షామ్లీలో ‘లవ్ జిహాద్’ ఆరోపణలపై ఒక మహిళ అరెస్టు భారతీయ ముస్లింలను మరింత నిశ్శబ్దంలోకి నెట్టింది.
తాను స్వచ్ఛందంగా ఇస్లాం మతంలోకి మారుతున్నట్టు బహిరంగంగా మాలిక్ ప్రకటించారు. అయినప్పటికీ, అతని భార్య, మామను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన భారతదేశ మత స్వేచ్ఛలో పాతుకుపోయిన కపటత్వాన్ని బహిర్గతం చేసింది.
ఉత్తర ప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలోని భారత్ మెడికల్ స్టోర్ వెలుపల ఉన్న రహదారి ఎప్పటిలాగే గందరగోళం, సంభాషణలతో నిండి ఉంది.
కొందరు తమ వంతు కోసం వేచి ఉండగా, ఇతరులు క్యూను ఉల్లంఘించి, చాలా దురుసుగా వెళ్లి కెమిస్ట్ వద్ద అసహనంగా ప్రిస్క్రిప్షన్ స్లిప్‌లను చూపిస్తున్నారు.
మెడికల్ స్టోర్‌ను సందర్శించే దాదాపు ప్రతి ఒక్కరూ జూన్ ప్రారంభంలో వెలువడిన వార్తలను ధ్రువీకరిస్తున్నారు.
ఈ దుకాణాన్ని మాలిక్ కుటుంబం నిర్వహిస్తోంది. వీరికి అదే రోడ్డులో మరో రెండు మెడికల్ షాపులు కూడా ఉన్నాయి. వారి ఇంటి కింద ఉన్న దుకాణం వారం రోజులకు పైగా మూసివేయబడింది.
రోడ్డు చివరన ఉన్న దుకాణం వినియోగదారులను స్వాగతిస్తూనే ఉంది. ఇప్పుడు భయానకంగా కనిపిస్తున్న మాలిక్ ఇంటి వైపు చూపిస్తూ, చుట్టుపక్కల వారు ఆసక్తిగా గుసగుసలాడుకుంటూ ఆయుష్ మాలిక్ గురించి చర్చిస్తున్నారు.
ఆరోపణలు – అరెస్టులు..
జూన్ ప్రారంభంలో, షామ్లీలో నివసిస్తున్న 27 ఏళ్ల ఆయుష్ మాలిక్‌ను ఇస్లాం మతంలోకి మారమని బలవంతం చేశారని అధికారులు చూస్తుండగానే బఘ్రా సాధన ఆశ్రమం అధిపతి స్వామి యశ్వీర్ మహారాజ్ ఆరోపించారు. దీని తర్వాత కెమెరాలు, దూషణలు, ఆరోపణలు వెల్లువలా ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఆయుష్‌ను అతని భార్య చాందిని ఖురేషి, ఆమె తండ్రి ఇస్లాం ఖురేషి మస్తిష్క ప్రక్షాళన చేశారని మహారాజ్ ఆరోపించారు.
చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే జూన్ 12న ఖురేషి ప్రాంతంలో హిందూ మహాపంచాయత్‌ను పిలుస్తానని ఆయన బెదిరించారు.
ఉత్తర ప్రదేశ్ చట్టవిరుద్ధ మత మార్పిడుల నిషేధ చట్టం- 2021, భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని పలు సెక్షన్ల కింద షామ్లీ కొత్వాలి పోలీస్ స్టేషన్లో జూన్ 6న ఆయుష్ తండ్రి దేవరాజ్ మాలిక్ ఎఫ్ఐఆర్ను దాఖలు చేశారు.
ఒక ముస్లిం మహిళ తన కుమారుడిని ప్రేమ సంబంధంలోకి ప్రలోభపెట్టి, ఆ తర్వాత ఇస్లాం మతంలోకి మారమని ఒత్తిడి చేసిందని దేవరాజ్ ఆరోపించారు.
‘ది వైర్’కు లభించిన ఎఫ్ఐఆర్ ప్రకారం, ఆ మహిళ కుటుంబానికి చెందిన తొమ్మిది మందిపై మత మార్పిడికి సూత్రధారులుగా వ్యవహరించడం, నకిలీ నిఖా-నామా(ఇస్లామిక్ వివాహ ఒప్పందం) తయారు చేయడం, మానసిక ఒత్తిడి తీసుకురావడం, బెదిరింపులు జారీ చేయడం, కుటుంబ ఆస్తిపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నించడం లాంటి ఆరోపణలు ఉన్నాయి.
ఆయుష్ కుటుంబంలోని ఇతర సభ్యులను కూడా ఇస్లాం స్వీకరించేలా నిందితులు ఒత్తిడి చేశారని ఆ నివేదికలో పేర్కొన్నారు.
కేసు నమోదు చేసిన తర్వాత, మత మార్పిడి ఆరోపణలకు సంబంధించి పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు.
ఇస్లాం – గుర్తింపు..
తన భార్య, మామ అరెస్టును చట్టబద్ధంగా సవాలు చేయాలని ఆయుష్ నిర్ణయించుకున్నారు.
పిడికెడు పొడవున్న తన గడ్డాన్ని సవరిస్తుండగా- మినుకు మినుకుమనే లైట్ల వెలుగులు ఆయుష్ ముఖాన్ని ముంచెత్తాయి.
పలు ప్రధాన టెలివిజన్ ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో- అతను ప్రశాంతమైన, నిబ్బరమైన ఆత్మవిశ్వాసంతో కనబడ్డాడు.
ఇస్లాం మతంలోకి మారినందుకు పలువురు యాంకర్లు, మీడియా వ్యాఖ్యాతలు అతన్ని ఎగతాళి చేసినప్పటికీ, అతను చలించలేదు.
“నేను నా ఇష్ట ప్రకారమే ఇస్లాంను అధ్యయనం చేసి, చాలా సంవత్సరాలుగా ఆచరిస్తున్నాను” అని ఆయుష్ బదులిచ్చారు.
కుటుంబ వేదన – మీడియా వేధింపులు..
షామ్లీలో, ‘ది వైర్’ ప్రతినిధులు దేవరాజ్ మాలిక్‌ను కలిశారు. చాలా నెమ్మదిగా వినిపించే స్వరంతో అతను తన వాదనను స్పష్టం చేశారు: చాందినీ ఖురేషీతో వివాహం సులభతరం చేయడానికి ఆయుష్‌ను మతమార్పిడికి ప్రలోభపెట్టారు.
“అతను 2019 లేదా 2020 నుంచే ఆ అమ్మాయితో టచ్‌లో ఉన్నాడు. కానీ, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వాళ్ల పెళ్లి గురించి మాకు తెలిసింది” అని కన్నీళ్లతో నిండిన కళ్లతో దేవరాజ్ చెప్పారు.
“నాకు నా కొడుకు తిరిగి కావాలి. మేము ఆస్తి కోసం కాదు, కేవలం మా కొడుకు కోసం పోరాడుతున్నాం” అని వాపోయారు.
మీడియా ప్రతినిధులు తమ ముఖాల ముందు మైకులు పెట్టి తన కుటుంబాన్ని వేధించడం మొదలుపెట్టినప్పటి నుంచి 66 ఏళ్ల దేవరాజ్ అనారోగ్యంగా ఉన్నారు.
ఆయుష్ భవిష్యత్తు గురించి తాను ఆందోళన చెందుతున్నానని ఆయన అన్నారు.
“అతను సద్గుణవంతుడు, అతని మనసులో ఏమొచ్చిందో నాకు తెలియదు” అని అన్నారు. “ఆ వీడియోలలో అతను మాట్లాడిన తీరు చూసినప్పుడు, ఏదో శక్తి లేదా వ్యక్తి అతనికి ఆ మాటలు నేర్పినట్లు నాకు అనిపించింది. చాలా మంది ముస్లింలు అతని ఇంటర్వ్యూ క్లిప్‌లను తమ వాట్సాప్ స్టేటస్‌గా అప్లోడ్ చేసుకుంటున్నారు” అని చెప్పుకొచ్చారు.
మత స్వేచ్ఛపై ద్వంద్వ వైఖరి..
భారతదేశంలో మత మార్పిడి అంశం ప్రజా వివాదాన్ని రేకెత్తించడంలో ఆయుష్ మాలిక్ ఉదంతమే మొదటిది కాదు.
అయినప్పటికీ భిన్నమైన ప్రజా స్పందనలు, మత స్వేచ్ఛను ఎవరు, ఏ పరిస్థితులలో వినియోగించుకోవచ్చనే దానిపై లోతైన చర్చ జరుగుతోందని వెల్లడిస్తున్నాయి.
2021లో యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ మాజీ ఛైర్మన్ వసీం రిజ్వీ ఇస్లాంను విడిచిపెట్టి, జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగీ అనే పేరుతో హిందూ మతాన్ని స్వీకరించారు.
అప్పుడు ఆ మత మార్పిడిని పూలమాలలు, వేడుకలతో, పొగడ్తలతో ముంచెత్తే మీడియాతో ఘనంగా జరుపుకున్నారు. ఆయన నిర్ణయాన్ని వ్యక్తిగత ఇష్టంగా, ఆధ్యాత్మిక జాగృతిగా అభివర్ణించారు.
అదే రాష్ట్రంలో, ఆయుష్‌ను ‘బలవంతం’ చేశారన్న ఆరోపణలతో ప్రజలను జైలులో పెట్టారు, అయితే ఆయన మాత్రం తాను స్వచ్ఛందంగా ఇస్లాంను స్వీకరించినట్లు అంగీకరించారు.
గతంలో తీసుకున్న వైఖరులకు పూర్తి భిన్నంగా, ఆయన మతమార్పిడి నిర్ణయాన్ని నేర విచారణకు అర్హమైన అంశంగా పరిగణిస్తున్నారు.
ఈ వైరుధ్యం, ఇస్లాం మతంలోకి మారి, హదియా అనే పేరు పెట్టుకుని కేరళలో ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్న అఖిలా అశోకన్ ఉదంతాన్ని కూడా గుర్తుకు తెస్తుంది.
తన మత మార్పిడి స్వచ్ఛందమేనని ఆమె పదేపదే నొక్కిచెప్పింది. అయినప్పటికీ సుప్రీంకోర్టు ఆమె స్వయంప్రతిపత్తిని ధ్రువీకరించి, ఆమె వివాహాన్ని పునరుద్ధరించే ముందు, ‘లవ్ జిహాద్’ అని పిలవబడే దానిపై పోలీసు విచారణ, కోర్టు విచారణలు, జాతీయ స్థాయి చర్చ జరిగాయి.
భారతదేశంలో మతమార్పిడి వ్యతిరేక చట్టాలు వేగంగా విస్తరిస్తున్న తరుణంలోనే, ఇస్లాం మతంలోకి మారినవారు ఎదుర్కొంటున్న విస్తృతమైన పరిశీలన కూడా వెలుగులోకి వస్తోంది.
గత దశాబ్ద కాలంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, అస్సాం సహా భారతీయ జనతా పార్టీ పాలిత అనేక రాష్ట్రాలు కొత్త మతమార్పిడి వ్యతిరేక చట్టాలను రూపొందించడం గానీ లేదా ఇప్పటికే ఉన్న చట్టాలను బలోపేతం చేయడం గానీ జరిగాయి.
విశ్వాసం, భయం, భవిష్యత్తు..
ఆయుష్ భార్య, మామగారి అరెస్టు జరిగిన కొద్ది రోజుల తర్వాత, మహారాజ్ ఈ కేసుపై మరో వ్యాఖ్య చేశారు.
షామ్లీ, కైరానాకు చెందిన మరో 100 మంది ముస్లింలతో పాటు ఆయుష్ కూడా త్వరలోనే ‘సనాతన ధర్మానికి తిరిగి వస్తాడు’ అని ఆయన పేర్కొన్నారు.
ముజఫర్‌నగర్‌కు చెందిన మహారాజ్, హిందూ మతాన్ని బహిరంగంగా ప్రచారం చేయడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించిన చరిత్ర ఉంది.
2025లో ఛత్రపతి శివాజీ సేన నాయకుడిగా, ఆయన కన్వర్ యాత్ర మార్గంలోని దుకాణాలు, ధాబాల ‘యజమాని మత గుర్తింపును నిర్ధారించుకోవడానికి’, భక్తులకు హిందువులు నడిపే సంస్థలలో మాత్రమే సేవలు అందేలా చూడటానికి ఒక ‘గుర్తింపు ప్రచారాన్ని’ నిర్వహించినట్లు సమాచారం.
2014లో ఆయన 2013 నాటి ముజఫర్‌నగర్ అల్లర్లను గుర్తుకు తెచ్చుకోవాలని ముస్లిం సమాజానికి సలహా ఇస్తూ, తీవ్ర పరిణామాల గురించి బహిరంగంగా హెచ్చరించారు.
షామ్లీకి చెందిన కొందరు హిందూ వ్యక్తులతో ‘ది వైర్’ మాట్లాడినప్పుడు, వారు ‘ఘర్ వాప్సీ(ఇంటికి తిరిగి రావడం)’ అనే భావనను పునరుద్ఘాటించారు.
జిల్లాలోని ఉద్రిక్త పరిస్థితిని చక్కదిద్దడానికి ఆయుష్ తప్పనిసరిగా హిందూ మతాన్ని తిరిగి స్వీకరించాలని వారు ప్రకటించారు.
షామ్లీలో ముస్లిం వర్గాల ఆందోళన..
అయితే, షామ్లీలోని ముస్లిం సమాజానికి ఆయుష్‌తో ఎలాంటి సంబంధం లేకపోయినా జీవితం అభద్రతాభావంతో చాలా దుర్భరంగా ఉంది.
వారి గుర్తింపును గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చినప్పటికీ, చాలా మంది తమ ఆలోచనలను పంచుకోవడానికి నిరాకరించారు.
అయితే పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక స్థానిక ముస్లిం దుకాణదారుడు స్పందిస్తూ, “మా హిందూ వినియోగదారులు మౌనంగా రావడం మానేశారు. బహిష్కరణకు పిలుపు ఏమీ లేదు. కానీ ఇది షామ్లీ, మాకు కూడా గత గాయాలు ఉన్నాయి. ప్రవర్తనలు మారినప్పుడు మేము అర్థం చేసుకుంటాము. మళ్లీ అల్లర్లు, హింస జరగకూడదనే మేము మౌనంగా ఉన్నాము” అని అభద్రతా భావంతో తన ఆవేదనను చెప్పారు.
ఈ మొత్తం పరిస్థితి జిల్లా అంతర్గత శాంతికి భంగం కలిగించిందని షామ్లీ పోలీసులు భావిస్తున్నారు. ‘ది వైర్’తో మాట్లాడుతూ, పోలీస్ సూపరింటెండెంట్ ఎన్పీ సింగ్, తాము కేవలం ఆందోళన చెందుతున్న ఒక తండ్రి ఫిర్యాదును మాత్రమే పరిశీలిస్తున్నామని చెప్పారు.
ఎవరు ఏ మతాన్ని అనుసరిస్తున్నారనేది తమకు అనవసరమని పేర్కొంటూ, ఈ విషయాన్ని సంచలనం చేయకుండా ఒక కుటుంబ సమస్యగా చూడాలని సింగ్ అన్నారు.
స్థానికులు వార్తలను నిశితంగా గమనిస్తున్నారు. కొందరు ఆయుష్ తిరిగి హిందూ మతంలోకి రావాలని ఆశిస్తుండగా, మరికొందరు సాధారణ పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటున్నారు.
ప్రజలు గుసగుసలాడుతూనే ఉన్నారు. ఆయుష్ గురించి కాదు, కానీ అతని భార్య చాందిని గురించి.
ముస్లిం పురుషులు ప్రతిరోజూ ఎదుర్కొనే ‘లవ్-జిహాద్’ ఆరోపణకు గురైన మొదటి మహిళలలో బహుశా ఆమె ఒకరు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
