Guntur Seshendra Sharma – Poet of the Era, Voice of Rebellion
నేడు గుంటూరు శేషేంద్ర శర్మ గారి వర్ధంతి. వారికి నివాళులర్పిస్తూ, వారిని గురించి, వారి సేవల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం.
తెలుగు ఆధునిక సాహిత్య చరిత్రలో కొన్ని పేర్లు కాలాన్ని దాటి నిలిచిపోతాయి. అలాంటి అరుదైన మహాకవులలో గుంటూరు శేషేంద్ర శర్మ ఒకరు. కవి, విమర్శకుడు, ఆలోచనాపరుడు, భాషావేత్త, సాహిత్య తత్వవేత్తగా ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన సేవ అపారమైనది. ఆయన కవిత్వం కేవలం భావోద్వేగాల వ్యక్తీకరణ మాత్రమే కాదు. అది సామాజిక చైతన్యానికి, మానవ విముక్తికి, రాజకీయ అవగాహనకు, సాంస్కృతిక పునరాలోచనకు ఒక ఆయుధంగా మారింది.
జననం–కుటుంబ నేపథ్యం:
గుంటూరు శేషేంద్ర శర్మ 1927 అక్టోబర్ 20న నెల్లూరు జిల్లాలోని నాగరాజుపాడు గ్రామంలో జన్మించారు. తరువాత ఆయన బాల్యం తొటపల్లిగూడూరు ప్రాంతంలో గడిచింది. సంస్కృత పాండిత్యం కలిగిన కుటుంబ వాతావరణం ఆయనకు చిన్ననాటి నుంచే భాషా, సాహిత్యాలపై ఆసక్తిని పెంచింది. ఆయన తండ్రి ద్వారా వేదాలు, పురాణాలు, సంస్కృత సాహిత్యంపై పరిచయం ఏర్పడింది.
విద్యాభ్యాసం:
ఆయన ఉన్నత విద్యను పూర్తి చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదివారు. అనంతరం మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి న్యాయ విద్యను అభ్యసించారు. విద్యార్థి దశలోనే పాశ్చాత్య సాహిత్యం, సంస్కృత సాహిత్యం, ఆధునిక ఆలోచనల ప్రభావం ఆయనపై పడింది.
అధికారిగా-తిరుగుబాటు మేధావిగా:
1949లో ప్రభుత్వ సేవలో చేరిన శేషేంద్ర శర్మ మున్సిపల్ పరిపాలనలో వివిధ పదవులు నిర్వహించారు. ఆయన క్రమశిక్షణ, నిష్పక్షపాత వైఖరి కారణంగా అనేక బదిలీలు ఎదుర్కొన్నారు. కానీ అదే అనుభవం సమాజాన్ని దగ్గరగా చూడటానికి అవకాశం కల్పించింది. పేదరికం, దోపిడీ, సామాజిక అసమానతలను ఆయన ప్రత్యక్షంగా చూశారు. ఈ అనుభవాలే ఆయన రచనలకు బలమైన సామాజిక పునాది అయ్యాయి.
శేషేంద్ర కవిత్వం – సంప్రదాయం, విప్లవం కలయిక:
శేషేంద్ర కవిత్వం ఒక ప్రత్యేక ప్రవాహం. ఆయన ఒకవైపు సంస్కృత సాహిత్య సంపదను లోతుగా అధ్యయనం చేస్తూనే, మరోవైపు ఆధునిక సమాజంలోని విరుద్ధతలను కవిత్వంలో ప్రతిబింబించారు.
“నదులు, కవులు దేశానికి రక్తనాళాలు” అని చెప్పినప్పుడు, కవిత్వాన్ని కేవలం కళగా కాకుండా సమాజాన్ని కదిలించే శక్తిగా చూశారు.
శేషేంద్ర శర్మ 50కి పైగా గ్రంథాలను రచించారు. వాటిలో నా దేశం–నా ప్రజలు ఒకటి. ఇది ఆయన అత్యంత ప్రసిద్ధ రచన. భారత సమాజాన్ని, చరిత్రను, రాజకీయ విరుద్ధతలను, ప్రజల జీవితాన్ని మహాకావ్య శైలిలో చిత్రించిన రచన. దీనివల్ల ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది.2)కాలరేఖ: ఇది సాహిత్య విమర్శా వ్యాసాల సంకలనం. ఈ రచనకు ఆయనకు సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.3)షోడశి రామాయణంపై ఆయన చేసిన విశిష్ట విమర్శనాత్మక అధ్యయనం. సంప్రదాయ పఠనానికి భిన్నమైన కోణాన్ని ఇందులో ప్రతిపాదించారు.
4)కవిసేన మేనిఫెస్టో: ఆధునిక కవిత్వంపై ఆయన తాత్విక దృక్పథాన్ని ప్రతిబింబించే రచన.
నీరై పారిపోయింది, శేషజ్యోత్స్న, రక్తరేఖ, ఆధునిక మహాభారతం
రచనలు ఆయన భావప్రపంచం ఎంత విస్తృతమో చూపిస్తాయి.
సాహిత్య విమర్శకుడిగా:
కేవలం కవి మాత్రమే కాదు. శేషేంద్ర ఒక శక్తివంతమైన విమర్శకుడు కూడా. తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ సాహిత్యంతో పోల్చి చూడగల దృష్టి ఆయనకు ఉంది. ప్రాచీన సాహిత్యాన్ని కూడా ఆధునిక దృష్టితో పునర్వ్యాఖ్యానించారు.
పురస్కారాలు-గౌరవాలు:
-సాహిత్య అకాడమీ పురస్కారం (కాలరేఖకు).
-కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిప్, హంస అవార్డు,
కలిదాస్ సమ్మాన్ ,గౌరవ డి.లిట్, అనేక జాతీయ సాహిత్య పురస్కారాలు పొందారు.
అంతర్జాతీయ గుర్తింపు:
“నా దేశం – నా ప్రజలు” రచన కారణంగా ఆయన పేరు నోబెల్ సాహిత్య పురస్కార నామినేషన్ చర్చల్లోకి వచ్చింది. భారతదేశం నుండి అంతర్జాతీయ స్థాయిలో చర్చించబడిన అరుదైన తెలుగు కవుల్లో ఆయన ఒకరు.
.
గుంటూరు శేషేంద్ర శర్మ పేరు వినగానే తెలుగు సాహిత్యంలో ఒక విభిన్న స్వరం, తిరుగుబాటు భావజాలం, భాషపై అసాధారణ పట్టు, సామాజిక చైతన్యం గుర్తుకు వస్తాయి. ఆయన కేవలం కవిత్వం రాసిన వ్యక్తి కాదు. కవిత్వాన్ని సమాజ మార్పు కోసం ఉపయోగించాలనుకున్న మేధావి.
శేషేంద్ర రాజకీయ దృక్పథం:
శేషేంద్ర శర్మ రచనలను చదివితే పేదరికం, దోపిడీ, వర్గ విభజనలు, సామాజిక అసమానతలపై ఆయన తీవ్ర స్పందన కనిపిస్తుంది. ఈ కారణంగా చాలామంది ఆయనను మార్క్సిస్టు కవిగా అభివర్ణిస్తారు. కానీ ఆయనను పూర్తిగా ఒక రాజకీయ గూటికి పరిమితం చేయడం కష్టం. ఆయన మార్క్సిస్టు ఆలోచనల ప్రభావం పొందినా, సంప్రదాయ కమ్యూనిస్టు సాహిత్య ధోరణిని యథాతథంగా అనుసరించలేదు. ఆయన అభిప్రాయం ప్రకారం
“కవిత్వం పార్టీకి సేవకుడు కాదు. సమాజానికి దిక్సూచి కావాలి.”
అందువల్ల ఆయన రచనల్లో వర్గపోరాటం కనిపించి నప్పటికీ, అది కేవలం రాజకీయ నినాదాల స్థాయిలో ఉండదు. మార్క్సిజం, భారతీయ తత్వం రెండింటి సమ్మేళనం.
శేషేంద్ర ప్రత్యేకత ఏమిటంటే, ఆయన ఒకేసారి మార్క్స్‌ను చదివాడు ఉపనిషత్తులను కూడా చదివాడు.
ఆయన రచనల్లో కనిపించే కొన్ని లక్షణాలు. వర్గ దోపిడీపై విమర్శ, సామ్రాజ్యవాద వ్యతిరేకత, కార్మిక,రైతు సమస్యల పట్ల స్పందన, భారతీయ పురాణాల ఆధునిక పునర్వ్యాఖ్యానం
సంస్కృత సాహిత్యాన్ని ఆధునిక దృష్టితో చూడటం.ఈ కారణంగా ఆయనను కొందరు “భారతీయ మార్క్సిస్టు మానవతావాది” అని కూడా పిలుస్తారు.
శ్రీశ్రీతో పోలిక:
ఇద్దరూ విప్లవకవులే. కానీ ఒకేలా కాదు. తెలుగు ఆధునిక కవిత్వంలో శేషేంద్రను పోల్చే పేరు శ్రీశ్రీ. ప్రజా భాషకు దగ్గర. ప్రత్యక్ష రాజకీయ నినాదాలకు దగ్గర. కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం బలంగా ఉంది. సరళమైన, ఆగ్రహభరితమైన కవితా భాష శ్రీ శ్రీ ప్రత్యేకతలు.
శేషేంద్ర సంస్కృత, పురాణ, తాత్విక ప్రతీకలు ఎక్కువ. సంక్లిష్ట రూపకాలు. రాజకీయతతో పాటు తాత్వికత. వ్యక్తిగత అనుభూతి, సామాజిక దృక్పథం కలయిక శేషేంద్ర శర్మ ప్రత్యేకతలు.
“శ్రీశ్రీ వీధిలో మాట్లాడితే, శేషేంద్ర విశ్వంతో. మాట్లాడాడు” అని కొందరు విమర్శకులు వ్యాఖ్యానిస్తారు.
“నా దేశం–నా ప్రజలు”
రచనను చాలామంది తెలుగు ఆధునిక మహాకావ్యంగా పరిగణిస్తారు. ఈ రచనలో దేశ చరిత్ర, వర్గ పోరాటాలు,రాజకీయ వ్యవస్థపై విమర్శ,ప్రజల జీవితం, స్వాతంత్ర్యా నంతర భారత విరుద్ధతలు అన్నీ ఒకే ప్రవాహంలో కనిపిస్తాయి.
దేశం అంటే భూభాగం కాదు, ప్రజలే దేశం. ఈ భావజాలం ఆయన రచన అంతటా కనిపిస్తుంది.
శేషేంద్ర ప్రారంభించిన “కవిసేన” భావన చాలా చర్చనీయాంశమైంది.కవి సమాజం నుండి వేరు పడకూడదు. కవిత్వం సామాజిక బాధ్యత కలిగి ఉండాలి. భాషలో సృజనాత్మకత ఉండాలి.
కవిత్వం ప్రజల అనుభవాలను ప్రతిబింబించాలి అనేవి శేషేంద్ర శర్మ ప్రత్యేకతలు. ఈ భావన తరువాతి తరాల కవులపై ప్రభావం చూపింది.శేషేంద్ర తరువాత వచ్చిన అనేక కవులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆయన ప్రభావం పొందారు. ఆయన వల్ల తెలుగు కవిత్వం భావోద్వేగాల వ్యక్తీకరణ నుండి ఒక విశ్లేషణాత్మక ప్రక్రియగా కూడా మారింది. ఆయనపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. కవిత్వం సాధారణ పాఠకుడికి క్లిష్టంగా ఉంటుందని. ప్రతీకలు ఎక్కువగా ఉపయోగించారని. కొన్ని సందర్భాల్లో అతిగా తాత్వికత పెరిగిందని.
కవిత్వం కేవలం సౌందర్యం కాదు. అది ప్రశ్నించాలి. ఆలోచింపజేయాలి. కదిలించాలి. అందుకే శేషేంద్ర ఒక వ్యక్తి కాదు. ఒక నిరంతర సాహిత్య సంభాషణ.
శేషేంద్ర శర్మకు కమ్యూనిస్టు ఉద్యమంతో సంబంధా లున్నాయి.
ముగింపు:
గుంటూరు శేషేంద్ర శర్మ 2007 మే 30న హైదరాబాద్‌లో కన్నుమూశారు. కానీ ఆయన రచనలు, ఆలోచనలు, కవిత్వం ఇప్పటికీ తెలుగు సాహిత్యంలో జీవిస్తున్నాయి
గుంటూరు శేషేంద్ర శర్మను అర్థం చేసుకోవాలంటే ఆయన కవితలు మాత్రమే చదవడం సరిపోదు. ఆయన విమర్శ, ఆయన తత్వం, ఆయన రాజకీయ దృక్పథం, ఆయన భాషా నిర్మాణం అన్నింటినీ కలిసి చూడాలి.
ది వైర్ తెలుగు స్టాఫ్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
