పోర్చుగీస్ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన కార్మికుల చట్టాల సవరణ బిల్లు జూన్ 19న వీగిపోయింది. ఇది కార్మికుల పోరాట విజయం.
ప్రభుత్వం ప్రతిపాదించిన కార్మిక చట్టాల సవరణ యజమానులకు కొమ్ముకాసి, కార్మికుల మీద పని గంటలు, పని భారం పెంపు, హక్కుల/రాయితీల ఉపసంహరణ/కోతలు లాంటి ప్రమాదకర అంశాలు ఆ బిల్లులో ఉన్నాయి.
ప్రభుత్వం బిల్లు ప్రతిపాదన చేసిన వెంటనే ప్రధాన కార్మిక సంఘం(సీజీటీపీ) ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ జనరల్ ట్రేడ్ యూనియన్స్ ఆఫ్ పోర్చుగల్’ స్పందించి దేశవ్యాప్తంగా అంచెలంచెలుగా అనేక పోరాటాలు నిర్వహించింది.
క్షేత్రస్థాయిలో కార్మికుల చైతన్యం..
ప్రతి కార్మికుడికి ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులోని ప్రమాదకర అంశాలు తెలియజేయడం ముఖ్య లక్ష్యంగా సీజీటీపీ నిర్ణయించింది.
ప్రతి ఫ్యాక్టరీ, ప్రతి యూనియన్ కిందిస్థాయి దాకా కార్మికుల సర్వసభ్య(జనరల్ బాడీ) సమావేశాలు నిర్వహించింది.
దీనికి ముందుగానే ఒక షెడ్యూల్ ప్రకటించింది. ఏ ఫ్యాక్టరీ, ఏ యూనిట్, ఏ రోజు, ఏ సమయానికి జరుగుతుందో నిర్దిష్టమైన సమయ పట్టిక ప్రకటించింది.
ఆ విధంగా మొత్తం నూటికి నూరు శాతం కార్మికులను చైతన్యవంతులను చేయడంలో సీజీటీపీ పెద్ద విజయం సాధించింది. దాంతో కార్మికులలో ప్రభుత్వం పట్ల తీవ్రమైన ఆగ్రహ జ్వాలలు రగిలాయి.
సమరశంఖం – చారిత్రాత్మక దేశవ్యాప్త సమ్మె..
సీజీటీపీ నిర్వహిస్తున్న ఆందోళనకు కార్మికుల నుంచి అనూహ్యమైన స్పందన రావడంతో మిగిలిన కార్మిక సంఘాలు కూడా పోరాటంలో కలిసి వస్తామని ప్రకటన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆ విధంగా దేశవ్యాప్త ఐక్య పోరాటం మొదలైంది.
2025 నవంబరు 4న రాజధాని నగరం లిస్బన్లో లక్ష మందికి పైగా కార్మికులతో భారీ ప్రదర్శన జరిగింది.
ఆ ప్రదర్శన సందర్భంగా జరిగిన సభలో “ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకోకపోతే డిసెంబర్ 11న దేశవ్యాప్త సమ్మెకు వెళ్లాలని” ట్రేడ్ యూనియన్ కార్మికుల ముందు ఉంచింది. దానికి కార్మికులందరూ హర్షామోదాలు తెలియజేశారు.
ఆ విధంగా డిసెంబర్ 11న సమ్మె చాలా విజయవంతంగా జరిగింది. ప్రభుత్వం కొంత వెనకడుగు వేసినట్లు నటించింది.
మళ్లీ 2026 ఏప్రిల్లో ఆ కార్మిక సంస్కరణ బిల్లును పార్లమెంట్లో పెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
దొడ్డిదారి పన్నాగాలు – తిప్పికొట్టిన కార్మికలోకం..
ఈసారి ప్రభుత్వం దొడ్డిదారి పన్నాగాలు వేసింది. అందులో ప్రధాన కార్మిక సంఘమైన సీజీటీపీని మినహాయించి మిగిలిన చిన్న యూనియన్లు, అధికారులు, యాజమాన్యాలతో కలిపి ఒక త్రైపాక్షిక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో చిన్న కార్మిక సంఘాలపై ఒత్తిడి తెచ్చి ఆమోదింపజేసుకోవడానికి నానా తంటాలు పడింది.
అయినా ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదిస్తే తమ సంఘాల ఉనికి ఉండదని చిన్న సంఘాలు కూడా గుర్తించాయి. దీంతో ఆ సంఘాలు కూడా ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించాయి. దాంతో ప్రభుత్వం ఆ బిల్లును నేరుగా పార్లమెంటులో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. వెంటనే సీజీటీపీ జూన్ 3న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.
ప్రభుత్వానికి భయపడి చిన్న కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొనలేదు. అయినా ఆ యూనియన్ల వెనక ఉన్న కార్మికులు కూడా సమ్మెలో పాల్గొన్నారు.
గత సమ్మెలన్నింటినీ మించి జూన్ 3 సమ్మె విజయవంతం అయింది.
పార్లమెంటులో బిల్లు వీగిపోవడం – పాలకులకు గుణపాఠం..
అయినప్పటికీ ప్రభుత్వం మొండిగా కార్మిక సంస్కరణల బిల్లును జూన్ 18న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. బిల్లుపై 18, 19 తేదీలలో రెండు రోజులు సుదీర్ఘ చర్చ జరిగి చివరికి ఓటింగ్ జరిగింది.
ఓటింగ్లో వామపక్ష పార్టీలు, అభ్యుదయ పార్టీలతో పాటు పచ్చి కార్మిక వ్యతిరేక మితవాద(రైట్ వింగ్) పార్టీ కూడా ఆశ్చర్యకరంగా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు చేసింది. దీంతో పార్లమెంటు సాక్షిగా బిల్లు తిరస్కరణకు గురైంది.
ప్రభుత్వం ఇంకా మొండిగా ఆ బిల్లును తిరిగి పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటే అనివార్యంగా అందులో కొన్ని సవరణలు చేసిన తర్వాత మాత్రమే ప్రవేశపెట్టాలి.
అది బహుశా ఈ సంవత్సరంలో సాధ్యం కాదని సీజీటీపీ అంచనా వేస్తున్నది.
రాజకీయాలను శాసించిన ఐక్య పోరాటం..
ఈ సందర్భంగా మరొక ప్రధాన అంశం గుర్తించాలి. పచ్చి కార్మిక వ్యతిరేక మితవాద పార్టీ, ప్రతిపక్షంలోని పెద్ద పార్టీ బిల్లును వ్యతిరేకిస్తూ ఓటు చేసింది.
కేవలం బిల్లును ఆమోదిస్తే తదుపరి జరగబోయే జనరల్ ఎన్నికలలో తమకు పుట్టగతులు ఉండవని ఆ పార్టీ గ్రహించింది.
అందుకే గత్యంతరం లేక రాజకీయ లబ్ధి కోసం బిల్లును వ్యతిరేకిస్తూ ఓటు చేసింది.
పోర్చుగీస్ దేశ కార్మిక చరిత్రలో ఇది ఒక మూల మలుపు, మైలురాయిగా నిలిచింది.
కార్మిక వర్గం ఐక్యంగా, సమరశీలంగా పోరాటాలు కొనసాగిస్తే రాజకీయ పార్టీలు కూడా ఎలా ప్రభావితం అవుతాయో పోర్చుగీస్ కార్మికుల పోరాటం తెలియజేస్తున్నది.
పోర్చుగీస్ కార్మికులు పోరాడి సాధించిన ఈ విజయం ప్రపంచ కార్మిక చరిత్రలో ఒక ముఖ్య పరిణామం. పోర్చుగీస్ కార్మికులకు రెడ్ సెల్యూట్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
