వామపక్షాలు నూతన తరహా ప్రజా రాజకీయాలకు తెర తీయాలని ఫాసిస్ట్ వ్యతిరేక ప్రతిఘటన క్షేత్రస్థాయి పోరాటాలు దీనికి పునాదిగా ఉండాలని సిపిఐ ఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య అంటున్నారు.
కేరళలో వరుసగా రెండుసార్లు అధికారంలో కొనసాగిన వామపక్ష ప్రజాతంత్ర సంఘటన ఈ ఎన్నికలలో ఓడిపోవడంతో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ వామపక్ష ప్రభుత్వాలు అధికారంలో లేని స్థితి తొలిసారి ఏర్పడింది. తాజాగా ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఫలితాలు పర్యవసానాల గురించి, వామపక్షాల పలుకుబడి తగ్గుదల, మితవాద శక్తుల ఎదుగుదల, లౌకిక ప్రజాతంత్ర భారతాన్ని సంరక్షించే లక్ష్యంతో వామపక్ష రాజకీయాలను పునరుద్ధరించాల్సిన అవసరం గురించి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్ లెనినిస్ట్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య ఫ్రంట్ లైన్ ప్రతినిధి టీ.కే.రాజ్యలక్ష్మి తో ముచ్చటించారు.
తగ్గుతున్న వామపక్షాల పలుకుబడి గురించి ఆందోళన చెందుతూనే భట్టాచార్య తాజా ఎన్నికల పరిణామాలు దీర్ఘ కాలంలో ఫాసిస్టు వ్యతిరేక రాజకీయాలకు కేంద్రంగా ఉండాల్సిన వామపక్షాల పై ఎటువంటి ప్రభావాన్ని చూపనున్నాయో అన్న అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇండియా బ్లాక్ అత్యంత విశాలమైన రాజకీయ వేదికగా మారాల్సిన అవసరం ఉందన్నారు. బిజెపి వ్యతిరేక శక్తులు అందరి మధ్య విస్తృతమైన సమన్వయము, సహకారము ఉండాల్సిన అవసరాన్ని తాజా ఎన్నికల ఫలితాలు మరింత ధృవీకరిస్తున్నాయన్నారు.
ఫ్రంట్ లైన్ : తాజాగా ముగిసిన ఎన్నికల ఫలితాలు వామపక్షాల పనితీరు గురించి స్థూలంగా మీరేం అనుకుంటున్నారు. గడచిన కొన్ని దశాబ్దాలలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ వామక్ష ప్రభుత్వం లేకపోవడం ఇదే మొదటిసారి.
దీపాంకర్ భట్టచార్య: ఈ ఎన్నికలలో వామపక్షాలు ఎలా వ్యవహరించాయి, ఏ ఫలితాలు సాధించాయి అన్న విషయాన్ని వామపక్షాలు ఆత్మ పరిశీలన చేసుకొంటాయి. అయితే ఎన్నికల ఫలితాలు మరింత తీవ్రమైన ఆందోళనకు కారణమవుతున్నాయి. అస్సాం, బెంగాల్ లలో బిజెపి అఖండ విజయం, బిజెపి వ్యతిరేక కూటమిలో ప్రధాన ప్రాంతీయ పార్టీలైన డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్ పరాజయంతో దేశ రాజకీయాలల్లో మితవాద శక్తుల ఆధిపత్యం మరింతగా సుస్థాపితం అవుతోంది. ఎన్నికల ఫలితాలతో మరింత ఉత్సాహం పొందిన బీజేపీ సంఘపరివారం సంపదను కొద్దిమంది చేతుల్లోనే మరింతగా కేంద్రీకరించే విధానాలకు, జాతీయస్థాయిలో అధికారాన్ని సంఘ్ బిజెపి చేతుల్లో భారీ ఎత్తున కేంద్రీకరించేందుకు అవసరమైన విధానాలను ఉధృతంగా అమలు చేయనున్నాయి.
ఫ్రంట్ లైన్: వామపక్షాల పరాజయం నేపథ్యంలో దేశంలో ప్రగతిశీల శక్తులు ఎదుర్కోబోతున్న సవాళ్లు ఎలా ఉండనున్నాయి?
భట్టాచార్య: ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో కేవలం కేరళలో మాత్రమే వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్నది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న తర్వాత ఆ వామపక్ష ప్రభుత్వం ఓడిపోవడం ఊహించినదే. అయితే ఇన్ని తక్కువ స్థానాలలో మాత్రమే గెలవటం అన్నది లోతుగా పరిశీలించాల్సిన విషయం. సింగూరు భూసేకరణ ఉదంతం తర్వాత పశ్చిమ బెంగాల్ లో సిపిఎం ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకోవడానికి, దిద్దుబాటు చర్యలకు సిద్ధం కాలేదు. అప్పుడు మొదలైన పతనం నేటికీ కొనసాగుతోంది. దాన్ని నిలువరించాల్సిన అవసరం ఉన్నది. కేరళలో సిపిఎం ఓటమి నుండి తగిన గుణపాఠాలు నేర్చుకోవడానికి పునరుద్ధరణ దిశగా తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. బెంగాల్ లో పదేళ్ల క్రితం బిజెపికి మూడే సీట్లు కొద్దిపాటి ఓట్లు మాత్రమే ఉన్నాయి. నేడు కేరళలో కూడా బిజెపి అదే పరిస్థితిలో ఉన్నది. కేరళలోని ప్రగతిశీల శక్తులు ఈ విషయాన్ని గమనిస్తాయని కేరళ కూడా మరో బెంగాల్ గా మారకుండా జాగ్రత్తలు తీసుకుంటాయని ఆశిస్తున్నాను.
ఫ్రంట్ లైన్: భారతదేశంలో వామ పక్షాల అసమాన అభివృద్ధికి కారణమేమిటి?
భట్టాచార్య: చారిత్రకంగా చూసినప్పుడు భారతదేశంలో వామ పక్షాలు వలస వ్యతిరేక స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా తెర మీదకు వచ్చాయి. అభివృద్ధి చెందాయి. సామాజిక సమానత్వపు ఆకాంక్ష, హేతువాద దృక్పథం, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సమరశీల రైతాంగ పోరాటాలు, పెట్టుబడిదారీ దోపిడీకి వ్యతిరేకంగా పురుడు పోసుకున్న కార్మిక ఉద్యమం, సంస్థానాలలో నిరంకుశ
పాలకులకు వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటాలు వామపక్షాల అభివృద్ధికి పునాదులు వేశాయి. కరుడు కట్టిన భూస్వామ్య పితృ స్వామిక వ్యవస్థలు ఉన్న ఉత్తర భారతదేశం సహజంగానే వామపక్ష భావజాలాన్ని స్వాగతించలేదు. పైగా ప్రతిఘటించింది. దీర్ఘకాలంగా చూసినప్పుడు ఇది ఒక వ్యవస్థాగత ధోరణిగా మారింది. ఇప్పటివరకు చూస్తే వ్యవస్థాపక ధోరణులు అన్నీ కకావికలం అవుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఉత్తరాది రాష్ట్రాలలో కూడా వామపక్షాలు ఒక రాజకీయ ధోరణిగా ఎదగలేవు అని తీర్మానించుకునే అవకాశం లేదు. ప్రస్తుతానికి ఆయా రాష్ట్రాలలో వామపక్షాల పలుకుబడి ప్రభావం పరిమితంగానే ఉన్నది.
ఫ్రంట్ లైన్: ఎన్నికలలో భారీ ఎత్తున ప్రభావం చూస్తున్న ధన బలం భారీ వనరులు వంటి అంశాలను వామపక్షాలు ఎలా అధిగమించాలి ?
భట్టాచార్య: విస్తృతమైన ప్రజా సమీకరణాల ద్వారాను, ప్రజా సమీకరణలు పౌర సమాచార సాధనాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా మాత్రమే వామపక్షాలు ఈ సమస్యను అధిగమించగలవు. మనం సాధించుకున్న రాజ్యాంగం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్వాతంత్ర్య ఉద్యమంలో అంతర్భాగాలు. భారతదేశం సాధించిన ప్రజాస్వామ్యపు విజయాలను ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలను ఇప్పుడు ఫాసిస్ట్ శక్తులు డొల్లబారుస్తున్నాయి. ప్రజలకు మరిన్ని హక్కులు సాధించుకునేందుకు, ప్రజాస్వామ్యం పరిఢవిల్లేందుకు, ప్రజా ప్రాతినిధ్యం పెంచేందుకు, మెరుగైన ప్రజాస్వామ్యం కోసం కృషి చేయాలి. ఈ లక్ష్యాలు సాధించాలంటే రెండో స్వాతంత్ర్య సమరం తప్ప మరో మార్గం లేదు. సిద్ధాంత పరంగాను, కార్యాచరణ పరంగానూ వామపక్షాలు ఈ ఫాసిస్టు వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించాలి.
ఫ్రంట్ లైన్: బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యతకు తృణమూల్ కాంగ్రెస్ సుముఖంగా ఉన్నట్లు ప్రకటించింది. తృణమూల్ గతంలో వ్యవహరించిన తీరు దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ వామపక్షాలు ఈ ప్రతిపాదనను తోసి పుచ్చాయి. సీట్ల సర్దుబాటు, ఓట్ల బదిలీ వంటి సమస్యల నేపథ్యంలో జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా ఐక్య సంఘటన సాధ్యమే అంటారా?
భట్టాచార్య: జాతీయ స్థాయిలో తృణమూల్ ఇండియా బ్లాక్ లో భాగస్వామిగా కొనసాగుతూంది. కేంద్ర ప్రభుత్వం దురుద్దేశ్యంతో ముందుకు తెచ్చిన డిలిమిటేషన్ బిల్లు కు వ్యతిరేకంగా పార్లమెంటులో అన్ని ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. అయితే తృణమూల్ పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉన్న బెంగాల్ లో బిజెపికి వ్యతిరేకంగా ఐక్య సంఘటన ఏర్పడలేదు. ఎందుకంటే అవినీతి, ఇతర పాలనా పరమైన అనేక సమస్యల కారణంగా వామపక్షాలు కాంగ్రెస్ లు తృణమూల్ తో రాష్ట్ర స్థాయిలో జట్టు కట్టడం సాధ్యం కాదు. కాలేదు. కేరళ పంజాబ్ లల్లో కూడా ఇండియా బ్లాక్ కు రాష్ట్ర స్థాయిలో సమన్వయం ఏర్పడలేదు. తమిళనాడులో కొన్ని మార్పులు రావచ్చు.
వైవిధ్యమైన, సంక్లిష్టమైన భారత రాజకీయాల్లో ఈ తరహా పరిస్థితులు పరిణామాలు అనివార్యం. తప్పించుకోలేము. బెంగాల్ లో మారిన రాజాకీయ పరిణామాల నేపథ్యంలో పలు బిజెపి వ్యతిరేక పార్టీల మధ్య సంబంధాలలో మార్పు వచ్చే అవకాశం ఉంది. మారిన పరిస్థితుల్లో తృణమూల్ తనను తాను ఎలా మార్చుకుంటుంది అన్న దానిపైనే చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి.
ఫ్రంట్ లైన్: కొందరు ఇండియా బ్లాక్ కు కాలం చెల్లింది అంటున్నారు. ప్రత్యేకించి ఏ రాష్ట్రంలోనూ ఆ కూటమి పార్టీలు అధికారంలో లేవన్న కారణంతో ఈ నిర్ధారణలకు వస్తున్నారు. ఇది సరైన అంచానాయేనా ?
భట్టాచార్య: సమకాలీన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పుట్టుకొచ్చిన వేదిక ఇండియా బ్లాక్. భారతదేశంలో ఒక్క రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలనుకుంటోంది బిజెపి. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అనేక పోరాటాలు, రోహిత్ వేముల మొదలు జె ఎన్ యు మీద పథకం ప్రకారం జరుగుతున్న దాడి వంటి పరిణామాలతో దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో చెలరేగిన అసంతృప్తి, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగిన శాంతియుత మహోద్యమం, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కబంధ హస్తాల్లోకి నెట్టే ప్రయత్నానికి వ్యతిరేకంగా సాగిన రైతాంగ సమరశీల పోరాటాల పర్యవసానంగా ఇండియా కూటమి తెర మీదకు వచ్చింది. ఇండియా బ్లాక్ ఏర్పాటుకు దారి తీసిన అనేకానేక ఉద్యమాలు పరిణామాలలో కొన్నిటిని మాత్రమే ఇక్కడ ప్రస్తావించాను.
తాజాగా జరిగిన ఎన్నికల సమరం, ఎన్నికలను భారీ ఎత్తున తొట్టడానికి జాతీయ స్థాయిలో బిజెపి పన్నుతున్న కుట్రలు, దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు కుదవ పెట్టడం, దశాబ్ద కాలపు విధానపర ఉత్పాతాలు, వైపరీత్యాల నేపథ్యంలో దేశంలో పొంచి ఉన్న ఆర్థిక సంక్షోభం వంటి పరిణామాలు ఇండియా బ్లాక్ ఇలాంటి కూటముల ఆవశ్యకతను మరింత వేగవంతం చేస్తున్నాయి. ఇండియా బ్లాక్ లోని అన్ని భాగస్వామ్య పార్టీలు ప్రస్తుత పరిస్థితులపై స్పందించాలి. ముందుకు వచ్చే డిమాండ్లను అందిపుచ్చుకోవాలి. దేశవ్యాప్తమైన ఉనికిని కలిగిన ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఈ కూటమిని ముందుకు తీసుకువెళ్లడంలో కీలకపాత్ర పోషించాలి. కాంగ్రెస్ పూర్తిగా జవ సత్వాలను సమకూర్చుకుంటుంది అన్న అంచనా కానీ, ప్రాంతీయ పార్టీలకు చెల్లు చీటి ఇచ్చే రోజులు వచ్చాయన్న అంచనా కానీ సరైనవి కావు. తొందరపాటు అంచనాలే. ఏక పార్టీ అధిపత్యానికి వ్యతిరేకంగా జాతీయ వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సమాఖ్య స్వభావానికి లోబడి ప్రజాస్వామ్యం పరిఢవిల్లింది. ప్రస్తుత రాజకీయ సవాళ్లను అధిగమించడంలో ఈ బహుళ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ఓ పరిష్కార మార్గమయితే భారతీయ జాతీయతను, సామ్రాజ్యవాద వ్యతిరేకతను, లౌకిక మూల స్తంభాలను బలోపేతం చేయటం రెండో పరిష్కారం.
ఫ్రంట్ లైన్: జోసెఫ్ విజయ్ నాయకత్వంలోని టీవీకే తమిళనాడులో లౌకిక ప్రజాతంత్ర కూటమిలో వామ పక్షాలు కూడా ఈ కూటమిలో భాగస్వాములే. ఈ పరిణామాలను ఎలా చూస్తున్నారు?
భట్టాచార్య: తమిళనాడులో టీవీకే ఆవిర్భావం, విజయం, వ్యవస్థాగత రాజకీయాలను చిన్నభిన్నం చేసింది. యాభై ఏళ్లకు పైగా కట్టుదిట్టంగా అమలు జరుగుతున్న రాజకీయ ఏర్పాటు చిన్నా భిన్నం కావటాన్ని ఉపయోగించుకొని ఆ రాష్ట్రంలో ప్రవేశించాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. తమిళనాడు భారతదేశంలో శక్తివంతమైన ప్రజాతంత్ర సమాఖ్య స్వభావాన్ని కలిగిన రాష్ట్రంగా కొనసాగేలా చూడాల్సిన బాధ్యత వామపక్షాలపై ఉంటుంది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో బిజెపి అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. ఈ పరిణామాలు భారత ప్రజాస్వామ్యానికి, వామపక్షాలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. అస్సాంలో నియోజకవర్గాల డీ లిమిటేషన్, బెంగాల్ లో ఓటర్ల జాబితా సవరణలు బిజెపి విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి పక్షపాత ధోరణితో వ్యవహరించింది. ఎన్నికల సమయంలో సాయుధ బలగాలను భారీ ఎత్తున మొహరించి ప్రభుత్వ వాతావరణం కల్పించారు.
భారతదేశంలోని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వ్యవస్థలు, సంస్థలు వాటిపై పెరుగుతున్న ఫాసిస్టు దాడిని నిలువరించలేకపోతున్నప్పుడు అన్ని రకాల ఫాసిస్టు వ్యతిరేక శక్తులు భారతదేశపు ప్రజాతంత్ర, లౌకిక, ప్రగతిశీల భావజాలం పై ఆధారపడి దానిని పునరుద్ధరించుకుంటూ ప్రజలను చైతన్యవంతులను చేయటం తప్ప మరో మార్గం లేదు. ప్రజల రోజువారి జీవితంతో మమేకం కావడం, మనుగడ కోసం వారు సాగిస్తున్న పోరాటాలలో భాగస్వాములు కావడం వారికి నాయకత్వం వహించడం, ఈ కార్యక్రమంలో ఇండియా బ్లాక్ భాగస్వామ్య పక్షాలను ఏకతాటి మీదకు తీసుకురావడం ఒక్కటే పాసిస్టు శక్తులను నిలువరించే మార్గం.
స్వాతంత్ర్యోద్యమంలోనూ, స్వాతంత్ర్యానంతరం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటంలోనూ నాయకత్వ పాత్ర వహించిన వామపక్షాలు తమను తాము పునరుద్ధరించుకోవడం కోసం, పునర్మించుకోవడం కోసం ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి.
ఫ్రంట్ లైన్: తమిళనాడు లో డిఏంకే నుండి కాంగ్రెస్ దూరం జరుగుతున్న తరుణంలో ఇండియా కూటమి కకావికలమవుతోంది అన్న వాదన తో మీరు ఏకీభవిస్తారా?
భట్టాచార్య: కొన్ని కొన్ని రాష్ట్రాల్లో పరస్పరం తలపడుతున్న పార్టీలతో సహా అనేక పార్టీలు ఇండియా కూటమి లో భాగస్వాములుగా ఉన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ లో మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడులో బిజెపి యేతర పార్టీల మధ్య సంబంధాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే ఇండియా కూటమి సాధ్యమైనంత ఐక్యతతో పరస్పరం సహకరించుకునే విశాలమైన వేదికగా ఉండాల్సిన సమయం ఇది. మే 4 ఫలితాలు ముందుకు తెస్తున్న కర్తవ్యం ఇదే. ఈ కూటమిలో కాంగ్రెస్ పెద్ద పార్టీ మాత్రమే కాదు ఈ కూటమి ద్వారా ఎక్కువగా లబ్ధి పొందిన పార్టీ కూడా. అందువలన కాంగ్రెస్ రానున్న కాలంలో నికరమైన నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాల్సి ఉంది.
అనువాదం: కొండూరు వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
