అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో ఇటీవల మిలిటెంట్(తీవ్ర స్థాయి) పోరాటాలు జరిగాయి. అవి సానుకూల ఫలితాలను సాధించాయి. వివరాల్లోకి వెళితే, అమెరికాలో ఉన్నత విద్యా సంస్థలు కేవలం విద్యా బోధన, పరిశోధనలకే కాకుండా కార్మిక హక్కుల ఉద్యమాలకు కూడా కేంద్రాలుగా మారుతున్నాయి.
2025–26 కాలంలో ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా(యూసీ), హార్వర్డ్ యూనివర్సిటీలలో ఉద్యోగులు, పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థి కార్మికుల వేతనాలు, జీవన వ్యయాలు, ఉద్యోగ భద్రత, విదేశీ విద్యార్థుల హక్కులు వంటి అంశాలపై పెద్దఎత్తున పోరాటాలు నిర్వహించారు. ఈ పోరాటాలు అమెరికా విద్యా రంగ కార్మిక ఉద్యమంలో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచాయి.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పోరాట నేపథ్యం..
కాలిఫోర్నియాలో ఇళ్ల అద్దెలు విపరీతంగా పెరగడంతో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా(యూసీ)లో పనిచేసే అనేక మంది ఉద్యోగులు ఉద్యోగ స్థలానికి 2–3 గంటల దూరం నుంచి ప్రయాణిస్తున్నారు. కొందరు కార్లలో లేదా తాత్కాలిక నివాసాల్లో జీవిస్తున్నారని యూనియన్ ఆరోపించింది.
యూనివర్సిటీ అధికారులు తక్కువ వడ్డీతో గృహ రుణాలు పొందుతుంటే, సాధారణ ఉద్యోగులకు అలాంటి సౌకర్యాలు లేవని యూనియన్ విమర్శించింది. జీవన వ్యయాలు విపరీతంగా పెరగడంతో వేలాది మంది విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రులు, పరిశోధనా కేంద్రాలు, విద్యాసంస్థల్లో పనిచేసే సేవా కార్మికులు, ఆరోగ్య సిబ్బంది, సాంకేతిక ఉద్యోగులు మెరుగైన వేతనాలు, ఆరోగ్య భద్రత, ఉద్యోగ పరిస్థితుల మెరుగుదల కోసం ఉద్యమించారు.
ప్రధాన డిమాండ్లు..
1. జీవన వ్యయాలకు అనుగుణమైన వేతనాలు.
2. కనీస గంట వేతన పెంపు.
3. ఆరోగ్య బీమా వ్యయాల తగ్గింపు.
4. గృహ వసతి సమస్యల పరిష్కారం.
5. ఉద్యోగ భద్రత, పదోన్నతి అవకాశాలు.
40 వేలకు పైగా ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవడంతో కాలిఫోర్నియా రాష్ట్రం అంతటా కార్మిక వర్గం వారి పోరాటానికి సంఘీభావం తెలియజేసింది.
ఫలితంగా యాజమాన్యంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. కార్మిక సంఘాలతో ఒప్పందం చేసుకోక తప్పనిసరి పరిస్థితుల్లోకి యూనివర్సిటీ యాజమాన్యం నెట్టబడింది.
AFSCME Local 3299 యూనియన్ దాదాపు రెండు సంవత్సరాల చర్చలు, పలుమార్లు సమ్మెలు, కార్మిక వ్యతిరేక విధానాలపై ఫిర్యాదుల తర్వాత ఒప్పందాన్ని సాధించింది.
చివరకు 40,000 మందికి పైగా ఉద్యోగులు నిరవధిక సమ్మెకు సిద్ధమైన సమయంలో యాజమాన్యం దిగివచ్చి ఒప్పందం చేసుకుంది.
సాధించిన ఒప్పందం..
దీర్ఘకాల చర్చల అనంతరం AFSCME Local 3299 యూనియన్, యూనివర్సిటీ యాజమాన్యం మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరింది.
వేతన పెంపు: ఒప్పంద కాలంలో సుమారు 33–34% వరకు పెరుగుదల ఉంటుంది.
కనీస వేతనం: గంటకు కనీస వేతనం 25 డాలర్ల నుంచి 30.10 డాలర్ల వరకు ఉంటుంది.
బోనస్: అర్హులైన ఉద్యోగులకు 1000 నుంచి 1500 డాలర్ల వరకు బోనస్ వస్తుంది.
ఆరోగ్య ప్రయోజనాలు: వైద్య ఖర్చుల భారం తగ్గింపు.
ఉద్యోగ భద్రత: మెరుగైన రక్షణలు కల్పించబడతాయి. ఒకవేళ ఎవరైనా కార్మికుడిని ఉద్యోగం నుంచి తొలగించాల్సి వస్తే 2 నుండి 16 వారాల వేతనాన్ని నష్టపరిహారంగా ఇస్తారు.
ఈ ఒప్పందాన్ని యూసీ చరిత్రలో సేవా ఉద్యోగులకు లభించిన అత్యుత్తమ ఒప్పందాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. 48 వేలకు పైగా అకడమిక్ ఉద్యోగులు, పరిశోధకులు, టీచింగ్ అసిస్టెంట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న UAW Local 4811 సభ్యులు 2026లో కొత్త ఒప్పందాన్ని 91.5% మెజారిటీతో ఆమోదించారు. కొన్ని వర్గాల ఉద్యోగులకు గణనీయమైన వేతన పెరుగుదలలు, 2029 వరకు అమలులో ఉండే ఒప్పందం లభించింది.
హార్వర్డ్ విశ్వవిద్యాలయ పోరాట నేపథ్యం..
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సుమారు 4,000 మంది గ్రాడ్యుయేట్ విద్యార్థి కార్మికులకు(Teaching Fellows, Research Assistants, Course Assistants) ప్రాతినిధ్యం వహించే HGSU-UAW యూనియన్ 2025 నుంచి కొత్త ఒప్పందం కోసం యాజమాన్యంతో చర్చలు జరుపుతోంది.
అయితే వేతనాలు, విదేశీ విద్యార్థుల రక్షణ, వివక్ష వ్యతిరేక నిబంధనలు, వేధింపులపై ఫిర్యాదు వ్యవస్థ వంటి అంశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు.
ప్రధాన డిమాండ్లు..
1. జీవన వ్యయాలకు సరిపడే వేతనాలు.
2. టీచింగ్ ఫెలోస్, రీసెర్చ్ అసిస్టెంట్స్ మధ్య వేతన సమానత్వం.
3. విదేశీ విద్యార్థుల ఉద్యోగ భద్రత.
4. వివక్ష, వేధింపులపై బలమైన రక్షణలు.
5. అకడమిక్ స్వేచ్ఛకు హామీ.
2026 ఏప్రిల్ 21న గ్రాడ్యుయేట్ విద్యార్థి కార్మికులు నిరవధిక సమ్మె ప్రారంభించారు. ఫలితంగా:
తరగతుల బోధనకు అంతరాయం కలిగింది.
పరీక్షల మూల్యాంకనం నిలిచిపోయింది.
ప్రయోగశాల పరిశోధనల్లో జాప్యం జరిగింది.
క్యాంపస్‌లో భారీ పికెటింగ్ కార్యక్రమాలు జరిగాయి.
ఈ సమ్మె హార్వర్డ్ చరిత్రలో విద్యార్థి కార్మికుల అత్యంత దీర్ఘకాలిక సమ్మెలలో ఒకటిగా నమోదైంది.
పోరాటానికి కారణమైన ముఖ్య అంశాలు..
హార్వర్డ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ యూనియన్(HGSU-UAW) 2025 ఫిబ్రవరి నుంచి కొత్త ఒప్పందం కోసం చర్చలు జరుపుతోంది. 14 నెలలకు పైగా చర్చలు జరిగినప్పటికీ పురోగతి లేకపోవడంతో సమ్మెకు దిగాల్సి వచ్చింది.
హార్వర్డ్ యూనివర్సిటీకి లభించే భారీ ఆర్థిక వనరులతో పోలిస్తే విద్యార్థి కార్మికుల వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి.
అమెరికాలో వీసా, వలస విధానాల మార్పుల వల్ల అంతర్జాతీయ విద్యార్థుల్లో ఆందోళన తీవ్రమైంది.
యూనియన్ హక్కుల పరిరక్షణపై వివాదాలు కూడా సమ్మెకు దారి తీసిన డిమాండ్లలో ఒకటి అయింది.
సమ్మె ముగింపు..
మే 29న జరిగిన చర్చల్లో హార్వర్డ్ యాజమాన్యం కొన్ని కీలక అంశాలపై ముందడుగు వేసింది. ప్రత్యేకంగా వేతన సమానత్వంపై చర్చకు సిద్ధమైంది. విదేశీ విద్యార్థుల రక్షణ అంశాన్ని చర్చించేందుకు అంగీకరించింది. వివక్ష వ్యతిరేక విధానాలపై చర్చ ప్రారంభించింది. దీంతో 40 రోజుల సమ్మె అనంతరం 2026 జూన్ 1న యూనియన్ సమ్మెను నిలిపివేసింది.
అయితే సమ్మె విరమించడంపై యూనియన్ నాయకత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా, సమ్మె కొనసాగించాలా లేదా అన్న అంశంపై సభ్యుల ఓటింగ్ నిర్వహించింది. అందులో: 81% మంది సమ్మెను తాత్కాలికంగా నిలిపివేయాలని ఓటు వేశారు. 15% మంది కొనసాగించాలని కోరారు. 4% మంది తటస్థంగా ఉన్నారు.
కార్మికుల మనోభావనలకు అనుగుణంగా పూర్తిస్థాయి ఒప్పందం కుదరకపోయినప్పటికీ, చర్చల్లో కొన్ని అంశాలపై పురోగతి ఉందని యూనియన్ పేర్కొన్నది. మొదట యూనియన్‌తో చర్చించడానికి నిరాకరించిన యాజమాన్యం, డిమాండ్లపై చర్చించి త్వరలో ఒక సానుకూల ఒప్పందానికి వస్తామని యూనియన్‌కు హామీ ఇచ్చింది.
ఉద్యోగ భద్రత: మెరుగైన రక్షణల కల్పన చర్చల దశలో ఉంది.
వివక్ష వ్యతిరేక నిబంధనలు: చర్చలలో పురోగతి ఉంది.
వేతన పెంపుదల: 33–34% మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.
సమ్మె కారణంగా విద్యా సంవత్సరం ముగింపు(మే చివరికి వస్తుంది), సెమిస్టర్ ముగియడం, గ్రేడింగ్ పనులు నిలిచిపోవడం, విద్యార్థుల పరిశోధనలపై ప్రభావం పడటం వంటివి చోటుచేసుకున్నాయి.
దీర్ఘకాల సమ్మె వల్ల సభ్యులపైనే ఆర్థిక, విద్యా ఒత్తిడి పెరిగే అవకాశం ఉండటంతో యూనియన్ వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గింది. తిరిగి చర్చలు కొనసాగించాలని నిర్ణయించింది.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో జరిగిన పోరాటాలు అమెరికా ఉన్నత విద్యా రంగంలో కార్మిక హక్కుల కోసం జరుగుతున్న కొత్త తరహా ఉద్యమాలకు ప్రతీకలుగా నిలిచాయి.
యూసీ ఉద్యోగులు స్పష్టమైన వేతన పెంపులు, కనీస వేతన హామీ, ఆరోగ్య ప్రయోజనాలను సాధించగా, హార్వర్డ్ విద్యార్థి కార్మికులు తమ సమస్యలను జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చగలిగారు.
హార్వర్డ్‌లో తుది ఒప్పందం ఇంకా కుదరకపోయినా, ఆ పోరాటం యాజమాన్యాన్ని మరింత సానుకూల చర్చలకు నెట్టింది. ఈ రెండు ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయ కార్మిక సంఘాలకు ప్రేరణగా నిలిచే అవకాశముంది.
అమెరికా కార్మిక ఉద్యమ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కార్మికులు ఆర్థిక ప్రయోజనాలను గెలుచుకోగా, హార్వర్డ్‌లో విద్యార్థి కార్మికులు తమ సమస్యలను జాతీయ చర్చాంశంగా మార్చగలిగారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
