పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఓటమి తర్వాత, ఆ పార్టీలో తలెత్తిన తిరుగుబాటును, గోడదాటు విన్యాసాలను చూస్తున్నాం.
ఆ పార్టీకి చెందిన 29 మంది లోక్‌సభ సభ్యుల్లోనూ 20 మంది ఒక విడి కూటమిగా ఏర్పడి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ)కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
అధికారం జిగురుతో అంతవరకూ అతుక్కుని ఉన్న ఆ పార్టీలోని అంతర్గత సయోధ్య, ఆ జిగురు తొలగ్గానే అంతఃకలహాల దారిపట్టి రోజుకో రీతిలో ప్రత్యర్థి పార్టీలను అమితానందంలో, వినోదంలో ముంచితేలుస్తోంది.
చిరకాలంగా అధికారంలో ఉన్న ఒక పార్టీకి వ్యతిరేకంగా, సమీప ప్రత్యామ్నాయంగా కనిపించిన ఇంకొక పార్టీకి అనుకూలంగా ఓటర్లు ఇచ్చిన తీర్పుగానే టీఎంసీ ఓటమిని చూడాల్సి ఉంటుంది.
ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని అవతలి పక్షం తెరవెనుక చక్రం తిప్పి తీర్పును కొంతమేరకు తనకు అనుకూలంగా మలచుకుందనే అనుకున్నా; టీఎంసీ, దాని ప్రభుత్వం, ఆ రెండింటి అధినాయకత్వం పాల్పడిన తప్పులూ, ఇతర వైఫల్యాలూ ఓటమికి దారితీసి ఉండవచ్చుననే విషయంలోనూ సందేహానికి తావు లేదు.
కాకపోతే, నిన్నటివరకూ ఆ పార్టీలో ఉండి, పదవులు పొంది; ఆ పార్టీ, దాని ప్రభుత్వమూ ఇన్నేళ్లలోనూ చేసిన తప్పుల్లోనూ, వైఫల్యాల్లోనూ భాగస్వాములుగా ఉండి; ఇప్పుడు అధికారాన్ని కోల్పోగానే, భావజాలపరమైన తేడాలనూ, శంకలనూ, జనం ఏమనుకుంటారన్న వెరపునూ, సిగ్గెగ్గులనూ పక్కనపెట్టి, తమను ఓడించిన పక్షం పంచనే చేరడంలోని అవకాశవాదం కలిగించే జుగుప్స అంతాయింతా కాదు.
అంతకాలం అధికారపు రుచి మరిగారు కనుక దానిని చంపుకోలేక, ఆత్మాభిమానాన్ని దిగజార్చుకుని అధికారంలో ఉన్న అవతలిపక్షం విదిల్చే భిక్ష కోసం చేయి చాపడం తప్ప అది మరొకటి కాదు.
కోశాంబి చెప్పిన చరిత్ర అవిచ్ఛిన్నత..
పైన చెప్పిన 20 మంది ఎంపీల గురించిన వార్త చూడగానే నాకు చటుక్కున డీడీ కోశాంబి గుర్తొచ్చారు.
వైదిక జనాలు వాయవ్య, ఉత్తర భారతాల నుంచి తూర్పు దిశగా పయనించే క్రమంలో నేటి బెంగాల్‌తో సహా తూర్పు ప్రాంతాలకు చెందిన స్థానికులు వైదిక మతంలోకి మారుతూ వచ్చారు. ఆ మత ప్రభావంతో వారిలో కూడా ఋషులు అవతరించారు. వారిలో దీర్ఘతముడు ఒకడు.
కోశాంబి అతని గురించి రాస్తూ, వాయవ్య, ఉత్తర భారతాలకు చెందిన వైదిక జనాలు కొత్తగా వైదిక మతంలోకి మారిన స్థానికులను తమతో సమానులుగా చూసేవారు కాదనీ, ఈసడించుకునేవారనీ అంటారు.
దీర్ఘతముడు తూర్పు నుంచి వాయవ్య, ఉత్తర భారతాల వైపు వచ్చిన తర్వాతే సాటి ఋషులలో ఒకడిగా వైదిక జనాల గుర్తింపును, గౌరవాన్ని పొందాడని అంటారు.
ఆధిపత్యానికి తలవంచే తత్వం..
ఏదో సామెత చెప్పినట్టుగా, కొత్తగా మతం మారినవారిలో దాని ప్రభావం వేషభాషల్లోనూ, తంతుల్లోనూ, పట్టింపుల్లోనూ – పాతవారిలో కంటే మరింత ఎక్కువ మోతాదులో ఉంటుంది.
కాలాల హద్దులను కూడా దాటి బెంగాల్ లాంటిచోట్ల ఇప్పటికీ అది కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉండడమే ఎక్కువ ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఉదాహరణకు, బెంగాల్ జనాల పేర్లలో సంస్కృత శబ్దాలను ఎక్కువగా చూస్తూ ఉంటాం. సరే, బెంగాలీ దానికదే, సంస్కృత భాషాపుత్రికగా ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినదే.
వాయవ్య, ఉత్తర భారతాలతో పాటు పశ్చిమ భారతాన్ని కూడా కలుపుకుంటే, తూర్పు ప్రాంతాలు వాటి ఆధిపత్యానికి తలవంచడం, వాటి అధికారపు గొడుగు కిందికి చేరడానికి వెంపర్లాడడం కూడా కాలాల హద్దులను దాటుకుని ఇప్పటికీ నిరవధికంగా కొనసాగుతోందని పైన చెప్పిన 20 మంది టీఎంసీ ఎంపీల తీరు చెబుతుంది. ఇలాంటి చరిత్ర అవిచ్ఛిన్నత ఎంత ఆశ్చర్యకరం.
దక్షిణాదిలోనూ అదే దారి..
అలాగని ఈ లొంగుబాటులో దిక్కుల భేదాలేమీ లేవు; దక్షిణ భారతం కూడా మొదటినుంచీ అంతే. కేఏ నీలకంఠశాస్త్రి మొదలైన దక్షిణ భారత చరిత్రకారుల ప్రకారం క్రీపూ 3 – క్రీ.శ. 3 శతాబ్దాల మధ్యకాలానికి చెందిన తమిళ సంగం సాహిత్యం నాటికే ప్రాకృత, సంస్కృత శబ్దాలు తమిళంలోకి ప్రవేశించాయి.
అప్పటికే దక్షిణాదిన వైదిక మతం పాతుకుని, రాజులు ఎంతో ధనవ్యయంతో కూడిన యజ్ఞాలు చేయడం ప్రారంభించారు.
క్రమంగా రామాయణ, మహాభారతాల వంటి వాయవ్య, ఉత్తర భారతాలకు చెందిన వాఙ్మయం దక్షిణ భారతంలోకి వ్యాపించి దక్షిణాది భాషల్లోకి అనువాదమవుతూ వచ్చింది.
చరిత్ర పూర్వకాలం నుంచీ, చరిత్రకాలం మీదుగా పశ్చిమం, తూర్పు, దక్షిణాలలో జరుగుతూ వచ్చిన ఇదే ప్రక్రియకు ముస్లిం, బ్రిటిష్ పాలనల వల్ల మధ్యలో విరామం వచ్చినా, స్వతంత్ర భారతంలో ఇప్పుడు తిరిగి మొదలైంది. తాజాగా లోతట్టు ఈశాన్య రాష్ట్రాల్లోకి కూడా అది వ్యాపిస్తుండడం చూస్తున్నాం.
ఆత్మగౌరవాన్ని చెరుపుకుంటూ..
అంతర్జాతీయంగానూ, దేశీయంగానూ వలసలూ, రాకపోకలూ సర్వసాధారణమైనప్పుడు వేర్వేరు ప్రాంతాలు తమ తమ మత, భాషా, సంస్కృతులను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం, అందులోంచి ఒక మిశ్రమ సంస్కృతి పెంపొందడం సహజమే కనుక దానిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు.
కానీ ఒక సువిశాల భూభాగంలోని ఏవో కొన్ని ప్రాంతాలు మొదటినుంచీ ఇతర ప్రాంతాలను తమదైన రాజకీయ, మత, భాషా, సంస్కృతుల ఆధిపత్యంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండడం, ఆ ఇతర ప్రాంతాలు కూడా తమవైన అన్ని రకాల గుర్తింపులనూ, ఆత్మగౌరవాన్ని చెరుపుకుంటూ లొంగిపోవడం మాత్రం అటువంటిది కానేకాదు.
దక్షిణ భారత రాష్ట్రాలు ఒకటొకటే లొంగిపోవడం ఇప్పటికి కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం. తమిళనాడులో ద్రవిడ గుర్తింపును చాటుకుంటూ ఏర్పడిన ఒక రాజకీయ పక్షం ఇప్పటికే లొంగిపోయింది.
తెలుగునాట కూడా రాజకీయరంగంలో అటువంటి లొంగుబాటునే చూస్తున్నాం. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలది ఆ లొంగు ‘బాట’లో తాజా అడుగు మాత్రమే.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
