ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 325, 326 ప్రకారం మతం, కులం, జాతి, లింగం అనే భేదాలు లేకుండా ప్రతి అర్హ పౌరుడికి ఓటు హక్కు కల్పించబడింది.
ఈ హక్కు కేవలం ఎన్నికల్లో ఓటు వేయడానికి మాత్రమే కాదు, ప్రజాస్వామ్యంలో పౌరుని సమాన హోదాకు ప్రతీక. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన “ప్రత్యేక విస్తృత సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – సర్)” దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మరణించినవారి పేర్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు, డూప్లికేట్ నమోదులను తొలగించడం ఎన్నికల జాబితా స్వచ్ఛతకు అవసరమే.
అయితే, ఆ ప్రక్రియలో నిజమైన పౌరులు తమ అస్తిత్వాన్ని, తమ ఓటు హక్కును మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే అది సహజంగానే తీవ్ర ఆందోళనకు కారణమవుతుంది.
“ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ అనేది కేవలం పరిపాలనా కార్యక్రమం మాత్రమే కాదు, ఓటు హక్కు కోసం తరాలుగా సాగిన ప్రజాస్వామ్య పోరాటాల ఫలితాన్ని సంరక్షించే బాధ్యత”.
ఎన్నికల సంఘం విశ్వసనీయతపై నీలినీడలు..
ఎన్నికల సంఘం రెండు దశల ప్రక్రియను పూర్తి చేసింది. ఆ రాష్ట్రాలలోని మొత్తం ఓట్లలో సుమారు 10 శాతం(5.29 కోట్లు) ఓట్లను తొలగించి ఉండవచ్చని ఒక అంచనా. ఓట్ల తొలగింపుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి.
బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలకు ముందు “సర్” చేపట్టడం పెద్ద వివాదాస్పదంగా మారింది. ఎన్నికల సంఘం విశ్వసనీయతపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ప్రత్యేక విస్తృత సవరణ ప్రక్రియతో పౌరసత్వాన్ని “లింక్” పెట్టడం అత్యంత తీవ్రమైన సమస్యగా పరిగణించి, దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఉద్యమించారు. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. భారత ఎన్నికల సంఘానికి ఆ అధికారం ఉన్నదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం మూడవ దశలో భాగంగా మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రక్షాళన ప్రక్రియ మొదలయ్యింది.
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 15 నుంచి బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారు. సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని ప్రకటించారు. మా ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు.
ఈ ప్రక్రియను రాగద్వేషాలకు అతీతంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలి. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుకు ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కల్పించకూడదు.
ఓటు హక్కు అనేది కేవలం ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశం మాత్రమే కాదు, అది ప్రజాస్వామ్యంలో పౌరుని గౌరవానికి, సమానత్వానికి ప్రతీక.
18 ఏళ్లకు ఓటు హక్కు – యువత పోరాట చరిత్ర..
“సర్” ప్రక్రియ కొనసాగుతున్న ఈ సందర్భంలో, 18 ఏళ్ళకు ఓటు హక్కు కల్పించాలనే డిమాండ్‌తో గతంలో జరిగిన ఉద్యమాలను గుర్తు చేయడం అవసరమని భావించాను.
కోట్లాది మంది యువత ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారంటే, దాని వెనుక విద్యార్థులు, యువజనులు సాగించిన ప్రజాస్వామ్య ఉద్యమాల చరిత్ర ఉంది.
నేడు పద్దెనిమిది సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి భారతీయ యువతీ యువకులకు ఓటు హక్కు సహజంగా లభిస్తున్నది. కానీ, ఈ హక్కు సులభంగా రాలేదు.
1977 నవంబర్ 28న 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ – ఏఐవైఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన భారీ ర్యాలీలో నేను పాల్గొన్నాను. రాయలసీమ ప్రాంతం నుంచి బస్సులో వెళ్లి దాదాపు రెండు వారాలపాటు యాత్ర చేశాం.
విద్యార్థి – యువజన సంఘాల అవిశ్రాంత పోరాటాల ఫలితంగానే 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించబడింది.
1989 నుంచి అది అమల్లోకి వచ్చింది. అటువంటి హక్కును సాధించడానికి పోరాడిన తరం, నేడు తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి ఆధారాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడడం తీవ్ర ఆవేదన కలిగించే అంశం.
చారిత్రక సాక్ష్యంగా నిలిచిన చిత్రం..
ఫోటోలు కాలాన్ని నిలిపివేయలేవు; కానీ కాలం చెరిపివేయలేని జ్ఞాపకాలను నిలుపుతాయి.
ఢిల్లీలో జరిగిన విద్యార్థి–యువజన మహార్యాలీకి అనంతపురం నుంచి బస్సులో వెళుతున్న మా బృందం మార్గమధ్యంలో తీసుకున్న ఈ ఫోటోను మిత్రులు శ్రీనివాసులు ఈ మధ్య కాలంలోనే నాకు పంపారు.
ఈ చిత్రం నేడు వ్యక్తిగత జ్ఞాపకంగా మాత్రమే కాకుండా, యువత రాజకీయ హక్కుల కోసం జరిగిన ప్రజాస్వామ్య పోరాటానికి చారిత్రక సాక్ష్యంగా నిలుస్తుంది. అప్పటి యువత కలలు, ఆశయాలు, సామాజిక నిబద్ధత ఈ ఫోటోలో ప్రతిబింబిస్తున్నది.
2002 ప్రత్యేక సమగ్ర సవరణలో గల్లంతైన పేర్లు..
నేను, మా తల్లిదండ్రులు, మా పూర్వీకులు కూడా జన్మతః భారతీయులం. ఓటు హక్కును పరిరక్షించుకోవడం కోసం ఈ మాట చెప్పాల్సిన అవసరం ఏర్పడడమే భారతీయుల దౌర్భాగ్యం.
నాకు 1980ల నుంచే ఓటు ఉంది. 2006లో జారీ చేసిన ఓటర్ గుర్తింపు కార్డు ఇప్పటికీ నా వద్ద ఉంది. అనేక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నాను. అయినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న “సర్” ప్రక్రియలో నా అర్హతలను మళ్లీ నిరూపించాల్సిన అవసరం ఏర్పడింది.
ఎన్యూమరేషన్ ఫారంను నిశితంగా పరిశీలించాను. దాన్ని భర్తీ చేయడానికి అవసరమైన అధికారిక సమాచారాన్ని సేకరించుకోవడానికి చాలా సమయాన్ని వెచ్చించాను.
ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిన 2002 నాటి “ప్రత్యేక సమగ్ర సవరణ” ఓటర్ల జాబితాలను పరిశీలిస్తే, నాది, నా జీవిత భాగస్వామి ప్రశాంతి కొల్లి ఓట్లు అందులో కనిపించలేదు.
అయితే, మా అమ్మ, ప్రశాంతి వాళ్ళ అమ్మానాన్నల ఓట్లు మాత్రం కనిపించాయి. నేడు నా ఓటు హక్కును రక్షించుకోవడానికి 2008లో మరణించిన మా తల్లి ఓటు వివరాలనే ఆధారంగా చూపించాల్సి రావడం ఒక విచిత్ర పరిస్థితి.
నా వంటి వ్యక్తికి విద్యార్హతలు, పాస్‌పోర్ట్, ఇతర అధికారిక పత్రాలు ఉన్నాయి. అవసరమైతే సమర్పించగలను. కానీ, అలాంటి పత్రాలు లేని వృద్ధుల పరిస్థితి ఏమిటి? పుట్టిన తేదీ నమోదు వ్యవస్థ అందుబాటులో లేని కాలంలో జన్మించిన లక్షలాది మంది పౌరులు తమ అర్హతలను ఎలా రుజువు చేసుకుంటారు? ఎస్ఎస్సీ చదవని వారు, పేదలు, అట్టడుగు వర్గాల ప్రజలు, వలస కూలీలు ఏం చేయాలి?
నా ఓటు ప్రస్థానం..
నేను పుట్టింది, కడప జిల్లా(నేడు తిరుపతి జిల్లా), రైల్వే కోడూరు శాసనసభ నియోజకవర్గంలోని కె కందులవారిపల్లి. 1973 వరకే మా ఊరిలో ఉన్నాను. అప్పటికి వయసు రీత్యా ఓటు హక్కుకు అర్హత లేదు.
తర్వాత ఇంటర్మీడియేట్ రాజంపేట, తిరుపతిలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఓటు నమోదుకు అర్హత లభించినా, నమోదు చేసుకోలేకపోయాను. సీపీఐ, ఏఐఎస్ఎఫ్ ఆఫీసుల్లో నివాసం.
ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం ఓట్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టేది. ఆ కాలంలో ఓటు నమోదుపైన దృష్టిసారించలేదు.
సీపీఐ అభ్యర్థులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ప్రచారం చేయడానికి వెళ్ళేవాడిని.
నమోదు చేసుకున్నా ఓటును వినియోగించుకునే అవకాశమూ ఉండేది కాదు.
1981లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత హైదరాబాదులో సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్లో నివాసం ఉండేవాడిని.
డోర్ నెంబర్ 3-6-201. ఆ చిరునామాతో ఓటు నమోదు చేయించుకున్నాను.
మధ్యలో కొంత కాలం ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా (1985-91) ఉన్నప్పుడు ఢిల్లీలో అసాఫాలీ రోడ్డులోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయానికి అనుబంధంగా ఉన్న ఒక గదిలో నేను, కామ్రేడ్ డీ రాజా (ప్రస్తుత సీపీఐ ప్రధాన కార్యదర్శి) ఉండేవారం.
అయినా, ఢిల్లీలో ఓటును నమోదు చేసుకోలేదు. ఢిల్లీ నుండి తిరిగొచ్చాక, కడపలో సీపీఐ జిల్లా కార్యదర్శిగా (1991-95) ఉన్నాను. అటుపై మళ్ళీ హైదరాబాదులో ఉండేవాడిని.
జాబితాలో గల్లంతు..
ఇదంతా ఎందుకు చెప్పానంటే నా ఓటు హైదరాబాదు, హిమాయత్ నగర్ శాసనసభ నియోజకవర్గంలోనే కొనసాగింది.
నా వివాహం తర్వాత డాక్టర్ కొల్లి ప్రశాంతి ఓటు కూడా ఆ డోర్ నంబరుతోనే నమోదు చేయించుకున్నాం.
కారణం, నా కార్యస్థానం సీపీఐ రాష్ట్ర కార్యాలయం, అప్పుడు నివాసం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్.
2006లో జారీ చేసిన ఓటర్ గుర్తింపు కార్డులు ఇద్దరికీ ఉన్నాయి. కానీ, “సర్-2002” ఓటర్ల జాబితాలో డోర్ నెంబర్ 3-6-201 ప్రస్తావనే లేదు.
ఆ భవనం సీపీఐ ఆఫీసు కాబట్టి బహుశా మొత్తం తొలగించారేమో!
ఈ రోజు “సర్-2002” జాబితాలో ఓటు ఉందా, లేదా, అన్నది మొదటి అర్హతగా పరిగణిస్తున్నారు. ఆ జాబితాలో వెతికితే మా ఓట్ల వివరాలు లభించలేదు.
ఏం చేయాలని ఆలోచించి, కోడూరు శాసనసభ నియోజకవర్గంలోని మా ఊరి ఓటర్ల జాబితాలో మా అమ్మ ఓటు వివరాలను వెతికి పట్టుకుని, నా దరఖాస్తులో పొందుపరిచాను.
నాటి విజయవాడ తూర్పు (ప్రస్తుతం పశ్చిమ) శాసనసభ నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో ప్రశాంతి తల్లిదండ్రుల ఓట్ల వివరాలను వెతికి పట్టుకుని, వాటిని ప్రస్తావించాం. ఆ సమాచారంతో ఎలాంటి అదనపు అధికారిక ధ్రువపత్రాలు అడగకుండా ఆమోదిస్తారో లేదో వేచి చూడాలి.
2002 నాటి “సర్” జాబితాలో మా వివరాలు లేవు. మా అబ్బాయి కర్ణాటకలో ఉన్నాడు. బెంగళూరులో ఓటు ఉంది.
ఎన్నికల సంఘం అడిగిన అధికారిక ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి సమర్పించి ఓటు హక్కును పరిరక్షించుకోవాలి.
ఈ దేశంలో పుట్టి, పెరిగి, దేశ సంపదను సృష్టించడంలో భాగస్వాములైన పౌరులు ఓటు హక్కును పరిరక్షించుకోవడానికి ఇన్ని కష్టాలు పడాలా?
ఓటు హక్కు ప్రభుత్వం ప్రసాదించిన వరం కాదు..
ఓటర్ల జాబితాను శుద్ధి చేయడంతో పాటు ఓటు హక్కును పరిరక్షించడం ఎన్నికల సంఘం బాధ్యత.
ప్రజాస్వామ్య బలం ఓటర్ల జాబితా స్వచ్ఛతలో మాత్రమే కాదు, ప్రతి అర్హ పౌరుడి ఓటు హక్కు భద్రతలో కూడా ఉంది.
అది భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు. కానీ, ఆ ప్రక్రియలో పౌరులే తమ పౌరసత్వాన్ని, తమ అస్తిత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే అది ప్రజాస్వామ్య వ్యవస్థలోని లోపాలను సూచిస్తుంది.
మరణించినవారి పేర్లు తొలగించడం ఎంత ముఖ్యమో, జీవించి ఉన్న ప్రతి పౌరుడు, పౌరురాలు ఓటు హక్కు కోల్పోకుండా చూడటం అంతకంటే ముఖ్యమైనది.
ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక విస్తృత సవరణ ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా, మానవీయ దృక్పథంతో అమలైతేనే ప్రజల విశ్వాసం నిలుస్తుంది.
లేకపోతే “సర్” పేరుతో మొదలైన ప్రక్రియ ప్రజాస్వామ్యానికే ప్రమాద సంకేతంగా పరిణమిస్తుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

