Modi's Pushkara rule - 5 Petroleum product prices are a burden on the people!
మోదీ పుష్కర పాలనలో పెరిగిన ద్రవయోల్బణం, క్షీణిస్తున్న ప్రజలు జీవన పరిస్థితులు, కుదింపుకు గురవుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ప్రభుత్వం బడ్జెట్ లో నిధుల కేటాయింపు, అపర కుబేరుల సంఖ్య, వారి మొత్తం సంపద ఎలా పెరిగింది తదితర విషయాలను “ది వైర్ తెలుగు” తెలుగు పాఠకులకు అందించింది.
ఈ సీరియల్ లో భాగంగా ప్రత్యేకంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు, భారతదేశంలో వినియోగ దారులు భరించిన ధరలు, వాటి వెనుకనున్న విధానాలు, వాటిని రూపొందించిన పాలకులు చెప్పిన విషయాలు, ఆచరణలో ఏమి జరుగుతున్నది ఆ వివరాలు చూద్దాం.
2002 సంవత్సరానికి ముందు భారతదేశంలో అడ్మినిస్ట్రేటివ్ ప్రైస్ కంట్రోల్ మెకానిజం అనే వ్యవస్థ ఏర్పడి పనిచేసింది. ఇది పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆధీనంలో పని చేసేది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధర హెచ్చు, తగ్గుల భారాలు ప్రజలపై మోపకుండా నియంత్రించడం దాని ప్రధాన లక్ష్యం.
అందులో భాగంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలను మార్కెట్ శక్తుల నిర్ణయించడం కాకుండా ప్రభుత్వమే నిర్ణయించడం అత్యంత కీలకమైనది. ఇది అమలు జరగడానికి వీలుగా “ఆయిల్ పూల్ అకౌంట్” అనే విధానం అమలులో ఉండేది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు ఆదా అయిన దానిలో కొంత భాగాన్ని ఈ నిధికి ప్రభుత్వం జమ చేసేది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు ఆ భారం ప్రజల పైన పడకుండా నివారించడానికి షాక్ అబ్జార్బ్ లాగా ఈ నిధిని వినియోగించేది.
అయితే 2002లో వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ రెండు వ్యవస్థలని (అడ్మినిస్ట్రేటివ్ ప్రైస్ కంట్రోల్ మెకానిజం & ఆయిల్ పూల్ అకౌంట్) రద్దు చేసింది.ప్రపంచీకరణ, సరళీకరణ విధానంలో అత్యంత కీలకమైన కేంద్ర బిందువు ప్రభుత్వం తన బాధ్యతల నుంచి విరమించుకొని మార్కెట్ శక్తులకు వదిలివేయడం.
ఈ విధానాన్ని నాటి ప్రధాని వాజ్పేయి గారు చెప్పి, ఇక ప్రభుత్వ జోక్యం ఉండదు. ఆయిల్ కంపెనీలే ధరలు నిర్ణయిస్తాయి అని విధాన నిర్ణయాన్ని ప్రకటించారు తదనగుణంగా వ్యవస్థీకృత ఏర్పాట్లు చేశారు.
అంతర్జాతీయంగా ముడిచమరు ధరలు పెరిగితే ఇక్కడ పెరుగుతాయి, తగ్గితే ఇక్కడ తగ్గుతాయి అని చెప్పారు.
2014 తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు గణనీయంగా పడిపోయాయి. ఈ కాలంలో అధికారంలో ఉన్నది కూడా వాజ్పేయి వారసుడు భారతీయ జనతా పార్టీ నేత నరేంద్ర మోడీ గారు. వాజ్పేయి గారు చెప్పిన సూత్రం ప్రకారం పెట్రోల్, డీజిల్, సీ.ఎన్.జి, వంటగ్యాస్ తదితర పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గాలి. కానీ అందుకు విరుద్ధంగా విపరీతంగా ధరలు పెరిగాయి.
నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ, వారిని నడిపిస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఇందుకు భారత ప్రజానీకానికి(మేరా భారత్ మహాన్) సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
అసలు కీలకమైన ప్రశ్న పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఆర్థిక వ్యవస్థ మార్కెట్ స్థిరత్వం కోసం పనిచేయాలా? లేక ప్రజల జీవన భద్రత కోసం పని చేయాలా? ప్రజల జీవన ప్రమాణాలు ఉపాధి, వ్యవసాయం, రవాణా, కొనుగోలు శక్తి వంటి అంశాలు ప్రధానమైతే ప్రభుత్వ జోక్యం, ధరల స్థిరీకరణ వ్యవస్థలు, సామాజిక రక్షణ విధానాలు, అనివార్యం అవుతాయి.
కాబట్టి నేటి ప్రభుత్వ విధానం ప్రజల కోసమా? కొద్ది మంది కార్పొరేట్ శక్తుల ప్రయోజనం కోసమా? మాటలు ఏమి చెప్పినప్పటికీ, ఆచరణలో నేటి ప్రభుత్వం రుజువు చేస్తున్నది “తాను అధికారంలోకి రావడానికి మాత్రమే ప్రజల ఓట్లు అవసరం. కాబట్టి ఎన్నికల ప్పుడు ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతాం. అధికారానికి వచ్చాక ఏరు దాటి తెప్ప తగిలేసినట్లు ప్రజలపై భారాలు వేసి వారి నడ్డి విరగొడతాం, అని ఈ ప్రభుత్వం ఆచరణలో రుజువు చేసింది.
2014 నుంచి 2026 మార్చి వరకు అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమరు ధర ఎలా మార్పులు చెందింది, దానికి అనుగుణంగా డీజిల్, పెట్రోల్, ధరల పెరుగుదల, 2014 నాటి అంతర్జాతీయ ధరల ఆధారంగా ఎలా ఉండాలి? వాస్తవంగా ఎంత ఉన్నాయి? ప్రతి లీటరు డీజిల్, పెట్రోల్ పై ప్రభుత్వం ప్రజల నుంచి అదనంగా ఎంత వసూలు చేసింది, సంవత్సరాలు వారీగా దేశం మొత్తంలో పెట్రోల్, డీజిల్ వినియోగం ఎంత జరిగింది? దాని ఆధారంగా ప్రజల డబ్బు ఎంత భారీ మొత్తంలో డ్యూటీ చేయబడింది? గణాంక వివరాలు అనుబంధం లోని పట్టికలో చూడండి.
దాని ప్రకారం కేవలం డీజిల్, మరియు పెట్రోల్ వినియోగం మీద మాత్రమే 12 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ప్రజల నుండి అదనంగా కొల్లగొట్టిన మొత్తం 65 లక్షల 56వేల 188 కోట్లు.
పెట్రోల్, డీజిల్ కేవలం వ్యక్తిగత వినియోగానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఇంధనం అత్యంత కీలకము. ఇంధనం లేకుండా సమాజంలో ఏ ప్రక్రియ జరిగే అవకాశం లేదు. అందుచేత ఇంధన ధరల ప్రభావం మొత్తం ప్రజలందరూ వినియోగించే సరుకుల ధరలపై అనివార్యంగా ఉంటుంది.
సి.ఎన్.జి, ఎల్.పి.జి గృహ వినియోగదారులు మరియు వ్యాపార వినియోగదారుల కు సంబంధించిన గణాంక వివరాలు వాస్తవ వినియోగం యొక్క లెక్కలు అందుబాటులో లేని కారణంగా ఈ పట్టికలో వాటి ప్రభావం వివరించలేదు కానీ పైన చెప్పిన మొత్తం కంటే ఇంకా చాలా ఎక్కువ మొత్తం ప్రజల నుండి ప్రభుత్వం వసూలు చేసింది అనేది యదార్థం.

ఆర్. లక్ష్మయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
