“యుద్ధమే శాంతి” అని జార్జ్ ఆర్వెల్ 1984లో రాశారు. అంటే మాటలకు అర్థం లేకుండా పోయి, నిజాన్ని వక్రీకరించి, గొడవల్ని కావాలనే సృష్టించే ప్రపంచం అన్నమాట.
ఆయన 1949లో రాసిన ఆ పుస్తకం ఇప్పుడు 2026లో జరుగుతున్న రాజకీయాలకు అద్దం పడుతోంది.
పాతకాలపు గొప్ప నాయకులు ఇప్పుడు లేరు. ఇప్పుడు ఆట నడిపేది సంకుచిత మనస్తత్వం ఉన్న నాయకులే. ఆర్వెల్ చెప్పిన భయంకరమైన ప్రపంచం నిజంగానే వచ్చేసింది.
ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉందంటే- బలవంతుడికి లాభం, బలహీనుడికి నష్టం. దీనికి మధ్యలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారు.
ఆయన ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కరోజులో ఆపేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చి ఇప్పటికి 487 రోజులు దాటిపోయింది.
తొందరగా గెలిచేస్తామనే భ్రమలతో ఆయన వేసిన వ్యూహాలు బెడిసికొట్టాయి. ట్రంప్ చేసిన పనుల వల్ల స్నేహితులు దూరమయ్యారు.
ఇండియా లాంటి మిత్రులకు కష్టాలు, చైనా, రష్యా లాంటి శత్రువులకు మాత్రం లాభాలు వచ్చాయి.
ట్రంప్ భ్రమలు.. బెడిసికొట్టిన వ్యూహాలు..
విముక్తి దినం(లిబరేషన్ డే) పేరుతో వేసిన పన్నుల వల్ల కెనడా, మెక్సికో, ఇండియా, యూరప్ దేశాలు ఇబ్బంది పడ్డాయి. అదే సమయంలో చైనా మాత్రం ట్రంప్‌ను చూసి నవ్వుకుంది.
అమెరికా పన్నుల రూపంలో వసూలు చేసిన 186 బిలియన్ డాలర్లు ఇప్పుడు తిరిగి ఇవ్వాల్సి వస్తోంది. దానికి మొదటి వరుసలో ఫెడెక్స్ ఉంది. అటు అమెరికా అప్పు 39 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. అయినా ట్రంప్ ఆగలేదు. ఇంకో పది శాతం కొత్త పన్నులు వేయాలనే ప్రతిపాదన చిక్కుల్లో ఉంది. ఆయన లక్ష్యం మాత్రం పన్నుల యుద్ధం చేయాలనే ఉంది.
ఈ గందరగోళం శూన్యం నుంచి పుట్టలేదు. పశ్చిమాసియాలో మంటలు, ఉక్రెయిన్‌లో యుద్ధం; ఎందుకంటే అవన్నీ ఆయా దేశాల్లోని రాజకీయ లెక్కల వల్లే జరుగుతున్నాయి.
వాషింగ్టన్, టెల్ అవీవ్, మాస్కో.. అన్ని చోట్ల సొంత రాజకీయాల కోసమే యుద్ధం, శాంతి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ గొడవల వల్ల సామాన్య జనం, వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు నష్టపోతున్నాయి.
సొంత రాజకీయాల కోసమే పశ్చిమాసియా రణరంగం..
ట్రంప్‌కు “సర్వనాశనం” అనే మాటంటే బాగా ఇష్టం. ఆయన ఎన్నిసార్లు నాశనం చేశామని చెప్పినా, ఇరాన్ మాత్రం ఇంకా నిలబడే ఉంది.
శాంతి చర్చల ఉద్దేశం హార్ముజ్ జలసంధి దారిని మూయకుండా చూడటమే. అది యుద్ధానికి ముందు కూడా తెరిచే ఉంది.
పైగా ఇరాన్, ఒమన్ కలిసి ఓడల దగ్గర టోల్ వసూలు చేసే ఆలోచనలో ఉన్నాయి.
పాలన మార్చేస్తామని గట్టిగా చెప్పిన ట్రంప్ చివరికి చేసిందేమిటంటే- ఒక వృద్ధ అయతుల్లా స్థానంలోకి మరో యువ అయతుల్లా రావడం.
ట్రంప్ ఫిబ్రవరి 23న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడిన ఫోన్ కాల్‌లోనే ఇరాన్ మీద దాడి తేదీ నిర్ణయించబడిందని అందరూ అనుకుంటున్నారు.
అమెరికా విదేశాంగ విధానం దేశంలోని రాజకీయాల మీదే ఆధారపడి ఉంటుంది. అధ్యక్ష, కాంగ్రెస్ ఎన్నికలకు నిధులు ఇచ్చే ఏఐపీఏసీ లాంటి ఇజ్రాయెల్ అనుకూల సంస్థలు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయి.
ఫిబ్రవరి 28న ఇరాన్ మీద జరిగిన దాడి ఇజ్రాయెల్ లాబీని సంతోషపెట్టడానికే. జో కెంట్, తులసీ గబ్బార్డ్ లాంటి వాళ్లు రాజీనామా చేయడం, అధికారుల మాటలు దీన్ని రుజువు చేస్తున్నాయి.
నెతన్యాహుకు అయితే యుద్ధం ఒక ఆయుధం లాంటిది. తన మీద వచ్చే కేసుల నుండి తప్పించుకోవడానికి దాన్ని వాడుకుంటున్నాడు. ఒకప్పుడు ట్రంప్ ఇజ్రాయెల్ వెళ్లినప్పుడు ఆయన్ని క్షమించమని నెతన్యాహు అడిగారు. ఇప్పుడు నెతన్యాహు వంతు వచ్చింది.
చమురు, డాలర్ ఆధిపత్యం.. తెరవెనుక రాజకీయాలు..
పశ్చిమాసియా గొడవకు, డాలర్ పెత్తనానికి కూడా లింకు ఉంది. 1974లో అమెరికా-సౌదీ ఒప్పందం జరిగినప్పటి నుంచి, చమురు వ్యాపారాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని అమెరికా డాలర్‌ను కాపాడుకుంటూ వస్తోంది.
ప్రపంచంలో హైడ్రోకార్బన్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న ఇజ్రాయెల్ ఈ ఎత్తుగడకు కేంద్ర బిందువుగా ఉంది.
వెనిజులా అధ్యక్షుడిని, అతని భార్యని అమెరికా దుర్మార్గంగా కిడ్నాప్ చేసి తీసుకుపోయిన ఘటన చూస్తే అర్థమవుతుంది.
మొదట డ్రగ్స్ అన్నారు. ఇప్పుడు చమురు రాజకీయమంటున్నారు.
ఇటీవల వెనిజులా నాయకులు కాకుండా అమెరికా మంత్రి మార్కో రూబియో ఇండియాతో చమురు ఒప్పందం గురించి మాట్లాడారు. ఇప్పుడు క్యూబా నేత రౌల్ క్యాస్ట్రోపై నిందారోపణ మోపి- వెనిజులా అధ్యక్షుడు మదురోను కిడ్నాప్ చేసిన విధంగా చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇదంతా రానున్న మధ్యంతర ఎన్నికల్లో క్యూబన్ అమెరికన్ల ఓట్లు రాబట్టడం కోసమే.
ట్రంప్ చెప్పే గొప్పలు, వ్యాపార ఎత్తుగడలు గొప్పలుగానే ఉన్నాయి. కానీ చేసిందేమీ లేదు. రష్యా, చైనా మీద ట్రంప్ విరుచుకుపడ్డా, లాభపడింది మాత్రం ఆ రెండు దేశాలే.
ఇరాన్ యుద్ధం వల్ల అమెరికా దగ్గర ఉన్న ఆయుధాలు అయిపోయాయి. ఉక్రెయిన్, తైవాన్లకు భయం పట్టుకుంది. దీంతో రష్యా మీద ఒత్తిడి తగ్గింది.
తైవాన్‌కు ఆయుధాలు ఇవ్వొద్దని చైనా, అమెరికాను బెదిరించే స్థాయికి వచ్చింది.
యుద్ధం వల్ల చమురు రేట్లు పెరిగి అమెరికాలో కూడా ఇంధన ధరలు పెరిగాయి. దాన్ని తగ్గించడానికి ట్రంప్, ఇరాన్ చమురు మీద ఉన్న నిషేధం ఎత్తివేశారు.
రష్యా చమురుకు మరో 30 రోజులు మినహాయింపు ఇచ్చారు. ఒకప్పుడు తక్కువ రేటుకు దొరికే రష్యా చమురు ఇప్పుడు వంద డాలర్లు అయింది.
ఇరాన్ చమురు 100 నుంచి 103 డాలర్లకి చేరింది. దీనివల్ల రష్యా, భారతదేశాలకు చైనా చేసే చెల్లింపులు యువాన్లలో చేయడం ద్వారా చైనా లాభపడింది.
గ్రాఫ్ పడిపోతున్న ట్రంప్.. పెరుగుతున్న వ్యతిరేకత..
ఈ వారం ట్రంప్ తన పవర్ ఏంటో చూపించారు. పార్టీలో తనను వ్యతిరేకించే వాళ్ల మీద పగ తీర్చుకున్నారు. పార్టీలో 80 శాతం మంది తన వెంటే ఉన్నారని నిరూపించారు. కానీ నిజానికి ఆయన గ్రాఫ్ పడిపోతోంది.
గాజాలో చిన్న పిల్లలు చనిపోవడం, లెబనాన్, ఇరాన్ మీద చేస్తున్న దాడుల ఫలితంగా యువతలో ట్రంప్‌కు మద్దతు 48 శాతం నుంచి 30 శాతం కంటే తక్కువకు పడిపోయింది.
ఒకటి కాదు, రెండు కాదు- నాలుగు సర్వేల ప్రకారం పెట్రోల్ రేట్లు పెరగడం, ఉద్యోగాలు లేకపోవడం వల్ల ట్రంప్ రేటింగ్ తగ్గింది. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామేమో అనే భయంతో రిపబ్లికన్ నాయకులే ట్రంప్ బిల్లులను ఆపేస్తున్నారు.
యుద్ధంలో విజేతలు ఉండరు.. మిగిలేది విషాదమే..
యుద్ధంలో ఎవరూ గెలవరు. కాల్పుల విరమణ అయితే చనిపోయిన వాళ్లు తిరిగి రారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు ఎప్పుడు ఆగుతాయో ఎవరికీ తెలియదు.
ఒకవేళ ఈ వారమే యుద్ధం ఆగిపోయినా దాని నష్టం చాలా ఏళ్ల వరకు ఉంటుంది. పశ్చిమాసియాలోనే చమురు మళ్లీ పాత స్థితికి రావాలంటే ఏడాదిన్నర పడుతుంది.
గ్యాస్ అయితే నాలుగేళ్లకు పైనే పడుతుంది. రాజకీయ లబ్ధి కోసం యుద్ధాలను వాడుకోవడం వల్ల ప్రపంచం పెద్ద ప్రమాదంలోకి నెట్టబడుతున్నది.
(ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంపాదకీయం సౌజన్యంతో. స్వేచ్ఛానువాదం: ఏవి రావు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
