2026 జూన్ 22న బ్రిటన్ రాజకీయాల్లో ఒక కీలక మలుపు తిరిగింది. కేవలం రెండేళ్ల క్రితం ఘన విజయంతో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
బ్రిటిష్ రాజకీయాల్లో స్థిరత్వాన్ని తీసుకొస్తాడని ఆశించిన నాయకుడు చివరకు తన సొంత పార్టీ ఒత్తిడితోనే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
కీర్ స్టార్మర్ న్యాయవాదిగా, మానవహక్కుల ఉద్యమకారుడిగా మంచి గుర్తింపు పొందిన వ్యక్తి. 2020లో జెరెమీ కార్బిన్‌ను లేబర్ పార్టీ నాయకత్వం నుంచి దించి, కీర్ స్టార్మర్ పార్టీ పగ్గాలు చేపట్టారు.
మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించే విధంగా తన రాజకీయ వ్యూహాన్ని రూపొందించారు.
2024 సాధారణ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. చాలా సంవత్సరాల తరువాత కన్జర్వేటివ్ పాలనకు ముగింపు పలుకుతూ స్టార్మర్ ప్రధానమంత్రి అయ్యారు. ఆయన నాయకత్వంలో రాజకీయ స్థిరత్వాన్ని, ఆర్థిక పునరుద్ధరణను, ప్రజాసేవలు మెరుగవుతాయని ప్రజలు ఆశించారు.
ఎదురైన సవాళ్లు..
అధికారంలోకి వచ్చిన తరువాత స్టార్మర్ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఆర్థిక వృద్ధి ఆశించినంతగా జరగలేదు. జీవన వ్యయం పెరిగింది. ఆరోగ్య సేవలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది.
వలసల సమస్యపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకోకుండా వలస వ్యతిరేక శక్తులకు ఊపునిచ్చేలా వ్యవహరించింది. ప్రభుత్వ విధానాల్లో పలుమార్లు మార్పులు రావడం వల్ల నాయకత్వంపై విశ్వాసం తగ్గింది.
స్థానిక ఎన్నికల దెబ్బ..
కీర్ స్టార్మర్ అనుసరించిన కార్పొరేట్ శక్తుల అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలలో తీవ్రమైన అసంతృప్తి, ఆగ్రహ జ్వాలలు పెల్లుబికాయి.
2026 స్థానిక ఎన్నికలలో స్టార్మర్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. లేబర్ పార్టీ అనేక స్థానాలను కోల్పోయింది. ముఖ్యంగా ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్ ప్రాంతాల్లో పార్టీకి భారీ నష్టం జరిగింది.
కేవలం రెండు కార్పొరేట్ స్థానాలు ఉన్న పచ్చి వలసవాద వ్యతిరేక పార్టీ అయిన రిఫార్మ్ యుకే పార్టీ భారీ విజయాలను సాధించింది. దీంతో సొంత పార్టీలోని ఎంపీలు, మంత్రులు నాయకత్వ మార్పును బహిరంగంగా డిమాండ్ చేయడం ప్రారంభించారు.
అంతర్గత తిరుగుబాటు..
రాజకీయ ప్రత్యర్థుల కంటే ఎక్కువగా స్టార్మర్‌కు తన పార్టీ నుంచే సవాళ్లు ఎదురయ్యాయి. వంద మందికి పైగా ఎంపీలు ఆయన రాజీనామా చేయాలని కోరినట్లు సమాచారం. కొంతమంది ప్రభుత్వ సహాయకులు, మంత్రులు కూడా నాయకత్వ మార్పును సమర్థించారు.
ఈ పరిస్థితుల్లో స్టార్మర్ ఒక భావోద్వేగ ప్రసంగం చేస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. “దేశ ప్రయోజనం, పార్టీ ఐక్యత కోసం నేను తప్పుకుంటున్నాను” అని ఆయన పేర్కొన్నారు. కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు తాత్కాలిక ప్రధానమంత్రిగా కొనసాగుతానని చెప్పారు.
స్టార్మర్ వైఫల్యాలు..
ప్రజాదరణను నిలుపుకోలేకపోవడం, ఆర్థిక సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలు చూపకపోవడం కీలక వైఫల్యాలు. ముఖ్యంగా అమెరికాతో అంటకాగి రష్యా ఉక్రెయిన్ ఘర్షణలో ఉక్రెయిన్‌కు పూర్తి సహాయ సహకారాలు అందించారు.
చౌకగా లభించే రష్యా చమురు, గ్యాస్ కొనొద్దనే అమెరికా ఆంక్షలకు స్టార్మర్ తలొగ్గి ఖరీదైన ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్నారు. ఫలితంగా తన దేశంలో ఇంధన ధరలు అనూహ్యంగా పెరిగాయి.
ప్రభుత్వ అధీనంలోని ప్రజా ఆరోగ్య సంస్థ “నేషనల్ హెల్త్ సర్వీస్”ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఘోరంగా విఫలమైయ్యారు.
ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ చేసిన యుద్ధంలో భాగస్వామి కాకపోయినా అమెరికా ఇజ్రాయెల్ చర్యలను ఖండించలేదు. అయినప్పటికీ ట్రంప్ ఆగ్రహానికి గురయ్యారు. కీర్ స్టార్మర్ రాజీనామా ఒక వ్యక్తి వైఫల్యం కాదు, ఉదారవాద విధానాల ఫలితమే.
లేబర్ పార్టీ దిశానిర్దేశం – ఒక చారిత్రక పరిశీలన..
బ్రిటన్‌లో రెండు పార్టీల ఆధిపత్యమే కొనసాగుతున్నది. అవి లేబర్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ. లేబర్ పార్టీ సంప్రదాయంగా కార్మికులు, ట్రేడ్ యూనియన్లు, సామాజిక సంక్షేమ విధానాలకు మద్దతు ఇచ్చే పార్టీగా ప్రజలలో గుర్తింపు ఉంది.
1990లలో టోనీ బ్లేయర్ నాయకత్వంలో పార్టీ మధ్యేవాద విధానాలను అవలంబించింది.
అయితే 2015లో జెరెమీ కార్బిన్ పార్టీ నాయకుడిగా ఎన్నిక కావడంతో లేబర్ పార్టీ మళ్లీ వామపక్ష దిశగా ప్రయాణించింది.
కార్బిన్ బ్రిటన్‌లో అత్యంత వామపక్ష భావజాలం కలిగిన నాయకులలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన రైల్వే, విద్యుత్, నీటి సంస్థలను ప్రైవేటీకరణ నుంచి తిరిగి జాతీయీకరణ చేయడం, ధనికులపై అధిక పన్నులు విధించడం, ఉచిత విశ్వవిద్యాలయ విద్యను అందించడం వంటి విధానాలు ప్రకటించారు.
ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను విస్తరించడం, కార్మిక హక్కుల బలోపేతం, విదేశాంగ విధానంలో అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఇరాక్‌పై అమెరికా యుద్ధం వంటి సైనిక జోక్యాలకు వ్యతిరేకత ఆయన విధానాలుగా ప్రకటించారు. ఈ విధానాలు యువత, ట్రేడ్ యూనియన్లు, వామపక్ష వర్గాల్లో మంచి ఆదరణ పొందాయి.
కార్బిన్ నాయకత్వ కాలంలో లేబర్ పార్టీలో యూదు వ్యతిరేక వ్యాఖ్యలు, సంఘటనలు పెరిగాయని ఆరోపణలు వచ్చాయి. పార్టీ నాయకత్వం వాటిని సమర్థవంతంగా ఎదుర్కోలేదని విమర్శలు వచ్చాయి.
2019 సాధారణ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. దీనితో కార్బిన్ నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తాయి. పాలస్తీన్ ప్రజల స్వతంత్ర దేశ హక్కును బలపరుస్తూ ఆయన తీసుకున్న దృఢ వైఖరితో ఆయనను పార్టీ నుంచి తొలగించారు. 2020లో కీర్ స్టార్మర్ పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యారు. ఇది లేబర్ పార్టీ చరిత్రలో అత్యంత వివాదాస్పద చర్యలలో ఒకటిగా నిలిచింది.
మధ్యేవాద రాజకీయాలు – స్టార్మర్ పతనం..
స్టార్మర్ అధికారంలోకి వచ్చిన తరువాత కార్బిన్ అనుచరుల ప్రభావాన్ని తగ్గించారు. పార్టీని రాజకీయ మధ్యేవాద దిశగా నడిపించారు. వ్యాపార వర్గాలకు దగ్గరయ్యారు. నాటో, యూరోపియన్ మిత్ర దేశాలతో బలమైన సంబంధాలను నెలకొల్పారు.
“ప్రభుత్వాన్ని నిర్వహించగల బాధ్యతాయుత పార్టీ”గా లేబర్‌ను చూపించేందుకు ప్రయత్నించారు. ప్రజలలో సమర్థవంతమైన నాయకుడిగా ప్రచారంలోకి వచ్చారు.
2024 ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. స్టార్మర్ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టారు.
ఆయన అనుసరించిన విధానాల కారణంగా కేవలం రెండు సంవత్సరాలలోనే ఆర్థిక వృద్ధి మందగించింది. జీవన వ్యయం పెరిగింది. వలసల సమస్యపై ప్రజలలో అసంతృప్తి నెలకొన్నది. స్థానిక ఎన్నికల్లో భారీ నష్టాలు చవిచూసింది. పార్టీలో అంతర్గత అసమ్మతికి దారితీసింది.
2020లో స్టార్మర్ పార్టీని “లెఫ్ట్ విధానాల నుంచి మధ్యేవాదం వైపు” తీసుకెళ్లడానికి కార్బిన్‌ను పక్కన పెట్టారు. 2026లో అదే స్టార్మర్ తన పార్టీ ఎంపీల తిరుగుబాటు కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది.
కొత్త నాయకత్వం దిశగా లేబర్ పార్టీ..
ప్రస్తుతం పార్టీ నాయకత్వానికి ఆండీ బర్నమ్ ప్రధాన పోటీదారుగా కనిపిస్తున్నారు. ఆయన జెరెమీ కార్బిన్లా నిఖార్సయిన వామపక్షవాది కాదు. స్టార్మర్లాంటి పూర్తిస్థాయి మధ్యేవాది కూడా కాదు. “సాఫ్ట్ లెఫ్ట్” ధోరణికి చెందిన నాయకుడిగా గుర్తింపు పొందారు.
మాంచెస్టర్ పార్లమెంటు స్థానానికి గత వారం జరిగిన ఉప ఎన్నికలలో ఆయన విజయం సాధించారు. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించే వ్యక్తిగా ముందున్నారు.
జెరెమీ కార్బిన్ యుగం లేబర్ పార్టీలో వామపక్ష పునరుజ్జీవనానికి ప్రతీక. కీర్ స్టార్మర్ యుగం మధ్యేవాద రాజకీయాలకు ప్రతీక.
ఇప్పుడు ఆండీ బర్నమ్ యుగం ప్రారంభమైతే, లేబర్ పార్టీ ఈ రెండు ధోరణుల మధ్య కొత్త సమతుల్యతను వెతుక్కోవాల్సి ఉంటుంది.
జెరెమీ కార్బిన్ – బ్రిటన్ రాజకీయాలను కుదిపేసిన సోషలిస్టు నాయకుడు..
బ్రిటన్ రాజకీయ చరిత్రలో కొందరు నాయకులు అధికారంలోకి రాకపోయినా, దేశ రాజకీయ చర్చల దిశను పూర్తిగా మార్చేస్తారు. అలాంటి నాయకులలో జెరెమీ కార్బిన్ ఒకరు.
కార్మికవర్గం, సామాజిక న్యాయం, ప్రభుత్వ సంక్షేమ బాధ్యత, యుద్ధ వ్యతిరేకత వంటి అంశాలను రాజకీయాల కేంద్రబిందువుగా తీసుకువచ్చిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు.
ప్రభుత్వ వ్యయాలను పెంచి ఉపాధి అవకాశాలను సృష్టించడం, విదేశీ యుద్ధాలలో బ్రిటన్ జోక్యాన్ని తగ్గించడం వంటి వాటికి ఆయన కట్టుబడి ఉన్నారు. ఈ విధానాలు యువత, విద్యార్థులు, కార్మిక వర్గాలలో విపరీతమైన ఆదరణ పొందాయి.
2017 సాధారణ ఎన్నికల్లో కార్బిన్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఆశించిన దానికంటే చాలా మెరుగైన ఫలితాలు సాధించింది. అప్పటి ప్రధానమంత్రి థెరిసా మే మెజారిటీ కోల్పోయారు. దీంతో కార్బిన్ బ్రిటన్ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగారు.
అయితే 2019 ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
లేబర్ పార్టీ 1935 తర్వాత అత్యంత దారుణమైన ఎన్నికల ఫలితాన్ని ఎదుర్కొంది. అనంతరం కార్బిన్ పార్టీ నాయకత్వం నుంచి తప్పుకున్నారు.
2024 సాధారణ ఎన్నికల్లో కార్బిన్ లేబర్ పార్టీ అభ్యర్థిగా కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
అనంతరం ఆయన లేబర్ పార్టీతో పూర్తిగా తెగతెంపులు చేసుకున్నారు. తరువాత కొత్త వామపక్ష రాజకీయ వేదిక నిర్మాణంలో భాగమయ్యారు.
జెరెమీ కార్బిన్ బ్రిటన్ ప్రధానమంత్రి కాలేకపోయినా, 21వ శతాబ్దపు బ్రిటిష్ రాజకీయాలపై అత్యంత ప్రభావం చూపిన నాయకులలో ఒకరిగా నిలిచారు. ఆయన ఒకవైపు లక్షలాది మంది యువతకు ఆశాకిరణంగా నిలిచారు.
చరిత్ర పుటల్లో కన్జర్వేటివ్ పార్టీ వైఫల్యం..
2024 ఎన్నికల్లో లేబర్ పార్టీ సుమారు 34 శాతం ఓట్లను మాత్రమే పొందింది.
ఇది 2017లో కార్బిన్ నాయకత్వంలో వచ్చిన ఓటు శాతం (సుమారు 40 శాతం) కంటే చాలా తక్కువ.
అయితే సీట్లు మాత్రం భారీగా పెరిగాయి. 2024 ఎన్నికల తర్వాత వామపక్ష విశ్లేషకులు ఒక ఆసక్తికరమైన వాదన చేశారు. “స్టార్మర్ ఎన్నికలలో గెలిచాడు, కానీ ప్రజల హృదయాలను గెలవలేదు.” కార్బిన్ కాలంలో లక్షలాది కొత్త సభ్యులు పార్టీలో చేరారు.
భారీ సభలు జరిగేవి. యువతలో ఉత్సాహం కనిపించేది. కానీ స్టార్మర్ కాలంలో ఇవన్నీ పడిపోయాయి.
2024 ఎన్నికల్లో “లేబర్ విజయం కన్నా కన్జర్వేటివ్ వైఫల్యం ఎక్కువ” అనే అభిప్రాయం బలంగా వినిపించింది.
ఇప్పుడు స్టార్మర్ రాజీనామా చేసిన నేపథ్యంలో చాలామంది ఒక చారిత్రక వ్యంగ్యాన్ని గుర్తు చేస్తున్నారు.
2019లో కార్బిన్‌ను విమర్శిస్తూ “అతను ఓట్లు తెచ్చుకున్నాడు కానీ గెలవలేకపోయాడు.” 2024లో “స్టార్మర్ గెలిచాడు, కానీ ప్రజా మద్దతును నిలబెట్టుకోలేకపోయాడు”.
అందుకే కొంతమంది విశ్లేషకులు కార్బిన్‌ను “ప్రజాదరణ ఉన్నా కానీ అధికారంలోకి రాలేని నాయకుడు”గా, స్టార్మర్ను “అధికారంలోకి వచ్చినా కానీ ప్రజాదరణను నిలబెట్టుకోలేని నాయకుడు”గా వర్ణిస్తున్నారు.
2015 నుంచి 2026 వరకు లేబర్ పార్టీ చరిత్రను కేవలం నాయకుల మార్పుగా కాకుండా “సోషలిస్టు రాజకీయాలు వర్సెస్ మధ్యేవాద ఎన్నికల వ్యూహం” మధ్య జరిగిన ఒక దీర్ఘకాల పోరాటంగా చూడవచ్చు.
రిషి సునాక్ ప్రస్థానం – ఆర్థిక సంక్షోభం..
స్టార్మర్‌కు ముందు కన్జర్వేటివ్ పార్టీ తరపున బ్రిటన్ ప్రధానమంత్రిగా “రిషి సునాక్” ఉన్నారు. 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటన్ రాజ్యాధిపతిగా, భారతజాతి మూలాలు ఉన్న వ్యక్తి పగ్గాలు చేపట్టాడని భారత మీడియా భారీ ప్రచారం నిర్వహించింది.
రిషి సునాక్ 2022 అక్టోబర్ 25న బ్రిటన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆయన సాధారణ ఎన్నికల ద్వారా అధికారంలోకి రాలేదు. కన్జర్వేటివ్ పార్టీ అంతర్గత సంక్షోభం వల్ల ఆయన ప్రధానమంత్రి అయ్యారు.
2022లో బ్రిటన్ రాజకీయాలు తీవ్ర అస్థిరతను ఎదుర్కొన్నాయి. బోరిస్ జాన్సన్ ప్రభుత్వం వివాదాలలో చిక్కుకుంది.
కోవిడ్ కాలంలో ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించి పార్టీలు నిర్వహించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో జాన్సన్ రాజీనామా చేశారు.
ఆ తర్వాత లిజ్ ట్రస్ ప్రధానమంత్రి అయ్యారు. లిజ్ ట్రస్ ప్రభుత్వం 2022 సెప్టెంబరులో భారీ పన్ను రాయితీలతో కూడిన “మినీ బడ్జెట్”ను ప్రకటించింది. దాని ప్రభావంతో పౌండ్ విలువ పడిపోయింది.
ఆర్థిక మార్కెట్లు కుదేలయ్యాయి. ప్రభుత్వ రుణ వ్యయాలు పెరిగాయి. ప్రధానంగా బడా పెట్టుబడిదారులు ట్రస్‌కు వ్యతిరేకంగా పావులు కదిపారు. ఈ పరిస్థితుల్లో ట్రస్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఆ విధంగా ఆమె కేవలం 49 రోజులే ప్రధానమంత్రిగా కొనసాగింది. బ్రిటన్ పార్లమెంట్ చరిత్రలో అతి తక్కువ కాలం ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తిగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది.
ఈ నేపథ్యంలో కన్జర్వేటివ్ పార్టీ రిషి సునాక్‌ను నాయకుడిగా ఎన్నుకుంది. ఆయన ముందున్న ప్రధాన లక్ష్యాలు: ఆర్థిక స్థిరత్వం పునరుద్ధరించడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, మార్కెట్ల విశ్వాసాన్ని తిరిగి పొందడం, పార్టీ అంతర్గత విభేదాలను తగ్గించడం.
అయితే పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. అధిక ద్రవ్యోల్బణం, విద్యుత్, ఇంధన ధరల పెరుగుదల, ఎన్హెచ్ఎస్ ఆరోగ్య సేవల సంక్షోభం, వలసల సమస్య, కార్మికుల సమ్మెలు, బ్రెగ్జిట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు.
ఈ సమస్యలను పరిష్కరించడం సునాక్‌కు సాధ్యం కాలేదు.
కారణం వ్యక్తిగత శక్తి సామర్థ్యాలు కాదు, కన్జర్వేటివ్ పార్టీ విధానాలే ప్రజా వ్యతిరేక విధానాలు.
ఫలితంగా 2024లో జరిగిన ఎన్నికలలో 14 సంవత్సరాలు నిరాఘాటంగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. లేబర్ పార్టీ భారీ మెజారిటీ సాధించింది.
ఇక్కడ గమనించాల్సింది, రిషి సునాక్‌కు ప్రజాదరణ తక్కువ. కార్పొరేట్ల ప్రతినిధి. పార్టీ బలహీన స్థితిలో ఉంది. దేశ ఆర్థిక సంక్షోభాన్ని వారసత్వంగా స్వీకరించాడు. ఎన్నికల్లో ఓడిపోయాడు.
కీర్ స్టార్మర్ భారీ మెజారిటీతో గెలిచాడు. కానీ ఓటు శాతం పెద్దగా పెరగలేదు. రెండు సంవత్సరాలకే నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు.
బ్రిటన్ పరిణామాలు ఏమి నేర్పుతున్నాయి?
2015 నుంచి 2026 వరకు బ్రిటన్ రాజకీయాలను చూస్తే అది ఇలా కనిపిస్తుంది: “ఎన్నికల్లో గెలవడం ముఖ్యమా? లేక ప్రజల దీర్ఘకాల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమా?” ఇదే ప్రశ్న గత దశాబ్ద కాలంగా బ్రిటిష్ రాజకీయాలను ప్రభావితం చేస్తోంది.
బ్రిటన్ ప్రజలు తాత్కాలికంగా కొన్ని భ్రమలకు, పార్టీల వాగ్దానాలకు లోనైనా ప్రజా వ్యతిరేక విధానాలు అమలు జరిపితే ఆ పార్టీని ఘోరంగా ఓడించారు.
పార్టీ నేతలు కూడా వారి అధినాయకుడు ఏమి చెప్పినా గుడ్డిగా అదే యదార్థం, శాస్త్రం అని మూర్ఖంగా నమ్మడం, భుజాల మీద మోయడం కాకుండా నాయకులను నిలదీయడం, అధికార నుంచి తొలగించడం చూస్తున్నాం.
బ్రిటన్ ఈ పరిణామాలను భారతదేశ ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు లోతుగా పరిశీలించాల్సిన అవసరం, ఆత్మవిమర్శ చేసుకోవలసిన సమయం ఆసన్నమైంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
