అమెరికాలో త్వరలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. డోనాల్డ్ ట్రంప్ నేతృత్వం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీకి అమెరికన్ కాంగ్రెస్‌లో పూర్తి మెజారిటీ లేదు.
మధ్యంతర ఎన్నికల్లో ఎలాగైనా మెజారిటీ సంపాదించాలని రిపబ్లికన్ పార్టీ, ముఖ్యంగా ట్రంప్ నానా అవస్థలు పడుతున్నారు.
ఇతర దేశాలపై విధించిన ఆంక్షలు, ఇతర అంతర్జాతీయ సమస్యలతో ట్రంప్ రేటింగ్ ఘోరంగా పడిపోతున్న నేపథ్యంలో, జరగబోతున్న మధ్యంతర ఎన్నికలు రిపబ్లికన్ పార్టీకి ఒక సవాలుగా పరిణమించాయి.
ఈ ఎన్నికల్లో కార్మికులను, కార్మిక సంఘాలను సంతృప్తిపరిచే చర్యలు తీసుకోవడం ద్వారా లబ్ధి పొందాలని రిపబ్లికన్ పార్టీ యోచిస్తోంది.
అందులో భాగంగా “ఫాస్టర్ లేబర్ కాంట్రాక్ట్స్ యాక్ట్ (ఎఫ్ఎల్సీఏ)” ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఆ ప్రతిపాదిత చట్టంలో ఏముందో చూద్దాం.
అమెరికాలో కార్మిక సంఘాలు, యాజమాన్యాల మధ్య ఒప్పందాలు కుదరడానికి చాలా కాలం పడుతోందనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో అమెరికా కాంగ్రెస్‌లో “ఫాస్టర్ లేబర్ కాంట్రాక్ట్స్ యాక్ట్ (త్వరితగతిన కార్మిక ఒప్పందాల చట్టం)” అనే బిల్లు ప్రవేశపెట్టబడింది.
దీని ప్రధాన లక్ష్యం, యూనియన్ గుర్తింపు పొందిన తర్వాత కార్మికులకు త్వరగా ఒప్పందం లభించేలా చట్టపరమైన గడువులు విధించడం.
ఈ చట్టం ప్రస్తుతం అమెరికా కార్మిక రాజకీయాల్లో, ముఖ్యంగా గిగ్ వర్కర్లు(ఉబర్, లిఫ్ట్, డోర్‌డ్యాష్ వంటి సంస్థల కార్మికులు), ఫ్యాక్టరీ కార్మికులు, సేవారంగ ఉద్యోగుల విషయంలో పెద్ద చర్చకు దారి తీసింది.
ఫాస్టర్ లేబర్ కాంట్రాక్ట్స్ యాక్ట్ అంటే ఏమిటి..?
ఈ బిల్లు ప్రకారం, ఒక సంస్థలో కార్మికులు యూనియన్‌గా ఏర్పడి ఎన్నికల్లో గెలిచిన తర్వాత, యాజమాన్యం వారితో నిరవధికంగా చర్చలు సాగిస్తూ ఒప్పందాన్ని ఆలస్యం చేయకుండా ఉండేందుకు కచ్చితమైన సమయ పరిమితులు విధిస్తారు.
ప్రస్తుతం అమెరికా కార్మిక చట్టాల ప్రకారం యాజమాన్యం సదుద్దేశంతో బేరసారాలు(గుడ్ ఫెయిత్ బార్గెనింగ్) చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, ఎంతకాలంలో ఒప్పందం పూర్తవ్వాలనే గడువు లేదు.
ఫలితంగా కొన్ని చోట్ల ఒప్పందానికి రావడానికి రెండు మూడు సంవత్సరాలు కూడా పడుతోంది. ఈ చట్టంలోని ముఖ్య నిబంధనలు:
1. పది రోజుల్లో చర్చలు: ఎన్నికలలో గెలిచిన యూనియన్ అధికారికంగా చర్చల కోసం లేఖ పంపిన 10 రోజులలోపు యాజమాన్యం చర్చలు ప్రారంభించాలి.
2. తొంభై రోజుల తరువాత మధ్యవర్తిత్వం: 90 రోజుల పాటు చర్చలు జరిగి ఫలితం రాకపోతే, రెండు పక్షాలలో ఎవరికైనా ఫెడరల్ మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ సర్వీస్ (ఎఫ్ఎమ్సీఎస్) ద్వారా మధ్యవర్తిత్వం కోరే హక్కు ఉంటుంది.
3. ముప్పై రోజుల తరువాత తప్పనిసరి తీర్పు: మధ్యవర్తిత్వం విఫలమైతే, వివాదాన్ని ముగ్గురు సభ్యుల ఆర్బిట్రేషన్ (తీర్పు చెప్పే) ప్యానెల్‌కు పంపిస్తారు.
4. తీర్పుకు కట్టుబడి ఉండాలి: ఆర్బిట్రేషన్ నిర్ణయం ఇరు పక్షాలకు శిరోధార్యం (బైండింగ్). ఆ ప్యానెల్ తీసుకునే నిర్ణయం రెండు సంవత్సరాల పాటు చట్టబద్ధంగా అమలులో ఉంటుంది.
ఈ చట్టం అవసరం ఎందుకు వచ్చింది?..
ఇప్పటిదాకా అమెరికాలో యూనియన్ ఏర్పడిన వెంటనే యాజమాన్యాలు తరచుగా కార్మిక వ్యతిరేక వ్యూహాలు అనుసరిస్తున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
చర్చలను సంవత్సరాల పాటు సాగదీయడం, ఉద్యోగులను నిరుత్సాహపరచడం, యూనియన్ను బలహీనపరచడం, కొంతమంది కార్యకర్తలను తొలగించడం, ఒప్పందం లేకుండా కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం జరుగుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో యూనియన్ గెలిచినా కార్మికులకు ప్రయోజనం దక్కడం లేదని కార్మిక సంఘాల ఆరోపణ. అందుకే “వేగవంతమైన ఒప్పంద చట్టం” అవసరమని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ చట్టం వల్ల కలిగే ప్రయోజనాలు..
కార్మికులకు వేగంగా రక్షణలు లభిస్తాయి. ఒప్పందం త్వరగా కుదిరితే వేతనాలు, ఆరోగ్య బీమా, సెలవులు, పని గంటలు, భద్రతా ప్రమాణాలు త్వరగా అమలులోకి వస్తాయి.
ఎన్నికలలో యూనియన్ గెలిచిన తర్వాత వెంటనే ఒప్పందం జరుగుతుందనే విశ్వాసంతో కార్మికులలో సంఘాల పట్ల నమ్మకం కలుగుతుంది.
గిగ్ వర్కర్లకు ప్రాధాన్యం..
ఉబర్, లిఫ్ట్ వంటి సంస్థల డ్రైవర్లు ఇటీవల అమెరికాలో పెద్ద ఎత్తున సంఘటితమవుతున్నారు. మసాచుసెట్స్‌లో ఇటీవల యాప్ డ్రైవర్ల యూనియన్ అధికారిక గుర్తింపు పొందింది.
ఇలాంటి రంగాల్లో ఈ చట్టం భవిష్యత్తులో ముఖ్య పాత్ర పోషించవచ్చు. త్వరగా పరిష్కారం లభిస్తే దీర్ఘకాల సమ్మెలు తగ్గుముఖం పడతాయి.
అయితే యాజమాన్యాలు, వారికి మద్దతు తెలిపే రాజకీయ నాయకులు ఈ చట్టంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
వ్యాపార వర్గాల ఆందోళనలు..
ఈ చట్టం వల్ల యాజమాన్య స్వేచ్ఛ తగ్గుతుందని, ప్రభుత్వం నేరుగా వేతన చర్చల్లో జోక్యం చేసుకుంటుందని అమెరికా వాణిజ్య మండలి(యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్) విమర్శించింది. వ్యాపార స్వేచ్ఛ తగ్గి, మార్కెట్ ఆధారిత చర్చలు బలహీనపడతాయని పేర్కొంది.
బలవంతపు ఆర్బిట్రేషన్ ప్రమాదం ఉందని, యాజమాన్యం – యూనియన్ రెండూ అంగీకరించకపోయినా బయట వ్యక్తులు నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంస్థ ఆర్థిక పరిస్థితులు పట్టించుకోకపోవడం వల్ల ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. చిన్న కంపెనీలు వేగంగా ఒప్పందాలు చేసుకునే సామర్థ్యం లేక ఇబ్బందులు పడతాయి.
కొన్ని కంపెనీలు అధిక వేతనాలు, ప్రయోజనాలు భరించలేక ఉద్యోగ నియామకాలు తగ్గించవచ్చు, ఆటోమేషన్(యంత్రాల వినియోగం) పెంచవచ్చు అని వ్యాపార వర్గాలు అంటున్నాయి.
కార్మిక వ్యయాలు పెరిగితే పెట్టుబడిదారులు వెనుకంజ వేస్తారని, ప్రత్యేకంగా గిగ్ ఎకానమీ రంగంపై దీని ప్రభావం ఉండొచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
గిగ్ వర్కర్లతో ఈ చట్టానికి ఉన్న సంబంధం..
అమెరికాలో ప్రస్తుతం పెద్ద చర్చ “ఉద్యోగి”, “స్వతంత్ర కాంట్రాక్టర్” వర్గీకరణ చుట్టూ తిరుగుతోంది. అమెరికా కార్మిక శాఖ ప్రకారం ఉద్యోగి హోదా ఉంటే కనీస వేతనం, ఓవర్‌టైమ్, బీమా, యూనియన్ హక్కులు లభిస్తాయి. కానీ ఉబర్, లిఫ్ట్ వంటి సంస్థలు తమ డ్రైవర్లను స్వతంత్ర కాంట్రాక్టర్లుగా పరిగణిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ కొత్త బిల్లు భవిష్యత్తులో గిగ్ వర్కర్ల సంఘటిత హక్కులకు బలం ఇవ్వవచ్చని భావిస్తున్నారు.
ప్రో యాక్ట్‌తో సంబంధం..
ఈ కొత్త బిల్లు పూర్తిగా కొత్త ఆలోచన కాదు. ఇది ముందుగా వచ్చిన ‘ప్రో యాక్ట్’లోని ఒక ముఖ్య భాగాన్ని ప్రత్యేక బిల్లుగా తెచ్చినట్లు కొందరు భావిస్తున్నారు.
ప్రో యాక్ట్‌లో యూనియన్లకు ఎక్కువ హక్కులు, ఉల్లంఘనలకు పాల్పడే సంస్థలపై కఠిన నిబంధనలు ఉన్నాయి.
ఈ కొత్త బిల్లు వాటిలో “త్వరిత ఒప్పందం” అంశంపై మాత్రమే దృష్టి పెట్టింది.
ప్రస్తుతం ఈ బిల్లు అమెరికా కాంగ్రెస్‌లో చర్చల దశలో ఉంది. ఇది సెనేట్‌లో, ఆ తరువాత ప్రతినిధుల సభలో (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ప్రవేశపెట్టబడింది.
దీనికి అధికార పక్షానికి చెందిన కొంతమంది రిపబ్లికన్ సభ్యుల మద్దతు కూడా లభించింది.
అయితే ఇంకా పూర్తి స్థాయి చట్టంగా అమలులోకి రాలేదు. అమెరికాలో అమెజాన్, స్టార్ బక్స్, ఉబర్, లిఫ్ట్, ఆటో పరిశ్రమ రంగాల్లో యూనియన్ ఉద్యమాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ చట్టంపై భవిష్యత్తులో మరింత రాజకీయ చర్చ జరిగే అవకాశం ఉంది.
చారిత్రక నేపథ్యం (పూర్వరంగం)..
ఈ చట్టాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా అమెరికా కార్మిక ఉద్యమ చరిత్రను పరిశీలించాలి.
పంతొమ్మిదవ శతాబ్దం చివర, ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో అమెరికా వేగంగా పారిశ్రామిక దేశంగా ఎదిగింది.
భారీ ఫ్యాక్టరీలు, రైల్వేలు, ఉక్కు పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో కార్మిక వర్గం పెరిగింది.
కానీ అదే సమయంలో రోజుకు 12 నుంచి 16 గంటల పని, తక్కువ వేతనాలు, బాల కార్మిక వ్యవస్థ, ప్రమాదకర పని పరిస్థితులు ఉండేవి.
ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు ఏర్పడటం ప్రారంభమైంది.
ముఖ్యంగా అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్(ఏఎఫ్ఎల్), కాంగ్రెస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్స్(సీఐఓ) వంటి సంస్థలు అమెరికా కార్మిక ఉద్యమాన్ని ముందుకు నడిపించాయి.
1930లో ఏర్పడిన మహా మాంద్యం సమయంలో ఫ్రాంక్లిన్ డీ రూజ్వెల్ట్ ప్రభుత్వం “న్యూ డీల్” కార్యక్రమాలను ప్రవేశపెట్టింది.
అదే సమయంలో 1935లో నేషనల్ లేబర్ రిలేషన్స్ యాక్ట్(వాగ్నర్ యాక్ట్) అమలులోకి వచ్చింది. ఈ చట్టం యూనియన్ ఏర్పాటును హక్కుగా గుర్తించింది.
సమిష్టి బేరసారాల హక్కును గ్యారెంటీ చేసింది. కార్మికులపై యాజమాన్య వేధింపులను నియంత్రించింది. ఇది అమెరికా కార్మిక చరిత్రలో ఒక కీలక మలుపుగా భావిస్తారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పరిస్థితులు..
1940, 1970 మధ్యకాలంలో అమెరికా యూనియన్లు అత్యంత బలంగా నిలిచాయి.
ఆటోమొబైల్, ఉక్కు, విద్యుత్, గనుల రంగాల్లో యూనియన్లు శక్తివంతమయ్యాయి. కానీ 1980 తరువాత సోవియెట్ యూనియన్ బలహీనపడటంతో పరిస్థితులు మారాయి.
ప్రపంచీకరణ, కంపెనీలు ఇతర దేశాలకు తరలిపోవడం, ఆటోమేషన్, ప్రైవేటీకరణ విధానాలతో యూనియన్ సభ్యత్వం క్రమంగా తగ్గిపోయింది.
1981లో రోనాల్డ్ రీగన్ ప్రభుత్వం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సమ్మెను అణచివేయడం అమెరికా కార్మిక ఉద్యమంపై పెద్ద ప్రభావం చూపింది. అప్పటి నుంచి అమెరికాలో యాజమాన్యాల ఆధిపత్యం మరింత పెరిగింది.
ఇటీవలి కాలంలో అమెరికాలో మళ్లీ యూనియన్ ఉద్యమాలు పెరుగుతున్నాయి. ప్రత్యేకంగా అమెజాన్, స్టార్ బక్స్, టెస్లా, ఉబర్ వంటి సంస్థలలో కార్మిక సంఘాలు ఏర్పడుతున్నాయి. కానీ యూనియన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఒప్పందానికి రావడానికి చాలా కాలం పడుతోంది.
చాలాసార్లు యాజమాన్యాలు చర్చలను ఆలస్యం చేయడం, యూనియన్ నాయకులను తొలగించడం, కార్మికులను భయపెట్టడం వంటి పద్ధతులను అమలు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో “త్వరిత ఒప్పంద చట్టం” అవసరమైందని డెమోక్రాటిక్ పార్టీ వర్గాలు, యూనియన్లు చెబుతున్నాయి.
అమెరికాలో ప్రతి నాలుగు సంవత్సరాలకు అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అయితే ప్రతి రెండు సంవత్సరాలకు జరిగే “మధ్యంతర ఎన్నికలు” కూడా చాలా కీలకం.
ఈ ఎన్నికల్లో అమెరికన్ కాంగ్రెస్, సెనేట్‌లకు కొంతమంది సభ్యులు, రాష్ట్ర గవర్నర్లు ఎన్నికవుతారు. త్వరిత ఒప్పంద చట్టం లాంటి కార్మిక అనుకూల చట్టాలు మధ్యంతర ఎన్నికల్లో ముఖ్య రాజకీయ అంశాలుగా మారే అవకాశం ఉంది.
డెమోక్రాటిక్ పార్టీ కార్మిక వర్గం, గిగ్ వర్కర్లు, యువ ఉద్యోగులు, సేవారంగ కార్మికుల వైపు మరింత దృష్టి పెడుతోంది. ప్రత్యేకంగా పెరుగుతున్న జీవన వ్యయం, ఆరోగ్య ఖర్చులు, ఉద్యోగ భద్రత సమస్యల నేపథ్యంలో కార్మిక అనుకూల చట్టాలు ఎన్నికల్లో ఓట్లను ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు.
రిపబ్లికన్ పార్టీ పాత్ర..
రిపబ్లికన్ పార్టీ సంప్రదాయంగా వ్యాపార వర్గాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో ఆ పార్టీలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి.
నాయకత్వ తీరుతో విభేదించే కొంతమంది రిపబ్లికన్ నేతలు కూడా కార్మిక వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే యూనియన్లకు పూర్తి మద్దతు ఇవ్వడంలో మాత్రం ఆ పార్టీ ఒకే వైఖరితో లేదు.
అమెరికాలోని వామపక్ష సంస్థలు ఈ కొత్త బిల్లును సాధారణ కార్మిక చట్టంగా కాకుండా “కార్మిక వర్గ పునరుజ్జీవనం”లో ఒక ముందడుగుగా చూస్తున్నాయి. ప్రత్యేకంగా డెమోక్రాటిక్ సోషలిస్ట్ ఆఫ్ అమెరికా(డీఎస్ఏ), సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్(ఎస్ఈఐయూ), టీమ్ స్టర్స్ వంటి సంస్థలు కార్మిక హక్కులు బలపడడానికి ఈ చట్టం అవసరమని భావిస్తున్నాయి.
అమెరికాలో ఆదాయ అసమానత తీవ్రంగా పెరిగింది. కార్పొరేట్ లాభాలు పెరిగాయి కానీ వేతనాలు అదే స్థాయిలో పెరగలేదు. అందువల్ల యూనియన్లను బలపరచడం అవసరమని భావిస్తున్నారు.
అయితే కొందరు ఈ చట్టంతోనే కార్మికుల బ్రతుకులు పూర్తిగా మారిపోవని భావిస్తున్నారు. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థను మార్చదని, యూనియన్లకు కొంత ఉపశమనం మాత్రమే ఇస్తుందని, నిజమైన సమస్య “కార్పొరేట్ పెట్టుబడిదారీ విధానం(కార్పొరేట్ క్యాపిటలిజం)” అని వారు అంటున్నారు.
మరి కొంతమంది సోషలిస్టులు మాత్రం కార్మికుల సహకార సంస్థలు, ప్రభుత్వ రంగ విస్తరణ, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ(యూనివర్సల్ హెల్త్‌కేర్), సార్వత్రిక కనీస ఆదాయం(యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్) వంటి పెద్ద మార్పులు అవసరమని వాదిస్తున్నారు.
“ఫాస్టర్ లేబర్ కాంట్రాక్ట్స్ యాక్ట్” అనేది కేవలం ఒక చట్ట ప్రతిపాదన మాత్రమే కాదు. ఇది అమెరికాలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, కార్మిక అసంతృప్తి, గిగ్ ఎకానమీ విస్తరణకు అద్దం పడుతూ, డెమోక్రాటిక్-రిపబ్లికన్ పార్టీల ఎన్నికల నినాదంగా మారింది.
అమెరికాలో భవిష్యత్తు కార్మిక రాజకీయాల దిశను నిర్ణయించే అంశాల్లో ఈ చట్టం ఒక ముఖ్యమైన అస్త్రంగా మారనుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
