భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా నరేంద్ర మోదీ 2014 ఎన్నికలకు ముందు, ఎన్నికల క్యాంపెయిన్లో నాడు అధికారంలో ఉన్న యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నిత్యజీవితావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, ప్రజలు అల్లాడిపోతున్నారని గగ్గోలు పెట్టారు. రకరకాల రూపాలలో నిరసనలు వ్యక్తం చేశారు.
2014 ఎన్నికల్లో తనకు అధికారం ఇస్తే 100 రోజులలో ధరలు కిందికి దించుతాను అని హామీ ఇచ్చారు.
దీనితోపాటు ఇచ్చిన ఇతర హామీలను విశ్వసించిన భారత ఓటర్లు మోదీకి అధికారాన్ని అప్పగించారు.
ఇప్పటికే 12 సంవత్సరాలుగా నిరాఘాటంగా మోదీ ప్రధానిగా భారతదేశాన్ని ఏలుతున్నారు.
వంద రోజులలో ధరలను కిందికి దించుతానని 12 సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీ అమలు అయిందా, ఈ 12 సంవత్సరాల కాలంలో ధరలు ఎంతవరకు కిందకి దిగాయో పాఠకులందరికీ తెలిసిందే.
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయిందన్న చందంగా 2014 కంటే ఇప్పుడు ధరలు ఇబ్బడిముబ్బిడిగా పెరిగాయని ప్రజల జీవిత అనుభవం రుజువు చేస్తున్నది.
అయితే మాటల్లో చెబితే ఇది సరిపోదు, గణాంకాలతో సహా రుజువు చేయాలి.
అందుకే ప్రజలు నిత్యం వాడే బియ్యం, గోధుమలు, కందిపప్పు, చింతపండు, నూనె తదితర వస్తువుల ధరలు 2014 నుంచి 2025-26 సంవత్సరం దాకా క్రమంగా ఎలా పెరిగాయో గణాంకాలతో కూడిన పట్టిక కింద ఉంది. దాన్ని లోతుగా పరిశీలించాలని కోరుతున్నాం.



పడిపోయిన కొనుగోలు శక్తి – పెరిగిన కుబేరుల సంపద..
పోనీ ధరల పెరుగుదలను భర్తీ చేసేలా కార్మికుల, ఉద్యోగుల వేతనాలు, ప్రజల ఆదాయాలు పెరిగాయా అంటే అది కూడా లేదు.
2014 నుంచి 2025-26కు ద్రవ్యోల్బణం మొత్తం 67% పెరిగింది. 2014లో రోజువారీ నిజ వేతనం రూ 246 కాగా 2025-26కి రూ 297 అయింది.
కేవలం 18.7% మాత్రమే పెరిగింది. అంటే నిజ వేతనం భారీగా పడిపోయిందని రుజువవుతున్నది.
నిజ వేతనాలు పడిపోతే ఆ మేరకు కొనుగోలు శక్తి పడిపోయినట్లే. అందుకు భిన్నంగా 2014లో బిలియనీర్ల సంఖ్య 90. ఇది 2025-26 కి 220 కి పెరిగింది.
2014-15 లో 90 మంది బిలియనీర్ల మొత్తం ఆస్తి 214.5 లక్షల కోట్లు. ఇది 2025-26 నాటికి అనూహ్యంగా 1,118 లక్షల కోట్లకు పెరిగింది.
ఆ విధంగా మోదీ 12 సంవత్సరాల పాలనలో సాధారణ ప్రజల నిజ వేతనాలు, కొనుగోలు శక్తి పడిపోయి అవస్థల పాలయ్యారు.
ఇదే కాలంలో అపర కుబేరుల సంఖ్యతో పాటు వారి మొత్తం ఆస్తులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి.
మోదీ పాలన ప్రజల కడుపులు కొట్టి అపర కుబేరులకు అప్పనంగా దోచిపెట్టిందని ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి.




తరువాయి భాగంలో…
వంట గ్యాస్, సీఎన్జీ, డీజిల్, పెట్రోల్ తదితర పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఈ పట్టికలో ఇవ్వలేదు.
డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల తదితర వివరాలు తర్వాతి భాగంలో అందిస్తాం.
అలాగే రైతాంగం వాడే వివిధ రకాల ఎరువులు, పురుగుమందుల ధరలు ఎలా పెరిగాయో కూడా ఈ పట్టికలో లేవు.
అవి కూడా తరువాయి భాగంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
