‘మోడీ పుష్కర పాలన’పై ఇప్పటికి మూడు వ్యాసాల ధారావాహికను ‘ది వైర్ తెలుగు’ పాఠకులకు అందించాము. ఈరోజు నాలుగో భాగం.
ఇందులో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ఏ విధంగా దన్నుగా నిలుస్తున్నది, వారి అక్రమాలను కూడా ఎలా సమర్థిస్తున్నదో తెలుసుకుందాం.
వారికి వివిధ రకాల రాయితీలను ఇస్తూ, కొత్త తరహా రాయితీలను కూడా ప్రభుత్వం సృష్టించింది.
కార్పొరేట్ పన్నుల తగ్గింపు – ఖజానాకు గండి..
కార్పొరేట్ సంస్థలు నిర్లజ్జగా పన్నులు ఎగవేస్తున్నాయి కాబట్టి, పన్నులను తగ్గిస్తే ఎగవేయకుండా సక్రమంగా చెల్లిస్తారని ప్రభుత్వం చెప్పింది.
ఇందులో భాగంగా 2019 సెప్టెంబర్లో కార్పొరేట్ పన్నును 30% నుంచి 22%కి తగ్గించింది. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలకు దీనిని 15% చేసింది.
ఫలితంగా సంవత్సరానికి రూ 1.45 లక్షల కోట్ల ఆదాయాన్ని కేంద్రం కోల్పోయింది. అయినా పన్ను ఎగవేత మాత్రం ఆగలేదు. పైగా రకరకాల పేర్లతో ప్రజాధనాన్ని కార్పొరేట్లకు దోచిపెట్టింది.
కార్పొరేట్లకు రకరకాల పేర్లతో ఇచ్చిన రాయితీల వివరాలు, విభిన్న రంగాలకు కేంద్ర బడ్జెట్లో జరిగిన కేటాయింపుల వివరాలు దిగువ పట్టికలో ఉన్నాయి.


ఈ 12 సంవత్సరాల కాలంలో పన్నుల తగ్గింపు, ఎగవేత, రకరకాల ప్రోత్సాహకాలు(ఇన్సెంటివ్లు), రాయితీలు(కన్సెషన్స్), రుణాల మాఫీల కింద మొత్తంగా రూ 71,52,073 కోట్లను(71 లక్షల 52 వేల 73 కోట్లు)కేంద్ర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టింది.
ఇంత చేసినా ఉపాధి కల్పన తగిన మోతాదులో పెరిగిందా అంటే అది కూడా లేదు.
ప్రజా సంక్షేమానికి కోతలు – కార్పొరేట్లకు అండ..
పట్టికలో తెలియజేసిన ఎనిమిది రంగాలకు కలిపి 12 సంవత్సరాల కాలంలో అదనంగా కేటాయించినది రూ 4,82,920 కోట్లు(నాలుగు లక్షల 82 వేల 920 కోట్లు). ఇందులో 12 సంవత్సరాల ద్రవ్యోల్బణం 67% ప్రభావాన్ని తీసివేస్తే- నికర పెరుగుదల కేవలం రూ 2,07,665 కోట్లు(రెండు లక్షల ఏడు వేల 665 కోట్లు) మాత్రమే.

ఈ 12 సంవత్సరాల కాలంలో కొన్ని రంగాలకు, కొన్ని సంవత్సరాల్లో ప్రభుత్వం భారీగా కోతలు కూడా పెట్టింది.
మొత్తం వెరసి ఈ 12 సంవత్సరాల కాలంలో కోట్లాది మంది ప్రజల కోసం కేవలం రూ 2,07,665 కోట్లు మాత్రమే అదనంగా కేటాయించింది. కానీ వేళ్ల మీద లెక్కబెట్టగలిగిన కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు మాత్రం రూ 71,52,073 కోట్లు(71 లక్షల 52 వేల 73 కోట్లు) సమర్పించుకుంది. ‘కాకులను కొట్టి గద్దలకు వేయడం’ అంటే ఇదే.
దీనిని బట్టి ‘సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్’ అనేది కేవలం ఒక “జుమ్లా”- డొల్ల నినాదమని కేంద్ర ప్రభుత్వం రుజువు చేసింది.

Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

