న్యూఢిల్లీ: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) చుట్టూ జరుగుతున్న వ్యంగ్య రాజకీయ ఉద్యమం కేవలం యువత నిరసన కాదని, అదొక “రాజకీయ వ్యూహాత్మక ఆపరేషన్” అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) వర్ణించింది.
సీజేపీ పరిణామం అనేది “ఉచితాలపై ఆధారపడే, వామపక్ష భావజాల రాజకీయ వ్యవస్థ(ఎకోసిస్టమ్)లో” భాగమని ఆర్ఎస్ఎస్ ముఖపత్రిక ‘ఆర్గనైజర్’ సంపాదకీయంలో ఘాటుగా విమర్శించింది.
“కాక్రోచ్ సిండ్రోమ్: ది న్యూ ఫేస్ ఆఫ్ యాంటీ-ఇండియా టెక్ సినిసిజం”(భారత వ్యతిరేక టెక్ నైరాశ్యానికి కొత్త ముఖం) అనే శీర్షికతో ప్రచురితమైన ఈ సంపాదకీయం- సీజేపీ ప్రకటించిన ఐదు లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది.
ఎన్నికల అధికారులపై ఉగ్రవాద వ్యతిరేక చట్టాలను ప్రయోగించడం, పార్టీలు ఫిరాయించే రాజకీయ నాయకులను నిషేధించడం వంటి ఆ పార్టీ లక్ష్యాలను కొట్టిపారేసింది.
ఇది “యువత డిజిటల్ తిరుగుబాటు ముసుగులో వ్యవస్థలను కుప్పకూల్చేందుకు వేసిన భయంకరమైన ప్రణాళిక” అని అభివర్ణించింది.
పలు ఆరోపణలు..
“మంత్రివర్గంలో మహిళలకు కచ్చితంగా 50% రిజర్వేషన్ కల్పించాలని ఏకపక్షంగా డిమాండ్ చేయడం.. పార్లమెంటరీ బలాన్ని, ఎన్నికల తీర్పులను, వ్యక్తుల అర్హతలను, వాస్తవాలను పూర్తిగా దాటవేయడమే. ఇది రాజ్యాంగబద్ధమైన పాలన పట్ల వారికున్న భయంకరమైన అజ్ఞానాన్ని చూపుతోంది. 1.4 బిలియన్ల జనాభా ఉన్న అత్యంత క్లిష్టమైన దేశాన్ని నడపడానికి ఇది సరైన విధానం కాదు. సోషల్ మీడియాలో ఆకర్షణ(ఎంగేజ్మెంట్) కోసం రూపొందించిన ఒక డొల్ల నినాదం మాత్రమే” అని ఆర్గనైజర్ సంపాదకీయం పేర్కొంది.
అదానీ, రిలయన్స్ గ్రూపులకు చెందిన మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేయాలన్న డిమాండ్‌ను- “స్టాలినిస్ట్ కమ్యూనిస్ట్ సెన్సార్‌షిప్‌కు ఒక పక్కా ఉదాహరణ(టెక్స్ట్‌బుక్ ఎగ్జాంపుల్)”గా అభివర్ణించింది. ఇది “దేశీయ మూలధనాన్ని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దుర్మార్గమైన దాడి” అని విమర్శించింది.
సాంప్రదాయ చాణక్య రాజ్యనీతి..
దీనిపై విస్తృతమైన చర్చను లేవనెత్తుతూ ఆర్గనైజర్- సాంప్రదాయ చాణక్య రాజ్యనీతిని కూడా ప్రస్తావించింది.
“ఒక దేశం తన యువతను ఉత్పాదక శ్రమవైపు మళ్లించకుండా, ఉద్దేశపూర్వకంగా కృత్రిమ నిరాశలోకి నెట్టినప్పుడు ఆ దేశం బలహీనపడుతుంది” అని పేర్కొంది.
ఈ నేపథ్యంలో, సీజేపీ ఉద్యమాన్ని యువతలో ఉన్న నిజమైన అసంతృప్తిని వెళ్లగక్కే ఒక వేదికగా(ప్రెజర్ వాల్వ్) ఆర్గనైజర్ చూడటం లేదు.
దానికి బదులుగా, జాతీయ విశ్వాసంపై జరుగుతున్న ఒక ప్రణాళికాబద్ధమైన దాడిగా భావిస్తోంది.
“సీజేపీ వ్యవస్థాపకుడు అమెరికన్ యువత సాంకేతిక ప్రసంగాలను గట్టిగా ఆరాధిస్తున్నాడు. కానీ, ఆ పాశ్చాత్య సాంకేతిక ఆధిపత్యం భారీ కార్పొరేషన్ల(వాటినే సీజేపీ ధ్వంసం చేయాలనుకుంటోంది) పునాదుల పైనే నిర్మితమైందన్న విషయాన్ని మాత్రం విస్మరిస్తున్నాడు” అని పత్రిక వాదించింది.
సెమీకండక్టర్ విప్లవం..
నిధులు సమకూర్చగల సామర్థ్యం ఉన్న కార్పొరేట్ దిగ్గజాలను రద్దు చేయాలని కోరుతూ, మరోవైపు సెమీకండక్టర్ విప్లవం కావాలని మీరు డిమాండ్ చేయలేరని ఆర్గనైజర్ స్పష్టం చేసింది.
“గ్లోబల్ టెక్ ప్రవాహానికి భారతీయ జెన్-జీ దూరంగా ఉందనే తప్పుడు కథనాన్ని ముందుకు తేవడం ద్వారా, సీజేపీ రూపకర్తలు వారికి వారే సొంతంగా ఒక విషాదాన్ని రచించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు” అని పత్రిక తెలియజేసింది.
ఆర్ఎస్ఎస్ ముఖపత్రిక ముగింపు చాలా స్పష్టంగా ఉంది: ప్రపంచంలోనే అత్యంత ఆశాజనకమైన ఆర్థిక వ్యవస్థను వారసత్వంగా పొందుతున్న నేటి తరంలో.. ‘యాచక మనస్తత్వాన్ని’ పెంపొందించడమే ఈ ఉద్యమ నిజమైన లక్ష్యంగా అది పేర్కొంది.
సీజేఐ ఉద్యమానికి పునాది..
భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ఒక విచారణ సందర్భంగా నిరుద్యోగ యువతను “బొద్దింకలు, పరాన్నజీవులు” అని సంబోధించారన్న వార్తల తర్వాత- దేశంలో అత్యంత చర్చనీయాంశమైన ఈ సీజేపీ డిజిటల్ నిరసన ఉద్యమం ప్రారంభమైంది.
కొన్ని రోజుల్లోనే బోస్టన్ విశ్వవిద్యాలయ విద్యార్థి అభిజీత్ దీప్కే ఈ వ్యాఖ్యను సీజేపీ కోసం ఒక వ్యంగ్య బ్యానర్‌గా మార్చారు.
నిరుద్యోగం, అవినీతి, దేశ ప్రజాస్వామ్య స్థితిగతులపై ఆగ్రహంతో ఉన్న యువ భారతీయులకు ఆ పార్టీ వెంటనే ఒక వేదికగా మారింది.
వారం రోజుల్లోనే లక్షలాది మంది ఆన్లైన్ ఫాలోవర్లను ఆకర్షించింది.
దీనిపై ప్రభుత్వ స్పందన కూడా వేగంగానే ఉంది. ప్రారంభించిన కొద్ది రోజులలోపే భారత్‌లో సీజేపీ ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాను నిలిపివేశారు.
తన సోషల్ మీడియా ఖాతాలు కూడా హ్యాక్ అయినట్లు కనిపిస్తోందని దీప్కే తెలిపారు. ఆ ఉద్యమ అధికారిక వెబ్‌సైట్‌ను కూడా ఇంటర్నెట్ నుంచి తొలగించారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
