న్యూఢిల్లీ: మనీలాండరింగ్ ఆరోపణల కేసుకు సంబంధించి కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ నివాసంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం(మే 27) దాడులు నిర్వహించింది.
కోజికోడ్‌లో ఉన్న కేరళ మాజీ పర్యాటక, ప్రజా పనుల శాఖ మంత్రి మహ్మద్ రియాజ్ నివాసంలో కూడా ఈడీ సోదాలు చేసింది.
కుమార్తె వీణపై ఎస్ఎఫ్ఐఓ చార్జిషీట్..
మాజీ ముఖ్యమంత్రి విజయన్ కుమార్తె టీ వీణకు వ్యతిరేకంగా సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్ఎఫ్ఐఓ) చార్జిషీట్ దాఖలు చేయడంతో కొనసాగుతున్న ఈ కేసుకు సంబంధించి ఈ దాడులు జరిగాయి.
కేరళ శాసనసభ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ను యూడీఎఫ్ ఓడించిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి విజయన్ రాజీనామా చేసిన నెల రోజుల వ్యవధిలోపే ఈ తాజా దాడులు జరగడం గమనార్హం.
కొచ్చికి చెందిన కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్(సీఎంఆర్ఎల్) సంస్థ నుంచి వీణకు చెందిన ఐటీ కంపెనీ ఎక్సాలోజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ “అక్రమ చెల్లింపులు” స్వీకరించిందన్న ఆరోపణలపై గత ఏప్రిల్‌లో ఎస్ఎఫ్ఐఓ ఆమెపై చార్జిషీట్ దాఖలు చేసింది.
ఎలాంటి సేవలు అందించకపోయినప్పటికీ, 2018-19 నుంచి మూడు సంవత్సరాల పాటు అక్రమ చెల్లింపులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సాఫ్ట్వేర్, మార్కెటింగ్ సేవలు అందించడానికి సీఎంఆర్ఎల్తో 2017లో ఎక్సాలోజిక్ కాంట్రాక్టు కుదుర్చుకుందని కూడా అందులో ఆరోపించారు.
సీఎంఆర్ఎల్ ప్రాంగణంలో 2019లోనే ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరిపి, ఆ తర్వాత నివేదికను సమర్పించింది.

బీజేపీ, కాంగ్రెస్‌ల కుమ్మక్కు: సీపీఐ(ఎం) ఖండన..
ఈ దాడులను కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) – సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ తీవ్రంగా ఖండించారు.
“కామ్రేడ్ పినరాయి విజయన్ నివాసంపై ఈడీ దాడిని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తోంది. బీజేపీ ప్రభుత్వం ఒక అగ్రశ్రేణి ప్రతిపక్ష నాయకుడిని లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడి ఇది. ఇలాంటి చర్యలు పినరాయి విజయన్ను లేదా సీపీఐ(ఎం)ను భయపెట్టలేవు. ఈ దాడి వెనుక యూడీఎఫ్ ప్రభుత్వ హస్తం కూడా ఉందా?” అని బేబీ ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు.
సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ కూడా ఈడీ దాడులను ఖండించారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి కేంద్ర ఏజెన్సీలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
“సీనియర్ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌పై జరిగిన బరితెగించిన ఈడీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి కక్షసాధింపు చర్యలు వారి నియంతృత్వ మనస్తత్వాన్ని బట్టబయలు చేస్తున్నాయి. కామ్రేడ్ పినరాయి, సీపీఐ(ఎం)లు ఇలాంటి అప్రజాస్వామిక వ్యూహాలకు భయపడవు. అరవింద్ కేజ్రీవాల్ విషయంలో చేసినట్లుగానే, విజయన్ను లక్ష్యంగా చేసుకోవడానికి కాంగ్రెస్ నాయకత్వం కూడా ఈడీని చురుకుగా ప్రోత్సహించిందని స్పష్టంగా తెలుస్తోంది” అని బుధవారం ఎక్స్ వేదికగా బ్రిట్టాస్ పేర్కొన్నారు.
కేసు నేపథ్యం, దర్యాప్తు..
ఎక్సాలోజిక్, సీఎంఆర్ఎల్, కేరళ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ (కేఎస్ఐడీసీ)ల మధ్య ఆర్థిక అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం జనవరి 2024లో ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తుకు ఆదేశించింది. (సీఎంఆర్ఎల్లో కేఎస్ఐడీసీకి 13.4% వాటా ఉంది). దీని ఆధారంగా ఈడీ మార్చి 2024లో మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది.
ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తుపై స్టే విధించాలని కోరుతూ అంతకుముందు వీణకు చెందిన సంస్థ, కేఎస్ఐడీసీ వేర్వేరుగా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అవి తిరస్కరించబడ్డాయి. బెంగళూరు కేంద్రంగా ఎక్సాలోజిక్ సొల్యూషన్స్ పనిచేస్తోంది.
కొట్టాయం జిల్లా పంచాయత్ సభ్యుడు, ఇటీవల బీజేపీలో చేరిన సీనియర్ నాయకుడు పీసీ జార్జి కుమారుడు షోన్ జార్జి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ ఈ కేసు నమోదు చేసింది. వీణ సంస్థలో అవినీతి జరిగిందని అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే మాథ్యూ కుజాల్నాడన్ కూడా ఆరోపించారు.
కాగా, 2024లో తన కుమార్తె సంస్థపై నమోదైన కేసును పినరాయి విజయన్ “రాజకీయ కక్షసాధింపు”గా అప్పట్లోనే కొట్టిపారేశారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
