరింది. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.
వివాదాస్పద నిబంధనలు – మహిళల ఇబ్బందులు..
ఈ ప్రక్రియ వల్ల క్షేత్రస్థాయిలో అంతులేని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2002 నాటి ఓటర్ల జాబితా మహిళల పాలిట శాపంగా మారింది. ఈ సవరణ ప్రక్రియలో అత్యంత వివాదాస్పదమైన, అసంబద్ధమైన అంశం ఏంటంటే, ఈ మ్యాపింగ్ అంతా రెండు దశాబ్దాల క్రితం నాటి రికార్డులను నేటి వాస్తవిక పరిస్థితులకు ప్రామాణికంగా తీసుకోవడం. దీనివల్ల ఈ ప్రత్యేక సవరణతో అత్యధికంగా నష్టాలే కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా 2002 సంవత్సరం తర్వాత పెళ్లయిన అమ్మాయిలకు ఈ నిబంధన పెద్ద తలనొప్పిగా మారింది.
వారు ప్రస్తుతం నివసిస్తున్న అత్తింటి ఊరిలో సహజంగానే పాత ఓటర్ల లిస్టులో వారి పేరు ఉండదు.
దీని పరిష్కారం కోసం మొదట వారు పుట్టిన ఊరికి వెళ్లి, అక్కడ తమకు చెందిన తహసీల్దార్ ఆఫీసులో సంప్రదించాల్సి ఉంటుంది.
వారి ఊరి బీఎల్ఓ లేదా అంగన్వాడీ టీచర్ దగ్గర ఉన్న 2002 ఓటర్ల లిస్టులో తమ తండ్రి లేదా తల్లి పేరు, సీరియల్ నంబర్ వెతుక్కోవాలి.
ఆ సీరియల్ నంబర్‌ను తీసుకొచ్చి ప్రస్తుతం తాము ఉంటున్న ఊరిలోని బీఎల్ఓకు ఇస్తే, ఆ నంబర్‌తో వారి మ్యాపింగ్ చేసి కొత్త జాబితాలో చేర్చుతారు.
ఒకవేళ ఈ పద్ధతి అంతా చేసుకోలేకపోతే వారు తమ ఓటు హక్కును శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది.
ఆర్థిక స్తోమత లేకపోవడం వల్లో, దూరాభారం వల్లో, సమయం లేకనో ఈ పని చేసుకోలేకపోతే, అది అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు అనుకూలంగా మారే ప్రమాదం ఉంది. ఆ తర్వాత మనం ఎదుర్కోబోయే అనేక సమస్యలకు ఇది పునాది రాయిగా మారిపోతుందనేది కఠోర సత్యం.
సంక్లిష్టమైన మ్యాపింగ్ విధానం..
సంక్లిష్టమైన మ్యాపింగ్ విధానం సామాన్యులకు అయోమయం కలుగజేస్తోంది. మహిళల సమస్యలు ఒక ఎత్తైతే, ఈ ప్రక్రియలోని నిబంధనలు, అందులోని ప్రశ్నావళి ఓటర్లకు పెద్ద తలనొప్పిగా మారాయి.
ఈ సవరణలో ప్రధానంగా మూడు మ్యాపింగ్ విధానాలను తీసుకువచ్చారు: సెల్ఫ్ మ్యాపింగ్, ఫ్యామిలీ మ్యాపింగ్, రిలేటివ్ మ్యాపింగ్. ఈ విధానాలను సరిగ్గా అర్థం చేసుకోవడం కష్టసాధ్యమైన విషయమే. ఇది సామాన్యులకే కాదు, విద్యావంతులకు సైతం సరిగ్గా అర్థం కాని పరిస్థితి నెలకొంది.
వీటిని ఓటర్లే స్వయంగా స్పష్టంగా చెప్పి మ్యాపింగ్ చేయించుకోవాలి. ఎందుకంటే దేశంలో ప్రతి ఒక్కరి కుటుంబ పరిస్థితి అధికారులకు తెలియకపోవచ్చు.
పైగా క్షేత్రస్థాయిలో ఈ విధులు నిర్వహించేవారు సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు లేదా మహిళా పోలీసులు, వీఆర్ఓలు మాత్రమే.
కాబట్టి “ఓటరే స్వయంగా తమ పరిస్థితికి సరిపోయే మ్యాపింగ్ ఏదో చెప్పి చేయించుకోవడం ముఖ్యం” అని నిబంధనలు చెబుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాలలోని నిరక్షరాస్యులు, దినసరి కూలీలు, కులవృత్తులు చేసుకొని జీవించేవారు, ఉపాధి హామీ పథకం ద్వారా బతికేవారు, వృద్ధులు ఈ ప్రక్రియను ఎలా పూర్తి చేయగలరనేది ప్రభుత్వాలకే తెలియాలి. ఇది ఖచ్చితంగా ప్రజల హక్కులపై, ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా భావించాలి.
ఈ పరిస్థితిని లోతుగా, నిశితంగా పరిశీలిస్తే- ఇవి కేవలం పరిపాలనాపరమైన లోపాలు మాత్రమే కాదు; ప్రజలను సాంకేతిక మాయాజాలంలో బంధించి, వారికి అర్థం కాని నిబంధనలను పెట్టి ఓటు హక్కును దూరం చేసే ప్రణాళికాబద్ధమైన కుట్ర జరుగుతోందన్నది వాస్తవం.
దీనిపై దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదు.
ఓటు హక్కు – రాజ్యాంగ పరమైన రక్షణ..
భారత రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన రాజ్యాంగ హక్కు ఓటు. ఇది పౌరులకు చాలా విలువైనది.
ఐదు సంవత్సరాలకు ఒకసారి తమను తాము పాలించుకోవడానికి, పార్లమెంటుకు లేదా రాష్ట్ర అసెంబ్లీకి ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఓటు హక్కు ఒకే ఒక్క సాధనమని భావించి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సౌకర్యం ఉంది.
అయినప్పటికీ, ఈ హక్కును ప్రజలు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నారనేది మరొక అంశం. కానీ ప్రజల హక్కులను ప్రభుత్వాలు, ఎలక్షన్ కమిషన్ పేరు మీద కాలరాయడం విచారకరం, బాధాకరం.
దేశంలో ఒకవైపు డిజిటల్ విప్లవం నడుస్తోందని చెప్పుకుంటూనే, మరోవైపు ఓటర్ల జాబితా సవరణ కోసం రెండు దశాబ్దాల క్రితం నాటి కాగితాల కోసం పౌరులను వీధుల పాలు చేయడం కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష, అప్రజాస్వామిక నిర్ణయం.
ఈ సవరణ ప్రక్రియ ద్వారా దేశంలో ఎక్కువగా అధికార పార్టీ లబ్ధి పొందుతుందనేది వాస్తవం.
ఓటర్ల జాబితాను ఒక నిర్థిష్టమైన రాజకీయ ఎజెండా కోసం, ప్రతిపక్షాల ఓట్లను గల్లంతు చేయడానికి ఉపయోగిస్తున్నారనేది వాస్తవం. దీనివల్ల ప్రజలలో అసహనం పెరిగే ప్రమాదం ఉంది.
ఎన్నికల సంఘం బాధ్యత – ఆధార్ అనుసంధానం..
ఓటర్ల జాబితాలో తమ వివరాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని నిశితంగా పరిశీలించి ధ్రువీకరించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని ఎన్నికల సంఘం చెబుతోంది.
“ఓటు కోల్పోకుండా చూసుకోవడం మన అందరి బాధ్యత. అందరూ తప్పకుండా మ్యాపింగ్ చేయించుకోవాలి” అని చెబుతున్నప్పటికీ, సదరు ప్రక్రియను సులభతరం చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వ యంత్రాంగం, ఎన్నికల సంఘం తీసుకోకుండా ప్రజలపైనే మోపడం సబబు కాదు.
ఈ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రజలకు క్షేత్రస్థాయిలో చాలా సమస్యలను సృష్టిస్తోంది. ప్రజలలో అసంతృప్తి పెరుగుతోంది.
రాజ్యాంగ హక్కును కాపాడుకోవడానికి ఒక పౌరుడు అడుగడుగునా అంతరాయాలు ఎదుర్కోవలసి రావడం అప్రజాస్వామికం. ఎన్నికల కమిషన్ తక్షణమే ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియలోని లోపాలను సరిదిద్దాలి.
ముఖ్యంగా 2002 నాటి జాబితాతో మ్యాపింగ్ చేసే అసంబద్ధమైన నిబంధనలను, మహిళలకు ఇబ్బందిగా మారిన వివాహ ధ్రువీకరణల షరతులను వెంటనే ఉపసంహరించుకోవాలి.
18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు కల్పించాలన్న రాజ్యాంగబద్ధ హక్కును పరిశీలించి రక్షించే విధంగా ఎన్నికల సంఘం కృషి చేయాలి తప్ప, కేంద్రంలో అధికారంలో ఉన్న అధికార బీజేపీ పార్టీ చెబితే అది అమలు చేసే విధంగా ఎన్నికల సంఘం చర్యలు ఉండకూడదు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం.
ఒక ఓటరును తొలగించాలంటే 2024కు ముందు కొన్ని నిబంధనలు అమలులో ఉండేవి, ఆ తర్వాత వీటిని సవరించారు. సిమిలర్ ఎంట్రీలను(ఒకేలాంటి పేర్లను) తొలగించారు. కొంతమేర డూప్లికేట్ ఓటర్లను తొలగించే ప్రక్రియ సఫలమయింది. రెండు చోట్ల ఓటరుగా నమోదైన వారిని చాలా చోట్ల గుర్తించి తొలగించారు.
డూప్లికేట్ ఓటర్లను తొలగించాలంటే ఓటను ఆధార్ కార్డుతో అనుసంధానించాలి. కానీ ఆధార్ కార్డును ఈ సవరణ నిబంధనలతో ఒక గుర్తింపు కార్డుగా మాత్రమే ఉపయోగించాలి.
అయితే పౌరసత్వ నిర్ధారణ కోసం ఉపయోగించకూడదని, ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన ఓటు హక్కు వచ్చేస్తుందని చెప్పడం కుదరదని, అది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
దీంతో, ఆధార్ కార్డు ద్వారా డూప్లికేట్ ఓట్లను తొలగించడంలో కొంత స్తబ్దత నెలకొంది.
ఈ సవరణ ద్వారా కుటుంబ యజమాని ప్రస్తుతం అందుబాటులో లేని వ్యక్తుల ఎన్యూమరేషన్ పత్రాలను పూర్తి చేసి ఇచ్చే అవకాశం ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందికి అందరు ఓటర్ల గురించి తెలిసే అవకాశం ఉంటుంది. కానీ నగరాలలో ఇళ్లలో ఎవరు ఉంటున్నారో తెలియని పరిస్థితి నెలకొని ఉంటుంది.
ఈ నేపథ్యంలో డూప్లికేట్ ఓట్లను గుర్తించడం కష్టమవుతుంది. కాబట్టి ఓటర్లను ఆధార్‌తో అనుసంధానం చేస్తేనే ఈ సమస్య పరిష్కారమవుతుంది.
సుప్రీంకోర్టు ఆధార్ కార్డును పౌరసత్వ నిర్ధారణకు లేదా నివాస నిర్ధారణకు ఉపయోగించకూడదని చెప్పిందే కానీ, డూప్లికేట్ ఓట్లను తొలగించడంలో ఉపయోగించవద్దని చెప్పలేదు.
కానీ నేడు ఆధార్ కార్డు భారతదేశంలో దాదాపు అందరికీ ఉంది, లేనివారు చాలా కొద్దిమంది మాత్రమే.
శిశువు పుట్టిన తర్వాత కొద్దిరోజులకే ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు. ప్రతి చిన్న ప్రభుత్వ కార్యకలాపాలకు ఆధార్ కార్డును వినియోగిస్తున్నారు.
ఎవరైనా ఆధార్ కార్డు ఉన్న చోటే ఓటు హక్కు కలిగి ఉండడం కూడా సమంజసంగా ఉంటుంది.
ఒకవేళ ఆధార్ కార్డు ఒక చిరునామాలో ఉండి, ఓటు హక్కు ఇంకో చిరునామాలో ఉంటే, ఆధార్ కార్డు అడ్రసును త్వరితగతిన మార్చుకోవాలి. ఇది కూడా ఇప్పుడు సులభతరం అయింది. దీనితో అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆ విధంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన అవుతుంది.
ఏది ఏమైనా ఓటర్ల జాబితా ప్రక్షాళనలో బీఎల్ఓలు, వారి పై అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, రాజకీయ పార్టీలు, ప్రజలు నిష్పక్షపాతంగా, నిజాయితీగా వ్యవహరించినట్లయితేనే ఓటర్ల జాబితా పూర్తిగా ప్రక్షాళన అవుతుంది. అప్పుడు మాత్రమే ఈ ప్రత్యేక సమగ్ర సవరణ లక్ష్యం పూర్తిగా నెరవేరినట్లవుతుంది.
అంతేకానీ కేంద్ర ప్రభుత్వము, వారి ప్రతినిధుల ఆదేశాల మేరకు జరిగితే లక్ష్యం నెరవేరదు.
పశ్చిమ బెంగాల్లో దాదాపు 60 లక్షల ఓటర్ల జాబితా అప్పీళ్లు ఐఏఎస్ అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఎన్నికలను నిర్వహించారు.
దాదాపుగా అధికారులు, ఎన్నికల కమిషన్ ఏక పక్షంగా కేంద్ర అధికార పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతున్నది.
బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల సరిహద్దుల వల్ల విదేశీయులు కూడా ఓట్లను భారతదేశంలో కలిగి ఉన్నారనే ఆరోపణను అధికార పార్టీ చేసింది.
ఎన్నికల కమిషన్ కూడా వారికి సహకరించింది. కానీ ఇప్పటికీ అప్పీళ్ల వ్యవహారం మాత్రం పరిష్కరించబడలేదు.
ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఎన్నికల కమిషన్‌ను సమర్థించడం విచారకరమైంది.
ఆంధ్రప్రదేశ్‌లోనైనా ఈ ప్రత్యేక సమగ్ర సవరణ నిజాయితీగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆశిద్దాం. అందుకు ప్రజాస్వామ్యవాదులందరూ కృషి చేయాలి.
చిమ్మె జాన్ బర్నబాస్
ఎమ్ఏ, ఎల్ఎల్ఎమ్, పీజీడీఏడీఆర్.
న్యాయవాది – ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
