అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనా పర్యటించారు. దానివల్ల భారతదేశం ఎదుర్కొనబోయే సమస్యలను అర్థం చేసుకోవాలంటే, ఆ పర్యటనను మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి.
చైనా-అమెరికా శిఖరాగ్ర సమావేశ వివరాలను మే పదిహేడున వైట్ హౌస్ వెబ్సైట్లో పొందుపరిచింది. ద్వైపాక్షిక సంబంధాలపై అమెరికా అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో కొత్త మార్పు కనిపిస్తున్నది.
“నిర్మాణాత్మక, వ్యూహాత్మక, స్థిరమైన చైనా-అమెరికా సంబంధం” అని పేర్కొనడమే ఆ మార్పు. ఇది ఆంగ్ల పదజాలంతో సహా చైనా భాషలో వాడే పదాలను పూర్తిగా పోలి ఉంది.
అమెరికా విదేశాంగ విధానంలో మార్పును ఇది పూర్తిగా తెలియచేస్తోంది. ఈ మార్పు భారతదేశ ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం కలిగించవచ్చు.
అమెరికా విదేశాంగ విధానంలో పెద్ద మార్పుకు సంకేతమా..
ట్రంప్ రెండవ సారి అధికారానికి రావడానికి ముందు దశాబ్ద కాలంలో, చైనా పట్ల అమెరికా వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. అదేమంటే- మిత్రదేశాలు, పాక్షిక మిత్రదేశాలు, భాగస్వాములను కలుపుకొని చైనాను కట్టడి చేయడం.
తద్వారా అమెరికా ఆధిపత్యంలో ఉన్న ప్రపంచ క్రమాన్ని పటిష్టం చేయడం, దానిని కొనసాగించడం. ఆ వ్యూహంలో భాగమే, ఒబామా హయాంలో ‘ఆసియా వైపు మళ్లడం’.
అయినా, ట్రంప్ మొదటి పదవీకాలపు ‘ఇండో-పసిఫిక్ వ్యూహం’ అయినా, లేదా బైడెన్ కాలపు ‘చిన్న పెరడు, పెద్ద కంచె’ వంటివన్నీ ఆ విధానానికి భిన్న రూపాలే.
ఈ వ్యూహం కింద, చైనాను కట్టడి చేయడానికి భారతదేశాన్ని ఒక కీలకమైన భాగస్వామిగా చూశారు. ‘ఆసియా-పసిఫిక్’ నుంచి ‘ఇండో-పసిఫిక్’గా మార్చడం భారతదేశం పోషించే ప్రముఖ పాత్రను నొక్కి చెప్పడానికే. ఈ ఏర్పాటు సారాంశం ‘చదరంగపు పావుల నమూనా’.
పరిస్థితులు మారిపోయిన చదరంగపు పావుల నమూనా..
అంటే, అమెరికా తన మిత్రదేశాలకు, భాగస్వాములకు వారు అందించే భౌగోళిక, రాజకీయ సహకారానికి, విధేయతకు ప్రతిఫలంగా- ఆ దేశాల భద్రతకు సంబంధించిన హామీలు, సాంకేతిక మద్దతు, మార్కెట్ అవసరాలను తీర్చడం మాత్రమే కాకుండా నగదు ప్రోత్సాహకాలను కూడా అందిస్తుంది.
చిన్న భాగస్వామి దేశం దృక్కోణం నుంచి చూస్తే, వారు అమెరికా చెప్పిన పాత్రను పోషించినంత కాలం, అమెరికాతో కలిసిపోతూ సంపూర్ణ మద్దతు, హామీలను పొందగలరు.
అయితే ఈ “చదరంగపు పావుల నమూనా” పరిస్థితులు మారిపోయాయి. ట్రంప్ రెండవ దఫా అధికారంలోకి వచ్చాక చైనాతో పలు దఫాల వాణిజ్య యుద్ధాలు, చిప్ దిగ్బంధనాలు, సముద్రయాన ఆంక్షల వల్ల కలిగే పరిణామాలు, ఫలితాలు వైట్ హౌస్ కళ్ల ముందు స్పష్టంగా కనబడుతున్నాయి.
అరుదైన ఖనిజ ఉత్పత్తుల సరఫరాకు అంతరాయాలు, వ్యవసాయ ఎగుమతుల పతనం వగైరాలు అమెరికాకు ఎదురైన చేదు అనుభవాలు. చైనాపై సాంకేతిక పరిజ్ఞానంపై విధించిన నిషేధం వలన కీలక రంగాలలో ఆ దేశం సాధించిన పురోగతి మరింత వేగవంతం కావడం వంటివి కూడా అమెరికాకు మింగుడు పడని విషయాలు.
ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్న అమెరికా, చైనాపై కఠినంగా ఒత్తిడి తేవడం అనేది లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉండే ఒక చెడ్డ విధానం అని గుర్తించింది.
చైనాతో సహజీవనం కోసం ఇరువైపులా లాభపడే మార్గాన్ని కనుగొనడం మేలనే నిర్ధారణకు వచ్చింది.
గతంలో లాగా తన అనుకూల దేశాలలో పెట్టుబడులు పెట్టడం, వాటికి మద్దతు ఇవ్వడంపై అమెరికా ఆసక్తిని కోల్పోయింది. ట్రంప్ చైనా పర్యటన ఈ ప్రధాన మార్పును మరోసారి తెలియచేస్తోంది. ఆ పర్యటన సందర్భంగా, చైనా, అమెరికా మధ్య కుదిరిన ఒప్పందం ఒక ముందడుగు సయోధ్య కాదు. అది “పోటీ మధ్య స్థిరత్వాన్ని కాపాడుకోవడం” అనే ఒక ప్రాథమిక ఏకాభిప్రాయం. ఇది అమెరికా వ్యూహంలో మార్పును తెలియచేస్తోంది. దాని దౌత్య దృష్టి “చైనాను ఎదుర్కోవడానికి జూనియర్ భాగస్వాములను సమీకరించడం” నుంచి “చైనాను స్థిరీకరిస్తూనే జూనియర్ భాగస్వాముల నుంచి లాభాలను ఎలా గరిష్ఠంగా పెంచుకోవాలి” అనే విషయం వైపు మళ్లింది.
ట్రంప్ విధానంగా బ్లడ్ బ్యాగ్ మోడల్..
అమెరికా చైనాను ఎదుర్కోవడం ద్వారా లాభం లేదని గ్రహించి, ఇప్పుడు తన జూనియర్ భాగస్వాములలో చైనా పట్ల ఉన్న ఆందోళనను ఉపయోగించుకుని, వారిని గరిష్ఠంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తోంది.
అమెరికా వ్యూహంలో భాగంగా పాత సంబంధాలను మార్చి, వారిని నిరంతరం తనపై ఆధారపడేలా చేస్తోంది. అందుకు జూనియర్ భాగస్వామి దేశాలు అధిక మూల్యం చెల్లించేలా చేయాలనేది అమెరికా లక్ష్యం.
“చెస్ పీస్ మోడల్”(చదరంగపు పావుల నమూనా) – “బ్లడ్ బ్యాగ్ మోడల్”(రక్తపు సంచుల నమూనా) మధ్య ఒక ప్రాథమికమైన తేడా ఉంది.
మొదటి దానిలో, మిత్రదేశాలు పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగిన పావులుగా ఉంటాయి. రెండవ దానిలో వారిని వాడుకుని, అవసరం తీరిన తర్వాత పక్కన పడేస్తారు.
ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ప్రస్తుత, భవిష్యత్ అంతర్జాతీయ పరిణామాలలో ఎదుర్కొనవలసిన వైవిధ్యభరితమైన విషయాలను అర్థం చేసుకోవచ్చు.
పైకి చూడటానికి అమెరికా చైనా మధ్య సయోధ్య ఉన్నట్లు ప్రపంచానికి సంకేతాలు ఇస్తుంది. మరొకవైపు అమెరికా తన జూనియర్ భాగస్వాములతో జరిగే ముఖాముఖి సంభాషణలలో జూనియర్ భాగస్వాముల భద్రత పట్ల తన ఆందోళనలను తెలియచేస్తూ వారి భయాలను పెంచుతూనే ఉంటుంది.
దీని వెనుక ఒక స్పష్టమైన తర్కం ఉంది. చైనాను ఇకపై ఒక భయంకరమైన ముప్పుగా చిత్రీకరించకపోతే, జూనియర్ భాగస్వాములకు తమ భద్రత గురించిన ఆందోళన తగ్గిపోతుంది. అలాగే అమెరికా తన మిత్రదేశాలను బలహీనపరిచే సాకును కోల్పోతుంది.
అలాగని అదే సమయంలో అమెరికా చైనాతో బహిరంగ సంఘర్షణకు సిద్ధంగా లేదు. ఎందుకంటే అలాంటి ఘర్షణ జరిగితే చెల్లించాల్సిన మూల్యాన్ని భరించడానికి అమెరికా సుముఖంగా లేదు.
మిత్రదేశాలలోని ముప్పు భయాలను ఒక సాధనంగా ఉపయోగించుకుని, వారి నుంచి రక్షణ రుసుములను వసూలు చేస్తూ, చైనాతో “ఉద్రిక్తంగా ఉంటూనే అదుపు తప్పని” సంబంధాన్ని కొనసాగించడమే అమెరికాకు ఉత్తమ పరిష్కారం.
ట్రంప్ చైనా పర్యటన తర్వాత మొత్తం అమెరికా విదేశాంగ విధానం దిశను అర్థం చేసుకోవడానికి ఈ అంశమే నిజానికి చాలా కీలకం.
భారతదేశం ఎదుర్కొనబోయే నిజమైన ప్రమాదాలు..
అమెరికా విదేశాంగ వ్యూహం మారినప్పుడు, భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన ప్రమాదాలు కూడా తదనుగుణంగా మారుతాయి.
భారతదేశానికి చైనాను అతిపెద్ద బాహ్య ముప్పుగా చూడటం భారతదేశంలో సర్వసాధారణం. కానీ ఇటీవలి సంవత్సరాలలో భారతదేశం ఎదుర్కొంటున్న బాహ్య ప్రమాదాలు, ఒత్తిళ్లు వాస్తవానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి?
“చైనాను అతిపెద్ద శత్రువుగా పరిగణించడం” అనే దృక్పథం నుంచి, ఉద్దేశపూర్వకంగా సృష్టించిన భ్రమలో నుంచి వస్తున్నాయని అర్థం అవుతుంది.
ఊహాజనిత ముప్పులపై కేంద్రీకరించే విధంగా, అమెరికా భారత దేశాన్ని తప్పుదారి పట్టించింది. కానీ అంతకంటే పెద్ద ముప్పు భారతదేశానికి తీవ్రమైన నష్టాలను కలుగచేస్తుంది.
భారతదేశం ఎదుర్కొంటున్న అసలైన ముప్పు ఏమిటంటే? “బ్లడ్ బ్యాగ్ మోడల్” కింద అమెరికా భారతదేశంపై ప్రయోగించబోయే దిగ్భ్రాంతి కలిగించే విషయాలు నాలుగు.
మొదటిది ఇంధనానికి సంబంధించింది:
స్పష్టంగా కనిపించే ఉదాహరణ ఇరాన్ కేంద్రంగా ఇటీవల జరిగిన సంఘటన. ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులు హోర్ముజ్ జలసంధిని దిగ్బంధం చేయడానికి దారితీయవచ్చని అమెరికాకు ముందే తెలిసినప్పటికీ, ప్రభుత్వం భారతదేశంపై దాని ప్రభావాన్ని ట్రంప్ పరిగణనలోకి తీసుకోలేదు.
భారతదేశపు తొంభై శాతం ద్రవీకృత పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ), సగానికి పైగా ద్రవీకృత సహజ వాయువు(ఎల్ఎన్జీ), ముడి చమురు ఈ జలమార్గం నుంచే భారత దేశానికి రవాణా అవుతాయి. సంఘర్షణ తీవ్రమవుతున్న సమయంలో, ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై ఆంక్షలను మరింత కఠినతరం చేస్తూ, తక్కువ ధరకు లభించే ఇరాన్ ముడి చమురును భారత్ వదులుకునేలా అమెరికా ఒత్తిడి చేసింది.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ట్రంప్ తరచూ పుతిన్‌తో తన సంబంధాల గురించి ఎంతగా గొప్పలు చెప్పుకున్నప్పటికీ, భారతదేశం, రష్యా చమురు కొనుగోలు విషయానికి వస్తే, ఆయన చాలా కఠినంగా వ్యవహరించారు.
భారతదేశం కొనుగోలును రష్యా మీద విధించిన ఆంక్షల ఉల్లంఘనతో ముడిపెట్టడమే కాకుండా, ఇరవై ఐదు శాతం జరిమానా పన్ను కూడా విధించారు. ఇలాంటి చర్యలు ఒకదానికి ఒకటి విరుద్ధంగా అనిపించినప్పటికీ, దీని వెనుక ఉన్న తర్కం చాలా సరళమైనది.
ఇరాన్ వివాదం ఫలితం ఎలా ఉన్నా, రష్యా, అమెరికా రాజీపడినా పడకపోయినా, భారతదేశం వంటి దేశాలను అధిక ధరలకు అమెరికా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసేలా అమెరికా బలవంతం చేయడం ప్రధానమైనది.
పెరిగిన దిగుమతి బిల్లుల వల్ల కలిగే ద్రవ్యోల్బణంతో భారతదేశం కుదుపులకు లోనైంది. అమెరికా ఇంధన వ్యాపారం పెద్ద విజయంగా నిలుస్తుంది. ఇది భౌగోళిక రాజకీయ సంఘర్షణ నుంచి కలిగిన ఇంధన సంక్షోభంలా పైకి కనిపిస్తుంది. కానీ సారాంశంలో ఇది అమెరికా తన మీద ఆధారపడటానికి సృష్టించిన సంక్షోభం మాత్రమే.
రెండవది ఆయుధాల అమ్మకాలకు సంబంధించింది:
అమెరికా భౌగోళిక, వ్యూహాత్మక ఎత్తుగడలు ఎప్పుడూ భారతదేశానికి వ్యతిరేకంగానే ఉన్నాయి. అవి అనేక ప్రాంతీయ సంఘర్షణలను ప్రేరేపించి, భారతదేశాన్ని “భద్రతా ఆందోళన, ఆయుధాల సేకరణ” అనే వలయంలోకి నెట్టాయి. హిమాలయ సరిహద్దులో చైనాను ఎదుర్కొనేలా “ఇండో-పసిఫిక్ వ్యూహం” పన్నింది.
దక్షిణాసియా ప్రాంతీయ సంఘర్షణలలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఘర్షణకు, అమెరికాపై భారతదేశానికి ఉన్న నమ్మకాన్ని ఉపయోగించుకున్నది. ఇలా ఏదైనా ఈ తర్కానికి లోబడే ఉంటుంది.
సంక్షోభం ముదిరిన తర్వాత, అమెరికా తన దేశంలో ఉన్న ఆయుధ వ్యాపారులతో కలిసి, “క్షీణిస్తున్న ప్రాంతీయ పరిస్థితిని” ఒక ఆయుధంగా వాడుకుంటుంది. భారతదేశానికి అత్యాధునిక ఫైటర్ జెట్ల వంటి ఆయుధాలను అధిక ధరలకు అమ్ముతుంది.
మరో మాటలో చెప్పాలంటే, అమెరికా భారతదేశాన్ని ఒక భాగస్వామిగా పరిగణిస్తూనే, ఉద్దేశపూర్వకంగా భారతదేశ భద్రత అనే ఆందోళనను పెంచుతుంది. ఆ ఆందోళనను “తగ్గించడానికి” తానే విరుగుడును(ఆయుధాలను) అమ్ముతుంది.
ఇంకో మాటలో చెప్పాలంటే, నిప్పు పెట్టింది అమెరికాయే, అగ్నిమాపక యంత్రాన్ని అమ్మేది, దాని ధరను నిర్ణయించేది అమెరికాయే అన్నట్లు. ఆ తర్వాత ఆ నిప్పునార్పే యంత్రాన్ని కొన్నవారే అమెరికాకు “ధన్యవాదాలు” చెప్పాలి.
మూడవది సాంకేతిక పరిజ్ఞానం మీద విధించిన పరిమితులకు సంబంధించినది:
ఇది వాస్తవానికి మునుపటి రెండింటి కంటే చాలా తీవ్రమైనది, పరిష్కరించడం కూడా చాలా కష్టమైన విషయం.
స్విఫ్ట్ నెట్వర్క్, కృత్రిమ మేధస్సు కంప్యూటింగ్ పవర్, క్లౌడ్ సేవలు, సెమీకండక్టర్, వాటికి ఆధారమైన ఆపరేటింగ్ సిస్టమ్‌లకు సంబంధించిన అన్ని రంగాలలో భారతదేశానికి అమెరికా సాంకేతిక మద్దతు చాలా తక్కువగా లేదా అసలు లేదు.
చాలా కాలంగా, అమెరికా భారతదేశం నుంచి నిరంతరం ప్రతిభావంతులను తరలించుకుపోతూ, శాశ్వత మేధో వలసకు కారణమవుతోంది. కానీ భారతదేశం స్థానికంగా సాంకేతిక, పారిశ్రామిక సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలని అది ఎప్పుడూ కోరుకోలేదు.
ఉదాహరణకు, భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ పరిశ్రమ అమెరికాలో వైట్ కాలర్ ఉద్యోగాల సృష్టికి ఆటంకంగా మారుతుంది. కనుక సమీప భవిష్యత్తులో ఇది ఒక ప్రధాన లక్ష్యంగా మారే అవకాశం ఉంది. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న అధునాతన సేవా పరిశ్రమను అరికట్టడానికి ఉద్దేశించిన ఈ విధానం, ట్రంప్ వీసా విధానంలో ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తుంది.
అమెరికా “బ్లడ్ బ్యాగ్ మోడల్” పూర్తిగా అమలులోకి వచ్చిన తర్వాత, అమెరికా విధించే వివిధ “ద్వితీయ ఆంక్షలు”, “డేటా కంప్లైయన్స్”, “భద్రతా సమీక్షల”కు భారతదేశం మరింతగా గురయ్యే ప్రమాదం ఉంది.
నాల్గవది మూలధనాన్ని అమెరికాకు తరలించడం:
ఇది మరింత ఆందోళనకరమైన విషయం. ఎందుకంటే తమ దేశంలో భారీ పెట్టుబడి పెట్టే ఒప్పందాలు చేసుకునేలా అమెరికా, భారతదేశాన్ని బలవంతం చేస్తుంది. ఇక్కడి పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది.
వాస్తవానికి, ఒత్తిడిలో ఉన్న ఏకైక “రక్తపు సంచి” భారతదేశం మాత్రమే కాదు. జపాన్, దక్షిణ కొరియా, తైవాన్లు కూడా ఈ వ్యూహం నుంచి తప్పించుకునే అవకాశం లేదు.
అయితే కీలకమైన తేడా ఏమిటంటే, ఇప్పటికే పూర్తి పారిశ్రామికీకరణ చెంది, దేశీయంగా మిగులు మూలధనాన్ని కలిగి ఉన్న ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే, భారతదేశం ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందే తొలి దశలో ఉంది.
దానికి దేశీయ మూలధనం అరుదైనది, విలువైనది. కాబట్టి, ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం నుంచి తరలించబడిన ప్రతి పైసా చాలా ఎక్కువ అవకాశ వ్యయంతో కూడుకున్నది. అందువల్ల అది ఎక్కువ నష్టాన్ని కలిగించవచ్చు.
స్వతంత్రంగా ఉన్న దేశంగా, అమెరికా ఒత్తిడిని భారతదేశం మరింత మెరుగ్గా ప్రతిఘటించగలిగి ఉండాల్సింది. సమస్య ఏమిటంటే, భారతదేశంలోని అనేక సమూహాలు ఇప్పటికే అమెరికాతో గాఢంగా ముడిపడి ఉన్నాయి. ఒత్తిడికి గురైనప్పుడు, ఈ సమూహాల ప్రయోజనాలు భారతదేశం కంటే అమెరికాతోనే ఎక్కువగా ముడిపడి ఉంటాయి.
భారతదేశం ఇప్పటికే తీవ్రమైన చెల్లింపుల సంక్షోభంలో ఉన్నప్పటికీ, చాలా మంది భారతీయ ధనవంతులు ఇప్పటికీ విదేశాలలో భారీగా ఎందుకు పెట్టుబడులు పెడుతున్నారు?
ఎందుకంటే, స్థానిక కరెన్సీ విలువ తరుగుదలను తప్పించుకోవడానికి, రూపాయి ఆస్తులను డాలర్లుగా మార్చుకోవడం వారి ప్రయోజనాలకు, అలాగే అమెరికా ప్రయోజనాలకు కూడా బాగా ఉపయోగపడుతుంది.
ఈ నాలుగు షాక్‌లను కలిపి చూస్తే, అమెరికా నూతన విధానం వెనుక దాగి ఉన్న కుట్రను గుర్తించడం కష్టం కాదు. అమెరికాకు భారతదేశ ప్రాథమిక ప్రయోజనాలు అవసరం లేదు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు.
అమెరికా భారతదేశ భద్రత గురించి, ఇంధన సరఫరా అంతరాయాల గురించి, సాంకేతిక పరిజ్ఞానం లోటు గురించి, మూలధన తరలింపులను గురించి ఏమాత్రం పట్టించుకోదు.
పైగా వాటిని మరింత తీవ్రతరం చేయడానికి, తనకు అనుకూలంగా వాడుకోవడానికి తగిన కారణాలను కూడా అది వెతుకుతుంది. “చదరంగపు పావుల నమూనా”, “రక్తపు సంచుల నమూనా” మధ్య ఉన్న అతిపెద్ద తేడా ఇదే కావచ్చు. చదరంగపు పావులను అయితే పనిచేసే స్థితిలో ఉంచాలి. కానీ రక్తపు సంచులను వాడి పారేయవచ్చు.
భారతదేశం ముందున్న మార్గం – అసలైన ముప్పును గుర్తించడం..
ఇప్పుడు మనం చేయవలసింది ఎదురవుతున్న, పెరుగుతున్న ప్రమాదాలను తగ్గించడానికి విధానపరమైన నిర్ణయాలలో మార్పు కొరకు తొందరపడటం కాదు. అంతకంటే ప్రాథమికమైనది మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం.
అసలైన శత్రువు ఎవరో గుర్తించడం. గత దశాబ్ద కాలంగా భారతదేశంలో వ్యూహాత్మక చర్చ అతి స్వల్ప కథనం చుట్టూ అల్లుకుంది. చైనా ఒక ముప్పు. అది ఏం చేసినా భారతదేశానికి వ్యతిరేకంగానే చేస్తుంది.
అదే సమయంలో అమెరికా మనకు ఒక నమ్మకమైన భాగస్వామి. దాని ప్రతి చర్యా భారత దేశానికి అనుకూలంగా ఉంటుంది. ఈ కథనం భావోద్వేగ పరంగా చాలామంది భారతీయుల మనసుల్లో నిలిచిపోయింది. కానీ వాస్తవం దానికి పూర్తిగా విరుద్ధంగా ఉండవచ్చు.
ఒకసారి డేటా ఆధారిత వాస్తవంలోకి వస్తే, భారతదేశానికి ఎవరు సహాయం చేస్తున్నారు, ఎవరు దోపిడీ చేస్తున్నారు అనేది స్పష్టమవుతుంది. ఉదాహరణకు, ఇటీవలి సంవత్సరాలలో, భారతదేశ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అద్భుతమైన పురోగతిని సాధించింది. ఇది ‘భారత్‌లో తయారీ’ చొరవకు ఆదర్శంగా నిలిచింది. ఇది భారతదేశానికి అదనపు విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెట్టగల పరిశ్రమలలో ఒకటిగా కూడా మారింది.
వాస్తవానికి, భారతదేశ ఎలక్ట్రానిక్స్ అభివృద్ధి చైనా మూలధనం, సాంకేతికత, ప్రతిభ, దాని విడిభాగాల సరఫరాపై ఆధారపడి ఉంది.
వాణిజ్య లోటు..
అయితే, ఒకవేళ ఎవరైనా పైన ఉదాహరించిన అమెరికా అనుకూల “ద్వంద్వ కథనం” గుడ్డిగా నమ్మితే, భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి చైనా చేసిన కీలక, నిర్మాణాత్మకమైన కృషిని గుర్తించే అవకాశం లేదు. కేవలం వాణిజ్య లోటుపైనే దృష్టి పెట్టి, దీనిని చైనా దోపిడీకి నిదర్శనంగా చూపిస్తారు.
ఇదే తర్కం క్రియాశీల ఔషధ పదార్థాలు, సౌర శక్తి భాగాలు, గృహోపకరణాల భాగాలకు కూడా వర్తిస్తుంది. భారతదేశంలో చాలా మందికి ఈ రంగాల అభివృద్ధికి చైనా అపారమైన సహకారం గ్రహించడం లేదు.
“వాణిజ్య లోటు”, వారి మీద “ఆధారపడటం వల్ల కలిగే నష్టాలు” వంటి మాటలను వల్లెవేస్తూ, అమెరికా రాసిన స్క్రిప్ట్‌ను గుడ్డిగా అనుసరించడం దురదృష్టకరం.
భారతదేశంలోని చాలా మందిలాగా వియత్నాం “చైనా లోటు” గురించి ఎందుకు ఫిర్యాదు చేయటం లేదు? అలాగే మెక్సికో చైనా పై “ఆధారపడటం వల్ల కలిగే నష్టాల” గురించి ఎందుకు మాట్లాడటం లేదు?
దీనికి విరుద్ధంగా, అమెరికా భారతదేశం మధ్య స్నేహపూర్వక సంబంధం అని చెప్పబడే దాని వల్ల భారతదేశానికి లభించేది అధిక ధరల శిలాజ ఇంధనం, ఖరీదైన ఆయుధాలు, నిరంతర మేధో వలసలు, సుంకాల జరిమానాలు, వలసల ఆంక్షలు, ఔట్ సోర్సింగ్ నియంత్రణలు, చివరికి అగ్రరాజ్యం దూషణల వంటి నిరంతర బెదిరింపులు ఎదురవుతున్నాయి.
ఒకవైపు చైనా, అతి తక్కువ రాజకీయ షరతులతో భారతదేశ పారిశ్రామికీకరణకు పునాది రాళ్లను అందిస్తున్నది. కానీ అమెరికా, భారతదేశాన్ని ఒక “రక్తపు సంచి”లా పిండి వాడుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది.
అయితే, భారతదేశంలోని చాలా మంది ఈ నిజాన్ని అంగీకరించడం కష్టంగా భావించవచ్చు. అలా అంగీకరించడం అంటే, ఒక తరం మొత్తం తమ దృక్పథంలో ప్రాథమికంగా పొరపాటు ఉందని అంగీకరించిన వారవుతారు. అటువంటి అంగీకారానికి వారు చెల్లించాల్సిన మానసిక మూల్యం చాలా ఎక్కువ.
వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి..
భారతదేశ సమాజంలో నిజమైన ఆత్మపరిశీలన ఇంత పరిమితంగా ఉండటానికి బహుశా ఇదే ప్రధాన కారణం కావచ్చు. కానీ, అంతర్జాతీయ రాజకీయాల కఠోర వాస్తవాలు ఎన్నడూ మన ఊహలకు అనుగుణంగా ఉండవు. అవి కేవలం వాస్తవాలను మాత్రమే ప్రతిఫలిస్తాయి. ఆత్మ పరిశీలనను తప్పించుకోవడం వల్ల సమస్య మాయం కాదు. అది ఆ సమస్యను మరింత భయంకరమైన రీతిలో తిరిగి మన ముందుకు తెస్తుంది.
నిజానికి, భారతదేశం ఇప్పుడు చేయాల్సింది కొత్త విధానాన్ని సృష్టించడం కాదు. దాని వ్యవస్థాపక సంప్రదాయంలోని మూల భావన అయిన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అయిన అలీన విధానానికి తిరిగి రావడం.
వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటే ప్రతీదానిపై రాజీ పడాల్సిన వ్యూహాత్మక సోమరితనం కాదు. అగ్రరాజ్యాల పట్ల సమభావ వైఖరి కూడా కాదు. ముందస్తు అభిప్రాయాలతో గుడ్డిగా వ్యవహరించకుండా, జాతీయ ప్రయోజనాల ఆధారంగా ఉండే స్పష్టమైన నిర్ణయాలు కలిగి ఉండటం. లాభాలను నష్టాలను గుర్తించడం, ఏ వైపుకు కట్టుబడి ఉండకుండా ఉత్తమమైన నిర్ణయాలు తీసుకోవడం.
అన్నిటికంటే “బ్లడ్ బ్యాగ్ మోడల్” వల్ల అమెరికా ప్రమాదాన్ని స్పష్టంగా గుర్తించడం. దీని అర్థం అమెరికాను ఎదుర్కోవడం కాదు. ప్రత్యేకించి అమెరికా విదేశాంగ విధానంలో “చెస్ పీస్ మోడల్” విధానాన్ని మార్చుకున్న తర్వాత, అమెరికా నుంచి అవసరమైన భద్రతా దూరాన్ని పాటించాలి. దీని కోసం భారతదేశం, అమెరికాతో ఉన్న ప్రత్యేక సంబంధాన్ని నిర్ణయాలు తీసుకోవడంలో మొదటి షరతుగా పరిగణించడం మానేయాలి.
విషకౌగిలి నుంచి బయటపడడానికి మార్గం..
అందుకు బదులుగా రాబోయే అమెరికా జోక్యం నుంచి తనను తాను రక్షించుకోవడానికి, పారిశ్రామిక అభివృద్ధి, దౌత్య వ్యూహం, ఆయుధాల సేకరణ, ఇంధన దిగుమతులు, ఆర్థిక, మౌలిక సదుపాయాలు వంటి కీలక రంగాలలో తగిన “రక్షణలను” ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే భారత్ వాషింగ్టన్ ‘విషకౌగిలి’ నుంచి బయటపడగలదు.
అన్నింటికంటే, విధాన స్థాయిలో వ్యూహాత్మకంగా స్వయం ప్రతిపత్తి కలిగి ఉండటం వల్ల ప్రాథమికంగా విదేశీ ప్రమాదం నుంచి, విదేశీ బలవంతపు ఒత్తిడిల నుంచి విముక్తి పొందే సామర్థ్యం భారత్ కలిగి ఉంటుంది.
రెండవది, చైనా – భారత పరస్పర ప్రయోజనం కోసం పటిష్టమైన పునాది కొరకు ప్రయత్నం చేయడం. చైనా భారత్‌కు ఎటువంటి భద్రతా హామీలను అందించదు. అందుకు బదులుగా ఎటువంటి వ్యూహాత్మక విధేయతను కూడా కోరదు.
పారిశ్రామికీకరణ, విశ్వసనీయమైన మౌలిక సదుపాయాల సామర్థ్యాలు, విస్తారమైన మార్కెట్‌ను అందుబాటులో ఉంచుతుంది. రాజకీయాలతో సంబంధం లేకుండా పెట్టుబడి అందించడం, అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాల వంటి ప్రయోజనాలను చైనా అందించగలదు.
అయితే సహజంగానే ఈ ప్రయోజనాలు ఉచితంగా రావు. బదులుగా, భారతదేశం విశ్వసనీయమైన రాజకీయ హామీల మద్దతుతో స్పష్టమైన, పారదర్శక వ్యాపార వాతావరణాన్ని అందించాలి. ఇది ఆర్థిక, వాణిజ్య సంబంధాలకు అత్యంత ప్రాథమిక అవసరం.
గతంలో ఈ విషయంలో తగిన నిర్ణయాలు తీసుకోలేదు. ఈ దిశగా ముందడుగు వెయ్యటానికి, తగిన చర్యలు తీసుకోవటానికి ఎంతో అవకాశం ఉంది.
మూడవది, బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ, జీ-20 వంటి బహుపాక్షిక వేదికలను క్రియాశీలకం చేయడం. స్వల్పకాలంలో, ఈ వేదికలు డాలర్ వ్యవస్థను లేదా పాశ్చాత్య ఆధిపత్య అంతర్జాతీయ క్రమాన్ని సవాలు చేయలేవు. కానీ భారతదేశానికి విశ్వసనీయమైన ప్రత్యామ్నాయాలను అందించడంలో వాటి అవసరం ఉంది.
చాలా సంవత్సరాలుగా భారతదేశం తరచుగా పాశ్చాత్యేతర వేదికలలో తనకు తాను “చైనా ప్రత్యర్థి”గా నిలిచింది. అలాంటి విశిష్ట ప్రదర్శన ద్వారా కొన్నిసార్లు పశ్చిమ దేశాలకు సంతృప్తిని కూడా కలిగించింది.
అదే విధానం ఇప్పుడు ప్రతికూలంగా మారింది. అన్నింటికంటే, భారతదేశం అమెరికా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చిన సందర్భంలో, చైనాతో సమర్థవంతమైన సహకారం లేకపోతే నిజమైన ప్రత్యామ్నాయ అవకాశాలు లేకుండా పోతాయి.
నిష్క్రమణ దారి వాస్తవానికి ఉపయోగించబడిందా లేదా అనే దానికంటే అది ఉండటం అనేది చాలా ముఖ్యమైనది.
అమెరికా విదేశాంగ వ్యూహంలో ఒక మార్పు..
ట్రంప్ చైనా పర్యటన ఒక అద్దం వంటిది. అది కేవలం చైనా-అమెరికా సంబంధాలలో ఒక నిర్దిష్టమైన సర్దుబాటును మాత్రమే ప్రతిబింబించడం లేదు. అమెరికా విదేశాంగ వ్యూహంలో ఒక మార్పును ప్రతిబింబిస్తోంది. భారతదేశానికి పాత విధానం ఇకపై ఎంతమాత్రం కొత్త సమస్యలకు పరిష్కారం చూపలేదు.
చైనా – అమెరికా ఘర్షణ నుంచి ఎలా లాభం పొందాలి లేదా వాషింగ్టన్ నుంచి మరిన్ని రాయితీలను ఎలా పొందాలి అని లెక్కించే “చదరంగపు పావుల నమూనా” ఆలోచనపై ఆధారపడటం ఇకపై ఎంతమాత్రం సరైన విధానం కాదు.
అలాగే ముందుకు కొనసాగితే, మారిన అమెరికా విదేశాంగ విధానంలో భారతదేశం తీవ్ర నష్టాలను ఎదుర్కొనవలసి వస్తుంది.
నిజమైన వ్యూహాత్మక స్పష్టత అంటే ప్రస్తుత పరాధీన వ్యవస్థను గుర్తించడం, నిజమైన ప్రమాదాలను గుర్తించడం, అసలైన ప్రత్యర్థిని గుర్తించడం. భావోద్వేగాలు, సొంత కథనాల మీద ఆధారపడకుండా జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మారిన వాస్తవ పరిస్థితులకు సరిపోయే విధాన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ మార్గం చాలా కష్టమైనది. కానీ దానిని కాదనుకుంటే చెల్లించే మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది.
వ్యాసరచయిత కేజీ మావో. అంతర్జాతీయ సహకార కేంద్రంలో విశ్లేషకులు. సౌత్ ఆసియా రీసెర్చ్ బ్రీఫ్ వ్యవస్థాపకులు. హార్వర్డ్-యెంచింగ్ ఇన్స్టిట్యూట్లో విజిటింగ్ ఫెలో.
అనువాదం: పి రామ కోటేశ్వరరావు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
