ఆర్థిక రంగానికి సంబంధించిన గణాంకాలు ఎటు నుండి ఎటు చూసినా భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అన్న అపోహ నుండి బయటపడల్సిన సమయం ఇది.
బెంగాల్ ఎన్నికలలో బిజెపి పొందిన విజయం అత్యున్నత రాజకీయ ప్రదర్శన, ఒక మైలురాయి వంటి విజయాన్ని సూచిస్తుంది. బెంగాల్లో సాధించిన ఎన్నికల విజయాన్ని పార్టీ అధిగమించాలంటే, 2029లో నరేంద్ర మోడీ భారీ మెజారిటీ తో గెలవడమే మార్గం. అంతకు మించిన విజయం ఏదైనా బెంగాల్ లో బీజీపీ సాధించిన విజయం ముందు దిగదుడుపే. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో బీజేపీ అట్టడుగు స్థాయికి పడిపోయింది. ఇది ఇంకా దిగజారదని ఎటువంటి హామీ లేదు. ఇప్పుడు తలెత్తుతున్న ప్రధాన ప్రశ్న ఏమిటంటే ఈ రెండు సంఘటనలు యాదృచ్ఛికమా, లేక ఏకకాలంలో నిర్ణయించబడ్డాయా? రెండవదే నిజం – వివరాలు కింద ఉన్నాయి.
ఈ ఆర్థిక పతనం వెనుక నాలుగు కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది, అత్యంత ముఖ్యమైనది స్వయంగా ప్రభుత్వమే. అది సమస్యను గుర్తించినప్పటికీ, సంక్షోభానికి ఇతరులను నిందించడంతోనే సంతృప్తి చెందుతోంది.
రెండవ కారణం ప్రధాని. మూడవ కారణం కాంగ్రెస్ పార్టీ. ఇది గాంధీల నాయకత్వంలో ఉండటానికి ఎంతగా అలవాటు పడిందంటే, అది బీజేపీ ఏకపక్ష పాలనను దాదాపు ఖరారు చేస్తోంది. నాల్గవ కారకం ఈ మూడు ప్రధాన శక్తులను నియంత్రిస్తున్న సూత్రధారి డీప్ స్టేట్. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలోకెల్లా అత్యంత వేగవంతమైనదిగా గర్వంగా చెప్పుకునే ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తూనే ఉండటం వల్ల ఈ సంక్షోభం కొనసాగుతోంది.
రాజకీయంగా ఉన్నత స్థితి స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో సాధించిన ఘన విజయం మూలంగా భారతదేశంలో దాదాపు ఏకపక్ష పాలనే. కొందరికి “ఆర్థిక పతనం” అనేది అతిశయోక్తి కావచ్చు. గత 35 ఏళ్లు సగటున సంవత్సరానికి 6 శాతం జీడీపీ వృద్ధితో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ కాదా? అసలు విషయం ఇక్కడే ఉంది. ఈ పద పొందిక లో ’35 ఏళ్ల సగటు ‘, ‘ ప్రధాన’ అన్న పదాలు కీలకమైనవి. బిజెపి ఏలుబడిలో ఉన్న 2014 నుండి ఇప్పటి వరకు ఉన్న కాలంలో తలసరి జీడీపీ వృద్ధి ప్రమాణంగా చూస్తే భారతదేశం తొమ్మిదవ స్థానంలో, అమెరికా డాలర్లలో తలసరి వృద్ధిలో 16వ స్థానంలో ఉంది.
అమెరికా డాలర్ల వృద్ధిలో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉంది. దాని సగటు తలసరి వృద్ధి సంవత్సరానికి 8.3 శాతం. ఇథియోపియా 7.2 శాతంతో రెండవ స్థానంలో ఉండగా, భారతదేశం కేవలం 4.7 శాతంతో 16వ స్థానంలో ఉంది. ఈ గణాంకాలను ఏ విధంగా విశ్లేషించినా, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అన్న వాదన కేవలం భేషజం గానే మిగిలి పోయే సమయం దగ్గర పడింది.
2013లో బలహీనంగా ఉన్న ఐదు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉన్న భారతదేశం ఇప్పుడు (టర్కీతో పాటు) ఆ జాబితాలో చేరే అవకాశం ఉన్న రెండవ దేశం గా మారింది. ( అంటే 2013 లో బలహీనంగా ఉన్న ఐదు దేశాల్లో మూడు దేశాల ఆర్థిక వ్యవస్థలు గండాలు గడిచి గట్టెక్కాయి) గత సంవత్సరంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి సుమారు 12 శాతం విలువ కోల్పోయింది. ఈ క్షీణత వరుసగా ఏడవ సంవత్సరంలోనూ కొనసాగింది. 2025 నాటికి ఆసియాలో అత్యంత బలహీనంగా ఉన్న కరెన్సీలలో మన రూపాయి ఒకటిగా నిలిచింది. నేటి భారతదేశం ఒక స్థూల ఆర్థిక వైరుధ్యాన్ని ప్రదర్శిస్తోంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. కరెంట్ ఖాతా లోటు నిర్వహించదగినదిగా ఉంది. వృద్ధి స్థిరంగా ఉంది. రాజకీయ స్థిరత్వం అసాధారణమైన బలంతో ఉంది. సిద్ధాంతపరంగా ఈ పరిస్థితులు కరెన్సీపై విశ్వాసాన్ని పెంచాలి. కానీ, తీవ్రమైన పెళుసుదనాన్ని (బలహీనత) కాదు.
భారతీయులు, విదేశీయులు అనే తేడా లేకుండా భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు కావాల్సిన తీవ్రమైన చర్యలకు బదులు కేవలం తాత్కాలిక చిట్కా వైద్యం తో సరిపెడుతోంది. అటువంటి తాత్కాలిక పరిష్కారాలలో ఒకటి, స్వదేశంలోనే ఎక్కువగా పెట్టుబడులు పెట్టమని భారతీయులకు విజ్ఞప్తి చేయడం. ఆర్థిక వ్యవస్థ కి సంభందించిన నిర్ణయాలు ఆర్థిక విషయాల ప్రాతిపదికన తీసుకోకుండా నైతిక ప్రాతిపదికల ఆధారంగా తీసుకోమంటోంది ప్రభుత్వం ! పెట్టుబడిదారులు తమ వైఖరిని చేతలతోనే తెలియజేస్తారని ఎప్పుడో స్పష్టమైంది. పెట్టుబడి దారులకు నేడు లభించే ఆర్థిక ప్రోత్సాహకాలకు వ్యక్తులు, సంస్థలు స్పందించే తీరు ఏమిటంటే, భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోవడం లేదా అసలు ప్రవేశించకపోవడం. ఎందుకు? దీనికి తొలి అడుగుగా విస్తృతంగా చర్చించబడిన ‘వ్యాపార అనుకూల వాతావరణం’ ఉంది. ప్రభుత్వ విధానంపై దేశీయ సంస్థలు తీవ్రమైన అనిశ్చితితో ఉన్నాయి.
GDP వృద్ధి, ఎగుమతుల సామర్ధ్యం, తయారీ రంగ పోటీతత్వానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) ఒక ప్రమాణం. వాటి పరిమాణం ఒక ప్రధాన చోదక శక్తి. FDI విదేశీ సాంకేతికతను, మూల ధనాన్ని మరియు ప్రపంచ సరఫరా గొలుసులతో అనుసంధానాలను తీసుకువస్తుంది. FDI ఎంత ఎక్కువగా ఉంటే, పెట్టుబడి అంత ఎక్కువగా ఉంటుంది మరియు వృద్ధి కూడా అంత ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన ఒక అభిప్రాయం. 2015 వరకు భారతదేశంలో కూడా ఇదే అవగాహన చెలామణిలో ఉంది. కొత్త ఆలోచనా విధానం ప్రకారం, విదేశీ పెట్టుబడిదారులకు భారతదేశం షరతులను నిర్దేశించగలదని, నిర్దేశించాలని, పెట్టుబడిదారులు “పెద్ద” భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి “ఆత్రుత పడుతున్నారని” భావిస్తున్నారు. మార్కెట్ పరిభాష లో చెప్పాలంటే 2025 నాటికి భారతదేశ GDP, కాలిఫోర్నియా రాష్ట్ర GDP కంటే తక్కువ. బహుశా ఇదే ఆలోచనా విధానం 2015లో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (BIT) చట్రంలో సమూలమైన మార్పులకు దారితీసి ఉండవచ్చు. ఆ వెంటనే, నాణ్యతా నియంత్రణ ఉత్తర్వులు (QCOS) 2017లో కేవలం 14 నుండి 2024 డిసెంబర్ నాటికి 765కు పెరిగాయి – ఇవి దేశీయ పరిశ్రమకు, ముఖ్యంగా విదేశీ భాగస్వామ్యాలు ఉన్న సంస్థలకు అదనపు రక్షణ సాధనం తప్ప మరేమీ కాదు.
సవరించిన 2015 ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (BIT) ప్రకారం ఒక విదేశీ పెట్టుబడిదారుడు తమ భారతీయ వ్యాపారం నుండి వైదొలగడానికి ముందు, మధ్యవర్తిత్వానికి వెళ్లడానికి ఐదు సంవత్సరాలు వేచి ఉండాలి. ఆ మధ్యవర్తిత్వం ఒక భారతీయ న్యాయమూర్తి ముందు జరగాలి. విషయం లేదా ఫిర్యాదు ఏదైనప్పటికీ, భారత పౌరులే భారతీయ న్యాయస్థానాలకు వెళ్లడానికి సంకోచిస్తుంటే, ఒక విదేశీ పెట్టుబడిదారుడు కూడా అలాగే చేయాలని ఎందుకు కోరాలి?
అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించే ముందు, విదేశీ పెట్టుబడిదారులు ఐదు సంవత్సరాల పాటు స్థానిక పరిష్కార మార్గాలన్నింటినీ వినియోగించుకోవాలనే నిబంధన అత్యంత నష్టదాయకమైనది. చరిత్రలో, ఎలాంటి బంధానికైనా ఐదేళ్ల పాటు ‘ కూలింగ్ అవుట్’ (ఓపికగా మధ్య వర్తిత్వం జరపడం ఇంకా చెప్పాలంటే అలసిపోయేంతవరకు మధ్యవర్తిత్వం జరపడం) అనివార్య షరతు గా ఉన్న సందర్భం ఏదైనా ఉందా? ఇప్పటికీ ప్రభుత్వం వాగ్దానం చేసిన సంస్కరణలు ఆ విధానాన్ని పునరాలోచించడం కోసం కాకుండా, కేవలం మృదువుగా మార్చడం కోసమే ఉద్దేశించినట్లు కనిపిస్తున్నాయి.
2025 ఫిబ్రవరిలో పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (BIT) ఫ్రేమ్‌వర్క్‌ను సమీక్షించి, కొత్త వెర్షన్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ సంస్కరణలు ఇంకా తెర మీదకు రాలేదు. ఐదేళ్ల నిరీక్షణ కాలాన్ని ‘కేవలం మూడేళ్లకు తగ్గించడం మినహా దాని మౌలిక నిర్మాణంలో ఎలాంటి మార్పు రాలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే, 2015కి ముందున్న BIT నిబంధనల నుండి ఒక కీలకమైన మార్పుగా ఉన్న, ముందుగా భారతీయ న్యాయస్థానాల ప్రయోజనాలన్నీ వినియోగించుకోవాలనే నిబంధనను కూడా కొనసాగించే అవకాశం ఉంది.
అఖండ రాజకీయ విజయం వల్ల కలిగే లోతైన ప్రమాదం ఏమిటంటే, విధానం ఇప్పటికే చాలా బాగుంది అనే నమ్మకాన్ని అది ప్రోత్సహించగలదు. కానీ అది నిజం కాదు. స్థిరత్వం, విస్తృతి, ప్రపంచ ప్రాముఖ్యత వంటి సానుకూలతలు భారతదేశానికి ఇప్పటికీ ఉన్నాయి. ప్రస్తుత పశ్చిమ ఆసియా సంక్షోభం ఆర్థిక సంస్కరణలకు ఒక సంపూర్ణమైన అవకాశం. ప్రభుత్వం ఈ అవకాశాన్ని పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచడానికి, ఒప్పంద విశ్వసనీయతను పునరుద్ధరించడానికి, సంస్కరణల పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించడానికి ఉపయోగించుకోకపోతే, రాజకీయ ఆధిపత్యం బలంలా కాకుండా, బలానికి ప్రత్యామ్నాయంలా కనిపించడం మొదలవుతుంది. ఎన్నికలు అధికారాన్ని అందిస్తాయి. విధానం మాత్రమే శ్రేయస్సును అందించగలదు. ప్రపంచం గమనిస్తోంది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక సౌజన్యంతో
ఆర్థికవేత్త సూర్జిత్ ఎస్. భల్లా వ్రాసిన వ్యాసానికి స్వేచ్ఛానువాదం- సుబ్రహ్మణ్యం.
భారతదేశం కోసం మొదటి అధికారిక గృహ ఆదాయ సర్వేకు సంబంధించిన సాంకేతిక నిపుణుల బృందానికి భల్లా ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
