విక్టర్ ఓర్బాన్‌ను ఓడించేందుకు హంగేరీ ప్రతిపక్ష పార్టీలు ఊహించలేని గొప్ప త్యాగం చేశాయి. పాలక పక్షాన్ని మట్టికరిపించాయి. భారత ప్రతిపక్షం ఆ అనుభవాన్ని గుర్తించాలి.
2010 నుంచి 16 సంవత్సరాల పాటు హంగేరీని ఇనుప కొరడాతో పాలించిన నిరంకుశ నాయకుడు విక్టర్ ఓర్బాన్ పాలన ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారానే కూలిపోతుందని ఎవరు ఊహించారు?
ఒకప్పుడు అసాధ్యంగా భావించిన దానిని హంగేరీ ప్రజలు ఏప్రిల్‌లో సాధ్యం చేసి చూపించారు.
ఈ ఊహించలేని ఫలితం వాస్తవమవ్వడానికి ప్రధాన కారణం హంగేరీ ప్రతిపక్షంలోని కొన్ని ప్రముఖ పార్టీలు చేసిన అత్యున్నత త్యాగం.
ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం అవి ఎన్నికల పోటీ నుంచి తప్పుకుని, అధ్యక్షుడు ఓర్బాన్‌కు వ్యతిరేకంగా ఉన్న అత్యంత బలమైన ప్రతిపక్ష పార్టీకి మద్దతు ఇచ్చాయి.
అలా చేయడం ద్వారా అధికార పార్టీ(ఫిడెజ్) ప్రతిపక్ష పార్టీల ఓట్ల చీలికను ఉపయోగించుకోకుండా అడ్డుకున్నాయి.
సార్వత్రిక ఎన్నికలకు ముందు నెలల తరబడి నిర్వహించిన ప్రజాభిప్రాయ సర్వేలు అన్నీ ఒకే విషయాన్ని సూచించాయి.
పీటర్ మగ్యార్ నేతృత్వంలోని టిస్జా పార్టీ ప్రతిపక్షంలో అత్యంత బలమైన శక్తిగా నిలిచింది.
వరుసగా ఐదోసారి ప్రధానమంత్రి పదవీకాలం కోసం(1998-2002 కాలాన్ని కలుపుకుంటే ఆరవసారి) పోటీ చేస్తున్న ఓర్బాన్‌కు నిజమైన సవాలు విసరగలిగిన ఏకైక శక్తిగా అది కనిపించింది.
పోటీ నుంచి తప్పుకున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీలలో హంగేరియన్ సోషలిస్ట్ పార్టీ(ఎంఎస్జెడ్పీ) కూడా ఉంది. ఈ పార్టీ 1994-1998 మధ్య ఒకసారి, తరువాత 2002-2010 మధ్య మరో రెండు పర్యాయాలు అధికారంలో ఉంది.
2004లో హంగేరీని యూరోపియన్ యూనియన్‌లో కలపడంలో కూడా ఎంఎస్జెడ్పీ కీలక పాత్ర పోషించింది.
2010లో ఓర్బాన్ ఫిడెజ్ చేతిలో అధికారం కోల్పోయిన తర్వాత ఎంఎస్జెడ్పీ పార్లమెంటులో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. 2014 ఎన్నికల తర్వాత కూడా ఆ స్థానాన్ని కొనసాగించింది.
అయితే పార్లమెంటులో మూడింట రెండు వంతుల భారీ మెజారిటీతో ఓర్బాన్ తన అధికారాన్ని బలోపేతం చేసుకుంటూ రావడంతో ఆ పార్టీ ప్రాముఖ్యత క్రమంగా క్షీణించింది.
హంగేరీ పార్టీలు ఏమి చేశాయి?
2026లో ఎంఎస్జెడ్పీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒక ధైర్యమైన, చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
“చట్టబద్ధమైన మోసంగా మారిన ఎన్నికల వ్యవస్థను ఓడించాలంటే, పార్టీ ఏదైనా కావచ్చు, అత్యంత బలమైన ప్రతిపక్ష అభ్యర్థి వెనుక ఐక్యంగా నిలబడటమే మార్గం” అని ప్రకటించింది.
టిస్జా నాయకుడు పీటర్ మగ్యార్ అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడని భావించి, అవినీతికర, నిరంకుశ పాలనను కూల్చివేయాలనే పెద్ద లక్ష్యంతో ఎంఎస్జెడ్పీ అతనికి సంపూర్ణ మద్దతు ఇచ్చింది.
2026 హంగేరీ పార్లమెంటరీ ఎన్నికల్లో ఎంఎస్జెడ్పీ ఒక్క అభ్యర్థినీ కూడా పోటీకి నిలబెట్టకుండా రికార్డ్ సృష్టించింది.
జాతీయ ఎన్నికల్లో పోటీ చేయకుండా, ప్రతిపక్ష ఓట్లను ఒకే నాయకుడి వెనుక ఏకీకృతం చేయడం, ఒక స్థిరమైన రాజకీయ పార్టీ ఇంతకంటే గొప్ప త్యాగం చేయగలదా?
ఇతర చిన్న పార్టీలు హంగేరీ పీపుల్స్ పార్టీ, మొమెంటం మూవ్మెంట్, సొల్యూషన్ మూవ్మెంట్, హంగేరీ గ్రీన్ పార్టీ తదితరాలు కూడా తమ పార్టీ ప్రయోజనాలను పక్కనపెట్టి దేశ ప్రయోజనాన్ని ముందుకు తెచ్చాయి.
ఓర్బాన్ 16 ఏళ్ల పాలనలో తీవ్రంగా దెబ్బతిన్న ప్రజాస్వామ్య సంస్థలను, ప్రక్రియలను పునరుద్ధరించడమే ఆ పార్టీలన్నిటి లక్ష్యం. అవన్నీ మగ్యార్, అతని టిస్జా పార్టీకి మద్దతు ఇచ్చాయి. కూటమి ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా చేయలేదు.
ఓర్బాన్ ఊహించని పరాజయం..
ఈ పార్టీల త్యాగం వృథా కాలేదు. ప్రతిపక్ష ఓట్ల పెద్ద భాగం మగ్యార్ వెనుక సమీకృతం కావడంతో అతను ఘనవిజయం సాధించి అధికార పాలనకు షాకింగ్ పరాజయాన్ని అందించాడు.
ఓర్బాన్ తనకు ఓటమి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్య సంస్థలను అతను అంతగా బలహీనపరిచాడు. కాబట్టి తాను జీవితాంతం ప్రధాన మంత్రిగానే కొనసాగుతానని, తన విస్తారమైన పార్టీ యంత్రాంగంతో కలిసి భావించాడు. అతనికి ఎన్నికలు కేవలం ఒక లాంఛనప్రాయ ప్రక్రియ మాత్రమే.
ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడనే చట్టబద్ధతను చూపించడానికి అవసరమైన ఒక రూపకల్పన మాత్రమే.
హంగేరీని ప్రతిపక్ష రహిత దేశంగా మార్చాలని ఓర్బాన్ బహిరంగంగా పిలుపునిచ్చేవాడు. కానీ పార్టీల కంటే దేశం ప్రధానంగా ఉంచిన రాజకీయ శక్తుల కారణంగా ఆ ప్రణాళిక విఫలమైంది.
ఓర్బాన్ మాత్రం తనను, తన పార్టీని దేశం కంటే అతీతమైనవిగా భావించాడు.
సోషల్ మీడియా ద్వారా ఓర్బాన్ పాలనలో జరిగిన దోపిడీ, అవినీతి ప్రజల ముందుకు రావడంతో, అతని గట్టి మద్దతుదారులలో కూడా అసంతృప్తి పెరిగింది.
ఇది భారతదేశంలో జరగగలదా?
విక్టర్ ఓర్బాన్, నరేంద్ర మోదీ మధ్య అనేక పోలికలు ఉన్నాయి. వాస్తవానికి భారత ప్రధానమంత్రి మోదీ ఓర్బాన్ విధానాన్ని చాలా వరకు అనుసరిస్తున్నారు.
పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండటం వల్ల ఓర్బాన్ కొత్త రాజ్యాంగ వ్యవస్థను అమలు చేయగలిగాడు. ఎన్నికల కమిషన్, అత్యున్నత న్యాయస్థానాన్ని ప్రభుత్వ శాఖల మాదిరిగా మార్చేశాడు.
ప్రభుత్వాన్ని విమర్శించిన మీడియా సంస్థలు వ్యాపారం చేయలేని పరిస్థితి రావడానికి వీలుగా రాజ్యాంగ, చట్టపరమైన మార్పులు చేశాడు.
స్టేట్ ఆడిట్ ఆఫీస్, సెంట్రల్ బ్యాంక్, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వంటి జవాబుదారీ సంస్థలపై కూడా పూర్తి నియంత్రణ సాధించాడు.
మోదీ కూడా అలాంటి ఆధిపత్యం కోసం పలు చర్యలు తీసుకుంటున్నారు. అందుకే ప్రతిపక్ష పార్టీలను చీల్చడం, ఫిరాయింపులను ప్రోత్సహించడం జరుగుతోంది.
రాజ్యాంగ మెజారిటీ లేకపోయినా, క్యారెట్-అండ్-స్టిక్ విధానంతో ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
భారత ఎన్నికల కమిషన్ నిష్పాక్షికత దెబ్బతిన్నదని, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ కూడా ప్రస్తుత కమిషన్‌పై ఆరోపణలు చేశారు.
అంతేకాకుండా, భారత సుప్రీంకోర్టు “కార్యనిర్వాహక” నిర్ణయాలకు ముద్ర వేసే “ఎగ్జిక్యూటివ్ కోర్ట్”గా మారిందని న్యాయవేత్త గౌతమ్ భాటియా వ్యాఖ్యానించారు.
ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లపై జరిగిన ఒత్తిళ్లు, అలాగే న్యూస్‌క్లిక్, దాని వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థ ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా ఉదాహరణలుగా రచయిత పేర్కొన్నారు.
మైనారిటీలపై దాడులు, సమాజ విభజన..
ఓర్బాన్ ఫిడెజ్ పార్టీ ముస్లింలను హంగేరీ సంస్కృతికి ముప్పుగా చిత్రీకరించినట్లే, భారతదేశంలో బీజేపీ కూడా ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుంటోంది.
“ముస్లిం దండయాత్ర” అనే భయాన్ని ఓర్బాన్ సృష్టించి ప్రజాదరణ పెంచుకునేవాడు. అలాగే మోదీ-షా జంట కూడా ఎన్నికల సమయంలో “ముస్లింలు చొరబాటుదారులు” అని చేసిన వ్యాఖ్యానాలను రచయిత గుర్తు చేస్తున్నారు.
భారతదేశంలో మైనారిటీలపై జరిగిన అన్యాయాలను అనేక మంది రచయితలు, సంస్థలు ప్రచురించిన విషయాన్ని రచయిత ప్రస్తావించారు.
భారత ప్రతిపక్షం నేర్చుకోవాల్సిన పాఠం..
భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోతాయా లేక హంగేరీ ప్రతిపక్షం చేసినట్లుగా దేశ ప్రయోజనాన్ని లక్ష్యంగా ఎంచుకొని ఐక్యంగా పనిచేస్తాయా?
ప్రస్తుత పరిస్థితులలో ప్రస్తుత అవసరం ప్రతిపక్ష ఐక్యత. ప్రతిపక్ష పార్టీలు ఏకమైతే నరేంద్ర మోదీని అధికారంలో నుంచి దించివేసే అవకాశం ఏర్పడుతుంది. హంగేరీలో జరిగినట్లే భారత ప్రజాస్వామ్యాన్ని కొంతవరకు పునరుద్ధరించవచ్చు.
భారతదేశం హంగేరీ కాదు, ఇక్కడ అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని అంగీకరించాలి. ప్రతి రాష్ట్రంలో, ప్రతి నియోజకవర్గంలో బీజేపీకి వ్యతిరేకంగా ఒకే ఐక్య ప్రతిపక్ష అభ్యర్థిని నిలబెట్టే విధంగా అవగాహన ఏర్పడాలి.
హంగేరీ ప్రతిపక్ష పార్టీలు చేసినట్లే ఎక్కడ ఏ పార్టీ బలంగా ఉందో నిజాయితీగా అంచనా వేయాలి. అదే ఐక్యతకు ఆధారంగా ఉండాలని సూచన. నిరంకుశ ధోరణులను ఓడించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి అదే ఏకైక మార్గం.
అనువాదం: డి వెంకన్న
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
