న్యూఢిల్లీ: కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులకు నిరసనగా న్యూఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయం ఎదుట సీపీఎం శ్రేణులు ధర్నా నిర్వహించాయి.
ధర్నాలో పాల్గొన్న వందలాది మంది సీపీఎం కార్యకర్తలను, సీనియర్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
సీపీఎం సీనియర్ నాయకులు బృందా కారత్, పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ ధావలే, మరియం ధావలే, విజు కృష్ణన్, కేంద్ర కమిటీ సభ్యులు విక్రమ్ సింగ్, అనురాగ్ సక్సేనాలతో పాటు వందలాది మంది కార్యకర్తలు పోలీసుల నిర్బంధంలో ఉన్నారు.
రాజకీయ కక్షసాధింపు చర్యలే: ఎంఏ బేబీ..
ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జరుగుతున్న ఈడీ దాడులను తీవ్రంగా సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ఖండించారు.
రాజకీయ ప్రతీకారంలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయని బేబీ ఆరోపించారు.
ఎక్సాలాజిక్ కేసుతో పినరయి విజయన్‌కు ఏమాత్రం సంబంధం లేదని పదేపదే న్యాయస్థానాలు ధ్రువీకరించిన విషయాన్ని బేబీ ప్రస్తావించారు.
అయినప్పటికీ రాజకీయ కక్షసాధింపులో భాగంగా ఆయనపై నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆరోపించారు.
ఆ కేసులో నిందితురాలైన వీణకు తండ్రిగా ఉన్నందునే పినరయి విజయన్‌పై ఈ దాడులకు కేంద్రం సిద్ధమైందని బేబీ విమర్శించారు.

దాడుల వెనుక రాజకీయ కుట్ర..
కేరళ సీఎం వీడీ సతీశన్ ప్రధానమంత్రిని కలిసిన వెంటనే ఈ దాడులు జరగటం గమనిస్తే దీని వెనుక రాజకీయ కుట్ర ఉందన్న అనుమానం కలుగుతుందని బేబీ అన్నారు.
కొచ్చిన్ మినరల్స్ డైరీలో ప్రస్తావించబడిన అనేకమంది ప్రముఖులు నేడు రాష్ట్ర ప్రభుత్వంలో అనేక పదవుల్లో ఉన్నారని కూడా ఆయన గుర్తు చేశారు.
వాళ్లందరినీ విస్మరిస్తూ కేవలం విజయన్ను మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని దాడులు జరగటం వెనక రాజకీయ కక్షసాధింపు తప్ప మరో కారణం లేదన్నారు.
దర్యాప్తు సంస్థల దుర్వినియోగం తగదు..
దర్యాప్తును అడ్డుకోవడం సీపీఎం ఉద్దేశం కాదని స్పష్టం చేస్తూ, రాజకీయ కక్షసాధింపు కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేయటాన్ని పార్టీ అంగీకరించేది లేదని ఎంఏ బేబీ తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలను సమీకరించి నిరసనలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
