కృష్ణా, గోదావరి బేసిన్లో రిలయన్స్ సంస్థ సహజ వాయువు(నేచురల్ గ్యాస్) వెలికితీతలో అక్రమాలకు పాల్పడిందనే వివాదం సుప్రీంకోర్టులో కొనసాగుతున్నది. దానిపై రిలయన్స్ సంస్థ తాజాగా సుప్రీంకోర్టుకు ఒక విజ్ఞప్తి చేసింది.
తాము కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఒక అంగీకారానికి వస్తామని తెలియజేసింది. అందుకు సుప్రీంకోర్టు కూడా అనుమతించింది.
ఈ నేపథ్యంలో అసలు వివాదం ఎలా ప్రారంభమైంది, గతంలో ఏమి జరిగిందో సింహావలోకనం చేసుకోవడం కోసం పాఠకులకు అందిస్తున్నాము.
భారతదేశ ఆర్థిక, ఇంధన రంగ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన అంశాలలో కృష్ణా-గోదావరి బేసిన్ సహజ వాయువు వివాదం ఒకటి.
ఈ వివాదంలో ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ), కేంద్ర ప్రభుత్వం, విదేశీ భాగస్వామ్య సంస్థలు, చివరకు భారత న్యాయవ్యవస్థ కూడా భాగస్వాములయ్యాయి.
ఈ కేసు కేవలం ఒక వాణిజ్య వివాదం మాత్రమే కాదు. ఇది భారతదేశ సహజ సంపదలపై హక్కులు ఎవరికో, ప్రభుత్వ పాత్ర ఏమిటో, ప్రైవేటు సంస్థల పరిమితులు ఎక్కడివరకో అన్న అంశాలను దేశవ్యాప్తంగా చర్చకు తెచ్చింది.
కేజీ బేసిన్ – నేపథ్యం..
కృష్ణా-గోదావరి సముద్ర తీర ప్రాంతంలో విస్తరించి ఉన్న సహజ వాయువు నిల్వలను “కేజీ బేసిన్” అంటారు.
ఇది ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో ఉన్న భారతదేశపు అతిపెద్ద గ్యాస్ నిల్వలలో ఒకటి.
2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం “నూతన అన్వేషణ లైసెన్సింగ్ విధానం”(న్యూ ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్సింగ్ పాలసీ – ఎన్ఈఎల్పీ) కింద వివిధ బ్లాకులను అన్వేషణ కోసం ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు కేటాయించింది.
నాడు వాజపేయి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. ఈ క్రమంలో కేజీ-డీ6 బ్లాక్‌ను రిలయన్స్ నేతృత్వంలోని కన్సార్టియంకు ఇచ్చారు.
సమీపంలోని కొన్ని బ్లాకులు ఓఎన్జీసీ ఆధీనంలో ఉన్నాయి.
ఈ రెండు బ్లాకులు భౌగోళికంగా సమీపంలో ఉండటంతో, భూగర్భంలో ఉన్న గ్యాస్ నిల్వలు పరస్పరం అనుసంధానమై ఉండే అవకాశాలు ఉన్నాయని తర్వాత తెలిసింది.
వివాదం ఎలా ప్రారంభమైంది?
2009 ప్రాంతంలో రిలయన్స్ తన కేజీ-డి6 బ్లాక్‌లో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభించింది. అయితే 2013 నాటికి ఓఎన్జీసీ అధికారులు తమ బ్లాక్‌లో ఒత్తిడి తగ్గుతున్నట్లు గుర్తించారు.
దీని తర్వాత జరిగిన అధ్యయనాలు, సాంకేతిక పరిశోధనల్లో ఓఎన్జీసీ బ్లాక్‌లోని గ్యాస్, భూగర్భ మార్గాల ద్వారా, రిలయన్స్ బ్లాక్ వైపు మళ్ళించబడిందని ఆరోపించారు.
ఓఎన్జీసీ వాదన..
రిలయన్స్ తమ బ్లాక్‌లో త్రవ్వకాల ద్వారా, ఓఎన్జీసీ బ్లాక్‌లోని గ్యాస్‌ను కూడా వాణిజ్యపరంగా వెలికితీసి విక్రయించిందని ఆరోపించింది.
ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం అమెరికా ఆధారిత ‘డిగోల్యర్ అండ్ మ్యాక్నాటన్'(డీ అండ్ ఎమ్) అనే నిపుణుల సంస్థను నియమించింది.
ఆ సంస్థ నివేదికలో రెండు బ్లాకుల మధ్య గ్యాస్ అనుసంధానం ఉందని పేర్కొన్నది.
కేంద్ర ప్రభుత్వ డిమాండ్..
2016లో కేంద్ర ప్రభుత్వం రిలయన్స్, దాని భాగస్వాములైన బీపీ, నికో సంస్థలకు భారీ పరిహారం చెల్లించాలని నోటీసులు జారీ చేసింది.
మొదట సుమారు 1.5 బిలియన్ డాలర్లకు పైగా రిలయన్స్ సంస్థ నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయం జరిగింది.
ఆ తర్వాత వడ్డీలు, ఇతర లెక్కలతో కలిపి 2.81 బిలియన్ డాలర్ల వరకు డిమాండ్ పెరిగింది.
ప్రభుత్వ వాదన..
సహజ వాయువు దేశ సంపద. అది ప్రభుత్వ ట్రస్ట్ కింద ఉంటుంది.
ఓఎన్జీసీ గ్యాస్‌ను అనుమతి లేకుండా వాణిజ్యంగా ఉపయోగించడం “అన్యాయమైన లబ్ధి”(అన్జస్ట్ ఎన్రిచ్మెంట్) అనేది ప్రభుత్వ వాదన.
రిలయన్స్ వాదన..
రిలయన్స్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. వారి ప్రధాన వాదనలు ఇలా ఉన్నాయి:
1. తాము తమ బ్లాక్ పరిధిలోనే త్రవ్వకాలు చేశాము.
2. గ్యాస్ సహజంగా ఇతర ప్రాంతాలకు మళ్లితే (మైగ్రేట్ అయితే) అది తమ తప్పు కాదు.
3. ఒప్పందంలో “తరలివచ్చిన గ్యాస్” (మైగ్రేటెడ్ గ్యాస్) తీసుకోరాదని ఎక్కడా లేదు.
4. తాము ఓఎన్జీసీ ప్రాంతంలోకి చొరబడలేదు.
రిలయన్స్ తరఫున ప్రముఖ న్యాయవాదులు ఇది కేవలం “సహజ గ్యాస్ ప్రవాహం” మాత్రమేనని వాదించారు.
అంతర్జాతీయ ఆర్బిట్రేషన్..
రిలయన్స్, కేంద్ర ప్రభుత్వ మధ్య ఉన్న ఉత్పత్తి పంపిణీ ఒప్పందం(ప్రొడక్షన్ షేరింగ్ కాంట్రాక్ట్ – పీఎస్పీ) ప్రకారం వివాదాలను ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరించాలి.
దీంతో కేసు సింగపూర్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్‌కు వెళ్లింది. 2018లో ట్రైబ్యునల్ 2-1 మెజారిటీతో రిలయన్స్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ముగ్గురిలో ఒక సభ్యుడు విభేదించాడు.
రిలయన్స్ తమ బ్లాక్‌లో చట్టబద్ధంగా గ్యాస్ తీయగలదు. తరలివచ్చిన గ్యాస్‌పై ప్రత్యేక నిషేధం ఒప్పందంలో లేదు. కాబట్టి పరిహారం అవసరం లేదని ట్రిబ్యునల్ తన తీర్పులో పేర్కొన్నది.
ఢిల్లీ హైకోర్టు తీర్పు..
తర్వాత కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో ఈ ఆర్బిట్రేషన్ అవార్డును సవాలు చేసింది.
మొదట ఒక సింగిల్ జడ్జి బెంచ్ ట్రైబ్యునల్ తీర్పును సమర్థించింది. కానీ తర్వాత డివిజన్ బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది. ఆర్బిట్రేషన్ అవార్డును రద్దు చేసింది. రిలయన్స్‌కు వ్యతిరేకంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
హైకోర్టు ప్రధానంగా చెప్పిన అంశాలు..
1. “ప్రజా విశ్వాస సిద్ధాంతం”(పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్): సహజ వనరులు దేశ ప్రజల సొత్తు. ప్రభుత్వం వాటి సంరక్షకురాలు మాత్రమే.
2. “స్పష్టమైన చట్టవిరుద్ధత”(పేటెంట్ ఇల్లీగాలిటీ): ట్రైబ్యునల్ తీర్పులో స్పష్టమైన చట్టవిరుద్ధత ఉందని పేర్కొంది.
3. రిలయన్స్ పూర్తి సమాచారం వెల్లడించలేదు: 2003 నుంచే గ్యాస్ కనెక్టివిటీపై సమాచారం ఉన్నప్పటికీ రిలయన్స్ దానిని వెల్లడించలేదని అభిప్రాయపడింది.
4. “అన్యాయమైన లబ్ధి” (అన్జస్ట్ ఎన్రిచ్మెంట్): ఓఎన్జీసీ లేదా ప్రభుత్వానికి చెందిన గ్యాస్‌ను వాణిజ్యంగా ఉపయోగించి లాభపడ్డారని వ్యాఖ్యానించింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన పరిహారం డిమాండ్‌కు చట్టబద్ధత ఉందని హైకోర్టు నిర్ధారించింది.
సుప్రీంకోర్టులో కేసు..
ఢిల్లీ హైకోర్టు తీర్పును రిలయన్స్, బీపీ, నికో సంస్థలు భారత సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. సుప్రీం కోర్టు మధ్యవర్తిత్వం లేదా పరస్పర రాజీ అవకాశాలను కూడా పరిశీలించింది.
కేంద్ర ప్రభుత్వం మాత్రం, ఇది కేవలం ఒప్పంద వివాదం కాదు, దేశ సహజ సంపదల దోపిడీకి సంబంధించిన అంశమని వాదిస్తోంది. తాజాగా రిలయన్స్ సంస్థ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఒక అంగీకారానికి వస్తామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సుప్రీంకోర్టు అందుకు అనుమతించింది.
ఈ కేసు ప్రాధాన్యం..
ఈ కేసు వల్ల కొన్ని కీలక ప్రశ్నలు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. సహజ సంపదలపై ప్రైవేటు సంస్థల హక్కులు ఎంతవరకు?
ప్రభుత్వం ప్రజా సంపదను రక్షించడంలో విఫలమైందా? ఓఎన్జీసీ వంటి ప్రభుత్వ సంస్థలకు నష్టం జరిగిందా? ఆర్బిట్రేషన్ వ్యవస్థ ప్రభుత్వ ప్రయోజనాలను దెబ్బతీస్తుందా? పెద్ద కార్పొరేట్ సంస్థల ప్రభావం ఎంతవరకు ఉంది?
కేజీ బేసిన్ వివాదం భారతదేశంలో కార్పొరేట్ శక్తి, సహజ వనరుల యాజమాన్యం, ప్రభుత్వ బాధ్యత, న్యాయవ్యవస్థ పాత్ర, ఈ నాలుగింటి మధ్య జరుగుతున్న పెద్ద పోరాటానికి ప్రతీకగా మారింది.
రిలయన్స్ సంస్థ తాజాగా సుప్రీంకోర్టుకు సమర్పించినట్లు ప్రభుత్వంతో ఒప్పందానికి వస్తుందా? ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న వైఖరితో దృఢంగా నిలబడుతుందా లేక అంబానీ సామ్రాజ్యానికి లొంగి రాజీ పడుతుందా? ఇవన్నీ వెండితెర మీద చూడాల్సిన అంశాలు.
అయితే ఇదేదో రిలయన్స్ సంస్థ, ఓఎన్జీసీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సమస్య ఎంత మాత్రం కాదు. దేశ సహజ వనరులు దేశ ప్రజల సొంత ఆస్తి. దానిపై ప్రజలకు మాత్రమే హక్కు ఉంది. మరీ ముఖ్యంగా కేజీ బేసిన్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కు కూడా ఇందులో ఇమిడి ఉంది.
రిలయన్స్ సంస్థ కేజీ బేసిన్లో ఉత్పత్తి చేసిన సహజవాయువులో సగభాగం ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాలి. ఇది సహజ న్యాయ సూత్రం. కానీ అందుకు భిన్నంగా ఉత్పత్తి చేసిన గ్యాస్ మొత్తాన్ని గుజరాత్‌కు తరలించుకుపోయి, రిలయన్స్ తన ఇష్టప్రకారం అమ్ముకుంటున్నది. ఇది కూడా తీవ్రమైన ఉల్లంఘన తప్ప మరోటి కాదు.
అందువల్ల కేంద్ర ప్రభుత్వం – రిలయన్స్ సంస్థ మధ్య ఎలాంటి రాజీ కుదిరినప్పటికీ దేశ సహజ వనరులపై హక్కు ఉన్న ప్రజలు తమ హక్కును కాపాడుకోవాలి. అందుకై అవసరమైతే ఉద్యమించాలి. రానున్న కాలంలో అందుకు దేశ ప్రజలు సంసిద్ధం కావాల్సిన అవసరం ఉంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
